Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

ప్రత్యేక రాష్ట్రం కోసం మళ్ళీ పట్టు

* ఉద్యమిస్తున్న గోర్ఖాలు

డార్జిలింగ్‌... పర్యాటకుల పాలిట స్వర్గధామం. పశ్చిమ్‌ బంగ రాష్ట్రంలోని ఈ ప్రాంతం దశాబ్దాలపాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆందోళనలతో అట్టుడికిపోయింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాలను విభజించి, రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయడంతో డార్జిలింగ్‌ వాసులకు ఆశలు కొత్తగా చిగురించాయి. గోర్ఖాల ప్రాబల్య ప్రాంతాలన్నింటినీ కలిపి ‘గోర్ఖాల్యాండ్‌’ రాష్ట్రంగా ప్రకటించాలని చాలాకాలం నుంచి వారు కోరుతున్నారు. జమ్మూకశ్మీర్‌ ఇప్పుడు శాసనవ్యవస్థ ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించడంతో, తమకూ అలాంటి హోదా లేదా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటినుంచి మొదలుపెడితే కనీసం 2024 సార్వత్రిక ఎన్నికల ముందునాటికైనా తమ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం అక్కడి నేతల్లో వ్యక్తమవుతోంది. పశ్చిమ్‌ బంగలోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, దానికి అనుకూలంగా ఉన్న వర్గాలు తప్ప మిగిలిన అన్ని పక్షాలూ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటుకు సుముఖంగా ఉండటం తాజా పరిణామం. మరోవైపు రాష్ట్ర విభజన యత్నాలను అడ్డుకుని తీరుతామని తృణమూల్‌ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు.

డార్జిలింగ్‌ ప్రాంతంలో గోర్ఖాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వారితోపాటు లెప్చాలు, షేర్పాలు, భుటియాలూ ఉంటారు. డార్జిలింగ్‌ పర్వతప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేస్తామంటూ పలు పార్టీలు అనేక సంవత్సరాలుగా వారిని ఊరిస్తూనే ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలును ఇక్కడ అమలుచేస్తే ఈ ప్రాంతానికి మరింత స్వాతంత్య్రం లభిస్తుంది. 1986లో ప్రారంభమైన గోర్ఖాల్యాండ్‌ ఉద్యమం తరవాతి కాలంలో హింసాత్మక రూపు దాల్చింది. అప్పట్లో సుభాష్‌ ఘీషింగ్‌ నేతృత్వంలోని గోర్ఖా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జీఎన్‌ఎల్‌ఎఫ్‌) ఉద్యమాన్ని ప్రారంభించి 43 రోజుల పాటు ఆ ప్రాంతాన్ని అట్టుడికించింది. 1200 మంది వరకు మరణించారు. ఉద్యమం ఫలితంగా 1988లో డార్జిలింగ్‌ గోర్ఖా హిల్‌ కౌన్సిల్‌ ఏర్పడింది. నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ, అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబసు చొరవ అందుకు కారణం. 2007 తరవాత సుభాష్‌ ఘీషింగ్‌ సన్నిహిత సహచరుడైన బిమల్‌ గురుంగ్‌ నేతృత్వంలో జీజేఎం ఏర్పాటు కావడంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మరోసారి ఊపందుకుంది. 34 ఏళ్ల పాటు సాగిన వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ 2011లో టీఎమ్‌సీ పశ్చిమ్‌ బంగలో అధికార పగ్గాలు చేపట్టింది. ఆపై బిమల్‌ గురుంగ్‌ నాయకత్వంలో గోర్ఖాల్యాండ్‌ టెర్రిటోరియల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (జీటీఏ) ఏర్పాటైంది. కానీ రెండేళ్లకే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ గురుంగ్‌ మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టారు. 2017లో ఏకంగా 104 రోజుల పాటు సమ్మె చేశారు. ఇది కూడా హింసాత్మక రూపం సంతరించుకుంది.

