Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

సుదృఢ భారత్‌ సుదూర స్వప్నమా?

* ఫిట్‌ ఇండియా

‘ఈసురోమని మనుషులుంటే... దేశమే గతి బాగుపడునోయ్‌’- గురజాడ అప్పారావు ఏనాడో అన్న మాట ఇది. సరిగ్గా అదే స్ఫూర్తిని అందిపుచ్చుకొంటూ గత నెల 29న జాతీయ క్రీడా దినోత్సవాన ‘దృఢ భారత్‌’ నిర్మాణానికి ప్రధాని మోదీ జాతికి పిలుపిచ్చారు. శారీరక దృఢత్వ సాధన పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి కేంద్ర ప్రభుత్వం‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. జీవనశైలిలో చిరు మార్పులు చేసుకుంటే శారీరక దృఢత్వ సాధన సుసాధ్యమేనని ప్రధాని చెబుతున్నా, క్షేత్రస్థాయి వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రజారోగ్య రంగాన ఎటుచూసినా అననుకూల పరిస్థితులు ముప్పిరిగొన్న నేపథ్యంలో ‘ఫిట్‌ ఇండియా’ లక్ష్య సాధనకు తీసుకోదగు చర్యలను సూచిస్తున్న వ్యాసమిది...

మంచి ఆరోగ్యమే మనిషికి నిజమైన సంపద. జీవితంలో ఆరోగ్యానికన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. దీని ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తించాలి. భావి తరాలకు తెలియజేయాలి. మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయి. ఆహార అలవాట్లలో స్వయం నియంత్రణ తప్పనిసరి. అదే సమయంలో వ్యక్తిగత క్రమశిక్షణా అవసరం - మహాత్మాగాంధీ

శారీరక దృఢత్వ లేమికి జీవనశైలి ఓ కారణమన్నది నిజమే కానీ, 130 కోట్లకు పైగా గల జనాభాలో ఇది ఎంతమందికి వర్తిస్తుందన్నదే అసలు ప్రశ్న! 2017నాటి ప్రపంచ ఆకలి సూచి ప్రకారం 119 దేశాల్లో భారత్‌ వందో స్థానంలో ఉంది. ఏడాది తిరిగేసరికి 103వ స్థానానికి పడిపోయింది. ప్రపంచ ఆహార సంస్థ లెక్కల ప్రకారం 19.59 కోట్ల భారతీయులకు పస్తులే ఆస్తులు! కనీసం పూటకింత తినడానికి లేని ఈ నిరుపేదలు శారీరకంగా ఎలా దృఢత్వం ఎలా సాధించగలరో, వారిని అలా తీర్చిదిద్దడానికి ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమం ఎంతవరకు ఉపకరిస్తుందో ఆలోచించాలి. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి అత్యధికులు ఆకలితో అలమటించేవారు. ఆ పరిస్థితి ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు. పోషకాహార సమస్య ఆఫ్రికా దేశాల్లో కంటే భారత్‌లో రెండు రెట్లు ఎక్కువగా ఉంది’ అని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ ఒక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎమ్‌ఆర్‌) నివేదిక ప్రకారం పోషకాహార లేమితో దేశంలో సంభవిస్తున్న అకాల మరణాలు పదేళ్లలో 35 శాతం పెరిగాయి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి అవసరమైన శక్తివనరులను అందించే ఆహారాన్ని సంపాదించుకోవడంలో వ్యక్తుల అశక్తతే పోషకాహార లోపం! మంచి ఆహారం అందుబాటులో ఉండటమనేది ఆదాయాలు, ధరలు, వ్యక్తులు, కుటుంబాలకు అందే సామాజిక మద్దతు మీద ఆధారపడి ఉంటుంది. కార్మిక బ్యూరో సర్వే ప్రకారం భారతీయ కార్మిక శక్తిలోని పురుషుల్లో 42.73 శాతం, స్త్రీలలో 71.22 శాతం నెలవారీ సంపాదన అయిదు వేల రూపాయలకు మించి లేదు. అంటే, నలుగురు ఉన్న కుటుంబంలో రోజుకు మనిషికి రూ.40కి మించి వెచ్చించ లేరు. దాంతో ఏం తింటారు, కుటుంబ సభ్యులు శారీరక దృఢత్వం సాధించేలా ఎలా ప్రోత్సహిస్తారు? ఈ మాత్రం సంపాదన లేక, ఆహార భద్రతా పథకాలేవీ అక్కరకు రాక, గడచిన నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 60 మంది అభాగ్యులు ఆకలిచావులకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం జీవనశైలిలో మార్పులతో మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చనే ‘ఫిట్‌ ఇండియా’ ఉద్దేశం, ఆ మేరకు పాలకులు నిర్దేశిస్తున్న ఉద్యమ కార్యాచరణ ఎంతవరకు ఫలవంతమవుతుందన్నది ప్రశ్న!

