Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

భారత్‌పై దుష్ప్రభావం?

* కెనడా ఎన్నికల ఫలితాలు

కెనడాలో గత నెల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీ ఓడిపోతుందని ప్రజాభిప్రాయ సేకరణలు ముందే సూచించాయి. ఆ ప్రకారమే ట్రూడో పార్టీకి గత ఎన్నికల్లో లభించిన సీట్లకన్నా 20 సీట్లు తక్కువ వచ్చి సాధారణ మెజారిటీకి ఆమడ దూరంలో నిలిచింది. ప్రధాన ప్రతిపక్షమైన కన్సర్వేటివ్‌ పార్టీకి పాలక లిబరల్‌ పార్టీకన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా 121 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 338 సీట్లు గల కెనడా పార్లమెంటులో సాధారణ మెజారిటీ లభించాలంటే 170కి మించి సీట్లు రావాలి. పాలక లిబరల్‌ పార్టీకి దక్కినవి 157 సీట్లు మాత్రమే. అదే అతి పెద్ద పార్టీగా నిలచినా కనీస మెజారిటీ లేకపోవడంతో సొంతగా అధికారం చేపట్టజాలదు. ఈ పరిస్థితుల్లో భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు జగ్మీత్‌ సింగ్‌ ‘కింగ్‌మేకర్‌’గా ఆవిర్భవించారు. సింగ్‌ నాయకత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎన్డీపీ)కి 24 సీట్లు రావడంతో, ట్రూడో మైనారిటీ ప్రభుత్వానికి ఆయన అవసరం ఎంతో ఉంది.

సాధారణంగా ఒక భారత సంతతి వ్యక్తి విదేశాల్లో రాజకీయంగా ఇంత పట్టు సాధించినందుకు భారత ప్రభుత్వం సంతసించాలి. కానీ, ఖలిస్థాన్‌ సానుభూతిపరుడైన జగ్మీత్‌ సింగ్‌ భారత ప్రభుత్వంపై తరచూ విమర్శలు రువ్వుతుంటారు. కెనడా ఎన్నికల్లో మూడో అతి పెద్ద పార్టీగా అవతరించిన బ్లాక్‌ క్వెబెక్వా, ఎన్డీపీలు ట్రూడో ప్రభుత్వానికి అంశాలవారీగా మద్దతు ఇస్తాయి. ఖలిస్థాన్‌ అనుకూల ఎన్డీపీ ఇంతటి కీలక పాత్రధారిగా అవతరించడం భారత్‌-కెనడా సంబంధాలకు శుభసూచకం కాదు. నిజానికి బహుళజాతులకు, సంస్కృతులకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు నిలయాలైన భారత్‌, కెనడాలు సహజ మిత్రులుగా విలసిల్లవలసింది. ఆంగ్ల భాష, న్యాయపాలన వంటి ఉమ్మడి లక్షణాలున్న ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం వర్థిల్లవలసింది. వివిధ కారణాల వల్ల అది సాధ్యపడలేదు. కెనడాను 42 ఏళ్ల తరవాత సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కావడం విస్మయకర వాస్తవం. పోఖ్రాన్‌ అణు పరీక్షల తరవాత భారత్‌తో అణు సహకారానికి స్వస్తి చెప్పిన కెనడా 2010లో పౌర అణుశక్తి కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించింది. దీనివల్ల 2015 ఏప్రిల్‌లో భారత ప్రధాని కెనడా సందర్శనకు వీలు ఏర్పడింది. ఆ యాత్ర ఘనంగా విజయవంతమైంది. అప్పట్లో కెనడా ప్రధానిగా ఉన్న కన్సర్వేటివ్‌ నాయకుడు స్టీఫెన్‌ హార్పర్‌ భారతదేశ సమైక్యత, సమగ్రతలకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. దాంతో రెండు దేశాల సంబంధాల్లో నిస్సందేహంగా కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2015 కెనడా ఎన్నికల్లో జస్టిన్‌ ట్రూడో లిబరల్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. భారత ప్రధాని మోదీ ఆయన్ను అభినందించి భారత సందర్శనకు రావలసిందిగా ఆహ్వానించారు. కానీ, తన పార్టీలో, ప్రభుత్వంలో ఖలిస్థానీ శక్తుల మాటలకు చెవి ఒగ్గిన ట్రూడో భారత యాత్రలో మోదీ సర్కారుకు అంత దగ్గర కాలేకపోయారు. కెనడాలోని సిక్కులు ఆయన్ను జస్టిన్‌ సింగ్‌ అని పిలుస్తారని గమనిస్తే, ఉభయుల మధ్య సంబంధాలు ఎంత గాఢమైనవో అర్థమవుతుంది.

