Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

కొత్త పొద్దు పొడిచేనా?

* నాగా శాంతి ఒప్పందం

నాగాలాండ్‌ శాంతి ఒప్పందంపై సాగుతున్న చర్చలు లక్ష్యాన్ని సాధిస్తాయా, దశాబ్దాలుగా సాగుతున్న హింసకు తెరపడుతుందా, ఈశాన్యంలో కొత్త పొద్దు పొడుస్తుందా? ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్నలివి. అక్టోబర్‌ 31 తుదిగడువుతో ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసే దిశగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. నాగా నేషనల్‌ పొలిటికల్‌ గ్రూప్స్‌ (ఎన్‌ఎన్‌పీజీ), నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలిం-ఐసాక్‌, ముయివా (ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐఎం)కు చెందిన, ముయివాతో విభేదించిన చీలిక వర్గం సీనియర్‌ నేతలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఎన్‌ఎన్‌పీజీ అనేది పలు నాగా బృందాలకు చెందిన వేదిక. ఇందులో మాజీ తిరుగుబాటుదారులతోపాటు ఎన్‌ఎస్‌సీఎన్‌తో వేరుపడిన వర్గాలూ ఉన్నాయి. ఈ వర్గాలన్నీ ప్రత్యేక రాజ్యాంగం, నాగా జాతీయ జెండా లేకపోయినా ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చి, దానిపై సంతకం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముయివాతోపాటు ఆ వర్గీయులు మాత్రం ఇందుకు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఒప్పందం కోసం ఎన్‌ఎన్‌పీజీలు ముందుకు వచ్చిన పరిణామాన్ని, ఎంతోకాలంగా రగులుతున్న సమస్యతో విసిగిపోయి, దీనికి అంతం పలకాలని కోరుతున్న చాలామంది నాగాల అభిప్రాయంగా చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, శక్తిమంతమైన భారత సైన్యంతో సాయుధ పోరాటమనేది ఆచరణ సాధ్యం కానిదన్న సంగతి అర్థం చేసుకున్న మీదటే ఇలాంటి నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. సహ హామీదారు, సంప్రతింపులు ప్రారంభించినవారి ప్రమేయం లేకుండానే ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగా తిరుగుబాటు ఉద్యమానికి ప్రధాన వ్యక్తిగా ఎవరిని చెప్పుకోవాలన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తోంది. ఇరువర్గాలు సంప్రతింపులకు ససేమిరా అంటూ కనబరచిన మొండి వైఖరి... ఒక దశలో గత 22 ఏళ్లుగా సాగించిన చర్చల్లో సాధించిన పురోగతిని బూడిదలో పోసే పరిస్థితిని సృష్టించింది. చర్చలకు నిర్దేశించిన అక్టోబర్‌ 31 తుదిగడువును పొడిగించే విషయంలో నెలకొన్న గందరగోళం చర్చల ప్రక్రియను దెబ్బతీసే ముప్పును కల్పించింది. మరోవైపు, తాజా ఒప్పందం నేపథ్యంలో చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎందుకంటే 1975 నాటి షిల్లాంగ్‌ ఒప్పందం నాగాల్లో సరికొత్త చీలిక వర్గానికి జన్మనిచ్చింది. అదే ఎన్‌ఎస్‌సీఎన్‌. నాటి ఒప్పందాన్ని వ్యతిరేకించిన ఆ వర్గం నాగా తిరుగుబాటు ఉద్యమంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందన్న సంగతి మరవలేనిది!

