Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ఉగ్రభూతానికి కొత్త కోరలు!

* చెలరేగుతున్న ఇస్లామిక్‌ స్టేట్‌
పారిస్‌లో నెత్తుటేళ్లు పారించిన ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదుల భీకర దాడులు, యావత్‌ ప్రపంచాన్ని నిర్ఘాంతపరచాయి. ఐఎస్‌ ప్రధానంగా అమెరికా, ఐరోపాలనే లక్ష్యంగా ఎంచుకోవడం గమనార్హం. నష్టం జరిగాక కానీ ఆ దేశాలకు నివారణ చర్యలు గుర్తుకు రాలేదు. ముందు జాగ్రత్తలు మరవడం... పక్కింట్లో నిప్పంటుకుంటే మన కెందుకులే అని చోద్యం చూస్తుండటం వల్లే, ఉగ్రవాదులు సిరియా సరిహద్దులు దాటి, శత్రుదుర్బేధ్యంగా చెప్పుకొనే ఐరోపాలోకి చొచ్చుకు రాగలిగారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరిగిన నరమేధం- భవిష్యత్తులో ఐరోపా సమాజాన్ని ముంచెత్తనున్న ఉప్పెనకు నమూనా మాత్రమేనంటూ ఉగ్రవాదులు వీడియో సందేశాలు సైతం పంపారు. పారిస్‌ దాడి తరవాత ఫ్రాన్స్‌ యుద్ధ విమానాలు సిరియాలోని ఐఎస్‌ ఆక్రమిత ప్రాంతంపై భీకర దాడులు చేశాయి. రష్యా సైతం తాజాగా ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులకు ఉపక్రమించింది. ఐఎస్‌ ఉగ్రవాదులు తమ విమానాన్ని కూల్చి 224మంది ప్రయాణికులను హతమార్చిన తరవాత కానీ వారి కారణంగా ప్రపంచం అనుభవిస్తున్న వేదన రష్యాకు తెలిసిరాలేదు. ఉగ్రవాదం, పర్యావసానాల చరిత్ర గమనిస్తే, ఇలాంటి ఉదంతాలు ఎన్నో కనబడతాయి. మూడు దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదం వల్ల భారత్‌ అనుభవిస్తున్న క్షోభ ఎలాంటిదో- సెప్టెంబరు 11 దాడుల తరవాతే అమెరికాకు అర్థమైంది. తాను పెంచి పోషించిన బిన్‌ లాడెన్‌ పక్కింట్లో నెగళ్లు రాజేస్తుంటే తమాషా చూసిన అమెరికా, తన ఇంటికి నిప్పంటుకోగానే బావురుమంది. ఖలీఫా రాజ్య స్థాపన పేరిట ఇప్పుడు ఆధునిక ప్రపంచ చరిత్రను నెత్తుటితో రాస్తున్న ఐఎస్‌ ఉగ్రవాదుల విషయంలోనూ అగ్రరాజ్యాలన్నీ బాధ్యత మరిచి చోద్యం చూసినవే. అందుకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాయి.

వణికిపోతున్న ప్రపంచం

నాలుగేళ్ల క్రితం ఈజిప్ట్‌ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా మొదలైన అరబ్‌ విప్లవం, చూస్తుండగానే మధ్యప్రాచ్యాన్ని చుట్టేసింది. సిరియాకు విస్తరించిన స్వాతంత్య్ర ఉద్యమం కాస్త తిరుగుబాటుగా మార్పు చెందింది. దశాబ్దాలుగా పెత్తనం చలాయిస్తున్న సిరియా అధ్యక్షుడు అసద్‌ ఉనికిని ప్రశ్నించడంతో మొదలైన తిరుగుబాటు ద్వారానే ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదం పురుడు పోసుకుంది. అసద్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా మొదలైన పోరాటం, అంతర్యుద్ధంగా మారింది. పక్కనే ఉన్న ఇరాక్‌, టర్కీలకూ విస్తరించింది. స్వాధీనం చేసుకున్న చమురు బావులతో వ్యాపారం మొదలుపెట్టిన ఉగ్రవాదులకు వందలకోట్ల డాలర్ల మేర నిధులు అందేసరికి ఆయుధాల కొరత తీరింది. అప్పుటి నుంచి మొదలైంది అసలు కథ! ఖలీఫా రాజ్య స్థాపన కోసం నరమేధం మొదలుపెట్టిన ఐఎస్‌, అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాన్ని చక్కగా వినియోగించుకుంది. అత్యంత క్రూరంగా మానవ హననానికి పాల్పడుతూ, వాటి తాలూకూ వీడియో చిత్రాలను అంతర్జాలంలో పెడుతూ ప్రపంచంలోని భావసారూప్యం గల యువకులను రెచ్చగొట్టింది. చూస్తుండగానే ఆ భావజాలం యావత్‌ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. సిరియా, ఇరాక్‌ సరిహద్దుల్లోకి చొచ్చుకెళ్లి 35వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో సుమారు లక్షమంది సైన్యంతో అది సామ్రాజ్యాన్నే స్థాపించుకుంది.

