Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అడుగులు ఆక్రమిత కశ్మీరం వైపేనా!

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అధికరణ-370 రద్దు నేపథ్యంలోనే - పాకిస్థాన్‌ నియంత్రణలోని కశ్మీరీ భూభాగం భారత్‌ అధీనంలోకి రావాల్సి ఉందని, అందుకోసం ప్రయత్నాలు సాగుతాయని విదేశాంగ మంత్రి జయశంకర్‌ స్పష్టంగా ప్రకటించారు. కేంద్ర సీనియర్‌ మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌లూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు మంత్రులు, అధికార పార్టీ నాయకులు కూడా ఇదే తరహాలో ప్రకటనలు చేస్తున్నారు. కశ్మీర్‌పై ప్రస్తుతం నెలకొన్న భావోద్వేగ వాతావరణంలో చేస్తున్నవే ఈ ప్రకటనలైతే వాటిని తీవ్రంగా పట్టించుకోవల్సిన అవసరం లేదు. కానీ, ప్రభుత్వం ఆక్రమిత కశ్మీర్‌ను చేజిక్కించుకోవడానికి నిజంగానే నిర్దిష్ట అడుగులు వేస్తే అది మహా సంచలనం అవుతుంది. ఆక్రమిత కశ్మీర్‌ గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో విలీనం కావడం మొదలుకొని.. గడచిన 70 ఏళ్లలో అక్కడి పరిస్థితులు, రాజకీయాలు, పౌరుల అభిప్రాయాలు, స్వయంప్రతిపత్తి ఆకాంక్షలు.. తదితర విషయాల గురించి ఎన్నో లోతైన విశ్లేషణలు వచ్చాయి. దేశవిదేశాలకు చెందిన సామాజిక శాస్త్రవేత్తలు సమగ్ర పరిశోధనలు చేశారు. ఆక్రమిత కశ్మీర్‌ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. చాలా తక్కువ మంది మాత్రమే దానిపై దృష్టి సారించారు. అక్కడి ప్రజలు, ఆర్థిక పరిస్థితుల గురించి తెలిసింది చాలా తక్కువ.

పాక్‌ నియంత్రణ ఎందుకు?
జమ్మూకశ్మీర్‌ సంస్థానం భారత్‌లో విలీనం కావడంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పాత్ర చాలా ఎక్కువ. కశ్మీర్‌ మహారాజా హరిసింగ్‌ విలీన పత్రంపై సంతకం చేసినా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అండదండలు లేకపోతే విలీనం కాగితాలకే పరిమితమయ్యేది. పాకిస్థాన్‌లోని పష్తూన్‌ గిరిజనులు ఆధునిక ఆయుధాలతో శ్రీనగర్‌ను చుట్టుముట్టే ప్రమాదం ముంచుకొచ్చిన చివరి ఘడియల్లోనే హరిసింగ్‌ విలీనానికి అంగీకరించారు. కశ్మీర్‌లోయలోని ముస్లిములను పాకిస్థాన్‌ వైపు చూడకుండా చేయడంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు షేక్‌అబ్దుల్లా సఫలీకృతం అయ్యారు. పాకిస్థాన్‌ నేత జిన్నా అన్నా, ఆయన నేతృత్వంలోని ముస్లింలీగ్‌ అన్నా అబ్దుల్లాకు సరిపడేది కాదు. ముస్లింలీగ్‌ నియంతృత్వానికి ప్రతిరూపమని, జిన్నా భిన్నాభిప్రాయాలు సహించరని, పాకిస్థాన్‌లో భూస్వామ్య వర్గాలదే చివరికి ఆధిపత్యం అవుతుందని అబ్దుల్లా నమ్మారు. అందుకే బహుళ పార్టీ ప్రజాస్వామ్యం, ప్రగతిశీల విధానాల పట్ల అభిమానం ఉన్న భారత్‌ వైపు అబ్దుల్లా మొగ్గారు. అయినా అబ్దుల్లాకు పరిమితులుండేవి. కశ్మీర్‌లోయ వరకే ఆయన ప్రభావం ప్రధానంగా ఉండేది. జమ్మూ ప్రాంతంలో ప్రభావం అంతంత మాత్రమే. అందుకే జమ్మూ ప్రాంతంలోని రాజకీయాలు, అక్కడి సంఘర్షణలు ఆ ప్రాంతాన్ని వేరే మార్గం పట్టించాయి. ప్రధానంగా జమ్మూలోని పశ్చిమ ప్రాంతం, సరిహద్దు జిల్లాల్లోని గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతం పాక్‌ నియంత్రణలోకి వెళ్ళడానికి ఆ ప్రత్యేకతలే కారణం.

