Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

సుస్థిరతకు సమాఖ్య సూత్రం!

* సిరియా సంక్షోభానికి పరిష్కార మార్గం
సిరియాలో తాజా పరిణామాలు చూస్తుంటే ఆ దేశం ముక్కచెక్కలు కాబోతోందా, ఈ విచ్ఛేద ప్రక్రియకు అమెరికా, రష్యాలు సూత్రధారులుగా వ్యవహరించబోతున్నాయా అన్న సందేహం వస్తోంది. 'సిరియా సంక్షోభం పరిష్కరించడానికి రష్యా, ఇరాన్‌లతో సహా మరే దేశంతోనైనా సరే కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది' అని సెప్టెంబరులో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రకటించారు. ఐరాస భద్రతామండలి తీర్మానం ద్వారా ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)పై పోరుకు అంతర్జాతీయ సంకీర్ణాన్ని ఏర్పరచాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సూచించారు. దరిమిలా సిరియాలో ఐఎస్‌ ఉగ్రవాదులపై రష్యా యుద్ధవిమానాలు, నౌకలు దాడులు ప్రారంభించాయి. పనిలో పనిగా సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష దళాలపైనా బాంబులు కురిపిస్తున్నాయి. మరోవైపు ఐఎస్‌కు రాజధాని లాంటి రక్కా నగర ముట్టడికి అమెరికా కూటమి ఉపక్రమిస్తోంది. రష్యా సైనిక జోక్యానికి లోపాయికారీగా సమ్మతించడం ద్వారా సిరియా విషయంలో అమెరికా ఇంతవరకు అనుసరించిన విధానం విఫలమైందని ఒబామా ఒప్పుకొన్నట్లయింది. ఒక్క సిరియా అనే ఏమిటి... అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, లిబియాల్లోనూ అమెరికా వ్యూహం బెడిసికొట్టింది. ఇప్పుడీ దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికా వ్యూహ పూర్వాపరాలు ఇలా ఉన్నాయి: 'పశ్చిమాసియాలో మనం ఇక నిరాటంకంగా సైనిక జోక్యం చేసుకోవచ్చు. సోవియట్‌ యూనియన్‌ మనల్ని అడ్డుకోగల స్థితిలో లేదు. ఇరాక్‌, సిరియా తదితర దేశాల్లో సోవియట్‌ మద్దతు కలిగిన ప్రభుత్వాలను మరో అయిదు పదేళ్లలో పడగొట్టాలి. తదుపరి అగ్రరాజ్యం (చైనా) ఈ ప్రాంతంలో అమెరికాను సవాలుచేయగలిగే లోపే ఈ పని పూర్తిచేయాలి' -1991లో సోవియట్‌ యూనియన్‌ పతనమవుతున్న దశలో అమెరికన్‌ సేనాని జనరల్‌ వెస్లే క్లార్క్‌తో అప్పటి ఉప రక్షణ మంత్రి పాల్‌ ఉల్ఫోవిట్జ్‌ అన్న మాటలివి. 1988-89లో అఫ్గానిస్థాన్‌లో అమెరికా మద్దతు కలిగిన ముజాహిదీన్‌ దళాల చేతిలో సోవియట్‌ సేనలు ఓడిపోవడంతో అమెరికా దూకుడు పెంచింది. 2001 సెప్టెంబర్‌ 11న న్యూయార్క్‌పై అల్‌ఖైదా దాడికి ప్రతీకారంగా అమెరికా మొదట అఫ్గానిస్థాన్‌పై విరుచుకుపడింది. 2003లో ఇరాక్‌పై దండయాత్రకు దిగి సద్దాం హుస్సేన్‌ను పదవీచ్యుతుణ్ని చేసింది. నియంతృత్వ ప్రభుత్వాలు తమ సొంత పౌరులపై దాడులు చేస్తున్నప్పుడు, వారిని రక్షించడం అంతర్జాతీయ బాధ్యత అంటూ ఐరాస సర్వప్రతినిధి సభ 2005లో చేసిన తీర్మానం, పశ్చిమాసియాలో తనకు గిట్టని ప్రభుత్వాలను మార్చి వేయడానికి అమెరికాకు అక్కరకొచ్చింది. 'ఇరాక్‌పై అమెరికా అక్రమ దాడి అనంతరం పశ్చిమాసియాలో, ఉత్తర ఆఫ్రికాలో పలు ప్రభుత్వాలు కూలిపోయి, అధికార శూన్యత ఏర్పడింది. ఈ శూన్యాన్ని ఉగ్రవాదులు, తీవ్రవాదులు భర్తీచేశారు. నేడు పశ్చిమాసియా సంక్షోభానికి ఇస్లామిక్‌ స్టేట్‌ కేంద్రబిందువుగా నిలవడమే దీనికి నిదర్శనం' అని ఐరాసలో పుతిన్‌ ఢంకా కొట్టి చెప్పారు.

