Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

చిక్కుముళ్లు తొలగుతాయా?

* ఒకే దేశం... ఒకే కార్డు సాధ్యాసాధ్యాలు

ఆధార్‌, పాన్‌, ఓటర్‌, పాస్‌పోర్ట్‌, బ్యాంకు ఖాతా... ఇన్ని గుర్తింపు కార్డులు ఉండాలా? వీటన్నింటికి బదులు ఒక్కటి ఉంటే సరిపోదా అని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లేవనెత్తిన ప్రశ్న దేశం దృష్టిని ఆకర్షించింది. జనాభా లెక్కల సమాచారాన్ని సేకరించే రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయ భవనం శంకుస్థాపన సందర్భంగా హోంమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. ఇప్పుడు చర్చకు వచ్చిన అత్యాధునిక బహుళ ప్రయోజక కార్డు కేవలం ప్రామాణిక ఆర్థిక సమాచారం అందించడం మాత్రమే కాదు, అది బ్యాంకు ఖాతా, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నవీకరణ, వివిధ గుర్తింపులకు సంబంధించిన సమాచారాన్ని ఏకీకృతం చేస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు సంక్లిష్ట ప్రక్రియే. వివిధ కారణాల వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందన్న వాదనలు వినపడుతున్నాయి. బహళ ప్రయోజక గుర్తింపు కార్డుకు సంబంధించిన కీలకమైన అంశాలు విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. ఇది ప్రధాని నరేంద్రమోదీ 2019 మార్చిలో ప్రారంభించిన జాతీయ కామన్‌ మొబిలిటీ కార్డు (ఎన్‌సీఎంసీ) తరహాలో ఉండనున్నట్లు సమాచారం. ఎన్‌సీఎంసీతో వినియోగదారులు దేశవ్యాప్తంగా భిన్నరకాల రవాణా వ్యవస్థల్లో చెల్లింపులు చేయవచ్చు. హోంమంత్రి అమిత్‌ షా చెబుతున్న కార్డు పూర్తిగా కొత్తది కాకుండా, ఇప్పటికే అమలులో ఉన్న కార్యక్రమానికి పొడిగింపుగా పేర్కొనవచ్చు.

ఇప్పటికే పలు గుర్తింపు కార్డులు ఉండగా, మరో గుర్తింపు కార్డు జారీ చేయాలనే ఆలోచనపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 90 శాతానికిపైగా ప్రజలకు ఇప్పటికే ఆధార్‌ కార్డు ఉండగా, మళ్లీ మరొక గుర్తింపు కార్డుతో అవసరం ఉందా అనే ప్రశ్నా తలెత్తుతోంది. 2009 నుంచి ఆధార్‌ ప్రక్రియపై చేసిన వ్యయం పదకొండు వేల కోట్ల రూపాయలకు మించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు చేసిన వ్యయాల్ని ఇందులో కలపలేదు. ఆధార్‌ ద్వారా దొంగ లబ్ధిదారుల ఏరివేత వల్ల ఇప్పటిదాకా ప్రభుత్వానికి తొంభై వేల కోట్ల రూపాయలు మిగిలాయని భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది. స్వతంత్ర పరిశీలన జరగనందువల్ల ఇలాంటి ప్రకటనల్ని ఏకపక్షంగా అంగీకరించలేం, అలాగని కొట్టిపారేయనూలేం. 2018లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఆధార్‌ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు సంబంధించి న్యాయస్థానం కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆధార్‌లోనే కాకుండా భవిష్యత్తులో ఇతరత్రా బహుళ ప్రయోజక గుర్తింపు కార్డుల విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో పాటించాల్సి ఉంది.

