Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

స్వీయలబ్ధి కోసం ట్రంప్‌ అగచాట్లు

* అమెరికా - చైనా వాణిజ్య ఒప్పందం

‘ఆర్ట్‌ ఆఫ్‌ ది డీల్‌’- అత్యుత్తమ అమ్మకాలు సాధించిన ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పుస్తకాల జాబితాలో దాదాపు 13 వారాల పాటు తొలిస్థానంలో నిలిచిన రచన ఇది. పుస్తక సహ రచయిత మరెవరో కాదు... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌! ఆయనీ పుస్తకాన్ని ఎలా రచించగలిగారన్న విషయం ఇటీవల అమెరికా-చైనా మధ్య కుదిరిన తొలివిడత వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ ఒప్పందంతో అనేక కోణాల్లో ప్రత్యర్థులపై ట్రంప్‌ పైచేయి సాధించారని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ ఒప్పందం వల్ల అమెరికాకు వాణిజ్యపరంగా పెద్దగా ఒరిగిందేమీ లేకపోయినా ట్రంప్‌ మాత్రం కష్టకాలంలో భారీగా లబ్ధి పొందారు. 2020లో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ప్రజలదృష్టిని తన విజయాలపైకి మళ్లించేందుకు ట్రంప్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఆర్థిక లాభం కొంతే...
చైనాతో ఈ నెల 13న తొలివిడత వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో వాల్‌స్ట్రీట్‌ మార్కెట్‌లో సూచీలు పరుగులు తీశాయి. ఆయన ప్రకటించిన ఒప్పంద వివరాల ప్రకారం చైనా ఆర్థిక-వాణిజ్య వ్యవస్థలకు సంబంధించి మేధాహక్కుల పరిరక్షణ, సాంకేతికత బదిలీ, వ్యవసాయం, ఆర్థిక సేవలు, కరెన్సీ, విదేశ మారకపు ద్రవ్య విధానాల్లో వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. రాబోయే సంవత్సరాల్లో అమెరికా నుంచి మరిన్ని వస్తుసేవలను (వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధనం, తయారీ వస్తువులు) కొనుగోలు చేసేందుకు చైనా కట్టుబడి ఉండాలి. ఫలితంగా సెక్షన్‌ 301 కింద విధించిన సుంకాలను సవరించేందుకు అమెరికా అంగీకరించింది. 25 వేలకోట్ల డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 25శాతం సుంకం కొనసాగుతుందని, మరో 12 వేలకోట్ల డాలర్ల ఉత్పత్తులపై సుంకం 15 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే చైనాకు ఈ ఒప్పందం నుంచి 900 కోట్ల డాలర్ల సుంకాలనుంచి మాత్రమే మినహాయింపు వచ్చింది. కాకపోతే ఈ నెల 15న విధిస్తామని గతంలో ప్రకటించిన జరిమానా సుంకాలను ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. చైనా వచ్చే రెండేళ్లలో దాదాపు 20 వేలకోట్ల డాలర్ల మేరకు అమెరికా వస్తుసేవలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందనిలా దేశ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైటైజర్‌ చెబుతున్నారు. ఇక అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా వచ్చే రెండేళ్లలో ఏటా నాలుగు వేలకోట్ల డాలర్ల నుంచి అయిదు వేలకోట్ల డాలర్ల వరకు పెంచేందుకు అంగీకరించిందని అమెరికా ప్రకటించింది. కానీ, చైనా ప్రతినిధుల ప్రకటనలో ఈ అంశం లేకపోవడం గమనార్హం.

వాస్తవానికి ఈ తొలివిడత ఒప్పదం నుంచి అమెరికా అనుకున్నంత లబ్ధి పొందలేదు. 2017లో అమెరికా-చైనా మధ్య వస్తుసేవల వాణిజ్యలోటు 37,500 కోట్ల డాలర్లు. అది చైనాకు అనుకూలంగా ఉంది. 2018లో వాణిజ్య యుద్ధం మొదలైనా కాని మరో 4,400 కోట్ల డాలర్ల లోటు చైనాకు అనుకూలంగా పెరిగి 41,900 కోట్ల డాలర్లకు చేరింది. మరి వాణిజ్యలోటును తగ్గించేందుకు అమెరికా అనుసరించిన సుంకాల వ్యూహం ఫలించినట్లు ఎలా అనుకోగలం? 2019లో అక్టోబర్‌ వరకు చూస్తే చైనాకు అనుకూలంగా 29,400 కోట్ల డాలర్లకు వాణిజ్య లోటు చేరింది. ఇదిలా కొనసాగితే 2017 నాటి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అంటే వాణిజ్యయుద్ధం వల్ల అమెరికాకు పెద్దగా ఒరిగిందేమీ లేదనే అర్థం. ఇక సుంకాల విషయానికి వస్తే- చైనా దిగుమతులపై విధించే సుంకాల భారం అంతిమంగా అమెరికా వినియోగదారుడే చెల్లిస్తున్నాడు. వాణిజ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి విడిభాగాలు, తయారైన వస్తువులకు సంబంధించిన దిగుమతులపై అమెరికా కంపెనీలకు నాలుగు వేలకోట్ల డాలర్లకు పైగా అదనంగా చేతి చమురు వదిలింది. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 430 అమెరికా సంస్థలు కుదేలైపోయాయి. ఈ భారం అమెరికన్లపైనే పడుతోందని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. దీనికి ట్రంప్‌ 2020 ఎన్నికల్లో సమాధానం చెప్పుకోవాలి. అందుకే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు పెంచామని ట్రంప్‌ చెబుతున్నారు. ట్రంప్‌ మద్దతుదారుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ నేపథ్యం ఉన్నవారే ఎక్కువ.