బిమల్‌ గురుంగ్‌ నేతృత్వంలోని గోర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) భాజపాకు మద్దతిస్తోంది. గోర్ఖాల్యాండ్‌ సమస్యకు శాశ్వత రాజకీయ పరిష్కారం చూపుతామని భాజపా తన సార్వత్రిక ఎన్నికల ప్రణాళికలోనూ హామీ ఇచ్చిన విషయాన్ని జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్‌ గిరి ఇటీవలి కాలంలో తరచూ ప్రస్తావిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌ పరిణామాల నేపథ్యంలో శాసనవ్యవస్థ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటుకు ఇదే సరైన సమయమని, త్వరలోనే తాము దీనికోసం ఆందోళన ప్రారంభిస్తామని ఆయన అంటున్నారు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు అమలు కూడా వీరి డిమాండ్లలో ప్రధానమైనది. వీరికి జీఎన్‌ఎల్‌ఎఫ్‌ సైతం మద్దతిస్తోంది. ఈ ప్రాంతవాసుల ఆకాంక్షలు నెరవేర్చడంలో గోర్ఖాల్యాండ్‌ టెర్రిటోరియల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (జీటీఏ) తీవ్రంగా విఫలమైందని స్థానిక పౌరుల నుంచి నాయకుల వరకు అందరూ మండిపడుతున్నారు. ఈ రెండు ప్రధాన వర్గాల వాదనకు పలు చిన్న సంస్థలూ మద్దతిస్తున్నాయి. 2017 ఆందోళనల తరవాతి నుంచి ఇక్కడ పోలీసు ఆగడాలు ఎక్కువయ్యాయి. రాష్ట్ర విభజనను సుతరామూ అంగీకరించని తృణమూల్‌ ప్రభుత్వం ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచేయాలని భావించడమే ఇందుకు ప్రధాన కారణం. చిన్న పార్టీల మద్దతుతో ఇక్కడి లోక్‌సభ స్థానాన్ని భాజపా గెలుచుకోవడం ఆ పార్టీని కలవరపరిచింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో రెండు స్థానాలకే పరిమితమైన భాజపా, అయిదేళ్లు తిరిగేసరికి 18 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవడం తృణమూల్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలను కలవరానికి గురిచేసింది. ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలు వినవచ్చాయి. ఎన్నికల సందర్భంగా తీవ్ర హింసాత్మక ఘటనలూ చోటుచేసుకున్నాయి. పశ్చిమ్‌ బంగలో భాజపా పాగా వేస్తే రాష్ట్ర విభజనకు యత్నిస్తుందని, దానివల్ల భవిష్యత్తులో తమ ప్రాబల్యం తగ్గిపోతుందన్నది తృణమూల్‌ నేతల కలవరపాటుకు కారణం. టీఎమ్‌సీకి మద్దతిస్తున్న జీజేఎం వర్గ నేత బినయ్‌ తమాంగ్‌ లాంటివారూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ స్వరాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై రాజ్యసభలో ఆరున్నర గంటల పాటు జరిగిన చర్చలో అసోమ్‌కు చెందిన బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు బిశ్వజిత్‌ డైమరీ మాట్లాడుతూ, గోర్ఖాల్యాండ్‌, బోడోల్యాండ్‌, కర్బి ఆంగ్లాంగ్‌లకూ కేంద్రపాలిత ప్రాంత హోదా కోరడాన్ని తమాంగ్‌ స్వాగతించారు.

ఒక్క గోర్ఖాల్యాండ్‌ మాత్రమే కాదు, ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. దక్షిణాదిలో కొంగునాడు, కొడగు.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి గోండ్వానా, మహారాష్ట్ర నుంచి విదర్భ, గుజరాత్‌ నుంచి సౌరాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి బుందేల్‌ఖండ్‌, వింధ్యప్రదేశ్‌, బాగేల్‌ఖండ్‌, మహాకోశల్‌, వింధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి మారు ప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి హరితప్రదేశ్‌, పూర్వాంచల్‌, అవధ్‌, బిహార్‌ తదితర ప్రాంతాల నుంచి భోజ్‌ పురి, మిథిల... ఇలా ‘ప్రత్యేక’ డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అసలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఇప్పటివి కావు. స్వాతంత్య్రానికి ముందునుంచే ఇవి ఉన్నాయి. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరవాతా భాష, సంస్కృతి, ఆర్థిక పరిస్థితులను బట్టి ఇలాంటి కోరికలు తలెత్తుతున్నాయి. వీటిలో ఎన్ని సాకారమవుతాయో, మరెన్ని కల్లలుగా మిగిలిపోతాయో ఎదురుచూడాలి!


- కామేశ్‌ పువ్వాడ
Posted on 04-09-2019