Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


అంతర్జాతీయం

వీడుతున్న యుద్ధమేఘాలు

* పశ్చిమాసియాకు ‘తాత్కాలిక’ ఊరట

పశ్చిమాసియాలో ముసురుకొన్న యుద్ధ మేఘాలు వారం వ్యవధిలోనే పలచబడటంతో అంతర్జాతీయ సమాజం ఊపిరి పీల్చుకుంది. ఇరాన్‌, అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం ముదిరితే పెట్రోలియం సరఫరాలకు ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం బారినపడి విలవిల్లాడుతున్న దేశాలను ‘యుద్ధం’ దెబ్బ మరింత కుంగదీస్తుంది. సమరం తప్పదేమోనని అందరూ భావిస్తున్న వేళ- సంక్షోభ నివారణకు దౌత్యపరంగా ఇరాన్‌ నాయకత్వం చురుగ్గా పావులు కదిపింది. అమెరికా సైతం అదే స్థాయిలో సానుకూలంగా స్పందించడంతో యుద్ధ భయాలు మలిగిపోయాయి. ఇరాక్‌లోని అమెరికా కేంద్ర స్థావరాలపై జనవరి 8న 22 బాలిస్టిక్‌ క్షిపణులను ఇరాన్‌ ప్రయోగించింది. ఆ ఘటనపై అదే రోజు సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమరస ధోరణిలో ప్రతిస్పందించారు. ఇరానియన్‌ ప్రజలు, నాయకత్వం శాంతియుత చర్చల ప్రక్రియపై శ్రద్ధ పెట్టాలని ఆయన పిలుపిచ్చారు. దాంతో ఒక్కసారిగా చమురు ధరలు నేలకు దిగాయి. స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నింగికెగిశాయి. అయితే ఇదంతా తాత్కాలిక ఊరటే కావచ్చు. క్షిపణి దాడుల రూపంలో ఇరాన్‌ ఇప్పటికే తన సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పటికిప్పుడు యుద్ధం అనే తేనెతుట్టెను కదల్చకూడదని టెహరాన్‌ నాయకత్వం భావించినందువల్లే సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగింది, దీర్ఘకాలంలో ఎప్పుడైనా మళ్ళీ అగ్గి రాజుకునే అవకాశాలు కొట్టిపారేయలేనివి!