ఐఎస్‌ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని టర్కీలో జరుగుతున్న జి-20 దేశాలు భీకర ప్రతిజ్ఞ చేశాయి. ఇవి ఇస్తున్న భరోసా మాటేమో కానీ, రక్తపుటేళ్లు పారిస్తామంటున్న ఐఎస్‌ ఉగ్రవాదుల హెచ్చరికలు మాత్రం ప్రపంచాన్ని భయకంపితం చేస్తున్నాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, ఉగ్రవాదులు ఎప్పుడు ఎక్కడ విరుచుకు పడతారోనంటూ ఐరోపా, ఆస్ట్రేలియాలు సైతం బెంబేలెత్తిపోతున్నాయి. అమెరికా అంతర్గత భద్రత వ్యవహారాలు చూసే హోంల్యాండ్‌ సెక్యూరిటీకి చెందిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సైతం ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లతో కూడుకున్న ఈ టాస్క్‌ఫోర్స్‌ ఆరు నెలలపాటు పరిశోధన చేసి ఒక నివేదిక రూపొందించింది. తమ పౌరులు ఎవరూ ఐఎస్‌లోకి వెళ్లకుండా నిలువరించడంలో అమెరికా విఫలమైందని ఈ టాస్క్‌ఫోర్స్‌ నిగ్గు తేల్చింది. ప్రస్తుతం ఐఎస్‌ తరఫున 30వేలమంది విదేశీయులు యుద్ధంలో పాల్గొంటున్నారు. వారిలో 250మంది అమెరికాకు చెందినవారున్నారు. వీరితోపాటు అయిదు వేలమంది ఐరోపా పాస్‌పోర్టు కలిగిన ఉగ్రవాదులు ఏ క్షణమైనా అమెరికాలోకి చొచ్చుకొచ్చి విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. నిరుడు 70మంది ఐఎస్‌ సభ్యులను అరెస్టు చేశామని టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ మైఖేల్‌ మెకాల్‌ వెల్లడించారు. ఐఎస్‌లోకి వెళ్తున్న విదేశీయుల సంఖ్య ఏటేటా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించేదే! 2011లో వెయ్యి మంది విదేశీయులు ఐఎస్‌లో చేరారు. తరవాతి ఏడాది వీరి సంఖ్య 3,500కు పెరిగింది. 2013నాటికి 74దేశాల నుంచి 8,500మంది, 2014నాటికి 90దేశాల నుంచి 10వేలమంది ఐఎస్‌లో సభ్యులయ్యారు. ప్రస్తుతం 100దేశాలకు చెందిన 30వేలమంది ఐఎస్‌ తరఫున సిరియాలో యుద్ధంలో పాలుపంచుకొంటున్నారు. వైమానిక దాడులవల్ల ఇప్పటివరకు 10వేలమంది ఉగ్రవాదులు చనిపోయారని భావిస్తుంటే, కొత్తగా అందులో చేరుతున్న వారి సంఖ్య అంతకుమించి ఉంటోందని అమెరికా రక్షణ వర్గాలు కలవరపడుతున్నాయి. ఐరోపాలో 70, అమెరికాలో 30 లక్ష్యాలపై దాడులు నిర్వహించాలని ఐఎస్‌ కుట్ర పన్నినట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పుడు పారిస్‌లో జరిగింది ఈ కోవలోకే వస్తుందని భావిస్తున్నారు. నియామకాలు పెంచుకోవడంలో ఐఎస్‌ అనుసరిస్తున్న వ్యూహాన్ని చూసి మేధావులే విస్తుబోతున్నారు. అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ అంచనా ప్రకారం ప్రతి రోజూ ఐఎస్‌ తరఫున ట్విట్టర్‌లో రెండు లక్షల ట్వీట్లు చేస్తున్నారు. ఒకప్పుడు సీమాంతర ఉగ్రవాదం అంటే వ్యక్తిగతంగా కలిసి, ఉగ్రవాదంవైపు మళ్ళే విధంగా మానసికంగా సిద్ధం చేసి, సరిహద్దులు దాటించి, శిక్షణ ఇచ్చి, దాడులకు పాల్పడేందుకు తిరిగి పంపేవారు. ఇది చాలా సంక్షిష్టమైన ప్రక్రియ. ఏదో ఒకదశలో పట్టుబడటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ప్రసంగాల వంటివి చూసి యువకులు అటువైపు మళ్లుతున్నారు.

