Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

ఇరకాటంలో భారత్‌

* అమెరికా - ఇరాన్‌ సంక్షోభం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తలకు వెలను ప్రకటించడం ద్వారా ఇరాన్‌ ప్రభుత్వం తన ప్రతీకారేచ్ఛను విస్పష్టంగా బహిరంగపరచింది. ఇరాన్‌ అత్యున్నత సైన్యాధిపతి మేజర్‌ జనరల్‌ సులేమానీని ఇరాక్‌ విమానాశ్రయంలో మాటువేసి డ్రోన్‌ దాడితో కడతేర్చిన అమెరికన్‌ నాయకత్వం- ‘టెహరాన్‌’తో నేరుగా కయ్యానికి కాలుదువ్వింది. ఇరాన్‌లో విపరీతమైన పలుకుబడిగల సులేమానీ- దేశ సైనికదళమైన ‘అల్‌-ఖుద్స్‌’ పగ్గాలను 22 ఏళ్ల క్రితం చేపట్టారు. ఉగ్రవాదంపై పోరులో సులేమానీ సేవలను ఒకప్పుడు చురుగ్గా ఉపయోగించుకున్న అమెరికా- ఉన్నపళంగా ఆయనను మట్టుపెట్టడం వెనక కారణాలు అంతుపట్టడం లేదు. మరో యుద్ధం జరగకుండా అడ్డుకునేందుకే ఆయనను పరిమార్చామంటున్న అగ్రరాజ్యం అసలు ఉద్దేశాలు మరికొంతకాలం ఆగితేగానీ బయటపడవు. సులేమానీ హత్య వెనక కారణాలేవైనా కావచ్చుగానీ- ఆయన మరణం వివిధ దేశాలతో ఇప్పటివరకూ ఇరాన్‌ నెలకొల్పుకొన్న ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలను దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు. ఇందుకు ఇండియా సైతం మినహాయింపు కాదు.

భారత్‌కు ఇరాన్‌ చిరకాల మిత్రదేశం. ఇరాన్‌ ఆగ్నేయ ప్రాంతంలో మక్రాన్‌ తీరంలో ఉన్న చాబహార్‌ నౌకాశ్రయ అభివృద్ధికి భారత్‌ ఇబ్బడిముబ్బడిగా నిధులు వెచ్చించింది. అటు మిత్రదేశం, ఇటు అగ్రరాజ్యం కొలువుతీరిన పరిస్థితుల్లో సులేమానీ హత్యపై ఎలా స్పందించాలన్న విషయంలో భారత్‌ అతిపెద్ద సందిగ్ధాన్ని ఎదుర్కొంటున్న సందర్భమిది. ఏ పక్షాన్నీ నొప్పించకుండా స్పందించేందుకు భారత్‌ యత్నిస్తోంది. భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ ఇరానియన్‌ ప్రభుత్వాధినేతలతో జరిపిన ఫోన్‌ సంభాషణను ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సులేమానీ హత్యను భారత్‌ ఖండించకపోవడం అమెరికాకు ఆనందం కలిగించవచ్చు. ఇరాన్‌కు మాత్రం భారత్‌ తీరు అసంతృప్తి కలిగిస్తుంది. పాకిస్థాన్‌ గుండా అఫ్గానిస్థాన్‌కు చేరుకోవడం కన్నా, ఇరాన్‌లోని చాబహార్‌ ద్వారా ప్రయాణిస్తే భారత్‌కు 800 కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది. షాహిద్‌ కలంతరి, షాహిద్‌ బెహెస్తీ అనే రెండు ఓడరేవుల సమాహారమే చాబహార్‌! నిబంధనల పరిమితులు లెక్క చేయకుండా షాహిద్‌ బెహెస్తీ ఓడరేవుపై భారత్‌కు 10 ఏళ్ల నిర్వహణ లీజు కట్టబెట్టేందుకు ఇరాన్‌ గతంలో ముందుకొచ్చింది. పాకిస్థాన్‌లోని గ్వదర్‌ సమీపంలో బలూచి ఓడరేవు నిర్మాణానికి పెద్దయెత్తున పెట్టుబడులు గుమ్మరించిన చైనా- చాబహార్‌ను సైతం నిర్మించేందుకు ఉత్సాహం చూపించింది. కానీ, వ్యూహాత్మక ప్రాధాన్యాల దృష్ట్యా ఇరాన్‌ ఆ అవకాశాన్ని భారత్‌కు అప్పగించింది. పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా మధ్య ఆసియా భూమార్గంతో వాణిజ్య బంధం నెలకొల్పుకొనేందుకు చాబహార్‌ ఓడరేవు భారత్‌కు అద్భుతంగా అక్కరకొస్తుంది. చాబహార్‌నుంచే ‘హిందూస్థాన్‌’ మొదలవుతుందని శతాబ్దాల క్రితమే అల్‌ బెరూనీ రచనల్లో ప్రస్తావించారు. పాకిస్థాన్‌ సరిహద్దులకు సమీపంలో చాబహార్‌లో ఏదో స్థాయిలో భారత్‌ అస్తిత్వం ఉండటం మేలని ఇరానియన్‌ నాయకత్వమూ తలపోసింది. భారత్‌ తరఫున గూఢచర్యం చేస్తున్నాడన్న అభియోగాలపై కులభూషణ్‌ జాదవ్‌ను పాకిస్థాన్‌ బంధించింది కూడా చాబహార్‌ సమీపంలోనే కావడం గమనార్హం.

