Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ప్రజాకోర్టులో బ్రెక్సిట్‌ బంతి

* వచ్చే నెలలో బ్రిటన్‌ ఎన్నికలు

బ్రిటన్‌ రాజకీయవాదులు మల్లగుల్లాలు పడుతూ గత పదేళ్లలో నాలుగోసారి పార్లమెంటు ఎన్నికలను దేశం మీద రుద్దారు. 2016లో ‘బ్రెక్సిట్‌’పై జరిగిన జనవాక్య సేకరణలో ప్రతికూల ఫలితం రావడంతో అప్పటి ప్రధానమంత్రి డేవిడ్‌ కామెరాన్‌ రాజీనామా చేశారు. 650 సీట్లు గల బ్రిటిష్‌ పార్లమెంటులో కామెరాన్‌ కన్సర్వేటివ్‌ పార్టీ కేవలం 330 సీట్లతో నెట్టుకొస్తోంది. కామెరాన్‌ తరవాత ఈ అత్తెసరు మెజారిటీతో బండి నడిపించే భారం థెరెసా మే మీద పడింది. బ్రిటన్‌ ఐరోపా సమాఖ్య (ఈయూ)లో కొనసాగాలని అభిలషించేవారు జనవాక్య సేకరణలో ఓడిపోవడం అత్యంత విచారకరమని కామెరాన్‌ వ్యాఖ్యానించారు. దీనివల్ల దేశ ప్రజల మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయనీ, ప్రభుత్వం స్తంభించిపోయిందనీ, చివరకు బ్రిటన్‌ ఎలాంటి ఒప్పందమూ లేకుండా వట్టి చేతులతో ఈయూ నుంచి వైదొలగాల్సి వస్తోందనీ ఆయన వాపోయారు. కామెరాన్‌ తరవాత ప్రధానమంత్రి పదవి చేపట్టిన థెరెసా మే ప్రజల మద్దతు పెంచుకుంటే బ్రెక్సిట్‌ సంప్రదింపుల్లో గట్టిగా బేరమాడగలనన్న అంచనాతో గడువుకన్నా మూడేళ్లు ముందే- 2017 జూన్‌లో మధ్యంతర ఎన్నికలు జరిపించారు. కానీ, ఓటర్లు ఆమెకున్న బలంలో 13 సీట్లకు కోత పెట్టడంతో పార్లమెంటులో పాలక కన్సర్వేటివ్‌ పార్టీ బొటాబొటి మెజారిటీతో నెట్టుకురావలసిన దుస్థితిలో పడిపోయింది. మొత్తం మీద బ్రెక్సిట్‌ సమస్య దేశంలో చీలిక తీసుకొచ్చింది. ఈయూ బ్రిటన్‌ సార్వభౌమత్వాన్ని నీరుగారుస్తోంది కాబట్టి ఐరోపా సమాఖ్య నుంచి బయటికొచ్చేయాలని భావిస్తున్నవారిదే ప్రస్తుతం పైచేయిగా ఉంది. కానీ, స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌లు ఈయూ నుంచి నిష్క్రమించడానికి (బ్రెక్సిట్‌కు) ససేమిరా అంటున్నాయి. ఈ రెండు ప్రాంతాలతో పాటు ఇంగ్లండ్‌, వేల్స్‌లను కలిపి యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ లేదా బ్రిటన్‌ అంటున్నారు. ఈయూ నుంచి బ్రిటన్‌ నిష్క్రమణకు థెరెసా మే ప్రతిపాదించిన ఫార్ములాను పార్లమెంటు మూడుసార్లు తిరస్కరించడంతో ఈ ఏడాది జూన్‌లో ఆమె రాజీనామా చేయకతప్పలేదు. ఆమె స్థానంలో బోరిస్‌ జాన్సన్‌ జులై 24న ప్రధాని పీఠమెక్కారు. పూర్వాశ్రమంలో పాత్రికేయుడైన జాన్సన్‌ మొదటి నుంచీ ఈయూలో బ్రిటన్‌ కొనసాగకూడదని వాదిస్తున్నారు. బ్రిటన్‌ నిష్క్రమణకు ఆయన అక్టోబరు 17న ఈయూతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ, జాన్సన్‌ మైనారిటీ ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి దన్నుగా నిలుస్తున్న డెమోక్రటిక్‌ యూనియనిస్ట్‌ పార్టీతో సహా అన్ని ప్రధాన పార్టీలు జాన్సన్‌ కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో సమస్య ప్రజా న్యాయస్థానంలోకి వెళ్లింది. డిసెంబరు 12న పార్లమెంటుకు తిరిగి ఎన్నికలు జరగనున్నాయి.

