Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అసోం పాపం ఎవరిది?

* జాతీయ పౌర జాబితా తప్పుల తడక

* భాజపా నేతలకూ దిగ్భ్రాంతి

* దేశవ్యాప్త జాబితా సాధ్యమేనా?

అక్రమ వలసదారులు దేశానికి పట్టిన చెదపురుగుల్లా తయారయ్యారని, వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తరిమేస్తామని భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఘనంగా ప్రకటించారు. రూ.1,220 కోట్లు ఖర్చుపెట్టి అసోమ్‌లో ఏళ్లతరబడి కసరత్తు చేసి రూపొందించిన పౌరుల జాతీయ జాబితా ముసాయిదాను దృష్టిలో ఉంచుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అప్పటికి 40 లక్షల మందికి పైగా ఆ జాబితాలో చోటుదక్కలేదు. జాబితాకు ఎక్కనివారిలో అత్యధికులు ముస్లిములు ఉంటారని చాలామంది భావించారు. వాస్తవానికి ముసాయిదాలో పేరు దక్కనివారిలో 28 లక్షల మంది హిందువులే ఉన్నారు. అన్ని వర్గాల నుంచి ముసాయిదాపై పెద్దయెత్తున దుమారం రేగింది. తండ్రికి చోటు లభించి కుమారుడికి లేకుండా పోవడం, కూతురు పేరున్నా తల్లి పేరు ఉండకపోవడం, సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొంది పింఛను అందుకుంటున్న వ్యక్తిని జాబితాలో చేర్చకపోవడం, తాతలను చేర్చి మనవలకు మొండిచేయి చూపించడం, కొన్నిచోట్ల భర్తల పేర్లు ఉండి భార్యల పేర్లు కనపడకపోవడం లాంటి వైపరీత్యాలు ముసాయిదాలో కోకొల్లలుగా ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జరిగిన కసరత్తులో ఇన్ని అవకతవకలు ఉండటం అక్రమ వలసదారుల వ్యవహారంపైనే చాలా సందేహాలను రేకెత్తించింది. ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించిన తరవాత విడుదల చేసిన తుదిజాబితాలో అక్రమ వలసదారుల సంఖ్య సగానికి పైగా పడిపోయింది. తుది జాబితాలో 19 లక్షల మందికి చోటు లభించలేదు. పోనీ వీరిలోనూ 80 లేదా 90 శాతం ముస్లిములు ఉన్నట్లయితే జాబితాపై ఇంత వివాదం... కనీసం అసోమ్‌లోని అధికార పార్టీ అయిన భాజపా నుంచి వచ్చేది కాదు. తుది జాబితాలో చోటుదక్కనివారిలో 12 లక్షల వరకూ హిందువుల పేర్లే ఉన్నట్లు తెలుస్తోంది. అసోం జాబితా ఈ రకంగా ఉంటే దేశవ్యాప్తంగా పౌరుల జాతీయ జాబితాను రూపొందిస్తామని, బెంగాల్‌ నుంచే దాన్ని మొదలుపెడతామని అమిత్‌ షా గతంలోనే చెప్పారు. అయినా, ఇప్పటికిప్పుడు అడుగులుపడేలా లేవు. తుది జాబితా కలగజేసిన దిగ్భ్రాంతి నుంచి కోలుకుని, అందులో కనీసం 20 శాతం వివరాలను పునఃపరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయడానికి అసోమ్‌లోని భాజపా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రజలకు పరీక్ష
బంగ్లాదేశ్‌ నుంచి లక్షల సంఖ్యలో తరలి వచ్చిన వలసదారులతో తమ సంస్కృతి, భాష, అస్తిత్వం ప్రమాదంలో పడ్డాయని భావించి అసోం విద్యార్థులు చేసిన ఉద్యమం ఫలితంగా ఈ పౌరుల జాతీయ జాబితా ఊపిరిపోసుకుంది. 1971 మార్చి 25నాటికి అసోమ్‌లో ఉన్నవారందరి పేర్లనూ జాబితాలోకి చేర్చేలా చట్ట నిబంధన రూపొందింది. 1971 మార్చి 25నాటికి తాము పౌరులమేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. దాదాపు 50 ఏళ్ళకు పైబడిన ఎన్నో రికార్డులను సంపాదించడానికి ప్రజలు పడిన కష్టాలను మాటల్లో వర్ణించలేం. రికార్డుల లభ్యత ఒక దగ్గరలేక, ఒకవేళ ఉన్నా వివరాల్లో తేడాలు, అక్షర దోషాలు, చివికి, చిరిగిపోయిన కాగితాలు... ఇలా ఎన్నో సమస్యలు ప్రజల్ని అగ్నిపరీక్షకు గురిచేశాయి. నెలలపాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగారు. జాబితాలో పేరు లేకపోతే భవిష్యత్తు ఏమిటనే ఆందోళనతో లక్షల మందిలో ఒత్తిడి తారస్థాయికి చేరింది. చోటుదక్కినవారు ఊపిరి పీల్చుకున్నారు. దక్కనివారు 120 రోజుల్లో తగిన సాక్ష్యాధారాలతో పునఃపరిశీలన కోరుకుంటూ ట్రైబ్యునళ్ళకు వెళ్లాలి. అక్కడ పౌరులుగా నిరూపించుకోలేకపోతే హైకోర్టు, తరవాత సుప్రీంకోర్టు గడపతొక్కాలి. అదెంత సుదీర్ఘ ప్రక్రియో అందరికీ తెలిసిందే.