చాబహార్‌ ప్రాజెక్టులో రెండు భాగాలున్నాయి. ఒకటి: ఓడరేవు, రెండు: ఇరాన్‌, అఫ్గాన్‌ నగరాలతో ఆ ఓడరేవును అనుసంధానించే రోడ్డు, రైలు మార్గాలు! భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రొహానీ, అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనిలు కలిసికట్టుగా 2016లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇతర దేశాలతో చురుగ్గా వ్యాపార, వాణిజ్య భాగస్వామ్యాలు నెలకొల్పుకోవడం ద్వారా తమపై ఆంక్షలు తొలగిపోతాయని; తద్వారా అంతర్జాతీయ ప్రధాన స్రవంతిలో చేరేందుకు తమకు వీలు చిక్కుతుందని ఇరాన్‌ నాయకత్వం భావించింది. కానీ ట్రంప్‌ రాకతో ఆ దేశం ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. ఇరాన్‌తో ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేసుకోవడంతోపాటు దానిపై ట్రంప్‌ ఆంక్షల అస్త్రం ప్రయోగించారు. ఇరాన్‌పై ఆంక్షలతోపాటు; ఆ దేశంతో లావాదేవీలకు అంతర్జాతీయ బ్యాంకులు నిరాకరించడంతో చాబహార్‌ పోర్టు నిర్మాణాన్ని భారత్‌ ఆశించినంత వేగంగా చేపట్టలేకపోయింది. అయితే అఫ్గానిస్థాన్‌ పునర్నిర్మాణానికి చాబహార్‌ ఓడరేవు కీలకమని భావించిన అమెరికా ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయలేదు.

తమ దేశపు ముద్దుబిడ్డడు సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుని తీరతామని ఇరాన్‌ సర్వోన్నత నేత అయతుల్లా ఖమైనీ విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో- ఇరాన్‌తో భారత్‌ ఎలా వ్యవహరించబోతోందన్న విషయం అంతుచిక్కడం లేదు. ఇరాక్‌, సిరియా సహా పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో ‘ఇస్లామిక్‌ స్టేట్‌’ కూసాలు కదల్చడంలో సులేమానీ కీలక పాత్ర పోషించారు. ఇరాక్‌లో ఐఎస్‌కు, అఫ్గాన్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా సులేమానీ గతంలో అమెరికాతో కలిసి చురుగ్గా పనిచేశారు. మారిన అంతర్జాతీయ వాతావరణంలో సులేమానీని అమెరికా శత్రువుగా పరిగణించడం ప్రారంభించింది. దిల్లీలో గతంలో ఇజ్రాయెలీ దౌత్యవేత్తపై దాడి వెనక సులేమానీ హస్తం ఉందని ట్రంప్‌ తాజాగా ఆరోపిస్తున్నారు. సులేమానీ కార్యకలాపాలను దిల్లీతో ముడిపెట్టడం ద్వారా భారత్‌నుంచి తాను ఆశిస్తున్నదేమిటో ట్రంప్‌ స్పష్టం చేశారు. సులేమానీ హత్యను అంతర్జాతీయ సమాజం ‘అన్యాయమైనది’గా తీర్మానిస్తున్న తరుణంలో ఒకవేళ ఇరాన్‌ సైతం భారత్‌ నుంచి నిర్దిష్ట మద్దతును ఆశిస్తే అప్పుడు మనదేశం మరింత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందనడంలో సందేహం లేదు. ఒకరితో వ్యాపార మైత్రి... మరొకరితో వ్యూహాత్మక భాగస్వామ్యం పెనవేసుకుపోయిన పరిస్థితుల్లో చాబహార్‌ ఓడరేవులో కార్యకలాపాల నిర్వహణ భారత్‌కు కష్టతరంగా మారుతుందనడంలో మరోమాట లేదు!

- సంజయ్‌ కపూర్‌
(రచయిత- సీనియర్‌ పాత్రికేయులు)
Posted on 07-01-2020