Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

అమెరికా తప్పుటడుగులు!

అమెరికా అధ్యక్షులవారి మాటలకు అర్థాలే వేరులే అని యావత్‌ ప్రపంచం నివ్వెరపోయేలా ఉంది డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహార సరళి. నిరంతర యుద్ధాల నుంచి అగ్రరాజ్యాన్ని తెరిపిన పడేసి, బలగాల్ని ఇంటిముఖం పట్టించడమే లక్ష్యమన్న ట్రంప్‌ తాజా తెంపరితనం పశ్చిమాసియాలో కొత్త చిచ్చు రాజేసింది. పునరధికారం కోసం అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇరాన్‌తో యుద్ధానికి తెగబడే ప్రమాదం ఉందని 2011లో ‘ట్విటర్‌’ వేదికగా పదేపదే జోస్యాలు చెప్పిన ట్రంప్‌- నేడు శ్వేతసౌధాధిపతిగా అభిశంసన ప్రక్రియను ఎదుర్కొంటూ టెహరాన్‌తో కయ్యానికి కాలుదువ్వడం పెను వివాదగ్రస్తమవుతోంది. 1998 డిసెంబరులో అధ్యక్షుడిగా బిల్‌ క్లింటన్‌ తనపై అభిశంసన దర్యాప్తు కీలక దశకు చేరిన వేళ, సైనికంగా అత్యవసరమంటూ ఇరాక్‌పై వైమానిక దాడులకు తెగబడ్డారు. ఇప్పుడు ట్రంప్‌ కూడా బాగ్దాద్‌ విమానాశ్రయం సమీపంలో ఇరాన్‌ అగ్రశ్రేణి సైన్యాధిపతి మేజర్‌ జనరల్‌ సులేమానీని డ్రోన్‌ దాడితో కడతేర్చి- యుద్ధాన్ని నిలువరించడానికే ఈ చర్య అవసరపడిందని సమర్థించుకొంటున్నారు. రెండు దశాబ్దాలుగా పశ్చిమాసియాలో చాపకింద నీరులా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న సులేమాని దిల్లీ నుంచి లండన్‌ దాకా జరిగిన పలు దాడులకు వ్యూహకర్త అని ట్రంప్‌ యంత్రాంగం తీర్మానిస్తోంది. కానీ ఇరాక్‌ సిరియాల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) టెర్రరిస్టుల్ని మట్టుబెట్టడానికి అమెరికా అతగాడి పరోక్ష తోడ్పాటు తీసుకొన్న వాస్తవాన్ని విస్మరించే వీల్లేదు! అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను ఒబామా, ఐఎస్‌ పెద్దదిక్కు అబు బకర్‌ అల్‌ బగ్దాదీని ట్రంప్‌ యంత్రాంగాలు మట్టి కరిపించినా- వాళ్ళిద్దరూ ప్రైవేటు వ్యక్తులు, భయానక ఉగ్రవాద శక్తులు! వాళ్లకు భిన్నంగా మేజర్‌ జనరల్‌ సులేమానీ ఇరాన్‌ సర్వోన్నత నేత ఖమేనీకి అత్యంత సన్నిహితుడే కాదు, పశ్చిమాసియాలో టెహరాన్‌ ప్రాబల్య విస్తరణ వ్యూహనిర్మాణ కోవిదుడు! కాబట్టే, అదనుచూసి అంతకంతా బదులు తీర్చుకొంటామని ఇరాన్‌ కత్తులు నూరుతోంది. అమెరికా చర్యతో ప్రపంచం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్న ఆందోళనల నేపథ్యంలో- పశ్చిమాసియా ప్రస్థానంలో అక్షరాలా అసురసంధ్య ఇది!

