Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

నూతన జాతీయ ఖనిజ విధానం

దేశంలో ఖనిజ వనరులు విస్తారంగా ఉన్నాయి. జాతి అవసరాలను నెరవేర్చుకునే క్రమంలో ఆ వనరులను అత్యంత జాగ్రత్తగా, సమర్థంగా వినియోగించుకోవాలి. తవ్వకాలకు సంబంధించిన లీజుల కేటాయింపులో పారదర్శకతకు పెద్దపీట వేయాలి. ఈ రెండింటిని ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని కేంద్రప్రభుత్వం కీలక సంస్కరణలకు సమాయత్తమైంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా, గోవా రాష్ట్రాల్లోనూ ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాల్లో పెద్దయెత్తున అవినీతి బయటపడింది. దరిమిలా, 1957నాటి గనులు-ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టాన్ని సవరించడం అనివార్యమైంది. చట్టసవరణ కోసం అత్యవసరాదేశం(ఆర్డినెన్స్‌) అమలులోకి వచ్చింది. నిరుడు సెప్టెంబరులో- దేశంలో ఖనిజాల తవ్వకం, లీజుల కేటాయింపుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ఠ విధానాలను 'కాగ్‌' ఎండగట్టిన తీరు చట్ట సవరణ ప్రక్రియను వేగవంతం చేసింది. బొగ్గుగనులు, భూసేకరణ అత్యవసరాదేశాలను వెలువరించిన మోదీ సర్కార్‌- అదే పరంపరలో ఇటీవల గనులు-ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ ఆర్డినెన్స్‌-2015ను జారీచేసి వాటి కేటాయింపు విధానాల్లో సంస్కరణలు చేపట్టింది. మునుపటి యూపీఏ ప్రభుత్వం 2011నుంచి ఆ మేరకు ప్రయత్నాలు చేసినప్పటికీ- చట్టసభల్లో ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో మోదీ ప్రభుత్వం చివరకు ఆర్డినెన్స్‌ రూపంలో సవరణ అస్త్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. దీర్ఘకాలిక జాతీయ లక్ష్యాలు, దృక్పథాలతో కూడిన మార్గదర్శకాల మేరకు ఖనిజ తవ్వకాలు చేపట్టాలన్న ఉద్దేశంతో యూపీఏ తొలిదఫా ప్రభుత్వం 2008లో నూతన జాతీయ ఖనిజ విధానం ప్రకటించింది. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు ఉద్దేశించిన చట్టాన్ని తీసుకురావడంలో విఫలమైంది. తాజాగా మోదీ సర్కారు చేపట్టిన సవరణలు నూతన జాతీయ ఖనిజ విధానం అమలుకు మార్గాన్ని సుగమం చేశాయి.

పారదర్శకతకు పెద్దపీట

తాజా అత్యవసరాదేశం ప్రధానంగా నూతన జాతీయ ఖనిజ విధానం నిర్దేశించిన రెండు ప్రధాన లక్ష్యాల మీదే దృష్టి సారించింది. మొదటిది- గనుల లీజు కేటాయింపుల్లో పారదర్శకతకు పెద్దపీట వేయడం. ఇప్పటివరకు 'మొదట వచ్చినవారికి మొదట' ప్రాతిపదికన లీజు కేటాయింపు ప్రతిపాదనల స్థానంలో ప్రత్యక్ష వేలం పద్ధతి ప్రవేశపెట్టారు. దీనిలో ఖనిజాల లభ్యత ప్రకారం వీలున్న ప్రాంతాలను 'నోటిఫై' చేసి వేలంపాటలు నిర్వహిస్తారు. అత్యధిక మొత్తంతో ముందుకు వచ్చినవారికి ఖనిజాల తవ్వకం లీజులు కేటాయిస్తారు. ఇందులో పారదర్శకతకు వీలున్నా, కార్పొరేట్‌ సంస్థలు, బహుళజాతి సంస్థలకే గనుల కేటాయింపుల్లో గుత్తాధిపత్యం కట్టబెట్టేందుకూ అవకాశాలు లేకపోలేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. సువ్యవస్థీకృత సంస్థలకు గనులను కేటాయించడం ద్వారా అక్రమ తవ్వకాలకు కొంతవరకు కళ్లెం వేయవచ్చు.

పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి గనుల లీజుల(క్యాపిటివ్‌ మైన్స్‌) కేటాయింపుల్లో గతంలో పెద్దపీట వేశారు. కానీ, వారు ఒప్పందం ప్రకారం లీజులు పొంది పరిశ్రమలు స్థాపించకపోవడంతో వాటిని ఉపసంహరించుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సంస్థలు- సున్నపురాయి, ఇనుప ఖనిజాల తవ్వకాలకు అనుమతులు పొందినప్పటికీ, పరిశ్రమలు స్థాపించకపోవడంతో వాటిని వెనక్కు తీసుకుంటూ నాటి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో గనుల లీజుల కేటాయింపుల్లో తాజాగా వేలం పద్ధతి అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించడం సాహసోపేత చర్య. రెండో ప్రధాన సవరణ- గనులు, ఖనిజాల అభివృద్ధి-నియంత్రణ సవరణల ఆర్డినెన్స్‌(2015)లోని నియమ నిబంధనలను ఉల్లంఘించి ఖనిజాల అక్రమ తవ్వకాలకు, అక్రమ రవాణాకు పాల్పడినవారికి గరిష్ఠంగా అయిదు సంవత్సరాల జైలుశిక్ష, హెక్టారు విస్తీర్ణానికి అయిదు లక్షల రూపాయల చొప్పున భారీ జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్దేశించింది. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారి విషయంలో అదనంగా రోజుకు రూ.50వేలు జరిమానా విధించే వీలూ కల్పించారు.

ప్రజా ప్రయోజనాలే కీలకం

నూతన జాతీయ ఖనిజ విధానం-2008లో నిర్దేశించిన విధంగానే ఖనిజాల తవ్వకం ద్వారా ప్రభావితమయ్యే ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు ఈ సవరణ ఆర్డినెన్స్‌లో ప్రాధాన్యం కల్పించడం స్వాగతించదగిన పరిణామం. ప్రధానంగా గిరిజన ప్రాంత ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి తాజాగా చర్యలు చేపట్టారు. అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా జిల్లా స్థాయిలో 'మినరల్‌ ఫౌండేషన్‌' పేరిట ఒక ట్రస్టును ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్నీ కేంద్రం కల్పించింది. ఖనిజాల తవ్వకం ద్వారా ప్రభావితమయ్యే ప్రాంతాలు, అక్కడి ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో కృషి చేయడం వీటి ప్రధాన ఉద్దేశం కావాలి. ఈ ట్రస్టు/ఫౌండేషన్ల నిర్వహణ కోసం- సంబంధిత ప్రాంత ఖనిజాల తవ్వకం కౌలుదారులు 'రాయల్టీ' కింద ప్రభుత్వానికి చెల్లించే మొత్తంలో మూడింట ఒకవంతుకు మించకుండా కేంద్రం నిర్ణయించిన రీతిలో ట్రస్టుకు జమ చేయాలి. ఆ మొత్తం అక్కడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే కేటాయిస్తారు. గనుల తవ్వకాల ప్రాంత ప్రజల్లో అపోహలను తొలగించి, వారికి ఉపశమనం కలిగించి ఆందోళనబాట పట్టకుండా చేసేందుకు ఉద్దేశించిన నిర్ణయమది. గతంలో విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో బాక్సైట్‌, యురేనియం ప్రాజెక్టులపట్ల గిరిజనులు పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు. మైనింగ్‌ ప్రాజెక్టులవల్ల నష్టపోయే ప్రజలకు జాతీయ సహాయ పునరావాస పథకంతో సమానంగా ప్యాకేజీలు అందించాలని ఖనిజ విధానంలో పేర్కొన్నారు. ఆ మేరకు సవరణల ద్వారా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయింది.

