Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

రాజ్యాంగ పీఠికపై రాద్ధాంతం

ఆత్యయిక స్థితి అమలులో ఉన్న కాలంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసిన ఒకే ఒక్క మంచి పని మన రాజ్యాంగ పీఠికలో 'లౌకికవాదం, సామ్యవాదం' అని రెండు పదాలను చేర్చడం. ఆమె తరవాత ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొరార్జీ దేశాయ్‌, రాజ్యాంగానికి ఇందిర చేసిన సవరణలన్నింటినీ తొలగించినా, పీఠికకు చేసిన ఈ ఒక్క సవరణను మాత్రం యథాతథంగా అట్టిపెట్టారు. అప్పట్లో జనతాపార్టీలో విలీనమైన జనసంఘ్‌ (భారతీయ జనతాపార్టీ పూర్వ రూపం) దీనికి అడ్డు చెప్పలేదు. రాజ్యాంగపీఠికలో ఈ రెండు పదాలను అట్టిపెట్టాలని గట్టిగా ఆకాంక్షించిన నాయకుల్లో అటల్‌బిహారీ వాజ్‌పేయీ, లాల్‌కృష్ణ అడ్వాణీ కూడా ఉన్నారు. కానీ, ఇటీవల కేంద్ర సమాచార, ప్రసారశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ పదాలు అదృశ్యమయ్యాయి. దానిమీద వివాదం రేగడంతో, ఇది పొరపాటున జరిగిందని సదరు మంత్రిత్వశాఖ వివరించింది. సమస్య అంతటితో ముగియవలసింది. కానీ, భారతీయ జనతాపార్టీ(భాజపా) అధ్యక్షుడు అమిత్‌ షా మాటలవల్ల వివాదం మళ్ళీ రేగింది. లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలు లేని మొట్టమొదటి పీఠికే ఖచ్చితమైనదని పాత్రికేయుల సమావేశంలో అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఈ రెండు పదాలను తొలి ప్రకటన నుంచి తొలగించిన ఉదంతాన్ని పురస్కరించుకుని, అసలు మన రాజ్యాంగ పీఠికలో వీటిని చేర్చవలసిన అవసరం ఉందా లేదా అనే అంశంపై చర్చ జరగాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయిలో చర్చించిన తరవాతనే ఆ రెండు పదాలను పీఠికలో చేర్చారన్న సంగతి ఆయనకు తెలియకపోవడం శోచనీయం. రాజ్యాంగ పవిత్రతను గ్రహించకుండా రవిశంకర్‌ప్రసాద్‌ అలా మాట్లాడటం గర్హనీయం.

రాజకీయ నీడలు

తాజా వివాదం నుంచి మనకు అర్థమయ్యే విషయమేమంటే- రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) రాజ్యాంగపీఠిక నుంచి లౌకికవాదం, సామ్యవాదం అనే పదాల తొలగింపును కోరుకుంటోందని! లౌకికవాదం అనే పదమంటేనే ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకులకు కంటగింపు. ఈ విషయంమీద దేశమంతటా దుమారం రేగడంతో భాజపా ప్రస్తుతానికి వ్యవహారాన్ని పక్కనపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై బహిరంగంగా పెదవి విప్పకపోయినా, ఇప్పట్లో లౌకిక, సామ్యవాదాలను విడనాడటానికి దేశం సిద్ధంగా లేదని ఆంతరంగికంగా పార్టీని హెచ్చరించి ఉంటారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. కూడా ప్రస్తుతానికి మిన్నకున్నా, అదను చూసుకుని దీన్ని మళ్ళీ అజెండాలోకి తీసుకువస్తుందనడంలో సందేహం లేదు.

సైద్ధాంతికంగా లౌకికవాదానికి కట్టుబడ్డామని చెప్పుకొనే కాంగ్రెస్‌కు ఈమధ్య బలం తగ్గిపోయింది. దీని ప్రతికూల ప్రభావం లౌకికవాదంపై ప్రసరించింది. అలాగని కాంగ్రెస్‌ తప్పులేదని కాదు. అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న యావతో కాంగ్రెస్‌ ఆదర్శాలను గాలికి వదిలేయడం, లౌకికవాదంపట్ల ఆ పార్టీ మాటలకు చేతలకు పొంతన లేకపోవడం, లౌకికవాదాన్ని బలహీనపరచాయి. సోనియా, రాహుల్‌ గాంధీలు లౌకికవాదానికి కట్టుబడినా, పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నాయకులు ఓట్లకోసం లౌకికత్వాన్ని నీరుగార్చడానికి వెనుదీయడంలేదు. వారిమీద చర్య తీసుకొంటే కాంగ్రెస్‌ నుంచి మూకుమ్మడిగా నిష్క్రమించి, పార్టీకి తీరని నష్టం కలిగిస్తారన్న భయమే సోనియా చేతులను కట్టివేస్తోంది.