కెనడియన్‌ సిక్కులు ట్రూడో, ఆయన పార్టీకి రాజకీయంగా, ఆర్థికంగా, మౌఖికంగా బలమైన అండగా నిలుస్తున్నారు. ట్రూడో కూడా సిక్కులకు తన ప్రభుత్వంలో కీలక పదవులు ఇచ్చారు. రక్షణ మంత్రిగా హర్జిత్‌ సింగ్‌ సజ్జన్‌ నియామకాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. లిబరల్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఖలిస్థానీ సిక్కులు నిబద్ధ కార్యకర్తలుగా పనిచేస్తారు. పార్టీకి భూరి విరాళాలు ఇస్తారు. కెనడాలోని సుసంపన్న గురుద్వారాలపై అదుపు సాధించి ఖలిస్థాన్‌ వాదాన్ని వ్యాపింపజేస్తున్నారు. అందుకు గురుద్వారా నిధులను దుర్వినియోగపరుస్తున్నా కెనడా అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 1970, 80లలో పంజాబ్‌లో ఖలిస్థానీ ఉద్యమం రేగుతున్నప్పుడు ఆనాటి కెనడా ప్రధాని పియెరీ ట్రూడో విదేశీయుల వలసకు ద్వారాలు బార్లా తెరిచారు. పియెరీ ప్రస్తుత ప్రధాని జస్టిన్‌ తండ్రే. ఆయన ఔదార్యం పుణ్యమా అని అనేకమంది పంజాబీ సిక్కులు కెనడాకు వలస వచ్చారు. భారత ప్రభుత్వం తమను వేధిస్తోందనే వంకతో వారు కెనడాలో ఆశ్రయం పొందారు. ఆఫ్రికా నుంచీ చాలామంది భారత సంతతివారు వలసవెళ్లారు. నేడు కెనడా జనాభాలో భారత సంతతివారు నాలుగు శాతం (15 లక్షలు) ఉంటారు. వీరిలో హిందువులు 10 లక్షలైతే, సిక్కులు అయిదు లక్షలు. నేడు భారత పార్లమెంటులో సిక్కు ఎంపీల సంఖ్య కేవలం 13. కెనడాలో ఏకంగా 18మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

కెనడాలో పంజాబీ సిక్కులు సంతరించుకున్న ప్రాధాన్యాన్ని తెలిపే ఉదంతమొకటి ఇక్కడ ఉదహరించాలి. కెనడాకు ఉగ్రవాద ముప్పు అనే అంశంపై 2018లో విడుదలైన ఒక నివేదిక, భారతదేశంలో సిక్కు తీవ్రవాద (ఖలిస్థానీ) ఉద్యమాన్ని, భావజాలాన్ని కొందరు కెనడియన్‌ పౌరులు సమర్థిస్తూనే ఉన్నారని వెల్లడించింది. దీన్ని నిరసిస్తూ ఖలిస్థానీ శక్తులు పెద్దయెత్తున యాగీ చేయడంతో కెనడా ప్రభుత్వం దిగి వచ్చి, నివేదికలో సిక్కు తీవ్రవాదానికి సంబంధించిన ప్రస్తావనను 2019 ఏప్రిల్‌లో తొలగించింది. దీనిపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ ఘాటుగా స్పందించారు. ట్రూడో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారని, ఆయన చేసిన పని భారతదేశ భద్రత పైన, భారత్‌-కెనడా సంబంధాలపైన ప్రతికూల ప్రభావం ప్రసరిస్తుందన్నారు. కెనడా ప్రధాని నిప్పుతో చెలగాటమాడుతున్నారని హెచ్చరించారు. అయినా ట్రూడోకి మెజారిటీ లభించకపోవడంతో ఎన్‌డీపీ, బ్లాక్‌ క్వెబెక్వా పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ నిర్మాణం ఆలస్యమైపోతోంది. చివరకు నలుగురు సిక్కు మంత్రులతో మంత్రివర్గాన్ని ఏర్పరచే అవకాశముంది. ఆ ప్రభుత్వం ఎంతో కాలం నిలవలేకపోవచ్చు. మొత్తంమీద ట్రూడో హయాములో భారత్‌, కెనడా సంబంధాలు పెళుసుగానే ఉండొచ్చు.


- విష్ణు ప్రకాశ్‌
(కెనడాలో భారత మాజీ హైకమిషనర్‌)
Posted on 02-11-2019