Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

మారుతున్న అంతర్జాతీయ సమీకరణలు

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ, మార్పు శాశ్వతం. అంతర్జాతీయ బలసమీకరణలు నేడు మారడానికి సిద్ధంగా ఉన్నాయి. రెండో ప్రపంచయుద్ధానంతరం అంతర్జాతీయ బలాబలాల సమతూకం పదేపదే మార్పులకు లోనైంది. అమెరికా, రష్యాల మధ్య భిన్నధ్రువాలుగా చీలిన ప్రపంచం కాలక్రమంలో బహుళ ధ్రువాలుగా, చివరకు అమెరికా కేంద్రిత ఏకధ్రువ ప్రపంచంగా మారింది. కానీ, నేడు ప్రపంచ పరిణామాలు కొత్త మార్పులకు దారితీస్తూ భారత్‌, చైనా తదితర దేశాలకు సవాలు విసురుతున్నాయి.

సోవియట్‌ యూనియన్‌ పతనంతో రెండు ధ్రువాల ప్రపంచం సమాప్తమై, అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది. ఇటీవలి కాలంలో చైనా తన ప్రాబల్యాన్ని విస్తరించుకునే విధానాన్ని దూకుడుగా అమలుచేస్తోంది. దానికి ప్రతిగా అమెరికా 'ఆసియా ఇరుసు' విధానం చేపట్టింది. రష్యా పట్ల అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల్లో శత్రుత్వ వైఖరి పెరుగుతోంది. దీనిపట్ల పుతిన్‌ కఠినంగానే స్పందిస్తున్నారు. భారత్‌ అమెరికాకు దగ్గరవుతుంటే రష్యా, చైనాలు చేతులు కలుపుతున్నాయి. ఇదీ స్థూలంగా ప్రస్తుతం కనిపిస్తున్న అంతర్జాతీయ చిత్రం. చైనా ఆర్థికంగా బలోపేతమవుతుంటే, అమెరికా ప్రాబల్యం ఆర్థికంగా, రాజకీయంగా క్షీణించడం ప్రపంచ రాజకీయాలు రూపాంతరం చెందడానికి కారణమవుతోంది.