పెరుగుతున్న పత్రాలు
వివిధ సందర్భాల్లో పలురకాల గుర్తింపు కార్డులు అవసరమవుతుండటమే ప్రధాన సమస్య. ప్రస్తుతం ఒక కుటుంబం సుమారు అయిదు రకాల గుర్తింపు కార్డులను కలిగి ఉంటోంది. వీటికి తోడు నిర్దిష్ట అవసరాల కోసం ఇతరత్రా పత్రాలూ అవసరమవుతున్నాయి. వృత్తి కార్డు, ఆరోగ్య బీమా, ప్రయాణ పాసులు, పాస్‌పోర్ట్‌ వంటి పలు రకాల కార్డులనూ వాడాల్సి వస్తోంది. వ్యక్తిగత అవసరాలను బట్టి వీటి సంఖ్య పెరిగిపోతోంది. బహుళ ప్రయోజక కార్డు ప్రాధాన్యం ప్రజల సామాజిక, ఆర్థికస్థాయుల్ని బట్టి మారిపోతుంటుంది. బాగా చదువుకున్నవారి విషయంలో గుర్తింపు అనేది సమస్య కాదు. ఎలక్ట్రానిక్‌ డేటా, డిజిటల్‌ లాకర్లు వంటి అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తరవాత చాలామందికి ఇది పెద్ద విషయమే కాదు. కానీ దిగువ, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందికరమే. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం ప్రజలు పెద్దయెత్తున వలస వెళ్తుండటం వల్ల స్థానికంగా ఆమోదనీయ గుర్తింపు పొందాల్సిన అవసరం ఏర్పడుతుంది. 2011 జనగణన ప్రకారం 45 కోట్ల భారతీయులు మెరుగైన అవకాశాల్ని వెదుక్కుంటూ వలస బాట పట్టారని అంచనా. అంతర్గత వలసదారులుగా భావించే ఇలాంటివారి సంఖ్య తదుపరి జనగణన పూర్తయ్యే సరికి 20 శాతందాకా పెరిగే అవకాశం ఉంది. బహుళ ప్రయోజక గుర్తింపు కార్డు వంటిది అందుబాటులో ఉంటే వలసదారులు ప్రాథమికంగా కొన్ని గుర్తింపు సమస్యల్ని అధిగమించడానికి వీలుంటుంది. ఈ తరహా సమస్యను ఆధార్‌ కొంతమేర పరిహరించింది. కొత్త కార్డు అమలులోకి వస్తే, అమెరికాలో సామాజిక భద్రత సంఖ్య తరహాలో పలురకాల గుర్తింపు అవసరాలకు ప్రత్యామ్నాయంగా ఇది నిలిచే అవకాశం ఉంది.

ప్రభుత్వం పలురకాల రాష్ట్ర డేటాబేస్‌లను ఒకేచోటకు చేర్చడం, సబ్సిడీలు, నగదు బదిలీలు వంటివాటిని ఇతర చోట్లకు మార్చుకునే అవకాశం కలిగించినప్పుడు ఈ తరహా కార్డుతో ఉపయోగం ఉంటుంది. దీనివల్ల లబ్ధిదారులు ఎక్కడున్నా తమ ప్రయోజనాల్ని పొందే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా పనుల కోసం వలసబాట పట్టిన వారికిది ఉపయుక్తం. ఇదేక్రమంలో దీన్ని నమోదు చేసుకున్న పోలింగ్‌ కేంద్రంలోనే ప్రత్యక్షంగా హాజరై ఓటేసే పద్ధతి కాకుండా, ఎక్కడి నుంచి అయినా ఓటు వేసే విధానానికీ జత చేయవచ్చు. అర్హులైన లబ్ధిదారులు రేషన్‌ను ఎక్కడి నుంచి అయినా పొందగలుగుతుండటం, బ్యాంకు, ఇతర ఖాతాల్ని ఎక్కడికైనా మార్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు- ఇదీ సాధ్యమే. ఇప్పటికిప్పుడు కాకున్నా, భవిష్యత్తులో సాధ్యమేనని చెప్పవచ్చు. బ్యాంకు ఖాతాల్ని విభిన్న బ్యాంకులకు, శాఖలకు మార్చగలిగే అవకాశం వచ్చే రెండు మూడేళ్లలో సాధ్యం కాకపోవచ్చు. పాస్‌పోర్టులకు సంబంధించి అంతర్జాతీయ ప్రభావం ఉండటం వల్ల ఆచరణలో సమస్యలున్నాయి. ఇతర దేశాల భాగస్వామ్యం, వాటి ఆమోదం వంటి సమస్యలు ఇందులో ఇమిడి ఉన్నాయి. పాస్‌పోర్ట్‌ పుస్తకాలు లేదా కార్డుల్లో ప్రామాణిక పద్ధతిని రూపొందించడానికి వివిధ దేశాలతో చర్చలు జరపాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ (ఐసీఏఓ) ఆమోదమూ ఉండాలి. ఇవన్నీ అమలులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