మరోపక్క చైనా అధినాయకత్వం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంది. వాణిజ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి చైనా వృద్ధి గణాంకాలు నేలచూపులు చూస్తున్నాయి. వృద్ధిరేటు 27 సంవత్సరాల అత్యల్పానికి పడిపోయింది. తయారీ సంస్థలు వియత్నాం, సింగపూర్‌, మలేసియా, భారత్‌ వంటి దేశాలకు తరలిపోవడతో హుయ్‌ఝూ వంటి పట్టణాలు ఖాళీ అయిపోతున్నాయి. మరోపక్క కొన్ని నెలలుగా హాంగ్‌కాంగ్‌లో అలజడి ఆగడంలేదు. వాస్తవానికి హాంగ్‌కాంగ్‌ పోలీసుల సంఖ్య 30 వేలు మించదు. కానీ, ఈ ఆందోళనలను అదుపుచేయడానికి వారు ఏమాత్రం సరిపోరు. దీంతో చైనా బలగాలను హాంకాంగ్‌ బలగాల్లోకి చైనా చొప్పించినట్లు వార్తలొస్తున్నాయి. అయినా ఫలితం లేకపోవడంతో అంతర్జాతీయ సమాజం దీనిపై దృష్టి సారించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ వార్షిక ‘బిదైహె’ సమావేశంలో హాంగ్‌కాంగ్‌, వాణిజ్య యుద్ధంపై రెండువర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. దీంతో ఆ సమావేశ వివరాలు బయటకు రానీయకుండా చైనా తొక్కిపెట్టింది. ఇలాంటి ఘటనలూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ఒత్తిడి పెంచాయి. ఇక హాంగ్‌కాంగ్‌తో దుడుకుగా వ్యవహరిస్తే వాణిజ్య ఒప్పందం చేసుకోమని అమెరికా బెదిరింపులకు దిగింది. జపాన్‌, ఆస్ట్రేలియా, ఐరోపా సంఘం దీనికి మద్దతు పలికాయి. అంతేకాదు ఏకంగా ‘హాంగ్‌కాంగ్‌ మానవ హక్కులు, ప్రజాస్వామ్య చట్టం’కు అమెరికా ప్రాణం పోసింది. తమ అంతర్గత విషయాలను అమెరికా బేరాలకు వాడుకుంటోందని, ఇక దీనికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని డ్రాగన్‌కు అర్థమైంది.

వాణిజ్య ఒప్పందం కోసం 2020 వరకు వేచి చూడాల్సిందేనని డిసెంబర్‌ మొదట్లో ట్రంప్‌ చెప్పారు. కానీ మరికొన్ని రోజుల్లో అభిశంసన తప్పదని తెలియగానే వాణిజ్య చర్చలను వేగిరపరచి ఓ కొలిక్కి తీసుకొచ్చారు. అందుకే అభిశంసనకు ముందే ఆయన అదరాబదరాగా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. అమెరికా రైతులకు ఇక మంచిరోజులు వచ్చినట్లుగా చిత్రీకరించారు. వాస్తవానికి తొమ్మిది అధ్యాయాలు ఉన్న ఈ ఒప్పందాన్ని అప్పటికి చైనా భాషలోకి తర్జుమా సైతం పూర్తికాలేదు. పెద్ద ఒప్పందాల్లో భాష అత్యంత కీలకమైంది. మరోపక్క చైనా ప్రతినిధులు, మీడియా ఆచితూచి స్పందించింది. ఒప్పందం పూర్తిస్థాయిలో బయటకు వచ్చేదాకా వేచి చూడాల్సిందే. ట్రంప్‌ను ఏమాత్రం నమ్మలేం. అతి త్వరలో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరుగుతాయని ట్రంప్‌ తాజాగా ప్రకటించారు. అంటే ఫిబ్రవరిలోపు ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

అనుమానాలు అనేకం
మరోపక్క ట్రంప్‌ ప్రకటించిన అంశాల్లో చాలా వరకు నమ్మదగినవిగా లేవని ఆ దేశ వాణిజ్య నిపుణులే వ్యాఖ్యానిస్తున్నారు. 2017లో అమెరికా నుంచి 18,600 కోట్ల డాలర్ల వస్తుసేవలు చైనాకు ఎగుమతి అయ్యాయి. ఆ మొత్తం 2018 నాటికి 16,900 కోట్ల డాలర్లకు పడిపోయింది. డిసెంబర్‌లోనే చైనా ‘3-5-2’ ప్రణాళికను ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే మూడేళ్లలో దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల్లోని ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో దేశీయ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఉపయోగించనున్నారు. దీంతో అమెరికా ఎగుమతులు ఇంకా తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికే ఎగుమతులను 20 వేలకోట్ల డాలర్లు ఎలా పెంచుతారనేదే ప్రశ్న. ఆర్థిక సేవల రంగంలో చైనా నిబంధనలు సరళతరం చేసి అమెరికా సంస్థలకు అవకాశం కల్పిస్తే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ చైనాకు సంబంధించి 37 వేలకోట్ల డాలర్ల సరకులపై సుంకాలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందంలో జరిగింది చాలా తక్కువ... జరగాల్సింది ఎంతో ఉంది. అంటే భవిష్యత్తులో మరిన్ని విడతల్లో వాణిజ్య ఒప్పందాలు చేసుకొనక తప్పదు. అమెరికా ప్రయోజనాల రక్షకుడిగా చిత్రీకరించుకొనేందుకు ట్రంప్‌నకు ఇదో సదావకాశం. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అభిశంసన గాయాన్ని కప్పిపెట్టుకొనేందుకు దీన్ని పైపూతగా వాడుకొంటారనడంలో సందేహం లేదు.

- పెద్దింటి ఫణికిరణ్‌
Posted on 26-12-2019