మోదీ చొరవ

21వ శతాబ్దిలో అమెరికా, చైనా, భారతదేశాల మధ్య సంబంధాలు అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి అమెరికా, చైనాలతో ఆర్థిక, రాజకీయ, వ్యూహపరమైన సంబంధాలకు కొత్త వూపు తెచ్చారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం ఎంతో లాభదాయకమనే భావనను విదేశాలకు కల్పించడంలో సఫలుడయ్యారు. కానీ, భారత్‌లో రెండోతరం ఆర్థిక సంస్కరణల కోసం విదేశీ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా నచ్చచెప్పడం, ఏకాభిప్రాయ సాధన ద్వారా సంస్కరణ బిల్లులను ఆమోదింపజేయడానికి మోదీ సర్కారు కృషి చేస్తోంది. ఈలోగా జపాన్‌, చైనాల నుంచి భారీ పెట్టుబడులను సంపాదించింది. అమెరికన్‌ సంస్థలు కూడా పెట్టుబడులతో ముందుకు వస్తాయని ఆశిస్తున్నారు. పౌర అణుశక్తి రంగంలో అమెరికన్‌ పెట్టుబడులకు అడ్డంకిగా తయారైన అణుపరిహార బిల్లుపై విభేదాల పరిష్కారానికి వెస్టింగ్‌ హౌస్‌, జీఈ-హిటాచీ సంస్థలతో మోదీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇటీవల వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత సందర్శన సందర్భంగా మొత్తం 12 అణు రియాక్టర్ల సరఫరాకు రష్యాతో మనదేశం ఒప్పందం కుదుర్చుకోవడం స్వాగతించాల్సిన పరిణామం. దీనివల్ల భారత్‌లో అణు విద్యుత్‌ ఉత్పాదన పెరుగుతుంది. అణుపరిహార బిల్లు విషయంలో అమెరికా, ఫ్రాన్స్‌లు అనుసరిస్తున్న పట్టువిడుపులు లేని ధోరణిపై పునరాలోచన జరిగేలా పురిగొల్పుతుంది. అవి మొండిపట్టుకు పోతే భారత్‌లో అణుశక్తి వ్యాపారాన్ని కోల్పోవలసి వస్తుంది. రిపబ్లిక్‌ దినోత్సవాల్లో పాల్గొనవలసిందిగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను భారత్‌ ఆహ్వానించడం ఆర్థిక, సైనిక రంగాల్లో ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. రెండు దేశాల మధ్య పదేళ్ల రక్షణ ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయి. త్వరలోనే మలబార్‌ తీరంలో సంయుక్త నౌకాదళ విన్యాసాలు మళ్ళీ ప్రారంభం కావచ్చు. అమెరికా-జపాన్‌-ఆస్ట్రేలియా-భారతదేశాల మధ్య సైనిక, ఆర్థిక పొత్తు బలపడే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఇదంతా అమెరికా చేపట్టిన ఆసియా ఇరుసు విధానంలో భాగం.
చైనా అధికార వర్గాలకు సన్నిహితమైన ఒక పత్రిక ఆసియా ఇరుసు విధానాన్ని భారత ప్రభుత్వం కానీ, మేధావులు కానీ ఆమోదించలేదని వ్యాఖ్యానించడం విశేషం. దీనికిబదులు ప్రాచీన సిల్క్‌ రూట్‌, ఆధునిక సముద్ర సిల్క్‌ రూట్‌ల ద్వారా ఆర్థిక సంబంధాల పటిష్ఠతకు హిందూ-పసిఫిక్‌ మహాసముద్రాల ద్వారా విస్తరించే ఆర్థిక-భౌగోళిక విధానాన్ని అనుసరించాలని సిఫార్సు చేసింది. ఈ విధాన రూపకర్త చైనాయే. ఈ పథకంలో బంగ్లాదేశ్‌-ఇండియా-మయన్మార్‌ ఆర్థికనడవా (బీఐఎంసీ), చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా కూడా అంతర్భాగాలుగా ఉంటాయని ఆ పత్రిక పేర్కొంది. ఈ విధంగా అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి భారత్‌ తనతో చేతులు కలపాలని చైనా ఆశిస్తోంది.