జమ్మూకశ్మీర్‌ సంస్థానం మూడు భాగాలుగా ఉండేది. కశ్మీర్‌లోయ, జమ్మూ, సరిహద్దు జిల్లాలుగా విభజితమై ఉండేది. లద్దాఖ్‌, గిల్గిట్‌ ప్రాంతాలను సరిహద్దు జిల్లాలుగా పిలిచేవారు. మొత్తం సంస్థానం విస్తీర్ణం 2,18,780 చదరపు కిలోమీటర్లు. అందులో జమ్మూ ప్రాంతం విస్తీర్ణం 32,067 చ.కి.మీ. ఉంటే కశ్మీర్‌లోయ విస్తీర్ణం 22,165 చ.కి.మీ. మాత్రమే. సరిహద్దుజిల్లాల ప్రాంతం 1,64,604 చ.కి.మీ.లో ఉండేది. 1949 జనవరి ఒకటి నాటికి అంటే ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగే నాటికి భారత్‌ అజమాయిషీలోని జమ్మూకశ్మీర్‌ 1,38,992 చ.కి.మీ.కే పరిమితమైంది. దాదాపు 80,000 చ.కి.మీ. భూభాగం పాకిస్థాన్‌ ప్రాబల్యంలోకి వెళ్ళింది. జమ్మూ ప్రాంతం సైతం 1947కి ముందు హిందువుల ఆధిక్యత ఉన్న ప్రాంతం కాదు. 1941 జనాభా లెక్కల ప్రకారం మూడు ప్రాంతాల్లోనూ ముస్లింలదే ఆధిక్యత. మహారాజు జమ్మూ ప్రాంతానికి చెందిన వారవడంతో ఆర్థికవ్యవహారాలు, పరిపాలన యంత్రాంగం, సైన్యం, ఉన్నత ఉద్యోగాల్లో ఆధిపత్యం ఎక్కువగా ఆ ప్రాంతవాసులదే. కశ్మీర్‌లోయలోని ముస్లిములను సైన్యంలో చేర్చుకునే వారు కాదు. యుద్ధానికి అవసరమైన వీరోచిత లక్షణాలు లేవని లోయ ముస్లిములను పక్కన పెట్టారు. వందలవేల ఎకరాలున్న భూస్వాముల్లో డోగ్రా రాజపుత్రులే ఎక్కువ.