భిన్నమైన సమస్యలు
ఆరోగ్య స్థితిగతుల పరంగా దేశం భిన్నమైన సమస్యలను ఎదుర్కొంటోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015-16) ప్రకారం దేశవ్యాప్తంగా అయిదేళ్లలోపు పిల్లల్లో 38.4 శాతం ఎదుగుదల లోపాలతో ఉన్నారు. 28.5 శాతం శారీరకంగా దుర్బలురు. మరో 35.8 శాతం ఉండాల్సిన బరువుకంటే తక్కువ ఉన్నారు. వీరికి సమాంతరంగా దేశంలో 1.44 కోట్ల చిన్నారులు స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. 2025నాటికి వీరి సంఖ్య 1.7 కోట్లకు పెరుగుతుందని అంచనా! పిల్లల్లో అధిక బరువు, దుర్బలత్వం, ఎదుగుదల లోపాలను అరికట్టడం, స్త్రీ-పురుషుల్లో మధుమేహం, స్థూలకాయ సమస్యలను తగ్గించడం, పునరుత్పత్తి వయసులోని స్త్రీలలో రక్తహీనతను రూపుమాపడం, నవజాత శిశువులకు తల్లిపాలు అందించడం మీద అవగాహన పెంచడం కీలకం. 2025 కల్లా ఈ లక్ష్యాలను సాధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలన్నీ ఆరేళ్ల క్రితం సంకల్పం చెప్పుకొన్నాయి. ఈ లక్ష్యాల సాధనలో భారత్‌ చాలా వెనకబడి ఉందని 2018 ప్రపంచ పోషకాహార నివేదిక కుండ బద్దలుకొట్టింది. పిల్లల్లో ఎదుగుదల, దుర్బలత్వ సమస్యలు ఎక్కువగా పేదరికంతో ముడివడినవి. జంక్‌ఫుడ్‌ అలవాటుపడటంతో పాటు శారీరక శ్రమ లేమివల్ల పిల్లల్లోనూ స్థూలకాయ సమస్య పెచ్చరిల్లుతోంది. దీనికి విరుగుడుగా చిన్నారులు క్రీడాసంస్కృతిని అలవరచుకోవాలన్నది ప్రధాని సూచన! అయితే, 2017లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు ఇచ్చిన సమాచారం మేరకు దేశంలోని 31 శాతం మాధ్యమిక విద్యాలయాల్లో, 40శాతం ప్రాథమిక పాఠశాలల్లో క్రీడామైదానాలు లేవు. ఇక చిన్నారులు ఎక్కడకు వెళ్లి ఆడుకుంటారు? ఆటలు, వ్యాయామ విద్యకు స్థానం లేని ప్రస్తుత విద్యావిధానం ఆ సంస్కృతికి తూట్లు పొడుస్తోంది. శరీరానికి అవసరమైన పోషకాహారం, అధిక బరువు వల్ల కలిగే సమస్యల గురించి విద్యాలయాలు పిల్లలకు పెద్దగా అవగాహన కల్పించడం లేదు. ఈ విద్యావిధానం మారడంతోపాటు దారిద్య్ర నిర్మూలన జరిగితే తప్ప ప్రధాని ఆకాంక్షించినట్లు నవభారతం దృఢభారతం కాబోదు!

