Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

మసకబారుతున్న మాగ్నాకార్టా

* నేడు మానవ హక్కుల దినోత్సవం

సమస్త మానవాళి ఎలాంటి దుర్విచక్షణకు గురికాకుండా స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో, సమాన హక్కులతో జీవించాలన్నది ఐక్యరాజ్య సమితి ఆశయం. భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ సమానమేనన్నది అంతర్జాతీయ సంస్థ సంపూర్ణ విశ్వాసం. ఈ మేరకు 1948 డిసెంబరు 10న ఐరాస ఆధ్వర్యంలో పారిస్‌ కేంద్రంగా ప్రపంచ దేశాలన్నీ తీర్మానించాయి. అప్పటి నుంచి ఏటా డిసెంబరు 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి వ్యక్తికీ పుట్టుకతోనే కొన్ని హక్కులు లభిస్తాయి. వాటిని పరిరక్షించడం ఆయా దేశాల్లోని ప్రభుత్వాల బాధ్యత. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం పనికిరాదు. అయినప్పటికీ నిత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజల హక్కులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు గురవుతున్నాయి. జాతి, మతం, ప్రాంతం, లింగం, కులం, రంగు, రూపు పేరుతో ప్రజలు దుర్విచక్షణకు గురవుతున్నారు. హక్కుల హననం జరుగుతూనే ఉంది. ‘న్యాయబద్ధమైన తీర్పు ద్వారా తప్ప, మరేవిధమైన పద్ధతుల్లోనూ పౌరుల స్వేచ్ఛను హరించడం నిషేధం’ అని హక్కులకు సంబంధించిన చారిత్రక శాసనం ‘మాగ్నాకార్టా’ స్పష్టం చేసింది.

ఏ దేశ చరిత్ర చూసినా...
భారత్‌లో 1993లో రూపొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994 జనవరి ఎనిమిదో తేదీ నుంచి అమలులోకి వచ్చింది. రాష్ట్రస్థాయుల్లోనూ మానవ హక్కుల సంఘాలను ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచించింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ నివేదిక ప్రకారం భారత్‌తో పాటు అనేక దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. అమెరికా, వెనెజువెలా, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, ఇరాక్‌, యెమెన్‌, టర్కీ, సిరియాల్లో ఉల్లంఘన అధికంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. బాలల హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, లింగ పరమైన దుర్విచక్షణ, బాలలు, మహిళలపట్ల హింస, కుల మత సంఘర్షణలతోపాటు సామాజిక కార్యకర్తలు హతమవుతున్నట్లు వెల్లడించింది. మహిళా హక్కులకు సంబంధించి- సరళ ముద్గల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1995), సెల్వీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక, మెహతా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1986) కేసులు ముఖ్యమైనవి. విశాఖ మార్గదర్శకాలూ కీలకమైనవి. హిజ్రా హక్కులకు సంబంధించి దిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ నాజ్‌ ఫౌండేషన్‌ (2009) కృషి చేసింది.

ప్రతి వ్యక్తికీ కనీస సౌకర్యాలు పొందే హక్కు ఉంది. ‘బిమారు’ రాష్ట్రాలుగా గుర్తింపు పొందిన బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఇప్పటికీ తాగునీరు, రవాణా, విద్యుత్‌ వంటి కనీస సౌకర్యాలు లేని గ్రామాలు కోకొల్లలు. పంచవర్ష ప్రణాళికలు ముగిసినా, వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసినా, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా కొన్ని వర్గాల్లో సామాజిక అభివృద్ధి లోపించడం హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర ఫలాలు వారికి ఇప్పటికీ అందకపోవడం బాధాకరం. చేతులతో మలం ఎత్తిపోసే (మాన్యువల్‌ స్కావెంజింగ్‌) దురాచారం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ ఈ విధానం కొన్ని ప్రాంతాల్లో నేటికీ కొనసాగుతుండటం బాధాకరం. ‘హెల్సింకీ’ డిక్లరేషన్‌ ప్రకారం మానవులపై ఔషధ ప్రయోగాలు చేయడం నేరం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఆదివాసీ యువతులపై ఇలాంటి ప్రయోగాలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. మహిళల అక్రమ రవాణా నేరం. తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల ప్రాంతంలో ఆదివాసులకు డబ్బు, మద్యం ఆశ చూపి వారిని మోసం చేస్తున్నారు. మహారాష్ట్రలోని కరవు ప్రాంతమైన మరాట్వాడా కథ అత్యంత విషాదభరితం. ఆ ప్రాంత మహిళలు చాలామందికి గర్భసంచులు లేవు. అక్కడి చెరకు పంట గుత్తేదారులు గర్భసంచి తొలగించుకున్న మహిళలను మాత్రమే పనిలోకి తీసుకోవడం ఇందుకు కారణం. మహిళలు ‘నెలసరి’ కారణంగా రెండు, మూడు రోజులు పని చేయలేరనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. ఇది హేయమైన హక్కుల ఉల్లంఘన. గుత్తేదారులు తమను పనికి పిలవరన్న భయంతో మహిళలు బలవంతంగా గర్భసంచి తీయించేసుకుంటున్నారు.