భారత్‌లో విలీనానికి హరిసింగ్‌ 1947 అక్టోబరు 26న అంగీకరించారు. అప్పటికి కొన్ని రోజుల ముందే చాలా ప్రాంతాన్ని తమ అదుపులోకి తెచ్చుకున్న తిరుగుబాటుదారులు అజాద్‌ కశ్మీర్‌ ఏర్పడిందంటూ ప్రకటించారు. జమ్మూ ప్రాంతంలో ఆగస్టు 15కి ముందు అక్కడక్కడా మొదలైన మతకలహాలు, ఊచకోతలు ఆ తర్వాత బీభత్సంగా మారాయి. సర్వం కోల్పోయి పశ్చిమ పంజాబ్‌ నుంచి భారత భూభాగాలకు తరలి వచ్చే శరణార్థులు జమ్మూ ప్రాంతం మీదుగా వచ్చేవారు. ఆ వచ్చిన వారు వర్ణించిన ఘోరకృత్యాలు విని హిందువులు... ప్రాబల్యం ఉన్న చోట ముస్లిములు పరస్పర దాడులకు పాల్పడేవారు. మహారాజా సైన్యం కూడా కొన్నిచోట్ల ఊచకోతలకు సహకరించింది. జమ్మూలోని హిందువులు-ముస్లిములు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ మతానికి సురక్షితం అనుకున్న ప్రాంతాలకు పరుగులు పెట్టారు. ముస్లిములు పెద్దయెత్తున పశ్చిమ పంజాబ్‌కు తరలి వెళ్లారు. పాకిస్థాన్‌ ప్రోద్బలంతో దాడులు మొదలుపెట్టిన పష్తూన్‌ తెగ ముస్లిములను భారత సైన్యం వెనక్కి తరిమికొట్టినా పాకిస్థాన్‌తో కలవాలనుకున్న ముస్లిముల ఆధిపత్యంలో ఉన్న ప్రాంతాలను కాల్పుల విరమణ వల్ల అలానే వదిలివేయాల్సి వచ్చింది. అది ఆనాటి కాంగ్రెస్‌ నాయకత్వం చేతకానితనానికి నిదర్శనమని, ముఖ్యంగా నెహ్రూదే ఆ పాపమని ఇటీవల కాలంలో విమర్శలు పెద్దయెత్తున వినిపిస్తున్నాయి. కానీ, ఆనాడు పాకిస్థాన్‌లో చేరాలనుకున్న ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను వ్యూహాత్మకంగా అంచనా వేసుకున్న తర్వాతే భారత్‌ ముందడుగు వేయలేదని క్రిస్టఫర్‌ స్నెడెన్‌ లాంటి చరిత్రకారుల అంచనా. మీర్పూర్‌, పూంచ్‌, ముజఫరాబాద్‌ జిల్లాల ముస్లిములు పాక్‌లో కలవాలని గట్టిగా కోరుకుంటున్నారని బ్రిటీష్‌ అధికారులు కూడా పేర్కొన్నారు. చివరికి అజాద్‌ కశ్మీర్‌లో కూడా ఈ మూడే ప్రధానంగా ఉన్నాయి. అజాద్‌ కశ్మీర్‌ ప్రభుత్వం పేరిట పాలన కూడా ఆ ప్రాంతానికే పరిమితం. గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతాన్ని పాక్‌ ప్రత్యక్షంగా పాలిస్తోంది. 1950ల నుంచి మీర్పూర్‌ ప్రాంతం నుంచి వేలల్లో ముస్లిములు బ్రిటన్‌కు వెళ్లారు. అక్కడ ఉద్యోగాలు, ఇతరత్రా ఉపాధి సంపాదించి, పెద్దయెత్తున పాకిస్థాన్‌కు విదేశీద్రవ్యాన్ని అందిస్తున్నారు. 1988 తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు భారీగా ఆర్థిక సహాయాన్ని అందించిన వారిలో ఈ మీర్పూరీ కశ్మీరీలదే ప్రధాన పాత్ర.

ప్రత్యేక రాజ్యాంగం కాగితాల్లోనే..
అజాద్‌ కశ్మీర్‌ అన్ని విధాలుగా పాక్‌ నియంత్రణలో ఉన్నా, రాజ్యాంగపరంగా అది ఆ దేశంలో భాగంకాదు. భారత్‌లో జమ్మూకశ్మీర్‌ విలీనాన్ని అంగీకరించని పాక్‌ ఆ సమస్యను అంతర్జాతీయంగా సజీవంగా ఉంచటానికే అట్లా అట్టిపెట్టింది. అందులో భాగంగానే అజాద్‌ కశ్మీర్‌ తాత్కాలిక రాజ్యాంగం రూపొందించింది.. కాగితాలపై ప్రత్యేక రాజ్యాంగం ఉన్నా కశ్మీర్‌ మండలి, కశ్మీర్‌ వ్యవహారాల శాఖ ద్వారా కీలక విషయాల్లో పాక్‌దే అంతిమ నిర్ణయం. బంగ్లాదేశ్‌ అనుభవంతో కొంత గుణపాఠం నేర్చుకోవడంవల్ల 1970 తరవాత కాస్త ఎక్కువగానే ఆక్రమిత కశ్మీర్‌కు ఆర్థిక సహాయం అందించడం మొదలుపెట్టింది. ఆక్రమిత కశ్మీర్‌లో స్వతంత్ర ప్రతిపత్తి రాగాన్ని వినిపించిన వారిపై ఉక్కుపాదం మోపారు. పాక్‌తో అజాద్‌ కశ్మీర్‌ సంబంధాన్ని ప్రశ్నించేవారికి ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేకుండా చేశారు. ఏ కోణం నుంచి చూసినా ఆక్రమిత కశ్మీర్‌ వెనుక చాలా సంక్లిష్ట చరిత్ర ఉంది. అందుకే పాకిస్థాన్‌తో విలీనాన్ని అన్ని రకాలుగా కోరుకుని అందుకోసం తిరుగుబాటుచేసిన ప్రాంతాన్ని 70 ఏళ్ల తర్వాత తిరిగి చేజిక్కించుకోవడం అంత తేలికకాదు. సిమ్లా ఒప్పందం ప్రకారం అన్ని సమస్యలను భారత్‌-పాక్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాల్సి ఉంది. పాకిస్థాన్‌లో చేరాలని బలంగా కోరుకున్న కశ్మీర్‌లోని ఒక భాగం ప్రజల్లో ఆనాడూ ఈనాడూ మార్పులేదు. అందుకే.. లౌకిక వాదం వైపు మొగ్గి, ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో తమ భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో భారత్‌లో విలీనానికి అంగీకరించిన కశ్మీర్‌లోయ ముస్లిముల హృదయాలను గెలుచుకోవడమే ఇప్పటి ప్రధాన కర్తవ్యం. అలా గెలుస్తామన్న భరోసాతోనే ప్రజాభిప్రాయసేకరణ (ప్లెబిసైట్‌)కు ఆనాడు భారత్‌ అంగీకరించింది. హృదయాలను గెలిస్తే పోయిన భూభాగాలు తిరిగి రాకుండా ఉంటాయా!

