Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

జాతి హితమే ప్రథమ ప్రాధాన్యం

* ‘ఆర్‌సీఈపీ’పై సహేతుక నిర్ణయం

భారతావని ప్రయోజనాలే ప్రథమ ప్రాథమ్యంగా నరేంద్ర మోదీ సర్కారు చెక్కు చెదరని చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. మోదీ సారథ్యంలోని ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ దేశమే కీలక ప్రాతిపదిక అవుతోంది. ఈ క్రమంలో 2019, నవంబరు 4వ తేదీ భారత చరిత్ర పుటల్లో చిరస్మరణీయమైన మైలురాయిగా నిలిచిపోతుందనే చెప్పాలి. భారతావని ప్రగతి కాంక్షలకు నిలువు పాతర వేసే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) ఒప్పందం పరిధినుంచి వైదొలగాలంటూ మోదీ ప్రభుత్వంసాహసోపేతమైన నిర్ణయం వెలువరించిన విశిష్ట సందర్భమది. దేశ అవసరాలు, ప్రయోజనాల రీత్యా ఆర్‌సెప్‌ ఒప్పందం ఏ రకంగానూ క్షేమదాయకం కాదని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత- నిస్సంకోచంగా దాన్ని తిరస్కరించడం శ్లాఘించదగిన చర్య. దేశంలోని రైతాంగం, వర్తకజనం, వినియోగదారుల ప్రయోజనాలకు కట్టుబాటు చాటుతూ అంతర్జాతీయ ఒప్పందానికి ససేమిరా అనడం భారత్‌ శక్తి, సామర్థ్యాలనూ ప్రపంచానికి చాటి చెప్పింది. స్వీయ ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలో అవసరమైతే ఒక దేశంగా భారత్‌ ఎంత బలంగా గళం వినిపించగలదో చాటిన పరిణామమిది. దేశంలోని సహస్ర వృత్తుల కార్మికజనం పొట్టగొట్టే విదేశీ వాణిజ్య చొరబాట్లను ఏ రకంగానూ ముందుకు సాగనివ్వబోమన్న భారత్‌ నిబద్ధతనూ ప్రపంచానికి వెల్లడించిన సంఘటన అది. దేశానికే తొలి ప్రాధాన్యం చాటుతూ ప్రధాని మోదీ కనబరుస్తున్న సాహసోపేతమైన చొరవ నయా భారతాన్ని ఆవిష్కరిస్తోంది. జాతి అణువణువునా ప్రతిఫలిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని చాటుతోంది.

తిరుగులేని శక్తిగా... భారత్‌!
‘ఆర్‌సీఈపీలో చేరడంవల్ల భారత్‌కు కలిగే ప్రయోజనమేమిటి అని నాతో నేను అనేక సార్లు తర్కించుకున్నాను. ఏ ఒక్కసారీ నాకు సానుకూల సమాధానం లభించలేదు. బాపూజీ ఈ దేశానికి ప్రసాదించిన మహా ప్రసాదం స్వావలంభన స్ఫూర్తి. ఆయన ప్రవచించిన స్వావలంభన సిద్ధాంతం ప్రాతిపదికన చూసినా, నా అంతరాత్మను పదే పదే తరచి చూసినా ఆర్‌సెప్‌కు దూరంగా ఉండమన్న జవాబే వినిపించింది’- ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పరిధినుంచి వైదొలగుతూ నిర్ణయం వెలువరించిన తరవాత ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్‌పట్ల ఆయన ఆపేక్షకు ప్రతీకగా నిలుస్తాయి. దేశ ప్రయోజనాలను కాపాడే క్రమంలో ఆయన ఎంత దూరమైనా వెళ్ళగలరని, ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకోగలరని వెల్లడించిన పరిణామాలివి. అన్నదాతల ప్రయోజనాలను; చిన్న మధ్య తరహా వ్యాపారుల అవసరాలను; వస్త్ర పరిశ్రమ ప్రాధాన్యాలను, పాడి పరిశ్రమ సంక్షేమాన్ని; తయారీ రంగ ప్రాథమ్యాలను; వైద్య, ఉక్కు, రసాయన పరిశ్రమల అవసరాలను పరిరక్షించేందుకు ప్రధాని మోదీ ఎంత దూరం ఆలోచించగలరో, ఎంత మేలిమి నిర్ణయాలు వెలువరించగలరో ఆర్‌సెప్‌ పరిణామాలు నిరూపిస్తున్నాయి. భారత్‌కు తీవ్రమైన వాణిజ్య నష్టాలు కలిగించే, దిగుమతుల వెల్లువతో దేశ ప్రయోజనాల గండికొట్టే వేదికను పంచుకునేందుకు నరేంద్ర మోదీ సర్కారు సుతరామూ ఇష్టపడలేదు. మన దేశ ప్రాథమ్యాలకు ఏ కోశానా చోటు కల్పించని వేదికనుంచి బయటకు రావడమే మేలని ఆయన భావించారు. భారతీయ రైతుల, వ్యాపారుల ప్రయోజనాలకు తూట్లు పొడిచే ఏకపక్ష అంతర్జాతీయ ఒప్పందాల్లో భారత్‌ భాగస్వామి కారాదన్నదే నా స్థిరాభిప్రాయం!

కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం భారత్‌ను ఏ రకంగా వెనక్కి నెట్టిందో చూశాం. దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో యూపీఏ అనేక విధాలుగా విఫలమైంది. చైనాతో 2007 న్రాటికే ప్రాంతీయ వాణిజ్య ఒప్పందా(ఆర్‌టీఏ)నికి సమకట్టడంవల్ల దేశ వాణిజ్య సమతుల్యత దెబ్బతింది. యూపీఏ విధానపరమైన నిర్వాకాల ఫలితంగా చైనాతో వాణిజ్యం విషయంలో భారత్‌ దారుణంగా నష్టపోయింది. 2005లో చైనాతో భారత్‌ వాణిజ్య లోటు 190 కోట్ల డాలర్లు కాగా- 2014 నాటికి అది 4,480 కోట్ల డాలర్లకు చేరింది. వాణిజ్య నష్టం పదేళ్ల కాలావధిలో 23 రెట్లు పెరిగిందన్న మాట! వాణిజ్యపరంగా ఏర్పడిన ఈ అసమతుల్యత దేశీయ పరిశ్రమలను ఏ స్థాయిలో దెబ్బతీసిందో వేరే చెప్పనవసరం లేదు. భారతీయ రైతుల, పరిశ్రమల ప్రయోజనాల పరిరక్షణ ఏనాడూ కాంగ్రెస్‌ ప్రాథమ్యం కాదు. ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. 2013లో జరిగిన బాలి ఒప్పందం ఇందుకు ఓ ఉదాహరణ. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా, ఆనంద్‌ శర్మ భారత వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో 2013లో బాలిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సమావేశాల్లో భారత్‌ వ్యవహరించిన తీరు ఎంతోమందిని ఆశ్చర్యపరచింది. దేశంలో సేద్య రంగానికి సబ్సిడీలు ఇవ్వడం, రైతులకు మద్దతు ధరలు చెల్లించడంపై అప్పటివరకూ కొనసాగిన విధానాన్ని నాటి ప్రభుత్వాధినేతలు నీరుగార్చారు. అదే తీరు కొనసాగి ఉంటే దేశ రైతాంగం తీవ్ర సమస్యల్లో కూరుకుపోయేది. కానీ, 2014లో ప్రధానిగా మోదీ ఆగమనంతో పరిస్థితులు ఒక్కపెట్టున మారిపోయాయి. భారత్‌లోని అన్నదాతల ప్రయోజనాల పరిరక్షణకు తిరుగులేని కట్టుబాటు చాటుతూ, యూపీఏ జమానా నాటి ప్రతిపాదనలను వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. జాతి ప్రయోజనాలకు కాపుకాయడంలో విఫల చరిత్రను సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ- తాజాగా ఆర్‌సెప్‌నుంచి వైదొలగుతూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తన ఘనత అని చెప్పుకొనేందుకు తాపత్రయపడుతుండటం హాస్యాస్పదం. కాంగ్రెస్‌ హ్రస్వదృష్టి ఫలితంగానే దేశంలోని వ్యాపారుల, రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే ఈ కూటమిలో భారత్‌ భాగస్వామిగా మారింది. ఆర్‌సెప్‌తో కలిసి సాగడంవల్ల చైనా ఉత్పత్తులు భారత్‌ను ముంచెత్తుతాయని, దానివల్ల వాణిజ్య సమతుల్యత దెబ్బతింటుందన్న విషయంలో తొలినాళ్లనుంచే స్పష్టత ఉంది. ఈ కూటమిలోని మిగిలిన దేశాలతోనూ భారత్‌ సానుకూల వాణిజ్య ప్రాతిపదికలు ఏర్పాటు చేసుకోలేదు.

