Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

పెనుముప్పున్నా... పెడపోకడ

* ‘పారిస్‌ లక్ష్య’సాధనపై కాప్‌-25లో ఉదాసీనత

వాతావరణ మార్పులవల్ల తలెత్తుతున్న విపత్కర పరిణామాలు- ప్రపంచానికి పెనుముప్పు పొంచిఉందనే సంకేతాలను ఇస్తున్నాయి. పెరుగుతున్న భూతాపాన్ని ఈ శతాబ్దం చివరినాటికల్లా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేయాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం ‘కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాప్‌)-2015’ సదస్సులో తెరమీదకు వచ్చిన పారిస్‌ ఒప్పందాన్ని కార్యాచరణలోకి తేవడానికి ప్రపంచ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తాజాగా స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో డిసెంబరు రెండు నుంచి 13 వరకు పన్నెండు రోజులపాటు కాప్‌-25 సదస్సు జరిగింది. కీలక అంశాల్లో ఎటువంటి ముందడుగూ లేకుండానే సదస్సు ముగియడంతో పారిస్‌ ఒప్పందం స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లయింది. దశాబ్దకాలంగా ప్రపంచవ్యాప్తంగా సగటున ఏడాదికి 1.5 శాతం చొప్పున హరితగృహ వాయు ఉద్గారాల మోతాదు పెరగింది. మరోవైపు ఇటీవలి సంవత్సరాల్లో అత్యధికంగా 55.3 గిగా టన్నులకు సమానమైన బొగ్గుపులుసు వాయువు ఉద్గారాలు వెలువడి భూతాపం గణనీయంగా పెచ్చరిల్లిందని ఐరాస పర్యావరణ కార్యక్రమ నివేదిక వెల్లడించడం- రానున్న విపత్కర పరిస్థితులకు అద్దం పడుతోంది. సరిగ్గా కాప్‌-25వ సదస్సుకు ముందే ఐరాస నివేదిక వెల్లడించిన అంశాలు- ‘కాప్‌’లోని 195 సభ్యదేశాలు భూతాపం నియంత్రణకోసం తక్షణ కార్యాచరణకు ఉపక్రమించాల్సిన ఆవశ్యకతను నిర్దేశించాయి. సదస్సులోని చర్చల్లో వర్థమాన, అభివృద్ధి చెందిన దేశాల మధ్య వైరుద్ధ్యాలు తలెత్తి, ప్రతిష్టంభన నెలకొనడం గమనార్హం. సదస్సు ప్రారంభంలో ఐరాస సెక్రెటరీ జనరల్‌ మాట్లాడుతూ- జాతీయ నిబద్ధతా పూర్వక సహకారం(ఎన్‌డీసీ)గా వ్యవహరించే సభ్యదేశాల పర్యావరణ కార్యక్రమ లక్ష్యాలను వచ్చే ఏడాదికల్లా వేగిరం చేయాలని, 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలను తటస్థపరచే దిశగా కృషి చేయాలని పిలుపివ్వడం భూతాపాన్ని కట్టడి చేయాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటిస్తోంది. ప్రస్తుతం భూతాపం పెరుగుదల రేటు ఇదే రీతిలో కొనసాగితే- 2030 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యసాధనను అందుకోవడంలో ప్రపంచ దేశాలు విఫలమైనట్లేననేది కఠోరమైన వాస్తవం.

తీవ్రమవుతున్న భూతాపం
భూగోళంపై సగటు ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగి ప్రకృతి విపత్తులు సంభవిస్తుండటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల పాలిట పెను శాపమవుతున్నాయి. 2020-2030 సంవత్సరాల మధ్య కర్బన ఉద్గారాల రేటును ఏటా 7.6 శాతం మేర తగ్గించడం ప్రపంచ దేశాల ముందున్న అనివార్యమైన లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో వెనకంజ వేస్తే భూతాపం 2100 నాటికల్లా 3.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడం ఖాయమనే హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న హరితగృహ వాయు ఉద్గారాల్లో దాదాపు 78 శాతం- అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, జపాన్‌, కొరియా, చైనా, భారత్‌, మెక్సికో, ఇండొనేసియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, అర్జెంటీనాలతో పాటు మరికొన్ని ఐరోపా సమాఖ్య దేశాల నుంచే విడుదలవుతున్నాయి. జి-20 దేశాల కూటమిలోని ఏడు దేశాలు నేటికీ కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా కనీస కార్యాచరణకు ఉపక్రమించకపోవడం సంపన్నదేశాల నిష్క్రియాపరత్వానికి, నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. పారిస్‌ ఒప్పంద లక్ష్యసాధన దిశగా 2020 కన్నా ముందు అనుసరించాల్సిన వ్యూహం విషయంలోనే ముందడుగు వేయలేకపోతున్న పరిస్థితుల్లో, 2020 తదుపరి కార్యాచరణపై సందిగ్ధత నెలకొంది. కర్బన ఉద్గారాలను అత్యధికంగా విడుదలచేస్తున్న దేశాల జాబితాలో (15 శాతం ఉద్గారాలతో) రెండోస్థానంలో ఉన్న అమెరికా పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు గతంలోనే ప్రకటించడంతో సంపన్న దేశాల వైఖరి సుస్పష్టమైంది. మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న చైనా (28 శాతం) రానున్న సంవత్సరానికి వాటి నియంత్రణకోసం తన లక్ష్యాన్ని సవరించుకోకపోవడం గమనార్హం.