ఎన్నికల్లో వరస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్‌, దీనికి కారణాల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతోంది. దీనికి సంబంధించిన తుది నివేదిక ఈ ఏడాది మార్చిలో సిద్ధమవుతుందని కాంగ్రెస్‌ నాయకుడు ఆనంద్‌శర్మ చెప్పారు. లౌకిక, సామ్యవాదాలనే మౌలిక సూత్రాలకు కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు దూరమైందో ఆనాడే పార్టీపట్ల కార్యకర్తలకు భ్రమలు తొలగిపోయాయి. మహాత్మాగాంధీ ఇప్పటికీ భారతీయులకు ఆరాధ్యుడేకానీ, మహాత్ముడి హంతకుడైన నాథూరాం గాడ్సే స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి ఈమధ్య కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రాజస్థాన్‌లోని అల్వార్‌ పట్టణంలో ఒక వంతెన కింది మార్గానికి గాడ్సే పేరు పెట్టాలనే ప్రయత్నమూ జరిగింది. మహాత్ముడు ఏ భావజాలాన్నయితే తీవ్రంగా వ్యతిరేకించారో సరిగ్గా ఆ భావాలకే గాడ్సే ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు గాడ్సేను నెత్తినపెట్టుకోవడమంటే, మహాత్ముడి లౌకికవాదాన్ని సవాలు చేయడమే అవుతుంది. ఇక సామ్యవాద భావన ఉన్నతమైనదే అయినా, దాన్ని యథాతథంగా ఆచరించడం కష్టమని భావించిన జవహర్లాల్‌ నెహ్రూ, సామ్యవాద పంథాలో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించారు. కాలక్రమంలో ఈ సిద్ధాంతం నీరుగారిపోయింది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు సారథ్యం వహిస్తాయనుకున్న ప్రభుత్వరంగ సంస్థల ప్రాధాన్యం రోజురోజుకూ తగ్గిపోతోంది. రాజకీయ పార్టీలకు పారిశ్రామికవేత్తలు ఎన్నికల విరాళాలు ఇస్తున్నందువల్ల, పలు పార్టీలు ప్రైవేటురంగాన్ని నెత్తినపెట్టుకొంటున్నాయి. ఎన్నికల్లో ధన ప్రాబల్యాన్ని తగ్గిస్తూ, సంస్కరణలు తీసుకురానంతవరకు రాజకీయ పార్టీలు, పారిశ్రామికవేత్తల మధ్య అక్రమ పొత్తు కొనసాగుతూనే ఉంటుంది.

సామరస్యమే అసలు బలం

సామ్యవాదం సమసమాజాన్ని స్వప్నిస్తుంది. దేశంలో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరిస్తే సంపద వృద్ధి అవుతుంది. రాజకీయవాదులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగి-అధికారి గణం మధ్య అపవిత్ర పొత్తు, ఈ సంపద సక్రమంగా పంపిణీ కాకుండా అడ్డుపడుతుంది. అడుగడుగునా అవినీతి దేశాన్ని ముందుకెళ్లకుండా నిరోధిస్తుంది. మతతత్వం దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు వంటిది. 'ఘర్‌ వాపసీ' (గతంలో మతం మారినవారు హిందూమతంలోకి తిరిగిరావడం) కార్యక్రమం, దేశమంతటా పెల్లుబికిన నిరసనలవల్ల ప్రస్తుతానికి ఆగింది. అయినా 'ఘర్‌ వాపసీ' కింద క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొంటూనే ఉన్నారు. ఏది ఏమైనా భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య తక్కువ కాబట్టి, వారి ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేవన్నది కొందరి ధీమా! దేశ జనాభాలో ముస్లిములు 15 శాతం ఉన్నా, వారికి ఉద్యోగాల్లో సముచిత వాటా లభించడం లేదు. అయితే, ముస్లిముల సంఖ్యాబలం వల్ల వారినెవరూ అలుసుగా తీసుకోలేకపోతున్నారు. తమ ఓట్ల శాతమే వారికి రక్షగా ఉపకరిస్తోంది. మతం పేరిట వారిని ఆకట్టుకోవడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలకు ముస్లిములు లోబడకుండా ఉంటే, దేశంలో లౌకికవాదం గట్టిగా వేళ్లూనుకొంటుంది.

భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి లౌకికత్వం ఇరుసుగా పనిచేసింది. నేడు అదే లౌకికవాదానికి మతతత్వం నుంచి ముప్పు పొంచి ఉంది. ముస్లింలీగ్‌ ప్రభ వెలిగిన రోజుల్లోనూ లౌకికత్వానికి గట్టిగా కట్టుబడిన మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌, 'సరిహద్దు గాంధీ' ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ వంటి మహా నాయకులు ఈ తరంలో ఎంతమందికి తెలుసు? ఈ నాయకులు భారతదేశం బహుళ సంస్కృతులకు, మతాలకు పుట్టినిల్లు అన్న వాస్తవాన్ని గ్రహించి, మెలగిన నిజమైన దార్శనికులు. ఆ స్ఫూర్తి ఈనాటి నాయకుల్లో ఎంతమందికి ఉంది?

(రచయిత - ఎస్‌.దీపాంకర్‌)
Posted on 13-02-2015