Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అభ్యర్థించడం రాజద్రోహమా?

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సద్విమర్శే ప్రాణవాయువు. భిన్నత్వంలో ఏకత్వమే విలక్షణ సంస్కృతిగా గల భారతావనిలో విభిన్న భావజాల సంఘర్షణే చైతన్యశీల జన స్వామ్యానికి, వ్యవస్థల పటిష్టతకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు. పౌర సమాజం క్రియాశీలతకు గొడుగు పడుతూ మొన్న జూన్‌లో 49 మంది లబ్ధ ప్రతిష్ఠులు ప్రధానమంత్రికి బహిరంగ లేఖ రాయడం తెలిసిందే! దాన్ని ఘోర నేరంగా, రాజద్రోహంగా పరిగణిస్తూ భారత శిక్షాస్మృతిలోని భిన్న సెక్షన్ల కింద వారి మీద కేసులు నమోదు కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దేశంలో పెరిగిపోతున్న మూకదాడుల్ని అసహనాన్ని నియంత్రించాలంటూ భారత ప్రధానమంత్రిని కోరడం- ఆ లేఖ పరమోద్దేశం. చరిత్రకారుడు రామచంద్ర గుహ, చలనచిత్ర ప్రముఖులు ఆదూర్‌ గోపాలకృష్ణన్‌, మణిరత్నం, శ్యామ్‌ బెనెగల్‌ తదితర పెద్దలు రాసిన ఆ లేఖ దురుద్దేశపూరితమంటూ, వారి పక్షపాత ధోరణిని ఖండిస్తూ 62 మంది దిగ్దంతులు మరో బహిరంగ లేఖను సంధించడం గమనార్హం. సాధారణ పరిస్థితుల్లో- జాతీయ నేర దర్యాప్తు బ్యూరో గణాంకాల్ని ఉదాహరిస్తూ ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ ప్రభృతులు రాసిన లేఖలో తాము పరిగణించదగ్గ అంశాలున్నాయనుకొంటే పాలన యంత్రాంగం దాన్ని పరిశీలిస్తే సరిపోయేది. పోనీ అది రాజకీయమనుకొంటే దాన్ని ఖండిస్తూ వెలువడిన ప్రతి లేఖ ఉండనే ఉంది! వాటికి భిన్నంగా- అసహనం కేసులు పెరుగుతున్నాయంటూ ప్రధానికి ఫిర్యాదు చేసి పత్రికలకు ఎక్కడం ద్వారా వారు దేశానికి చెడ్డపేరు తెచ్చారంటూ స్థానిక వకీలు ఒకరు చేసిన ఫిర్యాదుపై బిహారుకు చెందిన మేజిస్ట్రేట్‌ జాతి ద్రోహం సహా పలు కేసులు పెట్టి దర్యాప్తు చెయ్యాలని ఆదేశించడం విడ్డూరంగా ఉంది. ప్రధానికి లేఖ రాయడం రాజద్రోహం ఎలా అవుతుందన్న ప్రశ్న ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది.