మహత్తర లక్ష్యం వైపు అడుగులు
నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది మొదలు- యూపీఏ జమానా నాటి తప్పిదాలను సరిదిద్దే క్రతువు నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆర్‌సీఈపీ కూటమితో వాణిజ్య అసమతూకాన్ని సరిచేసి- భారతావని ప్రయోజనాలను కాచుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. కూటమి సమావేశాల్లో ప్రతిసారీ భారత్‌- విదేశీ వాణిజ్య చొరబాట్లకు వ్యతిరేకంగానే గళం వినిపించింది. ఏదో స్థాయిలో మనదేశానికి లబ్ధి చేకూర్చేలా కూటమితో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రత్నించింది. ఆర్‌సెప్‌ కూటమి దేశాలను తమ సేవల రంగాన్ని మొట్టమొదటిసారిగా భారత్‌కోసం తెరిచేలా ఒప్పించడం, కూటమి సభ్య రాజ్యాలకు భారత్‌నుంచి ఎగుమతులు పెంచడం వంటి వివిధ సానుకూల పరిణామాలు మోదీ ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగానే సాధ్యమయ్యాయి. ఆర్‌సీఈపీలో భాగస్వామిగా మారేందుకు కాంగ్రెస్‌ తహతహలాడింది. అందుకోసం యూపీఏ-2 ప్రభుత్వం 2014 జనవరి 1నాటి దిగుమతి సుంకాన్ని ‘మూల రేటు’గా (బేస్‌ రేట్‌)గా అమలు చేయడానికీ అంగీకరించింది. ఆర్‌సెప్‌ ఒప్పందం 2016నాటికి అమల్లోకి వస్తుందని కాంగ్రెస్‌ ఆనాడు అంచనా వేసింది. ఒకవేళ 2014 జనవరి నాటి దిగుమతి సుంకమే గనుక అమలై ఉంటే అది దేశీయ పరిశ్రమలకు శరాఘాతమయ్యేది. ఆర్‌సెప్‌ దేశాలనుంచి దిగుమతులు భారత్‌లోకి వెల్లువలా వచ్చిపడేవి. నిజానికి గడచిన కొన్నేళ్లలో అనేక ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు బాగా పెరిగాయి. జాతి హితమే అభిమతంగా స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ 2019ని ప్రాతిపదికగా చేసుకొని దిగుమతి సుంకం నిర్ణయించాలని పట్టుబట్టారు. ఆర్‌సెప్‌ సమావేశంలో మోదీసహా వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ భారతీయ రైతుల; చిన్న మధ్యతరహా పరిశ్రమల, తయారీ పరిశ్రమల ప్రయోజనాల పరిరక్షణకు అహరహం కృషి చేశారు. భారత్‌కు లబ్ధి చేకూర్చే విధంగా నిబంధనలు మార్చాలని పట్టుబట్టారు. వాణిజ్య పన్నుల్లో అసమతూకాన్ని సరిచేయాలని, కస్టమ్స్‌ సుంకానికి బేస్‌ రేటును మార్చాలని, అత్యంత ప్రాధాన్య దేశ హోదా నిబంధనలు సవరించాలని, ఒప్పందంలో చేరిన తరవాతా జాతీయ ప్రయోజనాల రీత్యా అవసరమైన పక్షంలో సుంకాలు పెంచేందుకు (రాచెట్‌ ఆబ్లిగేషన్స్‌) మినహాయింపు ఇవ్వాలని మోదీ ప్రభుత్వం గట్టిగా డిమాండ్లు వినిపించింది. ఆర్‌సెప్‌ సమావేశంలో ఒక దశలో 70 అంశాలు చర్చకు రాగా- అందులో 50కిపైగా భారత్‌ వెలిబుచ్చిన అభ్యంతరాలు, సూచించిన మార్పులే ఉండటం మోదీ సర్కారు నిబద్ధ కృషికి నిదర్శనం. ‘ఆసియాన్‌’తో వాణిజ్యానుబంధాన్ని భారత్‌ పునఃసమీక్షిస్తోంది. దక్షిణ కొరియాతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపైనా మన దేశం సమీక్షకు సిద్ధపడుతోంది. జపాన్‌, అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు, ఇతర అభివృద్ధి చెందిన రాజ్యాలతో వాణిజ్యానుబంధాల విషయంలో భారత్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. 2025 నాటికి భారత్‌ను అయిదు లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అక్కరకొచ్చే ప్రతి వ్యూహాన్నీ ఇప్పుడు మన దేశం అమలు చేస్తోంది. దేశ రైతాంగానికి; చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, తయారీ రంగానికి ఊతమిచ్చే ప్రతి నిర్మాణాత్మక విధానాన్నీ మోదీ సర్కారు నెత్తికెత్తుకుంటోంది. మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశంగా భారత్‌ విలువ క్రమంగా ఇనుమడిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌సెప్‌ దేశాలు భారత్‌ను విస్మరించి ఎక్కువకాలం కూటమిగా మనుగడ సాగించలేవు. కాబట్టి అవి ఏనాటికైనా మన నిబంధనలు, షరతులకు సిద్ధపడుతూ ముందుకొచ్చే తీరతాయి. ఇప్పటికైతే- ఆర్‌సెప్‌ను అడ్డంపెట్టుకొని భారత్‌ను వాణిజ్యపరంగా మింగేసేందుకు ప్రయత్నించిన చైనా ప్రయత్నాలను మోదీ ప్రభుత్వం విజయవంతంగా తిప్పికొట్టింది. అటు సూర్యుడు ఇటు పొడిచినా భారత్‌ మాత్రమే తమ తొలి ప్రాథమ్యమని విస్పష్టంగా ప్రపంచానికి చాటిచెప్పింది.