నలిగిపోతున్న ఆదివాసీలు
పీసా చట్టం-1996 ప్రకారం అటవీ వనరులపైన అధికారం ఆదివాసులదే. కానీ, వారి అనుమతి లేకుండానే వనరుల వెలికితీత విచ్చలవిడిగా జరుగుతోంది. ఒడిశా, మధ్యప్రదేశ్‌లలోని అడవుల్లో, తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల ప్రాంతంలో చేపడుతున్న యురేనియం అన్వేషణ వంటి కార్యక్రమాలు ఆ ప్రాంత ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తున్నాయి. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, సహజ వనరుల వెలికితీత పేరుతో అడవులు విధ్వంసానికి గురవుతున్నాయి. పశ్చిమ్‌బంగలోని మౌసుని దీవిలో నివసించే కొన్ని వర్గాల పరిస్థితి దారుణంగా ఉంది. పర్యావరణంలో మార్పుల కారణంగా వారు నివసించే దీవులు ముంపునకు గురవుతున్నాయి. రోజురోజుకూ సముద్రపు నీరు చుట్టుముడుతుండటంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

అత్యంత హేయమైన అత్యాచార కేసులు సభ్య సమాజానికి సవాలుగా మారాయి. మొన్నటి నిర్భయ, నిన్నటి దిశ కేసులు ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు. దేశ జనాభాలో 8 శాతం ఉన్న ఆదివాసి హక్కుల సంగతి సరేసరి. సంచార జాతుల పరిస్థితి దయనీయం. వారి హక్కులు తరచూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. స్థిర నివాసం లేనివారి జీవనం దుర్భరంగా ఉంది. ఇటీవల ఓ సంస్థ సమగ్ర సర్వే నిర్వహించి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం నుంచి గుర్తింపు పత్రాలు పొందేందుకు సైతం ఆదివాసులు పడరాని పాట్లు పడుతున్నారు. వారి పూర్వీకులు నేరచరితులని అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ముద్ర వేసింది. దీంతో ఇప్పటికీ వారిని అదే ధోరణితో చూస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. జాతీయ నేర గణాంకాల బ్యూరో- 2017 ప్రకారం పిల్లలపై నేరాలు పెరుగుతున్నాయి. మనుషుల అక్రమ రవాణా కేసులూ అధికమవుతున్నాయి. పిల్లలు, మహిళల అక్రమ రవాణా, అవయవ దోపిడి, ఆన్‌లైన్‌ మోసాలు, సుపారీ హత్యలకు సంబంధించి కచ్చితమైన గణాంకాలు లేవు. అవన్నీ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి.

కుటుంబ వ్యవస్థే కీలకం
మానవ హక్కుల పరిరక్షణలో నెదర్లాండ్స్‌ ప్రథమ స్థానంలో ఉండగా- నార్వే, కెనడా, స్వీడన్‌, డెన్మార్క్‌ స్విట్జర్లాండ్‌ తరవాతి స్థానాల్లో నిలిచాయి. ఇటీవలి ఒక సర్వే ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. సౌదీ అరేబియా, చైనా, ఖతార్‌, ఇరాక్‌ చివరి స్థానాల్లో నిలిచాయి. కుటుంబ వ్యవస్థ సమాజ మనుగడకు మూలస్తంభం. అది ఎంత బలంగా ఉంటే అంత మేలు జరుగుతుంది. బాల్యం నుంచి పిల్లలకు మానవత, నైతిక విలువలు నేర్పడం అవసరం. నైతిక విలువలతో కూడిన విద్యాబోధన సత్ఫలితాల్ని ఇస్తుంది. దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. వాటిని సక్రమంగా అమలు చేసినట్లయితే హక్కుల ఉల్లంఘనకు కొంతవరకైనా అడ్డుకట్ట పడుతుంది!

- డాక్టర్‌ రమేష్‌ బుద్దారం
(రచయిత- మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ జాతీయ గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు)
Posted on 10-12-2019