పాశ్చాత్య చక్రబంధంలో రష్యా

ఒకప్పుడు రష్యా మిత్రదేశాలైన తూర్పు యూరోపియన్‌ రాజ్యాలను పాశ్చాత్య సైనిక కూటమి అయిన 'నాటో' పరిధిలోకి తీసుకురావాలని అమెరికా కూటమి ఆశిస్తోంది. అదే సమయంలో రష్యా భూభాగానికి చేరువలో ఉన్న మధ్యాసియా రిపబ్లిక్‌లలో తిరుగుబాట్లను ప్రోత్సహిస్తోంది. పాశ్చాత్యుల పన్నాగాలను ఎదుర్కోవడానికి రష్యా, క్రిమియాను కలిపేసుకుని, ఉక్రెయిన్‌లో సంక్షోభాన్ని సృష్టించింది. దీనికిబదులుగా రష్యా మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనివల్ల రష్యన్‌ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నా పుతిన్‌ బెదరలేదు. అమెరికాను ఎదుర్కోవడానికి చైనాకు దగ్గరయ్యారు. రష్యా, చైనాల మధ్య సహజవాయు విక్రయ ఒప్పందంతోపాటు రక్షణ ఒప్పందమూ కుదిరింది. త్వరలోనే మధ్యధరా సముద్రంలో, పసిఫిక్‌ మహాసముద్రంలో రష్యా-చైనా సంయుక్త నౌకాదళ విన్యాసాలు జరగబోతున్నాయి.
1990లలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో భారతదేశం అమెరికాకు దగ్గరైంది. అదే సమయంలో అంతర్జాతీయ వేదిక మీద నుంచి రష్యా ఉపసంహరించుకోసాగింది. భారత్‌, రష్యాలు ఒకదానికొకటి దూరమవుతున్న సూచనలు కనిపించాయి. కానీ, పుతిన్‌ హయాములో రష్యా, భారతదేశానికి మళ్ళీ స్నేహబంధాన్ని పటిష్ఠం చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది. దీన్ని మోదీ రెండు చేతులతో అందిపుచ్చుకొన్నారు. పుతిన్‌తో సాన్నిహిత్యం పెంచుకోవడానికి బ్రిక్స్‌, జి-20 శిఖరాగ్ర సభలను ఉపయోగించుకున్నారు. 2014 డిసెంబరులో పుతిన్‌ భారత్‌ సందర్శనకు వచ్చినప్పుడు దాదాపు 20 కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 12 కొత్త అణు రియాక్టర్ల సరఫరాతోపాటు అత్యాధునిక ఆయుధాలు, హెలికాప్టర్ల ఉమ్మడి ఉత్పత్తికీ అంగీకారం కుదిరింది. రష్యా భారతదేశానికి అత్యంత ముఖ్యమైన రక్షణ భాగస్వామి అని మోదీ ప్రశంసించారు. భారత్‌కు తక్షణమే ట్యాంకర్‌ నౌకల ద్వారా ఎల్పీజీని సరఫరా చేయడానికి రష్యా అంగీకరించింది. రెండు దేశాల మధ్య నేరుగా వజ్రాల వ్యాపారం జరగాలని నిర్ణయించడం- ద్వైపాక్షిక సంబంధాల్లో గొప్ప మైలురాయి.

రష్యాతో భారత్‌ సంబంధాలు ఇలా వృద్ధి చెందడం అమెరికాకు అసంతృప్తి కలిగించింది. భారత్‌ సందర్శనలో పుతిన్‌ వెంట క్రిమియా ప్రధాని సెర్గెయ్‌ అక్సినోవ్‌ కూడా ఉండటం అమెరికాకు పుండు మీద కారం రాసినట్లయింది. అయితే, అమెరికా రుసరుసలను భారత్‌ పట్టించుకోనక్కర్లేదు. భారత్‌పై పాకిస్థాన్‌ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం పట్ల అమెరికా ద్వంద్వవైఖరిని ఏమనాలి? దేశాల మధ్య సంబంధాలకు పలు కోణాలు ఉంటాయి. ఒక రంగంలో ఉభయుల మధ్య విభేదాలు ఉన్నా, ఇతర రంగాల్లో అంగీకారం ఉండవచ్చు. రష్యాలోని అపార ఇంధన వనరులు, అది సరఫరా చేసే అత్యాధునిక ఆయుధాలు భారత్‌కు చాలా అవసరం. అమెరికాకు భిన్నంగా రష్యా అత్యాధునిక ఆయుధాల రూపకల్పన, ఉత్పత్తిలో భారతదేశంతో చేయి కలపడానికి సిద్ధంగా ఉంది. అమెరికాను, పాశ్చాత్య దేశాలను ఎదుర్కోవడానికి చైనా అవసరం రష్యాకు ఉన్నా, భారతదేశంతో సాన్నిహిత్యాన్ని ఎప్పటిలా కొనసాగిస్తుంది. 1962 యుద్ధంలో రష్యా, సాటి కమ్యూనిస్టు దేశమైన చైనాకు వత్తాసు ఇవ్వకుండా తటస్థంగా ఉన్న సంగతి మరువలేం.

