Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

కీలక నిర్ణయం... ఎటు?

* బ్యాంకాక్‌లో ‘ఆర్‌సెప్‌’ సమావేశం నేడు

శత్రువుతో సంప్రతింపులు జరిపేముందు దేశ ప్రజలతో చర్చించాలని యుద్ధనీతి ఉద్బోధిస్తుంది. వాణిజ్యం విషయంలో మాత్రం శత్రువుతో చర్చలు జరపడం సరికాదు. వాణిజ్యమనేది ఎప్పుడూ ఇరు దేశాలకూ ప్రయోజనకారిగా ఉండాలి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (రీజినల్‌ కాంప్రెహెన్సివ్‌ ఎకనమిక్‌ పార్టనర్‌షిప్‌- ఆర్‌సెప్‌) విషయంలో భారత్‌ తీసుకోబోయే నిర్ణయంపై దేశీయంగా అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. బ్యాంకాక్‌లో నేడు జరగనున్న ఆర్‌సెప్‌ దేశాల అధినేతల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ప్రసార మాధ్యమాలతో మాట్లాడుతూ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాల్లో పరస్పర ప్రయోజనాలు ముఖ్యమన్నారాయన. సహేతుకమైన ప్రతిపాదనలు చేయనున్నామన్నారు. భాగస్వాముల నుంచి తాము ఆశిస్తున్న స్థాయిలో సేవలను పొందగలమనే విశ్వాసాన్ని వ్యక్తీకరించారు. భారత్‌కు ఇప్పటికే ఆసియాన్‌ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. అయినా కేంద్ర ప్రభుత్వం మరో ఒప్పందం దిశగా సాగడంపై భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహా దేశీయ వాణిజ్య వర్గాలు అనుమానపు దృక్కులు సారిస్తున్నాయి. దీనివల్ల దేశీయ పరిశ్రమలకు నష్టం వాటిల్లుతుందని, జాతీయ ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని అవి సందేహిస్తున్నాయి. దేశ ప్రయోజనాల రక్షణపై ప్రభుత్వం హామీలిస్తున్నా దానిపై పూర్తిస్థాయిలో విశ్వాసం వ్యక్తం కావడంలేదు. నిజానికి ఒప్పందంపై భారత్‌ సంతకం చేయడం, దూరంగా ఉండటం- వీటిలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రయోజనాలతో పాటు సమస్యలూ ఉన్నాయి.

ఆచితూచి నిర్ణయం
భారత్‌ ఆర్‌సెప్‌లో చేరితే అది భయాలను అధిగమించి, ప్రపంచీకరణను ఆలింగనం చేసుకునే సంకేతాలను బలంగా ఇచ్చినట్లే. దేశంలోని ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయస్థాయి వాణిజ్యంలో పోటీకి నిలబడటం ఉత్పత్తుల నాణ్యతను గణనీయంగా పెంచుతుంది. అది అంతిమంగా వినియోగదారులకు ప్రయోజనకరం. ప్రపంచ వేదికలపై మోదీ తనను తాను ఓ సంస్కరణవాదిగా ప్రకటించుకుంటూ ఉంటారు. బ్యాంకాక్‌లో ధైర్యంగా తీసుకోబోయే నిర్ణయం రాజనీతిజ్ఞుడిగా ఆయన ఖ్యాతిని పెంచే విధంగానే ఉంటుందని భావించవచ్చు. ఒకవేళ భారత్‌ ఈ ఒప్పందానికి దూరంగా ఉంటే, ఇతర 15 సభ్యదేశాలతో విడివిడిగా ద్వైపాక్షికంగా సంప్రతింపులు జరపాల్సి ఉంటుంది. ఒప్పందంపై సంతకం చేయకపోతే భారత ఎగుమతిదారుల అవకాశాలకు గండి పడుతుందనే విషయాన్నీ విస్మరించకూడదు. ఆలస్యంగా ఆర్‌సెప్‌ ఒప్పందంలో చేరాలనుకోవడమూ సమస్యాత్మకమే. భారత్‌ ‘ఆలస్య ప్రవేశాన్ని’ చైనా అడ్డుకునే అవకాశం ఉంది.