యూపీఏ నిర్వాకాలు
‘ఆసియాన్‌’తో స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత ఒప్పందం విషయంలో యూపీఏ ప్రభుత్వం భారత ప్రయోజనాలకు విఘాతం కలిగే విధంగానే వ్యవహరించింది. భారత్‌తో వాణిజ్యానికి కేవలం 50శాతం మార్కెట్‌ను మాత్రమే తెరచేందుకు ఇండొనేసియా అంగీకరించగా, వియత్నాం 69శాతం విపణి తలుపులు తెరిచింది. కానీ, భారత్‌ మాత్రం 74శాతం మార్కెట్‌ను ఈ దేశాలకు బార్లా తెరచింది. ఈ తరహా అవివేక చర్యలవల్ల ఆర్‌సీఈపీ దేశాలతో వాణిజ్యంలో భారత్‌ భారీగా నష్టాలు చవిచూసింది. ఈ కూటమిలోని దేశాలతో 2004లో భారత్‌ వాణిజ్య లోటు 700 కోట్ల డాలర్లు కాగా- 2014నాటికి అది 7,800 కోట్ల డాలర్లకు విస్తరించింది. ప్రస్తుత మారకం రేట్ల ప్రకారం చూస్తే- ఈ నష్టం 2004లో 50వేల కోట్ల రూపాయలు కాగా 2014నాటికి అది అయిదు లక్షల 46వేల కోట్ల రూపాయలకు విస్తరించినట్లు లెక్కతేలుతుంది.

Posted on 13-11-2019