Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

బ్రెగ్జిట్‌కే ఓటు

* బ్రిటన్‌ ఎన్నికల ఫలితాలు

బ్రిటన్‌ ఎన్నికల్లో బోరిస్‌ జాన్సన్‌ కళ్లు చెదిరే విజయం సాధించడంతో మూడేళ్లుగా నలుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు స్పష్టమయ్యాయి. బోరిస్‌ గెలుపు ఐరోపా సమాఖ్య (ఈయూ)నుంచి బ్రిటన్‌ నిష్క్రమణను దాదాపుగా ఖరారు చేసింది. విపక్ష లేబర్‌ పార్టీ కంచుకోటలను బద్దలు కొట్టింది. ‘బ్రెగ్జిట్‌ను సాకారం చేద్దాం’ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బోరిస్‌ జాన్సన్‌ తన వాదనను గట్టిగా వినిపించడంలో కృతకృత్యులయ్యారు. ప్రధాని పీఠంనుంచి థెరెసా మే- జులైలో వైదొలగిన తరవాత సారథ్య బాధ్యతలు స్వీకరించిన బోరిస్‌ జాన్సన్‌ కన్జర్వేటివ్‌ పార్టీకి చిరస్మరణీయ విజయం అందించారు. 2016లో ‘బ్రెగ్జిట్‌’పై నిర్వహించిన రెఫరెండంలో మెజారిటీ ప్రజలు నిష్క్రమణవైపే మొగ్గుచూపారు. కానీ గడచిన మూడేళ్లకాలంలో ‘నిష్క్రమణ’ విషయంలో పార్టీల దోబూచులాటలతో విసిగిపోయిన బ్రిటన్‌ ప్రజలకు బోరిస్‌ జాన్సన్‌ నిర్దిష్ట హామీ ఇవ్వగలిగారు. జనవరి ముగిసేలోపు ఈయూనుంచి బ్రిటన్‌ నిష్క్రమణ ఖాయమంటూ బోరిస్‌ ఇచ్చిన హామీ ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. దానితోపాటు దేశంలో 14 బహుళ ప్రత్యేకతలున్న వైద్యశాలల ఏర్పాటు; 20వేలమంది పోలీసుల, 50వేల నర్సుల నియామకం చేపడతానని; జాతీయ ఆరోగ్య పథకానికి ధారాళంగా ధన సాయం చేసి జవసత్వాలు కల్పిస్తానని ఆయన వాగ్దానాలు చేశారు. అయితే బోరిస్‌ ఇచ్చిన హామీలన్నింటిలోకి ‘బ్రెగ్జిట్‌’ నిజం చేద్దామన్న మాటే జనాన్ని ఆకట్టుకుంది. 650 సభ్యులున్న బ్రిటన్‌ దిగువ సభలో కన్జర్వేటివ్‌ పార్టీకి ఇప్పుడు బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది.

అతివాద వామపక్ష భావజాలం ఉన్న జెరిమి కోర్బెన్‌ సారథ్యంలో లేబర్‌ పార్టీ మునుపెన్నడూ కనీవినీ ఎరుగని పరాజయం మూటగట్టుకొంది. బ్రిటన్‌లో గడచిన యాభయ్యేళ్లలో కోర్బెన్‌ స్థాయిలో అప్రతిష్ఠ పాలైన లేబర్‌ పార్టీ నాయకుడు మరొకరుండరు. ఇరవై ఒకటో శతాబ్దంలోనూ స్వేచ్ఛా వాణిజ్య విధానాలను తూర్పారపడుతూ, ప్రైవేటు పరిశ్రమలను జాతీయకరిస్తామని హుంకరిస్తూ, అమెరికా వ్యతిరేక- రష్యా సానుకూల విధానాలను అందిపుచ్చుకొని కోర్బెన్‌ వ్యవహరించిన తీరు బ్రిటన్‌ ప్రజలకు సుతరామూ నచ్చలేదు. ప్రపంచం ఎన్నో అడుగులు ముందుకు వేసినా- కోర్బెన్‌ మాత్రం ఇప్పటికీ ప్రచ్ఛన్న యుద్ధంనాటి భావజాలాల మధ్యే బందీ అయ్యారన్న విషయం ఓటర్లకు స్పష్టంగా అర్థమైంది. అందుకే గతంతో పోలిస్తే 59 స్థానాలు కోల్పోయి లేబర్‌ పార్టీ ఈసారి 203 సీట్లు మాత్రమే సాధించగలిగింది. లేబర్‌ పార్టీ మద్దతుదారులు ఎంతోమంది ‘బ్రెగ్జిట్‌’కు సానుకూలంగా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ‘బ్రెగ్జిట్‌’పై కోర్బెన్‌ విధానం ఆ పార్టీ మద్దతుదారులను గందరగోళంలో పడేసింది. ఈయూలో భాగస్వామిగా చేరింది మొదలు ఒకనాటి సోవియట్‌ దేశాలనుంచి తామరతంపరగా కార్మికులు బ్రిటన్‌లోకి పోటెత్తుతున్నారు. దానివల్ల బ్రిటన్‌కు చెందిన శ్వేతజాతి కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతోంది. కాబట్టే వారు ‘బ్రెగ్జిట్‌’కు మద్దతుగా మోహరించారు. ఈ పరిస్థితుల్లో కోర్బెన్‌ సరళి బ్రిటన్‌ శ్వేత జాతి కార్మికులకు ఏ రకంగానూ మింగుడుపడలేదు. అందుకే గడచిన యాభయ్యేళ్లలో ఏనాడూ గెలవని సీట్లలోనూ ‘టోరీలు’ (కన్జర్వేటివ్‌ పార్టీకి చెందినవారు) జయకేతనం ఎగరవేశారు. మరోవంక ప్రజాభిప్రాయ సేకరణలో మూడేళ్ల క్రితం ‘బ్రెగ్జిట్‌’కు వ్యతిరేకంగా గళం వినిపించిన ప్రాంతాల్లోనూ లేబర్‌పార్టీ ఈ దఫా మట్టిగరచింది. అయితే పార్టీ సారథ్య బాధ్యతలను ఇప్పటికిప్పుడు వదులుకోవడానికి కోర్బెన్‌ సిద్ధపడకపోవచ్చు. వచ్చే ఏడాదికిగానీ పార్టీ సంస్థాగత సంస్కరణల ప్రక్రియ పూర్తికాని తరుణంలో అప్పటివరకూ కోర్బెన్‌ వేచి ఉండే అవకాశాలే ఎక్కువ! మరోవంక జో స్విన్‌సన్‌ నాయకత్వంలో లిబరల్‌ డెమోక్రాట్‌ పార్టీ అధ్వానమైన ఫలితాలు రుచి చూసింది. పార్టీ అధినేత్రి స్విన్‌సన్‌ సైతం ఎన్నికల్లో ఓటమిపాలు కావడం గమనార్హం. అవమానకరమైన ఫలితాల నేపథ్యంలో ఆమె క్షణమాత్రం కూడా ఆలస్యం చేయకుండా పార్టీ నాయకత్వ బాధ్యతలు వదులుకుంటున్నట్లు ప్రకటించారు.

