Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అసంబద్ధ విధానాలతో అగచాట్లు

* బకాయిల భారంతో డిస్కమ్‌లు కుదేలు

విద్యుత్‌ రంగం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ విద్యుత్‌ సౌకర్యం కల్పించి వెలుగుల భారతాన్ని సృష్టించామని కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. మరోవైపు అత్యధిక విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లు, విద్యుదుత్పత్తి కేంద్రా (జెన్‌కో)లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. వీటిని ఆర్థికంగా గట్టెక్కించడానికి 2015లో కేంద్రం అమలులోకి తెచ్చిన ‘ఉజ్జ్వల్‌ డిస్కమ్‌ హామీ యోజన (ఉదయ్‌)’ పథకం విఫలమైంది. డిస్కమ్‌లకున్న వేల కోట్ల రూపాయల నష్టాలను రాష్ట్రాల నెత్తిన రుద్దడంతో అవి ఆర్థికంగా కుదేలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకే విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కమ్‌లు చెల్లించాల్సిన బకాయిలు రూ.78 వేల కోట్లను మించాయి. వీటి నుంచి బయటపడేసేందుకు ‘ఉదయ్‌’ పథకాన్నే మరింత సంస్కరించి అమలు చేయాలని కేంద్రం తాజాగా యోచిస్తోంది. విద్యుత్‌ పంపిణీ రంగం ఇలా కునారిల్లుతుంటే అప్పుల ఊబిలో చిక్కుకున్న విద్యుత్కేంద్రాల వేలం ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వాటిలో ఉత్పత్తి ప్రారంభం కాలేదు.

విద్యుత్‌ రంగం కాంతులీనుతోందని, నికర విద్యుత్‌ ఎగుమతి దేశంగా ఎదిగిందని కేంద్రం చెబుతోంది. 2017 అక్టోబరు 11 నుంచి ఇప్పటికి 2.63 కోట్ల ఇళ్లకు కొత్తగా విద్యుత్‌ సదుపాయం కల్పించినట్లు కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా ప్రకటించింది. వీటితో దేశంలో విద్యుత్‌ సౌకర్యం లేని ఇల్లే లేదని ఢంకా బజాయిస్తోంది. ఇవన్నీ ప్రగతి కాంతుల నాణేనికి ఒకవైపు వినిపిస్తున్న ప్రచార నినాదాలు. నాణేనికి రెండోవైపు చూస్తే విద్యుత్‌ రంగాన్ని చీకటిలో ముంచుతున్న ఆర్థిక కష్టాలు కనపడతాయి. ‘ఉదయ్‌’ పథకం రాకముందు దేశంలో అన్ని డిస్కమ్‌లకు కలిపి రూ.2.69 లక్షల కోట్ల అప్పులున్నాయి. వీటిలో 75 శాతం రాష్ట్రాల ఖాతాలకు బదిలీ నిబంధనతో ఉదయ్‌ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఈ మేరకు రూ.2.32 లక్షల కోట్లు రాష్ట్రాల ఖాతాలకు బదిలీ అయ్యాయి. దీనివల్ల గత రెండేళ్లలో రూ.34 వేల కోట్ల వరకూ వడ్డీ భారం డిస్కమ్‌లకు తగ్గింది. ఇదంతా అక్షరసత్యమైతే డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడి ఇప్పుడు ఆర్థికంగా పుంజుకోవాలి. కానీ అందుకు విరుద్ధంగా మళ్లీ ఇప్పటికే రూ.25 వేల కోట్లకు పైగా నష్టాల్లో డిస్కమ్‌లున్నట్లు అంచనా.

