Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

సహాయ నిరాకరణే సరైన ఆయుధం!

* 'సమితి' స్వభావం మారాల్సిన సమయం
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత ఏర్పడిన ఐక్యరాజ్య సమితి- భద్రతా మండలి, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలకు నేడు కాలం చెల్లిపోయిందంటే పొరపాటు కాదు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి 25 ఏళ్లవుతున్నా నాటి అంతర్జాతీయ సమీకరణలనే ఈ సంస్థలు ఇప్పటికీ ప్రతిఫలిస్తున్నాయి. కాలంతో పరుగులో అవి వెనకబడిపోయాయి. అన్ని సంస్థలూ కొన్ని అవసరాలను తీర్చడానికి, కొన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పడతాయి. లక్ష్య సాధనలో సాఫల్యవైఫల్యాలను చవిచూస్తాయి. తరచుగా ఈ సంస్థల దుర్వినియోగమూ జరగవచ్చు. ఏదిఎలాగున్నా కాలంతో పాటు తామూ మారకపోతే ఆ సంస్థల మనుగడకు అర్థం లేకుండా పోతుంది. అయినా వాటిపై పెత్తనం చేస్తున్న దేశాలు తమ ఆధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండవు. కొత్త పాత్రధారులకూ అవకాశమివ్వాలన్న హితోక్తులను తలకెక్కించుకోవు. ఈ సంగతి గుర్తించి, అంతర్జాతీయ సంస్థల్లో తిష్ఠవేసిన దేశాల మెడలు వంచైనా వాటిలో సముచిత స్థానం సంపాదించడానికి భారత్‌, బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌లు నడుంకట్టాలి. కేవలం ఆశలు పెట్టుకోవడం గాలిలో దీపంలాంటిదనీ, అది ఆచరణీయ విధానం కాదనీ గుర్తెరిగి, వాస్తవిక రాజకీయ వ్యూహాలను అనుసరించాలి. కనీసం ఐక్యరాజ్య సమితి 70వ వార్షికోత్సవ సందర్భంలోనైనా భద్రతా మండలిని సంస్కరించాలని పట్టుబట్టాలి.

పెద్ద దేశాల కొద్ది బుద్ధులు!

నిజానికి భద్రతా మండలిని సంస్కరించి కొత్త సభ్యులను చేర్చుకోవాలన్న డిమాండ్‌ ఈనాటిది కాదు. భద్రతా మండలి (ఎస్‌.సి.) శాశ్వత సభ్యదేశాల సంఖ్య అయిదే. 'వీటో' అధికారం కేవలం ఈ దేశాలకే ఉంది. ఆ అధికారం ఉండని తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య ఆరు. 1965లో తాత్కాలిక సభ్యుల సంఖ్యను పదికి పెంచారు. ఈ దేశాలకు ఎస్‌.సి.లో రెండేళ్ల సభ్యత్వం ఉంటుంది. 1965నుంచి భద్రతామండలి స్వరూపమేమీ మారలేదు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) సంస్థలన్నింటిలోకి ఒక్క భద్రతామండలి నిర్ణయాలనే ఐరాస దేశాలన్నీ చట్టపరంగా శిరసావహించాల్సి ఉంటుంది. భద్రతామండలిని కాలానుగుణంగా సంస్కరించాలని ఎన్నో ప్రతిపాదనలు వచ్చినా అవేవీ కార్యరూపం ధరించలేదు. ఈ సందర్భంగా మూడు ప్రతిపాదనలను పరిశీలించడం ఉచితంగా ఉంటుంది.
1. భారత్‌, జపాన్‌, జర్మనీ, బ్రెజిల్‌ (జి-4) సమర్పించిన ప్రణాళిక ప్రకారం భద్రతా మండలి కొత్తగా ఆరు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి. వీటితో కలిపి మొత్తం సభ్యుల సంఖ్యను 25కి పెంచాలి. కొత్త శాశ్వత సభ్యత్వాన్ని జి-4 దేశాలతోపాటు రెండు ఆఫ్రికా దేశాలకు ఇవ్వాలి. రెండేళ్లకు ఒకసారి తాత్కాలిక సభ్యులుగా ఎన్నుకునే దేశాల సంఖ్యను పెంచి, అదనంగా మూడు లేదా నాలుగు దేశాలను ఈ జాబితాలో చేర్చాలి.
2. ఐక్యరాజ్యసమితి ఏకాభిప్రాయ ప్రణాళిక (యు.ఎన్‌.సి) కొత్త శాశ్వత సభ్య దేశాల ప్రస్తావన లేకుండా భద్రతామండలి సీట్లను 25కి పెంచాలని ప్రతిపాదించింది. అయితే, ఒక్కో భౌగోళిక ప్రాంతానికి కొత్తగా శాశ్వత సీట్లను కేటాయించాలని సూచించింది. ఈ సీట్లను ఏయే దేశాలకు, ఎంతకాలం ఇవ్వాలో సదరు భౌగోళిక ప్రాంతంలోని దేశాలే నిర్ణయించుకోవచ్చు.
3. ఎజుల్విన్‌ ఏకాభిప్రాయ ప్రణాళిక కింద ఆఫ్రికా దేశాలు తమ ఖండం నుంచి కొత్తగా రెండు శాశ్వత, రెండు తాత్కాలిక సభ్య దేశాలకు చోటు కల్పించాలని ప్రతిపాదించాయి. కొత్త ఆఫ్రికన్‌ శాశ్వత సభ్యులకు పి-5 (అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా) దేశాలకు ఉన్నట్లే వీటో అధికారం ఉండాలి.