ఇరానియన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ‘ఖుద్స్‌ ఫోర్స్‌’ అత్యున్నత సైన్యాధిపతి మేజర్‌ జనరల్‌ ఖాసిమ్‌ సులేమానీని జనవరి 3న అమెరికా డ్రోన్‌ దాడులతో హతమార్చడంతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్‌తో అమెరికా పేచీ ఈనాటిది కాదు. 1979లో ఇరాన్‌లో షా ప్రభుత్వాన్ని కూలదోయడంతో అత్యంత శక్తిమంతుడైన అయతుల్లా ఖొమైనీ సారథ్యంలో ఇస్లామిక్‌ రాజ్యం ఆవిర్భవించింది. అదే ఏడాది నవంబరులో అతివాద విద్యార్థులు టెహ్రాన్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని ముట్టడించి, 52మంది దౌత్యవేత్తలను, సిబ్బందిని అదుపులోకి తీసుకొని 444 రోజులపాటు బంధించారు. ఆ ఘటనతో అమెరికా ఇరాన్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరాన్‌లో కొలువుదీరిన ఇస్లామిక్‌ సర్కారును కూలదోసేందుకు అమెరికా నాయకత్వం అన్ని రకాలుగా ప్రయత్నించింది. ఎనిమిదో దశకంలో ఇరాక్‌-ఇరాన్‌ల మధ్య యుద్ధం చెలరేగినప్పుడు అమెరికా ప్రభుత్వం సద్దాం హుస్సేన్‌కు అవసరమైన నిధులు, ఆయుధాలు, సైనిక శిక్షణ అందజేసి ‘బాగ్దాద్‌’కు అండగా నిలిచింది. ఇజ్రాయెల్‌తోనూ ఇరాన్‌ సంబంధాలు ఉప్పూనిప్పుగా మారడంతో- అమెరికా నాయకత్వం ‘టెహరాన్‌’కు మరింత దూరమైంది. ఇరాన్‌ అధ్యక్షుడిగా అహ్మదీ నెజాదీ ఒక దశలో ఇజ్రాయెల్‌ను ‘ప్రపంచ పటంపై అవమానకరమైన మచ్చ’గా అభివర్ణించడంతోపాటు ‘దాన్ని తక్షణమే తుడిచిపెట్టాలని’ వ్యాఖ్యానించారు. అమెరికాతో అంతకంతకూ అగాధం పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని అణ్వాయుధమే లక్ష్యంగా ఇరాన్‌ రహస్య ‘అణు కార్యక్రమానికి’ తెరలేపింది. ఆ దేశానికి అందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని, సాధన సంపత్తిని పాకిస్థాన్‌ సమకూర్చడం గమనార్హం. ‘అణు కార్యక్రమా’న్ని నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి, అమెరికా హుకుం జారీచేశాయి. ఆ క్రమంలోనే ఇరాన్‌పై తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఆ తరవాత జరిగిన అనేక ప్రయత్నాల కారణంగా 2015 జులైలో ‘ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక’కు ఇరాన్‌ సమ్మతించింది. దానిప్రకారం యురేనియం పాళ్లు అత్యధికంగా ఉన్న నిల్వలను ధ్వంసం చేస్తామని; కనిష్ఠ పరిమితుల్లో యురేనియం ఉన్న నిల్వలపై, శుద్ధి కేంద్రాలపై 15 సంవత్సరాలపాటు కఠిన నియంత్రణలు అమలుపరుస్తామని అంగీకరించింది. ఒబామా సారథ్యంలో సవ్యంగానే సాగిన అమెరికా, ఇరాన్‌ సంబంధాలు- వాషింగ్టన్‌ నాయకత్వ పగ్గాలు డొనాల్డ్‌ ట్రంప్‌ చేతికి రావడంతో ఒక్కసారిగా మారిపోయాయి. ఇరాన్‌తో ఒప్పందాన్ని అత్యంత పనికిమాలినదిగా అభివర్ణించిన ట్రంప్‌- 2018 మేలో ‘ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక’నుంచి ఏకపక్షంగా బయటకొచ్చి తిరిగి ఆ దేశంపై ఆంక్షలు విధించారు. దాంతోపాటు ఇరాన్‌నుంచి ఏ దేశమూ చమురు దిగుమతి చేసుకోరాదని హుకుం జారీ చేశారు. ట్రంప్‌ ఆదేశాలకు ‘సమితి’ సమ్మతి లేకపోయినా అంతర్జాతీయంగా అమెరికా ప్రాభవాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్‌ సహా వివిధ దేశాలు ఏదో స్థాయిలో ఆ నియంత్రణలను ఔదలదాల్చాయి.

ఇరాన్‌తో భారత స్నేహానుబంధానిది శతాబ్దాల చరిత్ర! పశ్చిమాసియా సంక్షోభం భారత్‌పై కనబరచే ప్రభావం అంతాఇంతా కాదు. ఆ ప్రాంతం 80 లక్షలమంది భారతీయులకు ఆశ్రయమిస్తోంది. పశ్చిమాసియాలో స్థిరపడిన భారతీయులు ఏటా మన దేశానికి నాలుగు వేల కోట్ల డాలర్ల డబ్బు పంపిస్తున్నారు. అయితే మరోవంక అమెరికాతో వ్యూహాత్మక మైత్రి దృష్ట్యా- ఇరాన్‌వైపు మొగ్గు చూపడానికి భారత్‌కు వీల్లేని పరిస్థితి నెలకొంది. మధ్యవర్తి పాత్ర పోషించాలన్న ఇరాన్‌ రాయబారి ఆహ్వానానికి భారత్‌వైపునుంచి మౌనమే సమాధానం కావడానికీ ఇదే కారణం. మరోవంక రెండు దేశాల మధ్య గొడవలో మూడో పక్షం జోక్యానికి సిద్ధాంతపరంగా మొదటినుంచీ భారత్‌ వ్యతిరేకం. పశ్చిమాసియా రాజకీయాల్లో ‘క్షమించడా’న్ని బలహీనతకు చిహ్నంగా చూస్తారు. జాతి కీర్తి ప్రతిష్ఠల కోసం అవసరమైతే దాడులకు తెగబడి ప్రతీకారం తీర్చుకోవడమే అక్కడ చెల్లుబాటయ్యే పద్ధతి. ఈ కోణంలో చూస్తే ఇరాన్‌ ప్రస్తుతానికి ఒక అడుగు వెనక్కి తీసుకోవడాన్ని వ్యూహాత్మక చర్యగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి, దీర్ఘకాలంలో పశ్చిమాసియా గడ్డపై యుద్ధం పురివిప్పే ప్రమాదం కొట్టిపారేయలేనిదనే చెప్పాలి.

- విష్ణు ప్రకాశ్‌
(రచయిత- కెనడా, దక్షిణ కొరియాల్లో భారత మాజీ రాయబారి)
Posted on 13-01-2020