డబ్బుకు కొదవ లేదు

ఒకవైపు కార్యకర్తల చేరిక, మరోవైపు అంతులేని సంపద రెండూ కలిసి ఐఎస్‌ను అత్యంత బలమైన శక్తిగా మార్చేశాయి. ఈ సంస్థ ఇరాక్‌, సిరియాల్లో అక్రమించుకున్న చమురు బావుల నుంచి రోజుకు 16.45లక్షల డాలర్లు సంపాదిస్తోంది. కిడ్నాప్‌లకు పాల్పడటం ద్వారా నిరుడు రెండుకోట్ల డాలర్లు సంపాదించారని అమెరికా ఆర్థిక శాఖ చెబుతోంది. తమ ఆధీనంలో ఉన్న భూభాగంలో నివసిస్తున్న 80లక్షలమంది నుంచి బలవంతంగా కోట్ల డాలర్లు వసూలు చేస్తోంది. మైనారిటీలు ప్రత్యేక సుంకం చెల్లించాలి. బ్యాంకుల్ని లూటీ చేయడం, విలువైన పురాత‌న‌ వస్తువులను అమ్మడం ద్వారా కూడా ఉగ్రవాదులు లాభాలు గడిస్తున్నారు. ఈ నిధులతో ఆయుధాలు కొనుగోలు చేయడమే కాకుండా ఉగ్రవాదుల కుటుంబాలకు రోజుకు 11 డాలర్ల చొప్పున చెల్లిస్తున్నారు.

భారత్‌ పరిస్థితి ఏమిటి?

ఐఎస్‌ ప్రభావం భారత్‌లోనూ తీవ్రంగా ఉంది. ఇంతకాలం వ్యవహారాలన్నీ చాప కింద నీరులా సాగాయి. ఇటీవల శ్రీనగర్‌లో కొందరు యువకులు ఐఎస్‌ జెండాలను బహిరంగానే ప్రదర్శించారు. భవిష్యత్‌ పోరు బాట గురించి, ఖలీఫా రాజ్య సంక్షిప్త చరిత్ర పేరిట ఐఎస్‌ రూపొందించిన 32పేజీల నివేదిక సైతం ఇటీవల బహిర్గతమైంది. భారత్‌పై దాడుల గురించీ దీనిలో ప్రస్తావించారు. భారత్‌ నుంచీ అనేకమంది ఐఎస్‌లో చేరారు, చేరుతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే సిరియా వెళ్లడానికి ప్రయత్నిస్తున్న 19మందిని పోలీసులు గుర్తించి నిలువరించగలిగారు. ఆదిలాబాద్‌కు చెందిన యువకుడు సిరియాలో జరుగుతున్న యుద్ధంలో మరణించాడు. భారతీయ యువతను ఆకర్షించడానికి ఐఎస్‌ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. తన అధికార ప్రచార విభాగంలో భారతీయ యోధుల పేరిట కొన్ని ఫొటోలూ ప్రచురించింది. వీరిలో ఇండియన్‌ ముజాహిదీన్‌ తరఫున దేశంలో అనేక పేలుళ్లకు పాల్పడ్డ మహ్మద్‌ సాజిద్‌ అలియాస్‌ అబూ తురబ్‌ అల్‌ హింద్‌, అబూ క్వకా అల్‌ హింద్‌, అబ్దుల్‌ ఖాదిర్‌ సుల్తాన్‌ ఆర్మర్‌ తదితరులు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాల నుంచి అనేక మంది ఐఎస్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. అందువల్లే ఐఎస్‌ ప్రభావాన్ని అడ్డుకోవడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ భావిస్తోంది. 2005 లండన్‌ బాంబు పేలుళ్ల తరవాత ఇంగ్లాండు- ఉగ్రవాద చర్యలను అరికట్టేందుకు ప్రత్యేకంగా రీసెర్స్‌ ఇన్ఫర్‌మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ యూనిట్‌ (ఆర్‌ఐసీయూ) పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో మనదేశంలోనూ ఐఎస్‌పై పోరాడటానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. వాస్తవానికి అమెరికా, ఐరోపా దేశాలతో పోల్చుకుంటే ఐఎస్‌లోకి వెళ్లడానికి భారతీయ యువతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ప్రతి రాష్ట్రం నుంచి గల్ఫ్‌ దేశాలకు విమాన రాకపోకలు రోజూ సాగుతుంటాయి. లక్షలాది మంది ఆయా దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. కాబట్టి, సిరియా, ఇరాక్‌లకు సులభంగా వెళ్ళే అవకాశం ఉంది. పైగా పాకిస్థాన్‌ దన్నుతో లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌, ఇండియన్‌ ముజాహిద్దీన్‌ తదితర సంస్థలు మూడు దశాబ్దాలుగా దేశంలో విధ్వంసానికి పాల్పడటమే కాకుండా, యువతలో జాతి వ్యతిరేక విషబీజాలు నాటడానికి ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ, మిగతా దేశాలతో పోల్చుకుంటే మనదేశం నుంచి ఐఎస్‌లోకి వెళ్లేవారి సంఖ్య పరిమితంగానే ఉంది. గతంలో అల్‌ఖైదా సైతం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినప్పుడూ స్పందన రాలేదు. అంతమాత్రాన ఏమరుపాటుగా ఉండరాదు. నియామకాలు తక్కువగా ఉన్నా, పెను విధ్వంసం సృష్టించడానికి ఒకరిద్దరు చాలు! అందువల్ల కేంద్రంతో పాటు రాష్ట్రాలూ నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలి. ముప్పు ముంచుకుని రాకముందే మేల్కొని దీటైన చర్యలు చేపట్టాలి.

- వలసాల సుహాస్‌
Posted on 01-12-2015