దేశంలో జీవనశైలి వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. జాతీయ పోషకాహార సంస్థ పరిశోధన ప్రకారం నగరాల్లో 20 ఏళ్లకు పైబడిన ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటు బాధితులు. ప్రతి నలుగురిలో ఒకరు మధుమేహంతో, ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక కొవ్వు, స్థూలకాయంతో బాధపడుతున్నారు. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 60 శాతానికి ఈ జీవనశైలి వ్యాధులే కారణం. వీటిని అరికట్టలేకపోతే 2012-2030 మధ్య భారత్‌ 326.71 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపదను కోల్పోతుందని ప్రపంచ ఆర్థిక సంస్థ, హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ హెచ్చరించాయి. కేంద్రప్రభుత్వ జాతీయ ఆరోగ్య సమాచార నివేదిక-2018 ప్రకారం 2017లోనే దేశవ్యాప్తంగా 30 లక్షలమందికి పైగా మధుమేహ వ్యాధి బారినపడ్డారు. మరో 36 లక్షల మంది అధిక రక్తపోటు, 1.34 లక్షల మందికి గుండె, రక్తనాళాల జబ్బులు, దాదాపు 40 వేల మందికి వివిధ రకాల క్యాన్సర్లు ఉన్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. జీవితాంతం వెంటాడే ఈ వ్యాధులకు చికిత్స తీసుకోవడం సామాన్యులకు తలకుమించిన భారమవుతోంది. వీటికి తోడు డెంగీ, చికెన్‌గున్యా లాంటి విషజ్వరాలు, ఇతర అంటురోగాల తాకిడి ఏటా పెరుగుతోంది. ప్రజారోగ్యం మీద ప్రభుత్వాలు వెచ్చిస్తున్న మొత్తం దేశ జీడీపీలో 1.4 శాతానికి మించట్లేదు. దీన్ని 2.5 శాతానికి పెంచాలని 2017నాటి జాతీయ ఆరోగ్య విధానం సిఫార్సు చేసింది. అయినా సరే, ప్రపంచ దేశాల సగటు వ్యయం (ఆరు శాతం)తో పోలిస్తే అది చాలా తక్కువ. నిరుడు మార్చి నాటికి దేశ జనాభాకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరానికన్నా 22 శాతం, ప్రజారోగ్య కేంద్రాలు 30 శాతం తక్కువ ఉన్నాయని జాతీయ గ్రామీణ ఆరోగ్య గణాంకాలు వివరిస్తున్నాయి. దీంతో ప్రజలకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. మరోపక్క వైద్యఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వైద్య సేవలను పొందడంలో ప్రజల మధ్య అసమానతలకు ఈ పరిణామాలు కారణమవుతున్నాయి. వైద్యఖర్చుల వల్ల ఏడాదికి 5.5 కోట్ల భారతీయులు పేదరికంలోకి కూరుకుపోతున్నారు. దృఢ భారత్‌ ఆవిష్కారం కావాలంటే ప్రజారోగ్యంపైన ప్రభుత్వ వ్యయం పెరగాలి. వైద్యసేవల అందుబాటులో అసమానత్వం రూపుమాసిపోవాలి.

ఆరోగ్యానికి హానికరమైనా...
దేశవ్యాప్తంగా సుమారు 24 వేల వ్యాయామశాలలు ఉన్నాయి. అంతర్జాల ఆధారిత వ్యాయామ సేవలందించే యాప్‌లతో కలిపితే భారతీయ ఫిట్‌నెస్‌ మార్కెట్‌ విలువ రూ.21,455 కోట్లు. శారీరక దృఢత్వం కోసం సగటు భారతీయుడు నెలలో నాలుగు నుంచి ఆరుసార్లే కసరత్తులు చేస్తాడని అంచనా! ఆరోగ్యానికి హానికరమైన పొగాకును ఏదో రూపంలో వినియోగించేవారు మాత్రం 27.5 కోట్లమంది ఉన్నారు. ఫలితంగా దేశంలో ఏడాదికి పది లక్షల మంది చనిపోతున్నారని అంచనా. ఈ దుస్థితిని అధిగమించాలి. దేశంలో 2010-17 మధ్య వార్షిక ఆల్కహాల్‌ వినియోగం 38 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 10-75 ఏళ్ల వయసువారిలో ఆల్కహాల్‌ తాగేవారు 16 కోట్లు ఉన్నట్లు ఓ సర్వే తేల్చింది. ఈ దురలవాటుతో ఏడాదికి 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ మద్యం విక్రయాలను ప్రభుత్వాలు ఆదాయ మార్గంగానే చూస్తున్నాయి. మరోవైపు దేశంలో 3.1 కోట్ల గంజాయి వినియోగదారులు ఉన్నారని ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. హెరాయిన్‌ మత్తులో తూగుతున్న 1.20 కోట్లమంది వీరికి అదనం. వ్యాధులు, వ్యసనాలకు తోడు కాలుష్యమూ భారతీయులను బలహీనులను చేస్తోంది. కాలుష్యం కారణంగా 2015లో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది చనిపోయారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాయు కాలుష్యం వల్లే 2017లో 12 లక్షల మంది మరణించారన్నది మరో సర్వే సారాంశం. ఆహార పదార్థాల కల్తీ సైతం ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోంది. పాలు, పాలపదార్థాల్లో 68.7 శాతం నిర్దేశిత ఆహారభద్రతా ప్రమాణాల మేరకు ఉండటం లేదు. డిటర్జెంట్లు, కాస్టిక్‌ సోడా, గ్లూకోజ్‌, కృత్రిమ తెల్లరంగు, నూనెలను కలిపిన పాలు, పాలపదార్థాలను విక్రయిస్తున్నారు. ఈ కల్తీని అరికట్టకపోతే 2025 నాటికి భారతీయుల్లో 87 శాతం తీవ్రమైన వ్యాధుల బారినపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆకలి బాధల నుంచి ఆరోగ్య సేవల అందుబాటు వరకూ, ఆటల మైదానాల కరవు నుంచి కాలుష్యం వరకూ దేశం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలన్నింటికీ పరిష్కారాలు చూపించగలిగితేనే ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమం విజయవంతమవుతుంది!


- శైలేష్‌ నిమ్మగడ్డ
Posted on 15-09-2019