దేశంలోకి అక్రమంగా వలస వచ్చారని మన చట్టాల ద్వారా నిరూపించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఏ దేశం నుంచి వలసదారులు వచ్చారని నిర్ధారిస్తున్నామో... ఆ దేశం వాళ్లను తమ పౌరులుగా భావిస్తే ఇబ్బందులు ఉండవు. బంగ్లాదేశ్‌ నుంచి ఇప్పటివరకూ అలాంటి సంకేతాల్లేవు. అసోమ్‌లోని వ్యవహారమంతా భారత్‌ అంతర్గతమైనదిగానే బంగ్లాదేశ్‌ భావిస్తోంది. ట్రైబ్యునళ్ళ పునఃపరిశీలనలో సగంమందికి ఉపశమనం లభిస్తుందని అనుకున్నా మిగతా 10 లక్షల మందిని బంగ్లాదేశ్‌కో, మరో దేశానికో పంపడం అంత తేలిక కాదు. వలసదారులు తమ దేశాల నుంచే వెళ్ళారని ఆమోదించని దేశాల్లోకి వారిని పంపడం దుస్సాధ్యం.

అక్రమ వలసదారుల్లో హిందువులే ఎక్కువగా ఉన్న విషయం తుదిపరిశీలనలో సైతం తేలితే ఏదో ఒకవిధంగా పౌరసత్వం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. బహుశా ఈ సమస్యను దృష్టిలో ఉంచుకునే పౌరసత్వ చట్టానికి సవరణ తీసుకువచ్చింది. లోక్‌సభలో సవరణకు ఆమోదం లభించింది. రాజ్యసభలో ఆమోదముద్ర పడితే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి వలస వచ్చిన ఆరు మతాలకు చెందిన అల్పసంఖ్యాక ప్రజలకు భారత పౌరసత్వాన్ని కల్పించడం సాధ్యమవుతుంది. ఈ దేశాల నుంచి వచ్చిన హిందువులు, పార్శీలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులను సవరణ చట్టం అల్పసంఖ్యాక వర్గంగా భావించి పౌరసత్వాన్ని ఇస్తుంది. ఆరు సంవత్సరాలు భారత్‌లో ఉన్నట్లు రుజువులు సమర్పిస్తే పౌరసత్వం లభిస్తుంది. ఈ సవరణతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశమూ ఉంది. మతం ఆధారంగా పౌరసత్వం కల్పించడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధమని ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. ఒక వేళ బిల్లు చట్టమైనా సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.