భూతాపాన్ని నియంత్రించడం కోసం ఉద్దేశించిన పారిస్‌ ఒప్పందంలోని ఆర్టికల్‌ 6 విషయంలోనే సభ్యదేశాలు సిగపట్లు పడుతున్నాయి. క్యోటో ప్రొటోకాల్‌ ఒప్పందం మొదలుకొని మొన్నటి పారిస్‌ ఒప్పందం వరకు స్వచ్ఛతను మెరుగుపరచే యంత్రాంగం (క్లీన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజమ్‌- సీడీఎం)లో భాగంగా ఉద్గారాల నియంత్రణ కార్యక్రమం, తద్వారా ఉద్గారాల నియంత్రణ ప్రమాణ యూనిట్లను (సీఈఆర్‌) లెక్కగట్టే విషయంలో ఆయా దేశాల మధ్య నెలకొన్న వైరుద్ధ్యాలు లక్ష్యసాధన దిశగా అడుగు ముందుకు పడనీయడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ స్వచ్ఛత మెరుగుపరచుకునే కార్యక్రమం (సీడీఎం) ప్రకారం- ఒక టన్ను బొగ్గుపులుసు వాయువు ఉద్గారాలను నియంత్రించినట్లయితే ఒక ‘క్రెడిట్‌’గా లెక్కిస్తారు. అలా నమోదైన ‘క్రెడిట్‌’లను విక్రయించే, కొనుగోలు చేసే సౌలభ్యం ఉంటుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ కర్బన ఉద్గారాల నియంత్రణకోసం వీటిని వినియోగిస్తారు. తద్వారా సుస్థిరాభివృద్ధికి వీలు కల్పిస్తారు. ఫలితంగా ఉద్గారాల నియంత్రణకు మార్గం సుగమం అవుతుందనే ఉద్దేశంతో దీన్ని క్యోటో ప్రొటోకాల్‌లో పొందుపరచినట్లు తెలుస్తోంది. 2020కి ముందుదశ కాలంలోనే కర్బన ఉద్గారాల నియంత్రణ ప్రమాణాల యూనిట్లను సాధించిన దేశాలకు సంబంధించి తుది నిర్ణయానికి రాకపోవడం అసంతృప్తికి దారి తీస్తోంది. పారిస్‌ ఒప్పందంలోని ఆర్టికల్‌ 6 విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఉందనేది దీన్నిబట్టి స్పష్టమవుతోంది. దేశాల మధ్య కర్బన ఉద్గారాల వాణిజ్యానికి సంబంధించిన ఆర్టికల్‌ 6.2, ఉద్గారాల నియంత్రణకు సంబంధించిన ఆర్టికల్‌ 6.4 విషయాల్లో దేశాల మధ్య సమతౌల్యం లోపించడంవల్ల సాంకేతికపరమైన ఏకాభిప్రాయం కుదరకపోవడం- పారిస్‌ ఒప్పందం పూర్తిగా కార్యాచరణలో పట్టాలెక్కకపోవడానికి కారణమవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కర్బన ఉద్గారాల నియంత్రణలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విషయంలో, దీర్ఘకాలికంగా ఆర్థిక సహాయాన్నందించడంలో ఏకాభిప్రాయం కొరవడటం పారిస్‌ ఒప్పందం అమలుకు ప్రధాన అవరోధంగా మారిందని తెలుస్తోంది.