జాతీయ నూతన ఖనిజ విధానంలో పేర్కొన్న ఇతర అంశాలపైనా సవరణల తాజా ఆర్డినెన్స్‌ దృష్టి సారించింది. ప్రజాప్రయోజనాలు, ఖనిజ వనరుల సంరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ విధానాల ద్వారా గనుల తవ్వకాలు చేపట్టడం కోసం అవసరమైతే రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసే బాధ్యతను కేంద్రానికే దఖలుపరచారు. తవ్వకాలు, లీజు కేటాయింపు విధానాలను మెరుగుపరచడం, మైనింగ్‌ లీజుదారుల కార్యకలాపాలను అంతర్జాల ఆధారిత డాటాబేస్‌ ద్వారా నిర్వహించడం, ఖనిజ నిక్షేపాల వెలికితీతలో ఉత్పన్నమవుతున్న వ్యర్థాలను తగ్గించడం, వ్యర్థాల నుంచి పునరుత్పాదనను ప్రోత్సహించడం, తద్వారా ప్రతికూల పర్యావరణ ప్రభావాలను అధిగమించడం, జీవ వైవిధ్య పరిరక్షణ, తదితర చర్యల కార్యాచరణకు కేంద్రం రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేస్తూ పర్యవేక్షిస్తుంది. ఖనిజ నిక్షేపాల అన్వేషణను సశాస్త్రీయంగా చేపట్టడం, నిర్వహణ వ్యయానికి నిధులు సమకూర్చడం కోసం కేంద్రం 'జాతీయ ఖనిజ అన్వేషణ ట్రస్ట్‌'ను ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా ఏర్పాటు చేస్తుంది. గనుల లీజుదారులు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించే మొత్తంలో రెండు శాతం ఈ ట్రస్టుకు జమచేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ట్రస్టు ప్రాంతీయ, సమగ్ర ఖనిజాన్వేషణ కార్యక్రమాలకు వెచ్చిస్తుంది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమని భావించిన పక్షంలో ఖనిజ నిక్షేపాలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు 'రిజర్వ్‌' చేసి, ఖనిజాల తవ్వకం బాధ్యతలను వాటికే అప్పగించవచ్చు. ఈ విధానం ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ ప్రభుత్వం సవరణల్లో పేర్కొనడం, కొనసాగించాలని నిర్ణయించడం చర్చనీయాంశం.

ప్రభుత్వరంగ సంస్థలు మైనింగ్‌ కార్యకలాపాలను సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహించడం వల్ల గతంలో అనేక అవకతవకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్‌ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే క్రమంలో నిబంధనలకు పాతరేసి సర్కారీ ఆదాయానికి గండి కొట్టాయని 'కాగ్‌' సైతం విమర్శించింది. ఇకనైనా సంయుక్త భాగస్వామ్య ఒప్పందాల్లో నిబంధనలను తప్పకుండా పాటించాలి. తాజాగా పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థ వాటా మొత్తం పెట్టుబడిలో 74శాతం మించి ఉండాలి. గనులు, ఖనిజాల చట్టం (1957)కి చేసిన సవరణలో మరో ప్రధానమైన అంశం 2015 జనవరి 12నుంచి గనులు, ఖనిజాల తవ్వకాలకు లీజుల కేటాయింపులు 50 సంవత్సరాలపాటు వర్తిస్తాయి. గతంలో 30సంవత్సరాలకు మించకుండా గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చేవారు. మరో 20సంవత్సరాలకు మించకుండా పునరుద్ధరణకు అనుమతించేవారు. వీటికి బదులు నేరుగా ఇక 50ఏళ్లకు కాలవ్యవధి పెంచడంవల్ల తవ్వకందారులు, కౌలుదారులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఆర్డినెన్స్‌ అమలు వర్తించేనాటికే మంజూరై ఉన్న లీజుల విషయంలో క్యాపిటివ్‌ గనులైతే 31 మార్చి 2030వరకు, ఇతర గనులైతే 31 మార్చి 2020 వరకు కొనసాగించుకునే సౌలభ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించడం పారిశ్రామిక వర్గాలకు వూరట కల్పించినట్లయింది.

ఆచరణతోనే సాధ్యం

సరిగ్గా 58ఏళ్ల తరవాత పలు కీలక అంశాల్లో సవరణలకు నోచుకున్న గనులు-ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే. సమగ్ర కార్యాచరణ ప్రణాళికతోనే ఇది సాధ్యం. గనుల లీజుల కేటాయింపు నుంచి తవ్వకాలు, రవాణా, పర్యావరణ పరిరక్షణ, ప్రభావిత వర్గాలు, ప్రజల ప్రయోజనాల పరిరక్షణ, పునరావాస కల్పన తదితర చర్యలన్నీ అత్యంత పారదర్శకంగా కొనసాగించాలి. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు లీజుదారులు, పారిశ్రామిక వర్గాలూ ఇందుకు పాటుపడాల్సి ఉంటుంది.

(రచయిత - డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌)
Posted on 09-02-2015