Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అందరికీ ఆరోగ్యం అందేనా?

* పేద వర్గాలకు దూరంగా ఆస్పత్రి సేవలు

* ప్రభుత్వ చొరవతోనే ‘మహాభాగ్యం’

* విదేశీయులను ఆకట్టుకుంటున్న వైద్యరంగం

పౌరుల జీవన స్థితిగతులను మెరుగుపరచడంలో ఆరోగ్య పరిరక్షణది కీలక పాత్ర. దేశ ఆర్థికాభివృద్ధికీ అది దోహదపడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యంతోనే మానవ వనరుల సామర్థ్యం ఇనుమడిస్తుంది. సరైన ఆహారం, వైద్య సౌకర్యాలు, సేవలు అందుబాటులో ఉంటేనే ప్రజారోగ్యం పరిఢవిల్లుతుంది. ఆరోగ్య రక్షణ (హెల్త్‌కేర్‌), ఉద్యోగ కల్పనపరంగా దేశంలో వైద్యసేవల రంగం అతిపెద్దదిగా విస్తరిస్తోంది. ఆస్పత్రులు, వైద్య పరికరాలు, ఔషధ పరీక్షలు, పొరుగు సేవలు, టెలి మెడిసిన్‌, వైద్య పర్యాటకం, ఆరోగ్య బీమా మొదలైనవి ఈ రంగం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఇది నాణేనికి ఒకవైపు, మరోవైపు భారత్‌లో ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉన్నాయా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా వైద్యసేవలు విస్తరించడం లేదు. సౌకర్యాల లేమితో, చాలీచాలని నిధులతో ప్రభుత్వ ఆస్పత్రులు కొట్టుమిట్టాడుతున్నాయి. వైద్యులు, కిందిస్థాయి వైద్య సిబ్బంది సరిపడా లేకపోవడం ప్రజలపాలిట శాపంగా పరిణమించింది. మరోవైపు కార్పొరేట్‌ ఆస్పత్రులు పూర్తిగా వాణిజ్య దృక్పథంతో వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య రక్షణ, సేవలను అత్యధికంగా గ్రామీణ ప్రజలు ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వినియోగించుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు పట్టణాలు, నగరాలు లక్ష్యంగా ఖరీదైన సూపర్‌ స్పెషాలిటీ సేవలందిస్తున్నాయి. సామాన్యులు మాత్రం ఈ రెండు రంగాల్లోనూ సేవలను పొందలేక సతమతమవుతున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం తప్పనిసరై కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరి, అప్పుల పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు.

విస్తృత అవకాశాలు
ఆసియా, పాశ్చాత్య దేశాల్లో ఆరోగ్య రక్షణకు, చికిత్సకయ్యే ఖర్చుతో పోలిస్తే భారత్‌లో వ్యయం తక్కువగా ఉండటం, నిపుణులైన వైద్యులు, ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉండటంతో వైద్యం కోసం విదేశాలనుంచి భారత్‌కు వరస కడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణ (హెల్త్‌కేర్‌) విపణి 2022 కల్లా మూడు రెట్లు పెరిగి 9.34 లక్షల కోట్ల రూపాయల(133.44 బిలియన్‌ డాలర్ల)కు చేరవచ్చని అంచనా. 2020 నాటికి వైద్య పర్యాటకం విపణి 22-25 శాతం వృద్ధితో రూ.63.46 వేలకోట్లకు చేరవచ్చు. ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణపై చేసే వ్యయం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో పెరుగుదలకు దోహదపడుతుంది. ఈ వ్యయం 2014లో 1.2 శాతం ఉండగా, 2018 నాటికి 1.4 శాతానికి పెరిగింది. 2025 కల్లా 2.5 శాతానికి చేరవచ్చని అంచనా. 2000 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి వరకు ఆస్పత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఏ)లు సుమారు రూ.43 వేలకోట్ల వరకూ వచ్చాయి.