భూతాపం, కర్బన ఉద్గారాల విషయంలో భారత్‌ తన వైఖరిని స్పష్టీకరించింది. కర్బన ఉద్గారాల నియంత్రణకు 2020కి ముందు ఆయా దేశాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండానే తదుపరి లక్ష్యాలను నిర్దేశించుకోవడం శుద్ధ దండగని తేల్చిపారేసింది. క్యోటో ప్రొటోకాల్‌ ప్రకారం కార్యాచరణకు కట్టుబడకుండా, పారిస్‌ ఒప్పందం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అదే సమయంలో 2020కి ముందుదశలో కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యసాధనకు గడువు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2023 వరకు పొడిగించాల్సిందిగా తాజా సదస్సులో భారత్‌ ప్రతిపాదించింది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం భారత్‌ స్వచ్ఛందంగా కృషి చేస్తూ, క్రియాశీల పాత్ర పోషిస్తోంది. స్థూల దేశీయోత్పత్తిలో కర్బన ఉద్గారాల వాటాను 21 శాతానికి తగ్గించడమేకాక, పారిస్‌ ఒప్పందాన్ని అమలు చేయడంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు 35 శాతానికి తగ్గించే దిశగా కార్యాచరణతో ముందుకెళ్తుండటం గమనార్హం. అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాల నియంత్రణ విషయంలో లక్ష్యానికి దూరమవుతుండటంపై ఉదాసీనవైఖరి పనికిరాదని భారత్‌ స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఉద్గారాల నియంత్రణలో ఇదే తీరు కొనసాగిస్తే శతాబ్దాంతానికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 3.4 నుంచి 3.9 డిగ్రీలకు పెచ్చరిల్లే ప్రమాదం ఉందన్న పర్యావరణ నిపుణుల హెచ్చరికలు తీసిపారేయలేనివి. ఐరోపా దేశాల సమాఖ్య మాత్రం ఉన్నపళంగా 2050 నాటికల్లా శూన్య ఉద్గారాలే లక్ష్యంగా హరిత ఒప్పందాన్ని తెరమీదకు తెచ్చింది. పారిస్‌ ఒప్పందం అమలు సాధ్యాసాధ్యాలు, ఫలితాలు 2020కి ముందున్న కాలంలోని లక్ష్యాలు-హామీల సాధనపైనే ఆధారపడి ఉంటాయన్నది సుస్పష్టం!

ప్రపంచ ఆర్థికానికి విఘాతం
అనూహ్యమైన వాతావరణ మార్పులు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయంటూ ఐరాస అభివృద్ధి కార్యక్రమ నివేదిక (యూఎన్‌డీపీ) సైతం స్పష్టీకరించింది. దేశాల ఆర్థిక అసమానతలకు వాతావరణ మార్పులు ఆజ్యం పోస్తున్నాయి. భూతాపం, విరుచుకుపడుతున్న విపత్తులు- వ్యాధుల విజృంభణకు, పౌష్టికాహార లోపాలకు దారితీస్తున్నాయి. ప్రజల ఆహార, సాంఘిక భద్రతకు సవాళ్లు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ నానాటికీ పెరుగుతున్న భూతాపానికి కారణమైన కర్బన ఉద్గారాల నియంత్రణలో నిబద్ధతతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పులవల్ల స్వచ్ఛమైన ప్రాణవాయువు మోతాదును మెరుగుపరచవచ్చు. తద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన మార్గాలను సుగమం చేయొచ్చు. వాణిజ్య, పెట్టుబడిదారీ వర్గాల సమీకృత కార్యాచరణ చర్యల ద్వారా కర్బన ఉద్గారాల నియంత్రణలో సంతృప్తికర ఫలితాలు రాబట్టవచ్చు. ఇంధన వినియోగ మార్పు, భూవినియోగ పద్ధతుల్లో మార్పుల ద్వారా గుణాత్మక ఫలితాలను సాధించవచ్చు. కర్బన ఉద్గారాల నియంత్రణకు ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్న, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, ఆర్థిక ఉద్దీపన చర్యలు చేపట్టడం ద్వారా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవచ్చు. ప్రపంచ దేశాలన్నీ పట్టుదలకు పోకుండా- సామరస్య, సమన్వయాత్మక, బాధ్యతాయుత ధోరణితో వ్యవహరించాల్సి ఉంది. అన్ని దేశాలూ పకడ్బందీ కార్యాచరణతో కృషిచేయడానికి ముందుకు వచ్చిన నాడు పారిస్‌ ఒప్పందం అమలు కష్టసాధ్యమేమీ కాదు.

Posted on 19-12-2019