భారత్‌ ఏ విషయం తేల్చి చెప్పకుండా దాగుడుమూతల ధోరణిని అవలంబిస్తే అత్యంత శక్తిమంతమైన ఒప్పందంపట్ల దిల్లీ వైఖరిని చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు నిందించే అవకాశం ఉంది. అవి భారత్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాయి. ఈ విభిన్న దృక్కోణాల మధ్య మోదీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇటీవల కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ విషయంపై మాట్లాడుతూ ‘ప్రభుత్వం జాతి ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదు. వాటిని నిర్ణయించడంలో విశాల దృక్పథంతో వ్యవహరిస్తాం’ అన్నారు. ఈ అంశంపై కొన్ని వర్గాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాయనీ ఆయన తప్పుపట్టారు. ‘జాతీయ ప్రయోజనం’ అంటే కేవలం కొందరు ఉత్పత్తిదారుల ప్రయోజనం కాదని, ప్రభుత్వం జాతీయ ప్రయోజనానికి చెప్పే నిర్వచనంలో వినియోగదారుల ప్రయోజనాలూ ఇమిడి ఉన్నాయని అన్యాపదేశంగా వెల్లడించారు. మరోవైపు ఆర్‌సెప్‌ ఒప్పందంపై సంతకంచేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు అది మరణ శాసనమవుతుందని కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ విమర్శిస్తున్నారు. దేశీయ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని, రైతులు చిరువ్యాపారులు కోలుకోలేని విధంగా దెబ్బతింటారని అంటున్నారు. దీన్ని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కొట్టిపారేశారు. యూపీఏ హయాములో ఆసియాన్‌ దేశాలకు 75 శాతం వాణిజ్యానికి భారత్‌ తలుపులు తెరచినప్పుడు ఈ విమర్శలు ఏమైపోయాయని ప్రశ్నించారు. ఆర్‌సెప్‌ ఒప్పందం దిశగా ప్రభుత్వ వైఖరి సానుకూలంగానే ఉండవచ్చనడానికి మంత్రి వ్యాఖ్యలను సూచనలుగా తీసుకోవచ్చు. భారత్‌ కొన్ని (వస్త్ర పరిశ్రమవంటి) రంగాల్లో పోటీని, అంతర్జాతీయ స్థాయి నాణ్యతను పెంచేందుకు విదేశాలతో కలిసి ప్రస్థానం సాగించవచ్చనీ తెలుస్తోంది. భారత్‌లో విదేశీ పరిశ్రమలు ప్రవేశిస్తే- క్రమేపీ కనుమరుగయ్యే రంగాల మాటేమిటనేది పలువురి మదిని తొలుస్తున్న ప్రశ్న. ఆర్‌సెప్‌ ఒప్పందంపై ప్రతిస్పందన వ్యవస్థీకృత మార్పులకు కారణమవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల్లో కొందరు అంతర్గతంగా చెబుతున్న సమాచారం ప్రకారం భారత్‌ ఆర్‌సెప్‌ దేశాలను రెండు రకాలుగా వర్గీకరిస్తుంది. మొదటిది- పది ఆసియాన్‌ దేశాలు, జపాన్‌, దక్షిణ కొరియా. ఈ దేశాలతో ఇప్పటికే భారత్‌ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలను కలిగి ఉంది. సమీప భవిష్యత్తులోనే వీటికి చెందిన మరిన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను నిలుపుదల చేయవచ్చు. రెండో వర్గీకరణ కింద ఇప్పటివరకు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం లేని చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఉంటాయి. వీటి విషయంలో మరికొన్ని ఉప వర్గీకరణలు ఉండవచ్చు.

చైనాకు సంబంధించి కొన్ని రంగాల్లోని ఉత్పత్తులపై ‘భవిష్యత్తులో’ దిగుమతి సుంకాలను తొలగించేలా ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది (వినియోగదారుల వస్తూత్పత్తి, తయారీ, రసాయన రంగాల వంటివి). దీనివల్ల దేశీయ పరిశ్రమలకు నాణ్యతను మెరుగుపరచుకునే సమయం దొరుకుతుంది. ఈ విధానంలో 10, 15, 20 ఏళ్ల కాలావధుల్లో మన పరిశ్రమలు విదేశాలతో పోటీ పడగలుగుతాయి. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతోనూ పాడి ఉత్పత్తుల విషయంలో ఆలస్యంగా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలకు తెరతీయవచ్చు. దీనివల్ల దేశీయ పాడి పరిశ్రమకూ పోటీతత్వాన్ని పెంచుకునేందుకు సమయం లభిస్తుంది.