ఆదాయ వ్యయాల మధ్య అంతరం
తెలుగు రాష్ట్రాల డిస్కమ్‌ల లోటు దాదాపు రూ.17 వేల కోట్లకు పైగా ఉంది. దేశంలో విద్యుత్‌ పంపిణీ, సరఫరాల నష్టాలు 21.97 శాతం. విద్యుత్కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ ప్రజల ఇళ్లకు చేరేలోగా మధ్యలోనే 21.97 శాతం ఎటు పోతోందనేది ఎవరికీ తెలియడం లేదు. జాతీయ స్థాయిలో ప్రతి యూనిట్‌ ఉత్పత్తి వ్యయానికి ఆదాయానికి మధ్య సగటున 38 పైసల లోటు ఉంది. వెనకబడిన రాష్ట్రమైన బిహార్‌లో ఈ లోటు 41పైసలుంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా ప్రచారం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో 67, తెలంగాణలో 42 పైసలుండటం గమనార్హం. వీటికి పక్కనే ఉన్న వెనకబడిన రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో కేవలం నాలుగు పైసలే లోటు ఉంది. విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయడంపై పెట్టినంత శ్రద్ధ ఆదాయం పెంపుపై చూపకపోవడం పెద్ద సమస్యగా మారింది. విద్యుత్‌ వ్యవస్థను మొత్తం మూడు ప్రధాన విభాగాలుగా చూడాలి. విద్యుదుత్పత్తి (జెన్‌కో) సంస్థలు మొదటి భాగం. ఉత్పత్తి చేసిన విద్యుత్తును కొనే డిస్కమ్‌లు రెండో భాగం. జెన్‌కో నుంచి డిస్కమ్‌లకు, వాటి నుంచి వినియోగదారులకు సరఫరా చేసే పంపిణీ వ్యవస్థ మూడో భాగం. 2014-19 మధ్యకాలంలో దేశంలో విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని లక్ష మెగావాట్లు పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రస్తుతం దేశంలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 3.50 లక్షల మెగావాట్లకు చేరింది. ఇందులో సగానికి సగం మాత్రమే రోజువారీ వినియోగంలో ఉండటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో దేశంలోని అన్ని థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల ఉత్పత్తి శాతం (పీఎల్‌ఎఫ్‌) 61 శాతమే. ప్రజలందరికీ నిరంతరం సరఫరా చేయడానికి అవసరమైనంత ఉత్పత్తి, విద్యుత్‌ అందుబాటులో ఉంది. కానీ డిస్కమ్‌లకున్న ఆర్థిక కష్టాలు, నష్టాల వల్ల అవి విద్యుత్‌ కొనడానికి డబ్బుల్లేక ప్రజలకు నిరంతరం సరఫరా చేయలేక కోతలు విధిస్తున్నాయని సాక్షాత్తు కేంద్ర విద్యుత్‌ మంత్రే ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు విద్యుత్‌ ఇవ్వాలంటే జెన్‌కోల నుంచి డిస్కమ్‌లు కొనాలి. ఇలా కొన్న విద్యుత్తుకు కచ్చితంగా 60 రోజుల్లోగా సొమ్ము చెల్లించాలి. కానీ పలు రాష్ట్రాలో 700 రోజుల వరకు చెల్లించడం లేదు. ఇప్పటికే కొన్న విద్యుత్తుకు జెన్‌కోలకు డిస్కమ్‌లు ఆగస్టు నెలలో రూ.11,373 కోట్లు చెల్లించాయి. వాస్తవంగా కట్టాల్సిన సొమ్ము రూ.78,020 కోట్లుగా తేలింది. దీనివల్ల జెన్‌కోలు ఆర్థిక ఇబ్బందుల్లో అల్లాడుతున్నాయి. వీటికి చెల్లించాలంటే ప్రజల నుంచి సక్రమంగా ఛార్జీలు సకాలంలో వసూలు చేయాలి. అది జరగాలంటే డిస్కమ్‌లు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. కానీ ప్రజల నుంచి కచ్చితంగా బిల్లులు వసూలు చేస్తే ఓట్లు పోతాయన్న భయంతో రాష్ట్రాలు డిస్కమ్‌లను స్వేచ్ఛగా పనిచేయడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగేళ్లుగా ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వాలు అంగీకరించలేదు. ఇదే కాలవ్యవధిలో కొనుగోలు వ్యయం తడిసిమోపెడైంది. సగటున యూనిట్‌ విద్యుత్‌ ఐదారు రూపాయలకు కొని పేదలకు రూ.1.45కే తెలుగు రాష్ట్రాల్లో ఇస్తున్నారు. వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్‌ రాయితీల భారమే ఏటా లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ సొమ్మును రాష్ట్రాలు సకాలంలో డిస్కమ్‌లకు చెల్లించడం లేదు. ఆదాయ, వ్యయాల మధ్య అంతరం విస్తరించడం వల్ల డిస్కమ్‌లు ఆర్థికంగా కోలుకోవడం లేదు. ముందుగా నగదు బ్యాంకులో డిపాజిట్‌ చేశాకే విద్యుత్‌ కొనాలనే నిబంధన కింద ‘లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌’ (ఎల్‌సీ)ని ఆగస్టు ఒకటి నుంచి కేంద్రం అమలులోకి తెచ్చింది.

