Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

జనగణన డిజిటలీకరణ

ఇండియాలో పదేళ్లకోమారు జరిగే జనగణన మహా క్రతువుకు పూర్వ రంగం సిద్ధమైంది. 2021నాటి ‘సెన్సెస్‌’ ముందస్తు కసరత్తులో భాగంగా 90శాతం గణకులు స్మార్ట్‌ఫోన్‌ సాంకేతికత వినియోగానికే మొగ్గుచూపారని, అలా సేకరించిన ఇళ్ల సంఖ్యా వివరాల్ని అధికారిక వెబ్‌ పోర్టల్‌కు అనుసంధానించే ప్రయోగం సఫలమైందని ఈ నెల తొలివారంలో భారతీయ రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం ప్రకటించింది. ఆ విధంగా మొట్టమొదటిసారి కాగితం కలంతో పనిలేకుండా డిజిటల్‌ డేటా రూపంలో జనగణన జరగనుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా- పౌరులందరికీ బహుళ ప్రయోజనకర గుర్తింపు కార్డుల మంజూరు యోచనను తాజాగా ప్రస్తావించారు. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంక్‌ ఖాతా, ఓటరు కార్డు- ఇలా అన్ని సేవలకూ వర్తించేలా ఒకే కార్డును ఎందుకు రూపొందించుకోలేమని ప్రశ్నిస్తూ ఆయా సమాచారాన్నంతా ఒకే కార్డులో క్రోడీకరించగలిగే వ్యవస్థను ప్రతిపాదిస్తున్నారు. దేశ ప్రజల వాస్తవిక సంఖ్యా వివరాలతోపాటు సేకరించే విస్తృత సమాచార నిధి- అభివృద్ధి సంక్షేమ పథకాలతోపాటు భవిష్యత్‌ ప్రణాళికలకూ కీలక పునాదిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 2011నాటి జనాభా లెక్కల ఆధారంగానే మోదీ ప్రభుత్వం 22 సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టిందన్న అమిత్‌ షా- 16 భాషల్లో రూ.12వేల కోట్ల వ్యయంతో నయా జనగణన సాగనుందంటున్నారు. వాతావరణ స్థితిగతుల రీత్యా వచ్చే ఏడాది అక్టోబరునుంచి జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలోనూ, 2021 మార్చి ఒకటినుంచి తక్కిన రాష్ట్రాల్లోనూ జరిగే జనగణన- మున్సిపల్‌ వార్డులు, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకూ కీలక ప్రాతిపదిక కానుంది. జనగణనతోపాటే దేశవాసుల వివరాలతో జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) వివరాల సేకరణా సాగుతుందని అమిత్‌ షా ప్రకటన చాటుతోంది. భారతీయులందరికీ బహుళ ప్రయోజనకర ఫొటో గుర్తింపు కార్డులు అందించాలంటూ దేశ ఉప ప్రధానిగా ఎల్‌కే అడ్వాణీ నోట 2003లో వెలువడిన ప్రతిపాదన మళ్ళీ నేడు అమిత్‌ షా ముఖతా ప్రస్తావనకు రావడం విశేషం

ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో 2.4శాతం మాత్రమే ఉన్న ఇండియా మానవాళిలో 17.5శాతాన్ని భరిస్తోంది. పరిమిత వనరుల్ని గరిష్ఠ ప్రయోజనదాయకంగా మలచుకోలేకపోవడానికి వ్యక్తుల వాస్తవిక సామాజిక స్థితిగతుల వివరాల లేమితోపాటు అన్ని స్థాయుల్లోనూ అంతెత్తున మేటవేసిన అవినీతీ ప్రధాన కారణమవుతోంది. దానికితోడు సరిహద్దు రాష్ట్రాల్లో ముమ్మరించిన అక్రమ వలసలతో స్థానిక జీవన ముఖ చిత్రం గణనీయంగా మారిపోవడం, అంతర్గత భద్రతకూ పెనుసవాళ్లు ఎదురుకావడం ఎన్నో ఏళ్లుగా దేశాన్ని అవస్థలపాలు చేస్తున్నాయి. రెండు దశాబ్దాలనాటి కార్గిల్‌ సమీక్షా సంఘం సిఫార్సులతోపాటు జాతీయ భద్రతా వ్యవస్థను సంపూర్ణంగా అధ్యయనం చేసేందుకు వాజ్‌పేయీ ప్రభుత్వం 2000 ఏప్రిల్‌లో మంత్రివర్గ బృందాన్ని కొలువు తీర్చింది. 2001లో అది సమర్పించిన నివేదిక- సరిహద్దు జిల్లాలతో ప్రారంభించి బహుళార్థ జాతీయ గుర్తింపు కార్డుల్ని పౌరులందరికీ జారీ చేయాలని సూచించింది. 2003లో పౌరసత్వ చట్టాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం- తప్పనిసరిగా ప్రతి పౌరుడి వివరాల్నీ నమోదు చేసి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని సంకల్పించింది. ఆ మరుసటి సంవత్సరమే అధికారం యూపీఏకు దఖలు పడటంతో, బహుళార్థ సాధన జాతీయ గుర్తింపు కార్డు పథకం అటకెక్కి, రాయితీల దుర్వినియోగాన్ని అరికట్టడానికంటూ ఆధార్‌ కార్డుకు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఆవాహన పలికింది. ఆధార్‌ రాజ్యాంగబద్ధతను నిరుడీ రోజుల్లో నిర్ధారించిన ‘సుప్రీం’ ధర్మాసనం- బ్యాంకు ఖాతాలకు, ఫోన్‌ కనెక్షన్‌ పొందడానికీ పరీక్షలు, పాఠశాల ప్రవేశాలకు దాని అవసరం లేదని తీర్మానించింది. ఈ నేపథ్యంలో జాతీయ పౌరపట్టిక కూర్పుతోపాటు బహుళార్థ సాధక కార్డు జారీని అమిత్‌ షా ప్రతిపాదిస్తున్నా, అసోమ్‌ ఎన్‌ఆర్‌సీ వివాదాల నడుమ తాజా యత్నంలో ఏ విధంగా ముందడుగులు పడతాయో చూడాలి!

భారత పౌరులందరి వివరాలతో జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), నిర్ణీత కాలావధిలో జాతీయ గుర్తింపు కార్డులను సిద్ధంచేయనున్నట్లు ఎన్‌డీఏ తొలి జమానాలో హోంమంత్రిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించడం తెలిసిందే. సమగ్ర సమాచార నిధి తయారీకోసం ఎన్‌పీఆర్‌, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పరస్పరం సహకరించుకొంటాయన్నదీ 2014 జులైలో లోక్‌సభాముఖంగా ఆయన చెప్పిన మాటే! పౌరుల గుర్తింపు క్రమ పద్ధతిలో చట్టబద్ధంగా సాగాలని రెండో పరిపాలన సంస్కరణల సంఘం సైతం 2009లో సూచించింది. పుట్టిన వెంటనే ప్రతి శిశువుకూ వ్యక్తిగత కార్డు అందించాలని, పద్దెనిమిదేళ్లు వచ్చాక ఆ కార్డే ఓటరు గుర్తింపు పత్రంగా ఉపకరించాలని సిఫార్సు చేసింది. కీలక వ్యక్తిగత వివరాల్ని కార్డులో పొందుపరచే వీలుతోపాటు, ఏ దశలోనూ వాటిని ఎవరూ వక్రీకరించే అవకాశం లేకుండా చూడాలన్న పరిపాలన సంస్కరణల సంఘం- జనన మరణాల్ని నూరుశాతం కచ్చితత్వంతో నమోదు చేసేలా స్థానిక సంస్థల్ని అవసరమైన సాధన సంపత్తితో పరిపుష్టీకరించాలనీ కోరింది. జనన మరణాల పట్టికను ఓటర్ల జాబితాకు అనుసంధానించడం ద్వారా- ఓటరు చిట్టాలు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులతో సదా సిద్ధంగా ఉండేలా చూసుకోలేమా?- అని అమిత్‌ షా నేడు ప్రశ్నిస్తున్నారు. 2021నాటి జనగణన డిజిటలీకరణతో అలాంటి ప్రయోజనాలెన్నో నెరవేరతాయనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా వేటికవిగా అశాస్త్రీయంగా జరుగుతూ వస్తున్న జనగణన, ఓటర్ల జాబితాల కూర్పు- నిజాయతీ నిబద్ధతలతో, గణకుల్ని పూర్తిగా జవాబుదారీ చేసే విధి విధానాలతో సక్రమంగా సాగినప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న జాతీయ లక్ష్యాలు నెరవేరేది!


Posted on 24-09-2019