పూర్వాపరాలు
* ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (రీజినల్‌ కాంప్రెహెన్సివ్‌ ఎకనమిక్‌ పార్టనర్‌షిప్‌- ఆర్‌సెప్‌)లో భారత్‌ చేరితే సభ్యదేశాల సంఖ్య 16కు పెరుగుతుంది.
* భారత్‌, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు భాగస్వామ్య దేశాలు; అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియన్‌ నేషన్స్‌ (ఆసియాన్‌) సభ్య దేశాలు మరో 10 ఉన్నాయి.
* స్వేచ్ఛావాణిజ్యానికి సంబంధించిన ఆర్‌సెప్‌ ఒప్పందం మేరకు దిగుమతి సుంకాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ 16 దేశాల మధ్య 112 వస్తువుల వాణిజ్యం జరుగుతోంది. ఒప్పందం కుదిరితే ఇందులో కనీసం నాలుగోవంతు అంటే- 28 వస్తువులపై దిగుమతి సుంకాలను తొలగించాల్సి ఉంటుంది. మిగతా 84 వస్తువులమీద సుంకాన్ని తొలగించే అంశంపై దశలవారీగా నిర్ణయం తీసుకుంటారు.
* భారత్‌ చైనాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాని(ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌- ఎఫ్‌ఏటీ)కి 2007లో అప్పటి యూపీఏ-1 ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.
* భారత్‌- ఆసియాన్‌ దేశాలతో, దక్షిణ కొరియాతో 2010లో (యూపీఏ-2 హయాములో) ఎఫ్‌టీఏ కుదుర్చుకుంది.
* జపాన్‌తో ఒప్పందం 2011లో జరిగింది.
* ఆసియాన్‌ దేశాలకు భారత్‌ 75 శాతం వాణిజ్యానికి తలుపులు తెరిచింది. అందుకు బదులుగా ధనిక దేశమైన ఇండొనేసియా భారత్‌ ఉత్పత్తుల్లో 50 శాతానికే అవకాశం ఇచ్చింది.
* ఆర్‌సెప్‌లో సభ్యత్వాలు పొందనున్న దేశాలతో 2004లో భారత్‌ వాణిజ్యలోటు రూ.49,364 కోట్లు; 2014లో యూపీఏ-2 ప్రభుత్వం దిగిపోయే సమయానికి అది రూ.5.50 లక్షల కోట్లకు చేరింది.

ఎన్నో చిక్కు ముళ్లు
ఆసియాన్‌ దేశాలైన ఇండొనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌, లావోస్‌, మలేసియా, మియన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, బ్రూనై, కంబోడియాలతో సహా జపాన్‌, దక్షిణ కొరియాలతో ఇప్పటికే భారత్‌కు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలున్నాయి. ఈ 12 దేశాలనుంచి వస్తున్న దిగుమతుల్లో 75 శాతం వస్తువులపై భారత్‌ సుంకాలను తొలగించింది. ఆర్‌సెప్‌లో సభ్యదేశంగా చేరడంద్వారా, మిగతా 25 శాతం వస్తువుల మీదా సుంకాలను తీసేయాల్సిందిగా ఈ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. దీనికి భారత్‌ అంగీకరిస్తే చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల దిగుమతుల మీదా సుంకాలను తొలగించాల్సి వస్తుంది. ఇదే భారత్‌కు కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం.

ఈ మూడు దేశాల దిగుమతులకు తలుపులు బార్లాతెరిస్తే ప్రధానంగా నాలుగు రంగాల్లో భారత్‌కు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, పాడి ఉత్పత్తులు, ఉక్కు, రసాయనాల రంగాల్లో భారీ వాణిజ్యలోటు ఏర్పడుతుంది. ఇప్పటికే చైనా ఉత్పత్తులు దేశంలోకి వెల్లువెత్తుతున్నాయి. ఒప్పందం ద్వారా సుంకాలను తొలగిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. చైనాతో భారత్‌కు వాణిజ్యలోటు సుమారు రూ.3.76 లక్షల కోట్లు. న్యూజిలాండ్‌ పాడి ఉత్పత్తులను అతి చౌకగా ఇతర దేశాలకు దిగుమతి చేస్తోంది. ఇప్పటికే పాడి ఉత్పత్తుల్లో స్వయంసమృద్ధి సాధించిన భారత్‌లో పాడి పరిశ్రమను ఇది దెబ్బ తీస్తుందనే భయాందోళనలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌తో స్వేచ్ఛావాణిజ్యానికి ఆస్ట్రేలియా ఆసక్తి చూపుతోంది. భారత్‌ ఈ మూడు దేశాలతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఆ దేశాలకు ఒనగూడే ప్రయోజనాలే ఎక్కువ. ఈ పరిస్థితిని భారత్‌ ఎలా అధిగమిస్తుందనేదే కీలకాంశం!


- రాజీవ్‌ రాజన్‌
Posted on 04-11-2019