అనూహ్య పరిణామాలు సాధ్యమే

వేగంగా మారిపోతున్న ప్రపంచంలో భారతదేశం తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి తోడ్పడే అవకాశాలన్నింటినీ అట్టిపెట్టుకోవాలి. ఎలాంటి మొహమాటాలకూ తావు ఇవ్వనక్కర్లేదు. ప్రస్తుతం భారత్‌ కూడా ఓ ప్రధాన శక్తి. కాబట్టి అంతర్జాతీయ బల సమీకరణలను తనకు అనువుగా ఉపయోగించుకోవడానికి కృషి చేయాలి. అమెరికా, చైనాలు ఉన్నట్టుండి తమ విభేదాలను పరిష్కరించుకునే అవకాశం ఉందని గమనించాలి. దక్షిణాసియాలో, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో తన విస్తరణ కాంక్షకు చైనా పగ్గం వేసుకుంటే అమెరికాతో సంబంధాలు వేగంగా మెరుగుపడతాయి. ఈ దిశగా రెండు దేశాల అధ్యక్షులూ రహస్యంగా చర్చలు జరపాలని అమెరికన్‌ విధాన సలహాదారు, భారత్‌లో ఒకప్పటి అమెరికా రాయబారి అయిన రాబర్ట్‌ డి.బ్లాక్‌విల్‌ సూచించారు. 2014 డిసెంబరు 11న చైనాలోని అంతర్జాతీయ, వ్యూహపరమైన అధ్యయనాల కేంద్రంలో ఆయన ఈ మాట అన్నారు. 'రెండు దేశాలు పైకి ఒప్పుకోకపోయినా అమెరికా ఆసియాలో తన వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పరిరక్షించుకోవాలనుకుంటోంది. అమెరికాను పక్కకు నెట్టి ఆసియాలో తానే ప్రధాన శక్తిగా నిలవాలని చైనా ఆశిస్తోంది. ఇటీవల రెండు దేశాల మధ్య వాతావరణ మార్పులపై, పెట్టుబడులు, హైటెక్‌ సహకారంపై, సైనికపరంగా పరస్పరం నమ్మకాన్ని పెంచుకోవడంపై ఒప్పందాలు కుదిరినా చైనా, అమెరికాల మధ్య పరస్పర అపనమ్మకం తొలగలేదు' అని బ్లాక్‌విల్‌ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తొందరపాటుతో సంఘర్షణకు దిగే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చైనా, అమెరికాల అధినేతలు నేరుగా సంప్రతించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఇక రెండు సంవత్సరాల పదవీకాలం మాత్రమే మిగిలి ఉంది. క్యూబాతో చిరకాల వైరానికి స్వస్తి చెప్పిన ఒబామా, చైనాతో సైద్ధాంతిక విభేదాలనూ విడనాడటం అసాధ్యమేమీ కాదు. ఇక, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు గత కాలపు నిష్ఫల విధానాల నుంచి వైదొలగడం కష్టం కాదు. పార్టీలో ప్రత్యర్థులంతా తోక ముడవడంతో ఆయనకు ఎదురే లేదు. అంతర్జాతీయ సంబంధాల్లో కొత్తపుట తెరవడానికి ఆయన అన్నివిధాలా సమర్థుడు. మొత్తం మీద అమెరికా, ఐరోపా సమాజం, చైనా, జపాన్‌, భారత్‌, రష్యాల మధ్య సంబంధాలు, సమీకరణలు రానున్న రోజుల్లో చిత్రవిచిత్రంగా మారిపోయే అవకాశాలే హెచ్చు. ఈ రాజకీయ ఏకీకరణలు, పునరేకీకరణలకు భారతదేశం ప్రేరకంగా నిలిస్తే, అంతర్జాతీయంగా దేశ ఖ్యాతి ఇనుమడిస్తుంది.

(రచయిత - ప్రొఫెసర్ బి.రమేశ్ బాబు)
(రచయిత- అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధాన వ్యవహారాల నిపుణులు)
Posted on 10-01-2015