వాడిపోయిన అరబ్‌ వసంతం

అరబ్‌ వసంతం పేరిట 2011లో పెల్లుబికిన ప్రజాస్వామిక ఉద్యమాలను 'ప్రభుత్వ మార్పు' వ్యూహానికి అమెరికా ఓ సాకుగా ఉపయోగించుకున్నా, చివరకు ఆ వ్యూహం ఎదురుతన్నింది. నేడు పశ్చిమాసియాలో ప్రజాస్వామ్య ఉద్యమాల స్థానాన్ని షియా, సున్నీ వైరాలు, జిహాదీల స్వైరవిహారాలు భర్తీచేశాయి. గడాఫీ ప్రభుత్వం కూలిన తరవాత లిబియా విఫలరాజ్యంగా మారగా, అఫ్గానిస్థాన్‌ కూడా అదే బాటలో ఉంది. ఈజిప్ట్‌ మళ్ళీ నిరంకుశ పాలనలోకి జారిపోతే, ట్యునీసియాను ఉగ్రవాదులు రాజకీయంగా, ఆర్థికంగా అస్థిరపరుస్తున్నారు. ఫ్రెంచి వలస పాలకుల విభజించి పాలించు వ్యూహం పుణ్యమా అని సిరియాలో సున్నీ మెజారిటీని అలవీ వర్గ(షియా) మైనారిటీలు పాలిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా తలెత్తిన అరబ్‌ వసంతాన్ని అసద్‌ ప్రభుత్వం అణచివేయడం అంతర్యుద్ధానికి దారితీసింది. ఈ పోరులో 2011 సెప్టెంబరు నుంచి 2015 ఏప్రిల్‌ వరకు 3.10లక్షలమంది మరణించారు. 2.20కోట్ల దేశ జనాభాలో సగంమంది ఇళ్లూవాకిళ్లు, ఉద్యోగ వ్యాపారాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. 40లక్షలమంది శరణార్థులై ఇతర దేశాలకు తరలిపోయారు. సిరియా నేడు అధ్యక్షుడు అసద్‌, ఐఎస్‌, కుర్దు, ప్రతిపక్ష దళాల ప్రాబల్య ప్రాంతాలుగా చీలిపోయింది. మొదట్లో సౌదీ అరేబియా, ఖతార్‌ తదితర సున్నీ దేశాలు జిహాదీలకు చాటుమాటుగా ఆయుధాలు, డబ్బూదస్కం అందించినా, సొంత ఖలీఫా రాజ్యస్థాపనే తన లక్ష్యమని ఐఎస్‌ ప్రకటించగానే, అది వారికి చేదు అయింది. మరోవైపు అమెరికా నుంచి డబ్బు, సాయుధ శిక్షణ పొందిన ప్రతిపక్ష దళాల్లో అనేకులు ఐఎస్‌లో చేరిపోయారు. నేడు అమెరికా- సౌదీ మద్దతుతో అసద్‌ ప్రభుత్వంపై పోరాడుతున్న ప్రతిపక్ష దళాల సంఖ్య అయిదు వేలకు లోపే ఉంది. ఇరాక్‌, సిరియా, టర్కీ, ఇరాన్‌ల్లో వ్యాపించి సొంతరాజ్యం కోసం కలలుగంటున్న కుర్దులు మాత్రం అమెరికా ఆశించినట్లు గట్టిగా పోరాడుతున్నారు. వీరి సంఖ్య 25వేల వరకు ఉంటుంది.