రాజ్యాంగం ప్రకారం ఆరోగ్యం ప్రాథమిక హక్కు. ప్రాథమిక స్థాయిలో పీహెచ్‌సీలు, పై స్థాయిలో జిల్లా ఆరోగ్య కేంద్రాలు, ఆపైన ప్రత్యేక వైద్య సదుపాయాల కల్పన, వైద్య కళాశాలలు ప్రాంతీయ/ కేంద్ర వైద్యసంస్థల ద్వారా వైద్యసేవలు ప్రజలకు అందజేస్తున్నారు. ప్రజారోగ్య కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో, కర్ణాటకలో ‘ఆరోగ్య భాగ్య’గా, తమిళనాడులో ‘ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా’గా... ఇలా వివిధ పేర్లతో నిర్వహిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్‌ ఒకటిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పేరుతో ప్రారంభించారు. దీనికి ప్రజాదరణ బాగా లభించింది. 2014లో ఈ పథకాన్ని ‘ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవ’గా మార్చారు. అయిదు లక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే పథకం వర్తించేలా రూపొందించడంతో అధికశాతం పేదలకు వైద్యం అందుబాటులోకి వచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో పీహెచ్‌సీల్లో ప్రమాణాలు ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉండటంతో గర్భస్థ శిశుమరణాల నిష్పత్తి తక్కువగా ఉంది. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లలో గర్భస్థ శిశు మరణాలు అధికంగా నమోదయ్యాయి. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్‌, స్వీడన్‌ దేశాల బడ్జెట్‌లో ఎక్కువ శాతం నిధులు ప్రాథమిక ఆరోగ్య రక్షణకు కేటాయిస్తారు. ఆరోగ్య భారత్‌ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి రూ.62,659.12 కోట్లు కేటాయించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే నిదులు 18.67 శాతం పెరిగాయి. వైద్య రంగంలో సంరక్షణ కార్యక్రమాలకు మొత్తంగా రూ.200 కోట్ల కేటాయింపులు తగ్గాయి.

కేంద్రం 2018 ఏప్రిల్‌ 14న ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు గరిష్ఠంగా అయిదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యబీమా కల్పించారు. ‘మోదీ కేర్‌’గా ప్రసిద్ధి చెందిన ఆయుష్మాన్‌ భారత్‌ కింద 2022 నాటికి 1,50,000 గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఉపకేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. 2018 సెప్టెంబరులో 40 శాతం నిరుపేద, ప్రజలకోసం ‘ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం’ ప్రారంభించారు. దీనికింద కుటుంబానికి ఏడాదికి అయిదు లక్షల రూపాయల వరకు నగదురహితంగా వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తారు. దాదాపు 10.74 కోట్లమందికి ఇది వర్తిస్తుంది. ‘ఇంద్రధనుష్‌’ కార్యక్రమం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంత చిన్నపిల్లలకు టీకాలు, ‘ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌’ ద్వారా మూడు కోట్ల మంది గర్భిణీ స్త్రీలకు చికిత్స అందిస్తున్నారు. కాయకల్ప పథకం ద్వారా ఆస్పత్రులు స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంటాయి.

భారత్‌లో వైద్య విజ్ఞానం పెరగడంవల్ల మరణాల సంఖ్య తగ్గి ఆయుఃప్రమాణ స్థాయి పెరిగింది. ఇది శుభ పరిణామం. 1990లో 57.91గా ఉన్న సగటు ఆయుర్దాయం 2016 నాటికి 68.65 ఏళ్లకు పెరిగింది. 1992-93లో 3.4 శాతంగా ఉన్న సంతానోత్పత్తిరేటు 2015-16 నాటికి 2.2 శాతానికి తగ్గింది. 2016లో ప్రతి వెయ్యిమంది శిశువుల్లో మరణాలరేటు 34 ఉండగా, అది 2017 నాటికి 33కు తగ్గింది. ఆరోగ్య సూచీలలో గణనీయమైన ప్రగతిని సాధించింది. పోలియో, ఎయిడ్స్‌ తదితర వ్యాధులను నిర్మూలించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌, పరిశుభ్ర ఆరోగ్య భారతం వైపు అడుగులు వేస్తోంది. 24 రాష్ట్రాలు, 95 శాతం నగరాలు ‘బహిరంగ మలవిసర్జన రహితం’ కావడంతో అతిసారం, మలేరియా వంటి వ్యాధుల బారిన పడి మృతి చెందుతున్న అయిదేళ్లలోపు పిల్లలు, నవజాత శిశువుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