‘రాజద్రోహం చట్టాలకంటే భారత రాజ్యాంగం పౌరులందరికీ హక్కుగా ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛకే ప్రాధాన్యం దక్కాలి’- సరిగ్గా నెలరోజుల నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ గుప్తా వ్యక్తీకరించిన అభిప్రాయమిది. రాజద్రోహానికి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన నిర్వచనానికి అనుగుణంగా ఎవరూ నేరం చేయకపోయినా ఆ చట్టాల్ని ఇటీవలి కాలంలో పోలీసులు బాగా దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల్ని నిర్బంధించడం, అవమానాలపాలు చెయ్యడం అధికమైందని న్యాయమూర్తే కుండ బద్దలు కొట్టారు. బ్రిటిషర్ల జమానాలో 150 ఏళ్ల క్రితం భారతీయుల స్వేచ్ఛను అణచివేయడమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన రాజద్రోహ చట్టానికి స్వతంత్ర దేశంలో చోటులేదని రాజ్యాంగ నిర్ణయ సభలో అనంత శయనం అయ్యంగార్‌ వంటి ఘనాపాటీలు తోసిపుచ్చారు. భారత శిక్ష్మాస్మృతిలో 124ఎ కింద కొనసాగుతున్న కరకు నిబంధనలు పౌరస్వేచ్ఛపై ఎత్తిన కత్తిగా మారడాన్ని గర్హించిన న్యాయపాలిక- కేదార్‌నాథ్‌ కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో విస్పష్టంగా రాజద్రోహ నేర పరిధిని నిర్ణయించింది. హింసకు పాల్పడటమో, హింసను ప్రేరేపించడమో జరిగినప్పుడే రాజద్రోహ చట్టం కింద కేసు పెట్టగల వీలుందని గిరిగీసిన న్యాయపాలిక- ప్రతి మేజిస్ట్రేట్‌ ఆ పరిధికి లోబడాలని 2016 సెప్టెంబరులోనే స్పష్టీకరించింది! జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ)ను వ్యతిరేకించినందుకు, పాకిస్థాన్‌ అందరూ అనుకొనేంత నరకం ఏమీ కాదన్నందుకు, ప్రధానికి బహిరంగలేఖ రాసినందుకూ రాజద్రోహ నేరాలు మోపుతున్న వైపరీత్యమే తీవ్రాందోళన కలిగిస్తోంది. ఆ చట్టాన్ని తెచ్చిన బ్రిటన్‌- అలాంటి పాశవిక శాసనాన్ని కొనసాగిస్తున్న దేశాల జాబితాలో తాను ఉండాలను కోవడం లేదంటూ కొన్నేళ్లక్రితమే దాన్ని రద్దు చేసేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ఆ చట్టం కొనసాగడం, అంతకు మించి అమితంగా దుర్వినియోగం కావడం ప్రజాస్వామ్య హితైషులకు హృదయశల్యమవుతోంది!

ఎంత త్వరగా వదిలించుకొంటే, అంత మంచిదని తొలి ప్రధాని నెహ్రూ పేర్కొన్న వివాదాస్పద చట్టాన్ని ఆరు దశాబ్దాల నాడు అలహాబాద్‌ హైకోర్టు- భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరంగా ఉందంటూ అడ్డంగా కొట్టేసింది. పిమ్మట మూడేళ్లకు హైకోర్టు ఆదేశాల్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు- ‘చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని హింసాత్మకంగా ఉసిగొల్పడం, శాంతిభద్రతల సమస్య సృష్టించే ఉద్దేశం లేనంతవరకు ప్రభుత్వాన్ని దాని చర్యలను పౌరులు ఎలాగైనా విమర్శించవచ్చు’నని విపులంగా స్పందించింది. వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, రాజద్రోహ కుట్రలకు మధ్య అంత స్పష్టమైన లక్ష్మణరేఖను సుప్రీంకోర్టే గీసి 57ఏళ్లు అవుతున్నా, నిరపరాధినని రుజువు చేసుకోవడానికి ఎవరికి వారు న్యాయపాలికను ఆశ్రయించాల్సి రావడం వ్యవస్థాగత బలహీనతలకే అద్దం పడుతోంది! ప్రజాస్వామ్యంలో అందరూ ఒకే పాట పాడటం దేశభక్తికి కొలమానం కానేకాదంటూ న్యాయ సంఘం (లా కమిషన్‌) నిరుడు ఆగస్టులో ‘రాజద్రోహం’ అంశంమీదే సంప్రతింపుల పత్రాన్ని విడుదల చేసింది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను వేలెత్తి చూపుతూ, నిర్మాణాత్మకంగా విమర్శిస్తూ, చర్చల్లో పాల్గొంటూ, భావ ప్రకటనలో కొంత కటువుగా భాష వాడినా, అది కొందరికి నచ్చకపోయినా- దాన్ని రాజద్రోహంగా ముద్ర వేయడం సరికాదన్నది ప్రజాస్వామ్యయుత పంథా. సర్వోన్నత న్యాయపాలికా ఎలుగెత్తి చాటుతోంది అదే కదా? మూకదాడుల్ని వేరే నేరంగా పరిగణించి తగు శిక్షలు విధించే చట్టాన్ని చేయాలంటూ పార్లమెంటుకు సుప్రీంకోర్టు సూచించిన ఏడాది తరవాతా, ఆ దిశగా అడుగులు పడకపోవడం, దాడులు ఆగకపోవడంపై ప్రధాని జోక్యాన్ని అర్థించడం- ఏ తరహా రాజద్రోహం? సుప్రీం సూచనల్ని ఔదలదాల్చేలా యంత్రాంగాలకు బాధ్యత మప్పడం నేటి ప్రజాస్వామిక అవసరం!


Posted on 07-10-2019