వలస పాలనకు అనుగుణంగా...
బంగ్లాదేశ్‌ నుంచి 1971 తరవాత ముస్లిములు మాత్రమే పెద్దయెత్తున వచ్చారన్న వాదన వాస్తవాల ముందు ఎలా నిలబడుతుందన్నదీ ప్రశ్నార్థకమే. సొంత ఆస్తులంటూ ఏమీ లేని నిరుపేద ముస్లిములు సరిహద్దులు దాటి వచ్చి ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. హిందువులు అలా రాలేదని చెప్పడానికీ ఎలాంటి ఆధారాల్లేవు. జాతీయ పట్టికలోని వివరాలు నిజమైతే హిందువులూ 1971 తరవాత బంగ్లాదేశ్‌ నుంచి రావడానికి ఆస్కారం ఉంది. దేశ విభజన నాటికి తూర్పు బెంగాల్‌లో 1.14 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వారంతా ఒక్కసారిగా భారత్‌లోకి రాలేదు. 1947లో 3.44 లక్షలమంది, 1948లో 7.86 లక్షలు, 1949లో 2.13 లక్షల మంది పశ్చిమ్‌ బంగకు వచ్చారు. 1950లో మాత్రం 15.75 లక్షల మంది తూర్పు బెంగాల్‌ని వీడారు. ఆపై మతకలహాలు, ఉద్రిక్తతలు తలెత్తినప్పుడల్లా పశ్చిమ్‌ బంగ, అసోమ్‌కు వచ్చే హిందువుల సంఖ్య పెరిగింది. 1981నాటికి తమ రాష్ట్రంలో శరణార్థులు 80 లక్షల మంది ఉన్నారని పశ్చిమ్‌ బంగ ప్రభుత్వం ప్రకటించింది. తూర్పు బెంగాల్‌ హిందువులందరూ పశ్చిమ పంజాబ్‌లాగా ఒక్కసారిగా భారత భూభాగానికి తరలిరాలేదు. ఆనాటి కేంద్ర ప్రభుత్వం కూడా పంజాబ్‌ నుంచి వచ్చిన హిందువులపైనే దృష్టిపెట్టి పునరావాస కార్యక్రమాలను పెద్దయెత్తున చేపట్టింది. తూర్పుబెంగాల్‌ హిందూ శరణార్థుల పట్ల అలాంటి శ్రద్ధ చూపలేదు. పైగా తూర్పు బెంగాల్‌ నుంచి ఇక్కడికి తరలివచ్చే హిందువులను, పశ్చిమ్‌ బంగ నుంచి అక్కడికి వెళ్లే ముస్లిములను ఆపడానికి భారత్‌-పాక్‌ ప్రధానుల మధ్య ఒప్పందమూ కుదిరింది. ఆ ఒప్పందంపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో దఫదఫాలుగా వచ్చిన హిందువుల్లో చాలామంది పొట్టచేతపట్టుకుని అసోమ్‌కు తరలి వెళ్లారు. బెంగాల్‌ విభజన కారణంగా వలస వచ్చిన ప్రజలతో పశ్చిమ్‌ బంగ జనసాంద్రత విపరీతంగా పెరిగింది. విభజనతో భూభాగం కుంచించుకుపోయింది. ఒక దశలో ఏ రాష్ట్రంలో లేనంత జనసాంద్రత పశ్చిమ్‌ బంగలో నమోదైంది. శరణార్థులకు పునరావాసం కల్పించడంలో పశ్చిమ్‌ బంగ, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దేశంలో ఇతరచోట్లకు శరణార్థులను పంపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బెంగాల్‌ నుంచి అసోమ్‌కు స్వాతంత్య్రానికి పూర్వమూ వలసలు భారీగానే సాగాయి. ఒక దశలో బ్రిటీష్‌ ప్రభుత్వం వాటిని బాగా ప్రోత్సహించింది. బెంగాలీయుల ప్రాధ్యాన్యత అన్ని రంగాల్లో ఇనుమడించిన తరవాత అసోం సంస్కృతికి, అస్తిత్వానికి ప్రమాదం ముంచుకొస్తోందని హెచ్చరించిందీ బ్రిటీష్‌ అధికారులే. వలసపాలన అవసరాలకు అనుగుణంగా ఆనాటి పాలకులు గొంతు మార్చారనడానికి ఇదే నిదర్శనం. ఇక వలసదారుల్లో హిందు-ముస్లిం అనే విభజన మొదట్లో అంతగా లేదు. మతం ప్రాతిపదికన వలసదారులను వెనక్కి పంపాలని అసోం ఉద్యమ సమయంలోనూ డిమాండ్‌ చేయలేదు. 1971 మార్చి 25 తరవాత వచ్చినవారందరినీ వెనక్కి పంపాలనే విద్యార్థి నాయకత్వం కోరింది. కాలక్రమేణా రాజకీయ ప్రయోజనాల కోసం వలసదారులకు మతంరంగు పూశారు. లక్షల మందిని దేశ సరిహద్దులు దాటించడం పెద్ద సవాలు. అంతర్జాతీయ సమాజమూ దీన్ని నిశితంగా పరిశీలిస్తుంది. అక్రమ వలసదారుల సమస్యనే అస్త్రంగా చేసుకుని రాజకీయంగా అసోం, బెంగాల్‌లో పట్టు సాధించిన భాజపాకు ఇది నిజంగా అగ్నిపరీక్షే!


- ఎన్‌. రాహుల్‌ కుమార్‌
Posted on 14-09-2019