తానిచ్చింది వరం పెట్టింది శాపంగా చలాయించుకొనే అమెరికా అగ్రవాదం, అధ్యక్షుడిగా ట్రంప్‌ తీసుకొన్న రెండు వివాదాస్పద నిర్ణయాల్లో బుసలుకొట్టింది. అందులో మొదటిది వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని కట్టడి చెయ్యడానికి ఉద్దేశించిన ప్యారిస్‌ ఒడంబడిక; రెండోది ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని నిలిపివేయించేలా కుదిరిన కీలక ఒప్పందం. ఈ రెండింటినుంచీ ఏకపక్షంగా వైదొలగిన ట్రంప్‌ సర్కారు మాటలకు చేతలకు పొంతన లేని విధానాల్ని అనుసరిస్తోంది. ఇరాన్‌తో అణు ఒప్పందానికి చెల్లుకొట్టడానికన్నా ముందే- జెరూసలేమ్‌ను అధికారికంగా ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించాలని నిర్ణయం తీసుకొన్నానని, పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి అది కొత్తదారి చూపుతుందంటూ ట్రంప్‌ ప్రభుత్వం విచిత్ర వాదనలు వినిపించింది. దరిమిలా ఇరాన్‌ను ఆర్థికంగా దిగ్బంధించేందుకు ఆ దేశం నుంచి చమురు దిగుమతుల్ని పూర్తిగా నిలిపివేయాలంటూ ఫర్మానాలూ జారీచేసింది. నిరుడు జూన్‌లో గల్ఫ్‌ ప్రాంతంలోని రెండు చమురు ట్యాంకర్లపై దాడి, పిమ్మట అమెరికా నౌకాదళానికి చెందిన గ్లోబల్‌ హాక్‌ డ్రోన్‌ కూల్చివేతలతో అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్‌ సైనిక కంప్యూటర్‌ వ్యవస్థలపై సైబర్‌ దాడులు చేసిన అగ్రరాజ్యం- లెబనాన్‌, ఇరాక్‌, సిరియా, యెమన్లలో ఇరాన్‌ మాట జవదాటని పటిష్ఠ యంత్రాంగాల్ని నిర్మించిన సులేమానీని కడతేర్చడం ద్వారా టెహరాన్‌ వెన్నువిరిచే వ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేసింది. జనరల్‌ సులేమానీని హతమార్చడం ద్వారా ఉత్పన్నమయ్యే ముప్పు తీవ్రతే తక్కువన్న నిర్ధారణతో అమెరికా అందుకు తెగించినా, దాని పర్యవసానాలు ఒక్క పశ్చిమాసియాకే పరిమితమయ్యే అవకాశం లేదు. ప్రపంచవ్యాప్తంగా గల షియా ముస్లిముల్లో అత్యధికులు ఇండియాలోనే ఉన్నందున వారిలో ఏ కొందరు ఉగ్రపంథా తొక్కినా భారత్‌ విశాల హితానికీ చెరుపు తప్పదు!

న్యూయార్క్‌, వాషింగ్టన్లపై సెప్టెంబరు 11నాటి ఉగ్రదాడులకు ఎక్కడెక్కడో అసంబద్ధమైన లంకెలు పెడుతూ స్వీయ వ్యూహాత్మక తప్పిదాల్ని కప్పిపుచ్చేందుకు అమెరికా పెద్దల ప్రయాసలు అన్నీఇన్నీ కావు. అప్పట్లో అమెరికాపై దాడులకు పాల్పడిన 10-12మంది ఉగ్రవాదుల్ని రహస్యంగా అఫ్గానిస్థాన్‌కు పంపింది సులేమానీయేనని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కొత్త కథ అల్లుతున్నారు. నిజానికి అఫ్గాన్‌లో తాలిబన్ల భరతం పట్టేలా అమెరికాకు సులేమానీయే సహకరించాడని మొత్తుకొంటున్నాయి ఎన్నో మిలిటరీ విశ్లేషణలు! సున్నీ షియా వర్గీయుల మధ్య పెనువైషమ్యాల రణక్షేత్రంగా పశ్చిమాసియా సెగలుపొగలు కక్కుతుంటే- ఉగ్రవాదం అంతుచూస్తామంటూ అగ్రరాజ్యం ఇరాక్‌పై భయానక దాడులకు తెగబడి సృష్టించిన మారణహోమం ఇంకా చల్లారనే లేదు. బాగ్దాద్‌లో అమెరికా దాడిని ‘దురాక్రమణ’గా ఇరాక్‌ ప్రధానమంత్రి గర్హించగా, అమెరికా దళాల్ని దేశం నుంచి బహిష్కరించాలని అక్కడి పార్లమెంటు తాజాగా తీర్మానించింది. ఒకవంక అమెరికా, మరోపక్క ఇరాన్‌ల ప్రచ్ఛన్న రణస్థలిగా మారి ఇరాక్‌ మరో సిరియాగా రూపాంతరం చెందుతుందేమోనన్న భయాందోళనలూ ముప్పిరిగొన్నాయిప్పుడు! పశ్చిమాసియాలో ఎలాంటి ఉద్రిక్తతలు ప్రజ్వరిల్లినా, దాని ప్రభావం చమురు ధరలపై పడి అవి భగ్గుమన్నప్పుడల్లా దేశ దేశాలు తెల్లమొగమేయక తప్పడం లేదు. గల్ఫ్‌లో మరో యుద్ధం రాకుండా అందరూ సంయమనం పాటించాలంటున్న సమితి ఆశాభావం నెరవేరుతుందా; సులేమానీ దళాల మెరుపుదాడుల ముప్పు అమెరికా, దాని మిత్రదేశాలను దెబ్బతీస్తే, అది అంతటితో ఆగుతుందా?- ఈ ఆందోళనకర ప్రశ్నలకు కాలమే చెప్పాలి జవాబు!

Posted on 06-01-2020