Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

నాటోకు కొత్త నాయకత్వం?

* అమెరికా నిరాసక్తత ఫలితం

చైనాతో పోటీ వల్ల వాణిజ్య లోటు విపరీతంగా పెరిగిపోయిన అమెరికా ప్రపంచ నాయకత్వ భారాన్ని వదలించుకోవాలని చూస్తోంది. సోవియెట్‌ కూటమిని నిలువరించడానికి ఏర్పడిన ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) నిర్వహణ భారాన్ని సభ్య దేశాలు మరింత ఎక్కువగా మోయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పట్టుబట్టింది ఇందుకే. 29 సభ్య దేశాలు తమ జీడీపీలో నాటోకు కేటాయింపును రెండు శాతానికి పెంచాలని ట్రంప్‌ ఒత్తిడి చేస్తున్నారు.

స్వదేశంలో అభిశంసన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు, లండన్‌ నాటో సమావేశంలో పంతం నెగ్గించుకొని అమెరికన్ల జేజేలు అందుకోవాలని ఆశించారు. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఇది తనకు గెలుపు గుర్రంగా ఉపయోగపడుతుందని ఆశపడ్డారు. కానీ, తన చేష్టలను చూసి నాటో దేశాల నాయకులు నవ్వుతున్నారని వీడియో సాక్షిగా వెల్లడి కావడంతో, ట్రంప్‌ హతాశుడై తిరుగుబాట పట్టారు. నాటో 70వ వార్షికోత్సవ సందర్భంగా లండన్‌లో జరిగిన ఓ విందు సమావేశంలో కెనడా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌ దేశాల అధినేతలు ట్రంప్‌ గురించి చెప్పుకొంటూ నవ్వుకొంటున్న వీడియో అది. ‘ఆయన 40 నిమిషాలసేపు పాత్రికేయుల సమావేశంలో ప్రసంగించి కానీ మన సమావేశానికి రారు. అందుకే ఇంత ఆలస్యమైంది’ అని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తోటి దేశాధినేతలతో వ్యాఖ్యానించడం ఆ వీడియోలో కనిపించింది. అంతకుముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా నాయకత్వ బాధ్యత నుంచి వైదొలగడం వల్ల నాటో జీవచ్ఛవంలా మారిందని వ్యాఖ్యానించారు. లండన్‌లో ట్రంప్‌తో కలిసి పాత్రికేయుల సమావేశంలో ప్రసంగించిన మేక్రాన్‌, నాటో పట్ల ట్రంప్‌ వైఖరిపై అసమ్మతి వ్యక్తీకరించారు. ఉత్తర సిరియాలో కుర్దులకు వ్యతిరేకంగా టర్కీ సేనలు పంపినా ట్రంప్‌ చూస్తూ ఊరుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అల్‌ బాగ్దాదీ హతమైన తరవాత ఇస్లామిక్‌ స్టేట్‌ చిత్తయిపోయిందన్న ట్రంప్‌ వాదననూ మేక్రాన్‌ వ్యతిరేకించారు. లండన్‌ సభ ముగిశాక విడుదలైన నాటో సంయుక్త ప్రకటన ఇస్లామిక్‌ స్టేట్‌పై పోరాటం ముగియలేదని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొంటామని ఉద్ఘాటించిందంటే కారణం మేక్రాన్‌ ఒత్తిడే. రష్యా దుందుడుకు చర్యలు కూడా ఉగ్రవాదమంత తీవ్రమైనవని ఆ ప్రకటన గుర్తించింది. అదే సమయంలో నాటో పిడివాదానికి పోలేదు. ఎంత చెడ్డా టర్కీ కూడా నాటో సభ్య దేశమే. ఆ కూటమిలో అమెరికా తరవాత అత్యధిక సేనాబలం ఉన్నది టర్కీకే. రష్యా బారి నుంచి దాని సమీప దేశాల రక్షణకు నాటో రూపొందించిన ప్రణాళికపై సంతకం చేయాలంటే, సిరియాలోని కుర్దుల పార్టీ వైపీజీని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని టర్కీ పట్టుబట్టింది. లండన్‌ సభలో ట్రంప్‌ నగుబాటుపాలైనా ఆయన ఒత్తిడి మేరకు నాటో దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుతున్నాయి. నాటో సంయుక్త ప్రకటన ఎలా ఉన్నా సిరియా, టర్కీ సమస్యలపైన; రష్యా, చైనాల సవాళ్లపైన అమెరికా, ఐరోపా దేశాలు ఎల్లకాలం ఏకతాటిపై నడుస్తాయని చెప్పలేం. సోవియెట్‌ కూటమిని ఎదుర్కోవడానికి ఏర్పాటైన నాటోకు కాలం చెల్లిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గతంలో వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. క్రిమియాను కలుపుకొని, ఉక్రెయిన్‌లో సైనిక చర్యకు దిగినా అమెరికా కానీ, నాటో కానీ ఏమీ చేయలేకపోవడం బట్టి ట్రంప్‌, మేక్రాన్‌ వ్యాఖ్యలు సత్యదూరం కావని తేలుతోంది. పైగా రష్యా అధినేత పుతిన్‌ విధానాలను ట్రంప్‌ తరచూ ప్రశంసిస్తుండటం నాటోను అయోమయపరుస్తోంది. చైనా 5జీ సాంకేతికతలను కొనవద్దని ట్రంప్‌ చేస్తున్న ఒత్తిడిని జర్మనీ, బ్రిటన్‌ తదితర నాటో దేశాలు ఖాతరు చేయకపోవడం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.