జపాన్‌, జర్మనీలు ఐక్యరాజ్యసమితి బడ్జెట్‌కు అందిస్తున్న నిధులు ఒక్క అమెరికా మినహా ఇతర పి-5 దేశాలకన్నా ఎంతో ఎక్కువ. అమెరికా అన్ని దేశాలకన్నా ఎక్కువగా 22 శాతం నిధులను ఐరాస బడ్జెట్‌కు అందిస్తుండగా, జపాన్‌, జర్మనీలు రెండు, మూడో స్థానాలను ఆక్రమిస్తున్నాయి. ఐరాసకు నిధుల వితరణలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనాల తరవాత 7వ స్థానం ఆక్రమిస్తున్న బ్రెజిల్‌- రష్యాకన్నా ఎక్కువ నిధులే సమకూరుస్తోంది. జనాభా, నిధుల పరంగా చూస్తే జి-4 దేశాలు ఇప్పటికే భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొంది ఉండాల్సిందని తేలుతుంది. దీనివల్ల భద్రతామండలి ప్రాతినిధ్య స్వభావానికి నిండుదనం వచ్చి, మరింత ప్రజాస్వామిక సంస్థగా మారి ప్రపంచంలో నానాటికీ పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని సంతరించుకొంటుంది. భద్రతా మండలి ఇప్పుడున్న రూపంలో విఫలమైందనడానికి ఇరాన్‌, ఇరాక్‌, లిబియా, సిరియా సంక్షోభాలే నిదర్శనం. అది మరింత ప్రాతినిధ్యం, న్యాయబద్ధత కలిగి ఉంటే అంతర్జాతీయ సంఘర్షణలను వివేకంతో ఒడుపుగా పరిష్కరించగలిగేది. 1960లలో ఐరాసలో 113 సభ్యదేశాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 193కు పెరిగింది. అయినా భద్రతా మండలి రూపురేఖలేమీ మారలేదు. ఐరాస కార్యకలాపాలు ప్రధానంగా ఆఫ్రికాలోనే నడుస్తున్నా, ఆ ఖండం నుంచి ఒక్క దేశానికీ భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం దక్కలేదు. దక్షిణ అమెరికా ఖండ దేశాలకు కానీ, వందలాది ద్వీప దేశాలకు కానీ ఐరాసలో అత్యున్నత విధాన నిర్ణయ సంస్థ అయిన భద్రతా మండలిలో ప్రాతినిధ్యం లేదు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి భారత్‌ అన్ని అర్హతలూ కలిగి ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోనూ, ఆ తరవాత ప్రపంచ శాంతి పరిరక్షణకు భారత్‌ కీలక సేవలు అందించింది. జనాభా, విస్తీర్ణం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), నాగరికత, సాంస్కతిక వైవిధ్యం, వారసత్వం, ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థల రీత్యా శాశ్వత సభ్యత్వం పొందే హక్కు భారత్‌కే మిన్నగా ఉంది. పలు దేశాల్లో ఐరాస తరఫున శాంతి రక్షక కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించిన చరిత్ర భారతదేశానిది. ఇంతవరకు ఏడుసార్లు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందిన భారత్‌కు 2021-2022లో మళ్లీ ఆ అవకాశం దక్కబోతున్నది. ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టుకోకుండా భారత్‌, జపాన్‌, జర్మనీ, బ్రెజిల్‌ శాశ్వత సభ్యత్వం కోసం చేయీచేయీ కలిపి కృషి చేయాలి. ముఖ్యంగా భారత్‌, జపాన్‌ ఇందుకు చొరవ తీసుకోవాలి. భద్రతా మండలి విస్తరణను చైనా వ్యతిరేకిస్తుండగా, అమెరికా పూటకో బుద్ధి ఘడియకో మాట చందంగా ప్రవర్తిస్తోంది. భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని బహిరంగంగా ప్రకటించే అమెరికా, తీరా వ్యవహారం అమీతుమీ తేలే సమయానికి వెనక్కు తగ్గుతోంది. అమెరికా విధానంలో మరింత స్పష్టత రావాలి. రష్యా మొదట్లో భద్రతా మండలి విస్తరణను వ్యతిరేకించినా, వారం తిరక్కుండానే తన వైఖరి మార్చుకుంది. భారత్‌, బ్రెజిల్‌ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని రష్యా కోరుతోంది. 'వీ టో' అధికారమిచ్చే అంశంపై మాత్రం స్పష్టత లేదు. ఏదిఏమైనా భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు (పి-5) తమ విశేషాధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగాలేవు. ఈ దేశాలు 'వీటో' అధికారాన్ని తరచూ తమ దేశ ప్రయోజనాల రక్షణకే ఉపయోగిస్తూ వచ్చాయి. దీనిమీద రుసరుసలాడటం వల్ల ప్రయోజనం లేదు. జి-4 దేశాలు కలసికట్టుగా కృషి చేసి ఆశించినది సాధించుకోవాలి.