బహుళ వైద్య విధానాలతో చికిత్స
భారతదేశంలో వివిధ వైద్య విధానాలు విస్తరించాయి. అల్లోపతితో పాటు, ఆయుర్వేదం, హోమియో, ఉత్తర్‌ ప్రదేశ్‌లో యునాని, తమిళనాడులో సిద్ధ, కేరళలో మూలికావైద్య విధానాలు ఇక్కడి ప్రత్యేకత. జాతీయ నమూనా సర్వే కార్యాలయ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సర్వే ప్రకారం దేశంలో అన్ని వైద్య విధానాల్లోనూ‘ఆయుష్‌’ పథకం కింద వైద్య సేవలు విస్తరిస్తున్నాయి. ముంబయి, హైదరాబాద్‌, దిల్లీ వంటి నగరాలు ఆరోగ్య ‘హబ్‌’లుగా మారుతున్నాయి. నీతి ఆయోగ్‌ భారత్‌ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ‘ఇండెక్స్‌ బేస్‌ లైన్‌’ నివేదికల ప్రకారం ఆరోగ్యం విషయంలో కేరళ 92, తమిళనాడు 77, తెలంగాణ 73, పంజాబ్‌ 71, కర్ణాటక 69, ఆంధ్రప్రదేశ్‌ 68, ఉత్తరప్రదేశ్‌ 25, చండీగఢ్‌ 23 చొప్పున స్కోర్లు సాధించాయి. దేశం సగటు స్కోరు 52. ఇందులో 65 అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే ‘ఫ్రంట్‌ రన్నర్‌’గా, 50-64 మధ్య ఉంటే ఆశావాదులు(ఆస్పిరెంట్స్‌)గా పరిగణిస్తారు. దీని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలూ ‘ఫ్రంట్‌ రన్నర్‌’ విభాగంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, ఇప్పటివరకు నమోదు చేసిన 1,044 వ్యాధులను 29 రకాలుగా వర్గీకరించి వైద్య సహాయం అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 13 జిల్లాల్లో 129.44 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. తెలంగాణలో ‘కంటి వెలుగు’ కనీవిని ఎరుగని రీతిలో ఎందరికో కంటిచూపు కల్పించడమే కాకుండా 35,25,714 కళ్లద్దాలు ఇచ్చారు.

బీమాపై అవగాహన ఏదీ?
భారత్‌లో 9.36 లక్షల మంది అల్లోపతి వైద్యులు ఉన్నారు. అంటే 1,668 మంది జనాభాకు ఒక వైద్యుడు చొప్పున ఉన్నారు. ప్రభుత్వ వైద్యరంగం సమర్థంగా లేకపోవడంతో, సగటు పౌరుడు తన ఆదాయం నుంచి నేరుగా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు చెల్లిస్తున్న సొమ్ము మిగతా దేశాలకంటే ఎక్కువగా ఉంది. మూడో పార్టీ (ప్రభుత్వం లేదా బీమా సంస్థ) లేదా ఆరోగ్య పరిరక్షణదారు ప్రమేయం లేకుండా నేరుగా ఆస్పత్రికి చేస్తున్న (ఔట్‌ ఆఫ్‌ ప్యాకెట్‌) వ్యయం అమెరికాలో 13.4 శాతం, యూకేలో 10 శాతం, చైనాలో 13.4 శాతం. భారత్‌లో అది 62 శాతం కావడం గమనార్హం. దీన్నిబట్టి ఆరోగ్య భద్రత విషయంలో భారత్‌ ఎంత వెనకబడి ఉందో అవగతమవుతుంది. ఇక్కడ 76 శాతం ప్రజలకు ఆరోగ్య బీమాపై ఇంకా అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొన్ని రాష్ట్రాల్లో ‘నగదు రహిత ఆస్పత్రులు’ పేద ప్రజలకు బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఆరోగ్య కార్డులు వీటికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కంప్యూటర్‌, మొబైల్‌ అనుసంధానంతో ఈ-హెల్త్‌, ఎం-హెల్త్‌ విధానాలు వాడుకలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య బీమా ఊరట కలిగించే పరిష్కారం. కేవలం అవగాహన లేకపోవడంవల్ల లక్షలాది ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భవ వంటి పథకాల సేవలను మరింతగా విస్తరించాలి. పౌరులకు జనరిక్‌ మందులపై అవగాహన కల్పిస్తే ఆర్థికంగా కొంత సాంత్వన లభిస్తుంది. ప్రభుత్వాల ద్వారా అన్ని వర్గాలకూ వైద్యసేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చినప్పుడే ‘అందరికీ ఆరోగ్యం’ అనే మాట నిజమవుతుంది.


- ఆచార్య కొండపల్లి పరమేశ్వరరావు
(రచయిత- ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు)
Posted on 05-10-2019