సంస్కృతుల సారూప్యత
జమ్మూలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ముస్లిములకు పశ్చిమ పంజాబ్‌ ప్రాంతంతో సాన్నిహిత్యం ఎక్కువ. వ్యాపార సంబంధాలు, రాకపోకలు అన్నీ పంజాబ్‌తోనే. సంస్కృతి, సంప్రదాయాల పరంగానూ పంజాబ్‌ ముస్లిములకు, జమ్మూ పశ్చిమ ప్రాంత ముస్లిములకు మధ్య సారూప్యతలు ఉండేవి. ఇక ఉపాధి కోసం పంజాబ్‌ మీద ఆధారపడేవారూ ఎక్కువే. చాలామంది పంజాబ్‌ వెళ్లి అక్కడి స్థానికులుగా నమోదు చేసుకుని బ్రిటీష్‌ సైన్యంలో చేరేవారు. అట్లా చేరి రెండో ప్రపంచ యుద్ధానంతరం ఉద్యోగాలు కోల్పోయిన సైనికుల నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు వల్లే అజాద్‌ కశ్మీర్‌ ఉనికిలోకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌ సంస్థానంలో పూంచ్‌ ప్రాంతం ఉపసంస్థానంగా ఉండేది. అక్కడి ప్రజలపై రెండు సంస్థానాలూ ఎడాపెడా పన్నులు వేశాయి. భరించలేని పన్నులు, ముస్లిముల పట్ల వివక్ష, బ్రిటీష్‌ సైన్యంలో పనిచేయడం వల్ల ఏర్పడిన రాజకీయ స్పృహ కలగలిసి మహారాజా పాలనపై తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని కలగజేశాయి. దేశ విభజన ఘడియలు దగ్గరపడుతున్న సమయంలో జమ్మూ పశ్చిమ ప్రాంత ముస్లిములు పాకిస్థాన్‌లో కలవడానికే మొగ్గుచూపారు. పంజాబ్‌తో పెనవేసుకున్న బహుముఖ సంబంధాలు దీనికి ప్రధాన కారణం. కశ్మీర్‌లోయలోని ముస్లిములది భిన్నమైన సంస్కతి. హిందువులతో దీర్ఘకాల సామరస్యంతో పాటు హిందు, బౌద్ధ సంప్రదాయాల ప్రభావం అంతర్లీనంగా వారిపై ఉండేది. కశ్మీర్‌ పండితులు కూడా లోయలోని ముస్లిములతో సన్నిహితంగా ఉండేవారు. కశ్మీర్‌లోయ ముస్లిములు భారత్‌ వైపు మొగ్గుచూపడానికి ఇవీ కారణాలేనని చరిత్రకారులు చెబుతారు.


- ఎన్‌. రాహుల్‌కుమార్‌
Posted on 25-09-2019