నేడు సిరియాలో విశాల భూభాగాలు ఐఎస్‌, ప్రతిపక్ష సేనలు, కుర్దుల అధీనంలోకి వెళ్లిపోగా, అసద్‌ ప్రాబల్యం సిరియాలో మూడోవంతు భూభాగానికి పరిమితమైంది. అక్కడున్న టార్టస్‌ రేవు మధ్యధరా సముద్ర తీరంలో రష్యాకు మిగిలిన ఏకైక నౌకాస్థావరం. సిరియాకు రష్యన్‌ ఆయుధ ఎగుమతులు ఈ రేవు ద్వారానే జరుగుతుంటాయి. ఈ రేవు కనుక అమెరికా అనుకూలురైన ప్రతిపక్షాల చేతిలో పడినా, ఐఎస్‌ స్వాధీనమైనా రష్యాకు పశ్చిమాసియాలో నిలవడానికి చోటు లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో బలహీనపడిన అసద్‌ను నిలబెట్టడానికి రష్యా, ఇరాన్‌ రంగప్రవేశం చేశాయి. రష్యా యుద్ధవిమానాలు ఐఎస్‌ స్థావరాలపై, అసద్‌ ప్రాబల్య ప్రాంతంలోకి చొచ్చుకు వస్తున్న ప్రతిపక్ష సేనలపై దాడులు ప్రారంభించాయి. రష్యా సైనికచర్యకు ఈజిప్ట్‌ ఆమోదముద్ర వేయగా, ఐఎస్‌ గురించి గూఢచారి సమాచారాన్ని రష్యా, ఇరాన్‌లతో పంచుకొంటానని ఇరాకీ సైన్యం తెలిపింది. విశేషమేమంటే, సిరియాలో అసద్‌ సైన్యం ఇంతకాలం ఐఎస్‌తో కాకుండా ప్రతిపక్ష సేనలతో పోరాడుతూ వచ్చింది. సిరియాలో అహ్రర్‌ అల్‌ షమ్‌ దళానికి టర్కీ మద్దతు ఇస్తుంటే, అల్‌ఖైదా అనుబంధ సంస్థ జభత్‌ అల్‌ నుస్రా, జైష్‌ అల్‌ ఇస్లాం దళాలకు సౌదీ అరేబియా నిధులు, ఆయుధాలు సమకూరుస్తోంది. ఇటీవల భద్రతామండలి సభ్యదేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇరాన్‌ మీద ఆర్థిక ఆంక్షలు ఎత్తివేశారు. దీనితో పశ్చిమాసియాలో షియా దేశాలకు ఆయుధాలు, ఇతర వనరులు సమకూర్చే ఆర్థిక సత్తా ఇరాన్‌కు సమకూరింది. పశ్చిమాసియాలో సున్నీ- షియా కూటములు బలోపేతం కావడానికి భూమిక ఏర్పడింది. అయితే దానికి ముందు జిహాదీల పనిపట్టడం రెండు వర్గాలకూ ఎంతో అవసరం. ఇప్పటికే ఐఎస్‌ విస్తరణ నాటో కూటమి సభ్యదేశమైన టర్కీకి ప్రమాదకరంగా తయారైంది. సిరియన్‌ శరణార్థుల సెగ టర్కీకి తగులుతోంది. ఈ నేపథ్యంలో ఐఎస్‌, జభత్‌ అల్‌ నుస్రాలను నాశనం చేయాలనే రష్యా, ఇరాన్‌ల వాదానికి పాశ్చాత్య దేశాల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. రష్యా, అమెరికా సంకీర్ణాల విమానాలు ఐఎస్‌పై దాడులు చేస్తున్నప్పుడు పరస్పర సంఘర్షణలకు దిగకుండా జాగ్రత్త పాటించాలని అంగీకారం కుదిరింది. ఆ తరవాత రష్యా విమానాలు దాడులు ప్రారంభించగా, టర్కీలోని ఇంకిర్లిక్‌ వైమానిక స్థావరం నుంచి ఐఎస్‌పై దాడుల నిర్వహణకు అమెరికా సిద్ధమైంది.