కలిసికట్టుగా దేశాలన్నీ...

లక్ష్య సాధనకు జపాన్‌ సూచించిన త్రిసూత్ర ప్రణాళిక- భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ వ్యూహాన్ని గుర్తుకుతెస్తోంది. భద్రతా మండలి తాత్కాలిక సభ్యుల ఎన్నిక ప్రక్రియలో జి-4 దేశాలు పాల్గొనకూడదన్నది, జపాన్‌ ప్రతిపాదనలోని మొదటి సూత్రం. ఈ విధంగా దశాబ్ద కాలంపాటు సహాయ నిరాకరణ చేస్తే, అసలే క్షీణించిన భద్రతా మండలి పేరుప్రతిష్ఠలు మరింత దిగజారిపోతాయని జపాన్‌ పేర్కొంటోంది. ఈ పథకంలోని ఇతర అంశాలు- ఫలానా దేశాలు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ బాధ్యతలను ఉల్లంఘించాయని ప్రకటించే ప్రక్రియలోనూ జి-4 పాల్గొనకూడదు. ప్రస్తుత అంతర్జాతీయ వాస్తవాలను భద్రతా మండలి గుర్తించడం లేదు కాబట్టి మండలి విధి నిర్ణయాలన్నింటికీ జి-4 యాంత్రికంగా తలూపనక్కర్లేదు. ఐక్యరాజ్య సమితి శాంతి రక్షణ కార్యక్రమాలకు సైనిక, పౌర సిబ్బందినీ, నిధులనూ అందించకూడదు. స్థూలంగా ఇదీ జపాన్‌ త్రిసూత్ర వ్యూహం. అమెరికా వివిధ సమయాల్లో ఇలాంటి ఎత్తుగడలను విజయవంతంగా అవలంబించిన దృష్ట్యా, వాటిని జి-4 కూడా చేపట్టి ఆశించినది సాధించాలి. జి-4 ఇలా సహాయ నిరాకరణ చేస్తే అంతర్జాతీయ వ్యవహారాల్లో భద్రతా మండలి విశ్వసనీయత దెబ్బతినిపోతుంది. ఇక అప్పుడు పి-5 దేశాలు మండలి సంస్కరణలకు దిగిరాక తప్పదు. చైనా ఇప్పటికే ఏఐఐబీ, బ్రిక్స్‌ బ్యాంకులను ఏర్పాటుచేసి ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకుల ఆధిపత్యానికి గండి కొట్టిన సంగతి విదితమే. ఐక్యరాజ్య సమితిని స్థాపించి ఈ ఏడాదితో 70 ఏళ్లవుతున్న దృష్ట్యా, కనీసం ఈ సందర్భంలోనైనా పి-5 దేశాలు భద్రతా మండలిని సంస్కరించడానికి ఒప్పుకోవాలి. దానికి అవి ససేమిరా అంటే ఈ ఏడాది డిసెంబరు 31నాడు ఐరాస నుంచి నిష్క్రమిస్తామని జి-4 దేశాలు హెచ్చరించాలి. ఈమధ్య పలు ప్రపంచ నాయకుల సమావేశాల్లో పాశ్చాత్య శ్వేత దేశాలతో కలివిడిగా వ్యవహరించిన జర్మనీ ఇందుకు కలిసిరాకపోవచ్చు. కాబట్టి భారత్‌, జపాన్‌, బ్రెజిల్‌ దేశాలు సహాయనిరాకరణ పంథా చేపట్టి, భావస్వామ్యం ఉన్న దేశాలను కలుపుకొనిపోవాలి. అప్పటికీ భద్రతా మండలి మారనంటే, దాన్ని కాలగర్భంలో కలిసిపోనివ్వాలి.

బి. రమేష్‌బాబు
(ర‌చ‌యిత - విదేశీ వ్యవ‌హారాల నిపుణులు)
Posted on 28-08-2015