స్కాట్లాండ్‌లో వెల్లువెత్తుతున్న స్వతంత్ర కాంక్షను పసిగట్టిన బోరిస్‌ జాన్సన్‌ ‘సమైక్య బ్రిటన్‌’ నినాదం నెత్తికెత్తుకున్నారు. వచ్చే నెల 31న ఈయూనుంచి నిష్క్రమణ తరవాత వాణిజ్య ఒప్పందాల్లో బ్రిటన్‌ పోషించబోయే పాత్రపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ వాణిజ్య ఒప్పందాల్లో ఈయూ దేశాలు బ్రిటన్‌కు అంతగా అనుకూలించని నిర్ణయాలు తీసుకుంటే- బోరిస్‌ జాన్సన్‌ ఇబ్బందుల్లో పడతారు. కన్జర్వేటివ్‌ల విజయంతో బ్రిటన్‌ పౌండ్‌ బలం పుంజుకొంది. కానీ, ఈయూనుంచి నిష్క్రమణ తరవాత బ్రిటన్‌ వ్యాపారాలు, పరిశ్రమలపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు కొట్టిపారేయలేనివి. బలమైన వాణిజ్య భాగస్వామ్యాల సాయంతోనే ఆ సమస్యను బ్రిటన్‌ ఎదుర్కోవాల్సి ఉంది.

స్కాట్లాండ్‌ తీరు వేరు
దేశవ్యాప్త ఫలితాల సరళి ఒకరకంగా ఉంటే స్కాట్లాండ్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించింది. మునుపటితో పోలిస్తే నికోలా స్టర్‌గియన్‌ సారథ్యంలోని స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ 13 సీట్లు అధికంగా 48 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకున్న వెన్వెంటనే బ్రిటన్‌తో స్కాట్లాండ్‌ కలిసి ఉండాలా లేక వేరుపడాలా అన్న విషయంలో మరోదఫా ప్రజాభిప్రాయ సేకరణ తప్పదన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. తమ పార్టీకి అపూర్వ విజయం కట్టబెట్టడం ద్వారా స్కాట్లాండ్‌ స్వతంత్రతపై రెఫరెండం నిర్వహించాల్సిందేనన్న ఆకాంక్షను ప్రజానీకం బలంగా వినిపించిందని స్టర్‌గియన్‌ వ్యాఖ్యానించారు. 2016లో నిర్వహించిన ‘బ్రెగ్జిట్‌’ రెఫరెండంలో ఈయూతోనే బ్రిటన్‌ కలిసి ఉండాలని మెజారిటీ స్కాట్లాండ్‌ ప్రజలు తీర్మానించారు. ఈ పరిస్థితుల్లో ఈయూనుంచి వచ్చే నెల బ్రిటన్‌ బయటకు వస్తే అది స్కాట్లాండ్‌ ప్రజల అభీష్టానికి భిన్నంగా వ్యవహరించినట్లే అవుతుంది.

- వీరేంద్ర కపూర్‌
Posted on 17-12-2019