డిస్కమ్‌ అనేది కంపెనీ చట్టం కింద నమోదై ఏర్పాటైన సంస్థ. ఎప్పటికప్పుడు లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ వాణిజ్య దృక్పథంతో సమర్థంగా పనిచేసినప్పుడే ఏ కంపెనీకైనా మనుగడ సాధ్యం. ఈ కంపెనీల పాలనపగ్గాలు పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నందువల్ల ప్రజలకు నిరంతర విద్యుత్‌ అందడం లేదు. ఈ దురవస్థను తప్పించడానికి నూతన జాతీయ విద్యుత్‌ టారిఫ్‌ విధానానికి కేంద్రం రూపకల్పన చేసింది. ఏ డిస్కమ్‌ అయినా ప్రజలకు సక్రమంగా సరఫరా చేయకుండా అనధికారికంగా కోతలు పెడితే సదరు డిస్కమ్‌కు జరిమానా వేయాలనేది ఈ విధానంలో ప్రధాన నిబంధన. రోజుకు ఒక మెగావాట్‌కు మించి అధికంగా విద్యుత్‌ వాడే పరిశ్రమలకు ఇష్టారీతిగా ఛార్జీలు పెంచుతున్నారు. ఈ భారం భరించలేక ‘ఓపెన్‌ యాక్సెస్‌’ విధానంలో ఎక్కడి నుంచి అయినా కొనే సౌలభ్యం పరిశ్రమలకుంది. కానీ ఇలా ఎక్కువమంది బయటికెళ్ళి కొనుక్కుంటే తాము నష్టపోతామని డిస్కమ్‌లు అదనపు సర్‌ఛార్జీలు వేస్తూ ఓపెన్‌ యాక్సెస్‌ విధానాన్ని దెబ్బతీస్తున్నాయి. కొత్త టారిఫ్‌ విధానంలో ఓపెన్‌ యాక్సెస్‌కు మరింత ప్రోత్సాహకాలిస్తామనడం సహేతుకం.

హేతుబద్ధంగా ధరల సవరణ
ఏళ్ల తరబడి అసమర్థ నిర్వహణ విధానాలతో డిస్కమ్‌లను దెబ్బతీసి దశాబ్దానికోమారు ఆ నష్టాలన్నీ ప్రజలపై మోపే ‘ఉదయ్‌’ లాంటి పథకాలు ఎన్ని వచ్చినా ఫలితం ఉండదు. దేశంలో అందుబాటులో ఉన్న 3.50 లక్షల మెగావాట్ల విద్యుత్‌లో కనీసం 80 శాతమైనా వాడుకునేలా విధానాలుండాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు సొమ్ము లేకనో, పాలకులకు ఇష్టం లేకనో విద్యుత్‌ కొనకుండా కోతలు విధించి ప్రజలను ఇబ్బంది పెట్టే విధానాలు ఇకనైనా ఆగిపోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే హేతుబద్ధంగా ధరల సవరణ జరగాలి. ఏళ్లకు ఏళ్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని గొప్పలు చెప్పుకొనే అసంబద్ధ విధానాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు బయటపడాలి. కనీసం లీటరు మంచినీరు కొనాలంటేనే రూ.15 దాకా ఖర్చుపెట్టాల్సిన రోజులివి. అలాంటిది భూగర్భం నుంచి బొగ్గుతవ్వి, మండించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే దానికి అయిన సగటు వ్యయాన్ని ఎప్పటికప్పుడు రాబట్టేలా నియంత్రణ వ్యవస్థలుండాలి. రాష్ట్ర పాలకుల ఇష్టాల కోసం డిస్కమ్‌లను దెబ్బతీసే విధానాలు కొనసాగినంత కాలం విద్యుత్‌ రంగంలో ఆర్థికంగా అంధకారం విస్తరించడమే తప్ప వెలుగులు విరజిమ్మవు!


- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 04-10-2019