మారిన పరిస్థితిలో నాటో అమెరికా మీద ఆధారపడటం తగ్గించుకొని సొంత పంథాలో ముందుకు సాగక తప్పదు. అమెరికా జాతీయవాదం, పెరుగుతున్న చైనా, రష్యాల ప్రాబల్యం, నానాటికీ విస్తరిస్తున్న డిజిటల్‌ విప్లవం నాటోను అంతర్మథనంలోకి నెడుతున్నాయి. ఐరోపా భూభాగం నుంచి అమెరికా సేనలు ఇప్పుడు కాకుంటే మరెప్పుడైనా సరే నిష్క్రమించకమానవు. ఇంతకాలం రష్యాను నిలువరించడానికి ఐరోపా గడ్డపై అమెరికా సేనలను నియోగించి భారీగా చేతి చమురు వదిలించుకున్నామని ట్రంప్‌ రుసరుసలాడుతున్నారు. అందుకే నాటో దేశాలు రక్షణ వ్యయాన్ని పెంచాలని డిమాండ్‌ చేశారు. అమెరికా కేంద్రిత ప్రపంచానికి కాలం చెల్లిపోతున్న దృష్ట్యా నాటో కూడా ఒక ప్రబలశక్తిగా మారాల్సిన అవసరం ఉరుముతోంది. అమెరికా వైఖరి వల్ల నాటోకు ఏర్పడిన నాయకత్వ శూన్యాన్ని ఫ్రాన్స్‌ భర్తీ చేయగలదనే సంకేతాలను మేక్రాన్‌ పంపిస్తున్నారు. ఇది ఐరోపా సమాఖ్యలో ఆర్థికంగా అగ్రదేశమైన జర్మనీకి ఖాయంగా రుచించదు. ఏతావతా నాటోలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా రగులుకోవడం రష్యా అధినేత పుతిన్‌కు నయనానందకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. నాటో బలహీనపడితే రష్యా పొరుగున ఉన్న పోలెండ్‌, హంగరీ, బాల్టిక్‌ దేశాల్లో పుతిన్‌ జోక్యం పెరిగే అవకాశం ఉంది. దీన్ని నిరోధించడానికి నాటో రూపొందించిన ప్రణాళికలపై సంతకం చేయడానికి టర్కీ నిరాకరించింది. సిరియా నుంచి తమ దేశానికి ఎసరు పెడుతున్న కుర్దుల పట్ల ఐరోపా మెతక వైఖరి పట్ల టర్కీ ఆగ్రహంగా ఉంది. చివరకు దౌత్య మార్గాల్లో టర్కీని సంతకానికి ఒప్పించగలిగారు. ఇలాంటి కీచులాటలు నాటో సామర్థ్యంపై అనుమానాలు ప్రసరిస్తున్నాయి.

మొత్తంమీద రష్యా, చైనా, అమెరికాల మధ్య ఐరోపా స్వతంత్ర శక్తిగా నిలబడకతప్పని స్థితి ఎదురవడం అనివార్యం. నాటో రూపంలోనైనా, ఐరోపా సమాఖ్య (ఈయూ) రూపంలోనైనా తన బలాన్ని చాటుకోకతప్పదు. ఇప్పటికే ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీలతో ఆర్థిక, సైనిక బంధాలున్న భారతదేశం మున్ముందు ఆ సహకారాన్ని మరింత ఉద్ధృతం చేసుకోక తప్పదు. అమెరికా-బ్రిటన్‌, రష్యా, చైనా, ఐరోపాలతో ఏర్పడనున్న బహుళధ్రువ ప్రపంచానికి భారత్‌ అవసరం చాలానే ఉంటుంది.

- ప్రసాద్‌
Posted on 07-12-2019