సమాచార పరిరక్షణే పెద్ద సవాలు
ఆధార్‌ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఎలాంటి చట్టబద్ధమైన అనుమతీ లేదు. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నవీకరణ, తదితర అంశాలపైనా ఎలాంటి చట్టపరమైన సమస్యలు లేవు. బహుళ ప్రయోజక కార్డు ప్రాజెక్టును చేపట్టే విషయంలో ప్రయోజనాలు, సౌకర్యం, ఉపయోగిత విలువ ఉన్నప్పటికీ, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో గోప్యత, భద్రతతోపాటు మూడు ముఖ్యమైన కీలకాంశాలున్నాయి. ఆధార్‌తో పోలిస్తే బహుళ ప్రయోజక కార్డుల్లో బ్యాంకు ఖాతాల వివరాలను సైతం చేర్చనుండటం వల్ల వీటిలో అత్యంత ముఖ్యమైన సమాచారం ఇమిడి ఉంటుంది. అందువల్ల వీటిలోని సమాచార పరిరక్షణ పెద్ద సవాలే. అన్నింటికన్నా పెనుసవాలు జాతీయ భద్రతకు సంబంధించినది. శత్రుదేశాలతోపాటు, అంతర్జాతీయ హ్యాకర్ల నెట్‌వర్క్‌ బారిన పడకుండా సమాచారాన్ని పరిరక్షించాల్సి ఉంటుంది. సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా చూడటం మరో కీలక సమస్య.

మౌలిక సదుపాయాలే కీలకం
మన దేశంలో సమాచార పరిరక్షణకు సంబంధించి ఎలాంటి చట్టాలు లేవు. ఇప్పటికే ఉన్న ఇతర చట్టాల అమలు సైతం పకడ్బందీగా లేదు. ఆధార్‌ సమాచారం లీకేజీకి సంబంధించిన ఎన్నో ఉదంతాలు మనకు అనుభవమే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆధార్‌కు సంబంధించి చట్టాల ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఉల్లంఘనలు, సమాచార చోరీకి పాల్పడినా ఏమీ కాదనే భావన బలపడుతోంది. ఇది వాంచనీయం కాదు. చట్టవిరుద్ధంగా వ్యక్తిగత సమాచారం అందుబాటులోకి రావడం వల్లే ప్రజలకు రోజూ వివిధ మార్కెటింగ్‌ సంస్థల నుంచి ఫోన్లు రావడం ఇటీవలి కాలంలో వెలుగు చూస్తున్న విషయం. బహుళ ప్రయోజక గుర్తింపు కార్డు దుర్వినియోగం విషయంలో అంతగా చదువుకోనివారు, డిజిటల్‌ ప్రపంచంతో పెద్దగా పరిచయం లేనివారి పరిస్థితి దయనీయంగా ఉంటుందన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన ముఖ్యమైన పని ముందుగా సమాచార పరిరక్షణ చట్టాన్ని ఆమోదించడం. ఇది వినియోగదారులను, వారి సమాచారాన్ని రక్షిస్తుంది. ఆర్థిక నేరాల గురించి క్షేత్రస్థాయిలో పోలీసులకు అవగాహన పెంచడమూ కేంద్ర ప్రభుత్వ బాధ్యతే. ఇలాంటి నేరాల కోసం ప్రత్యేక న్యాయస్థానాలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో జాప్యానికి ఎంతమాత్రం తావుండరాదు. ఆర్థిక నేరాల్లో- సమాచార ఉల్లంఘన కారణంగా తలెత్తిన నష్టాల్నీ చేర్చాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, వాటి విభాగాలు మరింత ప్రభావాన్వితంగా, సమన్వయంతో పని చేస్తేనే, బహుళ ప్రయోజక కార్డుల వల్ల హోం మంత్రి అమిత్‌ షా ఆశిస్తున్న ఫలితాలు సమకూరుతాయి. ఈ కార్డుల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలపైన ప్రభుత్వం పెద్దయెత్తున వ్యయం చేయాల్సి ఉంటుంది!


Posted on 06-10-2019