ఈ బ్రెక్సిట్‌ రగడ పట్ల భారత్‌ ఎలా స్పందించాలనేది ప్రశ్న. దీనికి థెరెసా మే 2018లో భారత సందర్శనకు వచ్చినప్పుడు సమాధానం అందించారు. బ్రెక్సిట్‌ అనంతరం భారత్‌-బ్రిటన్‌ల మధ్య వ్యూహపరమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని మే నమ్మకం వ్యక్తం చేశారు. కలసికట్టుగా ముందుకుసాగుతూ ఉజ్జ్వల అవకాశాలను అందిపుచ్చుకుందామని పిలుపు ఇచ్చారు. ఓం ప్రథమంగా భారతీయ విద్యార్థులకు, నిపుణులకు వీసా నిబంధనలను సరళతరం చేయడం విశేషం. 2010-11లో 39,090 మంది విద్యార్థులు వెళ్లగా, 2016-17కల్లా వారి సంఖ్య 16,550కి తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతూ భారతీయ విద్యార్థుల వెల్లువ మళ్లీ పెరుగుతోంది. మొత్తం మీద బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ కన్నా కన్సర్వేటివ్‌ పార్టీయే భారత్‌ పట్ల ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటుంది. 2015 నవంబరులో లండన్‌కు వెళ్ళిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అప్పటి కన్సర్వేటివ్‌ ప్రధాని కామెరాన్‌ ఘన స్వాగతం పలికారు. లండన్‌ వెంబ్లే స్టేడియంలో సమావేశమైన భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఉభయ ప్రధానులూ ప్రసంగించారు. ‘అక్కడ చేరిన 60,000 మందికి మోదీని పరిచయం చేస్తూ ఏదో ఒక రోజు ఓ భారత సంతతి బ్రిటిష్‌ పౌరుడు బ్రిటన్‌ ప్రధానమంత్రి అవుతాడన్నాను. అంతే, అక్కడి జనం హర్షధ్వానాలతో ఆకాశం దద్దరిల్లింది’ అని కామెరాన్‌ ఆ తరవాత ఓ సందర్భంలో సభలోని ఘటనను ప్రస్తావించారు. ప్రతిపక్షం లేబర్‌ పార్టీ తీరు వేరు. ఓటు బ్యాంకు రాజకీయాలతో భారత్‌ పట్ల అది ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తూ ఉంటుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) నుంచి వలసవచ్చి బ్రిటిష్‌ పార్లమెంటుకు ఎన్నికైన లార్డ్‌ నజీర్‌ అహ్మద్‌ వంటివారు లేబర్‌ పార్టీలో ఉండి భారత వ్యతిరేకతను ఎగదోస్తూ ఉంటారు. నేడు బ్రిటన్‌లో ఉన్న 11 లక్షలమంది పాకిస్థానీ సంతతివారిలో 10 లక్షలమంది పీఓకే నుంచి వలస వచ్చినవారే. పెద్దగా చదువు సంధ్యలు లేక చిన్నాచితకా పనులు చేసుకుంటూ వారంతా కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమై జీవిస్తున్నారు. అదే భారతీయులైతే పెద్ద చదువులు చదివి ఐటీ, వైద్యం, ఫైనాన్స్‌, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఉన్నతోద్యోగాలు చేసుకుంటున్నారు. వృత్తి వ్యాపారాల రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తారు. వీరికి భిన్నంగా పాక్‌ సంతతివారు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల రాజకీయులకు వారు ఓటు బ్యాంకులుగా ఉపయోగపడుతున్నారు. పలు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంటూ తమ పనులు నెరవేర్చుకోగలుగుతున్నారు. పాక్‌ సంతతి ఓటర్ల ఒత్తిడి వల్లనే లేబర్‌ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్‌ కశ్మీర్‌ అంశంపై భారత్‌ను తీవ్రంగా దుయ్యబడుతూ సెప్టెంబరు 25న ఒక తీర్మానం చేశారు. దీనిపై 100కుపైగా భారత సంతతి సంస్థలు, సంఘాలు విరుచుకుపడ్డాయి. బ్రిటిష్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా కోర్బిన్‌ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఒడిగట్టారని విమర్శించారు. తన ప్రకటనలోని కొన్ని అంశాలు భారతీయ సంతతి బ్రిటిష్‌ పౌరులను నొప్పించి ఉండవచ్చని తరవాత కోర్బిన్‌ కూడా అంగీకరించారు.

డిసెంబరు బ్రిటిష్‌ పార్లమెంటు ఎన్నికల్లో కన్సర్వేటివ్‌ పార్టీకే ఆధిక్యం లభిస్తుందని అనేక ప్రజాభిప్రాయ సేకరణలు చెబుతున్నాయి. అయితే ప్రజాభిప్రాయ సేకరణలు చాలాసార్లు విఫలమయ్యాయని మరచిపోకూడదు. మొత్తం మీద ఈసారి బ్రెక్సిట్‌, ఆరోగ్య సేవలు ప్రధాన ఎన్నికల అంశాలుగా హోరాహోరీ సమరం సాగనుంది.

- విష్ణు ప్రకాశ్‌
(రచయిత కెనడా, దక్షిణ కొరియాల్లో భారత రాయబారిగా పనిచేశారు)
Posted on 09-11-2019