సత్వర పరిష్కారం అవసరం

పశ్చిమ సిరియాలో రష్యా దాడులు నిర్వహిస్తుంటే, ఈశాన్య సిరియాలో అమెరికా సంకీర్ణం విమాన దాడులు ప్రారంభించనుంది. ఐఎస్‌పై అమెరికా గురి ఎక్కుపెడితే, రష్యా ఐఎస్‌ మీద కాకుండా సున్నీ ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని అమెరికన్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఐఎస్‌ మీద పోరాడే బాధ్యతను అమెరికా సంకీర్ణానికి వదిలి, అసద్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యతను రష్యా తలకెత్తుకుందని వారు భాష్యం చెబుతున్నారు. ఏదిఏమైనా శరణార్థుల తాకిడికి ఐరోపా అతలాకుతలమవుతున్న దృష్ట్యా, సిరియా సంక్షోభానికి అత్యవసరంగా పరిష్కారం కనుగొనడం అమెరికా, నాటో దేశాలకు అనివార్యమైంది. లేకుంటే అమెరికా, ఐరోపాలకు జిహాదీల ముప్పూ పెరుగుతుంది. ఐఎస్‌ను ఓడించి, సిరియాలో సుస్థిరత నెలకొల్పాలని అమెరికాతోపాటు రష్యా కూడా ఆకాంక్షిస్తున్నా, అసద్‌ ప్రభుత్వ స్థానంలో అమెరికా అంతేవాసుల సర్కారు ఏర్పడటం పుతిన్‌కు సుతరామూ ఇష్టం లేదు. అమెరికా ప్రస్తుతానికి సిరియాలో అసద్‌ ప్రభుత్వాన్ని మార్చాలనే వ్యూహాన్ని అవతలపెట్టి రష్యా, చైనాలతో కలిసి భద్రతామండలి ద్వారా సంక్షోభ పరిష్కారానికి నడుంకట్టే అవకాశముంది. ఇరాన్‌తో అణు ఒప్పందం భద్రతామండలి ఛత్రం కిందే కుదిరిన సంగతి గుర్తుంచుకోవాలి. సిరియాలోని జనవర్గాలు ఇలా ఉన్నాయి; పశ్చిమాన మధ్యధరా సముద్ర తీరం వెంబడి అసద్‌ వర్గమైన షియాలు ఆధిక్యం వహిస్తే, ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో కుర్దులు, నైరుతి సిరియాలో డ్రూజ్‌ వర్గీయులు, తూర్పు సిరియాలో సున్నీలు ప్రాబల్యం వహిస్తున్నారు. కేంద్ర సిరియా అన్ని తెగల మిశ్రమ ప్రాంతం. ఈ ప్రాంతాలకు స్వయంనిర్ణయాధికారం ఇవ్వడం ద్వారా సిరియాను సమాఖ్య వ్యవస్థగా తీర్చిదిద్దడం చక్కని పరిష్కారమవుతుంది. దానికిముందు అధ్యక్ష పదవి నుంచి అసద్‌తో రాజీనామా చేయించి, ఆయనను షియా ప్రాంతానికి పరిమితం చేయవచ్చు. బలహీన కేంద్రప్రభుత్వం- స్వయంప్రతిపత్తిగల రాష్ట్రప్రభుత్వాలతో సమాఖ్యను నిర్మిస్తే, సిరియాలో తిరిగి శాంతి సుస్ధిరతలు నెలకొంటాయి. అన్ని వర్గాలూ కలిసి ఐఎస్‌ను పారదోలి, ప్రజాస్వామ్య వ్యవస్థను పునఃప్రతిష్ఠించడం సులువు అవుతుంది.

కైజర్‌ అడపా
Posted on 10-10-2015