ఇదీ చరిత్ర...
నాగాలలో స్వాతంత్య్ర కాంక్ష సుమారు 1917 ప్రాంతంలో మొదలైంది. ఆ సమయంలో బ్రిటిష్‌ పాలకులు దృఢంగా ఉండే నాగా యువతను మొదటి ప్రపంచయుద్ధంలో భాగంగా ఫ్రాన్స్‌లో ఇళ్లు, బ్యారక్‌లు, కందకాలతోపాటు ఇతర నిర్మాణ కార్యకలాపాల కోసం తీసుకెళ్లారు. చాలా పరిమిత స్థాయి ప్రపంచజ్ఞానం, తమ పరిసరాలను వీడి బయటికి వెళ్లని నాగా యువతకు అప్పుడే తొలిసారిగా వెలుపలి ప్రపంచంతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతమున్న నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం వంటి ఇతర ప్రాంతాల్లో ఉండే నాగాలకు తమకూ చాలామేర ఒకే తరహా లక్షణాలు ఉన్న సంగతిని గుర్తించారు. ఏకరూపత, ఐక్యతకు సంబంధించిన కొత్త అంశాల్ని గుర్తించిన నేపథ్యంలో వీరంతా విదేశాల నుంచి తిరిగి వచ్చాక 1918లో నాగాక్లబ్‌ను ఏర్పాటు చేశారు. 1929లో నాగాక్లబ్‌ సైమన్‌ కమిషన్‌కు ఓ దరఖాస్తు పత్రాన్ని సమర్పించింది. బ్రిటిష్‌ పాలకులు భారత్‌ను వీడివెళ్లినప్పుడు స్వయంనిర్ణయాధికార హక్కును ప్రసాదించాలని అందులో కోరారు. సంపూర్ణ సార్వభౌమత్వం, స్వాతంత్య్రాలే ప్రధాన లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపేందుకు, కొత్త దిశను కల్పించే బాధ్యతల్ని తమ నేతలైన అంగామి నాగా, జా ఫిజోలకు అప్పగించారు. ఆ సమయంలో జపాన్‌ దళాలు వదిలి వెళ్లిన ఆయుధాలు తేలికగా అందుబాటులో రావడం, చైనా నుంచి క్రియాశీలక సాయం అందడంతో ఫిజో ఉద్యమం ఊపందుకుంది.

అందరి ఆమోదం అవసరం
ప్రస్తుతం ఎన్‌ఎస్‌సీఎన్‌(ఐఎం) స్వాతంత్య్ర డిమాండ్‌ విషయంలో కొంతమేర పట్టుసడలించి, భాగస్వామ్య సార్వభౌమత్వం దిశగా అడుగులేసింది. ఇందులో భారత్‌లోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, నాగాలాండ్‌కు మరిన్ని అధికారాలు, స్వయంప్రతిపత్తిని కల్పిస్తారు. ఈ పరిణామాలు చర్చల పురోగతిని డోలాయమానంలో పడేసినట్లు భావిస్తున్నారు. ఒప్పందం దిశగా అడుగులు పడుతుండటం, తుదిగడువు సమీపిస్తుండటం వంటి ప్రస్తుత పరిస్థితుల్లో వందల మంది ఎన్‌ఎస్‌సీఎన్‌(ఐఎం) సాయుధులు నాగాలాండ్‌లోని శిబిరాల నుంచి మెల్లగా పొరుగునే ఉన్న మియన్మార్‌లోని రహస్య స్థావరాల దిశగా వెళ్లిపోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీలైతే వారంతా చైనాకేసి సాగిపోయే అవకాశమూ ఉంది. చైనాకిది ప్రయోజనకరమైన పరిణామమేననేది సుస్పష్టం. శాంతిస్థాపన ప్రక్రియ డోలాయమానంలో పడితే, మరిన్ని ఘర్షణల ముప్పు పొంచిఉన్నట్లే. అపరిష్కృత నాగా సమస్య మరిన్ని తిరుగుబాట్లకు, వాటి అణచివేతలకు దారితీస్తుంది. ఈ పరిణామాలు ఎవరి ప్రయోజనాల్నీ నెరవేర్చవు. ఇటు ప్రభుత్వంగాని, అటు నాగాలకుగాని శ్రేయస్కరం కాదు.

ప్రస్తుతం నాగా తిరుగుబాటు పోరాటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎన్‌ఎస్‌సీఎన్‌(ఐఎం) భాగస్వామ్యం లేకుండా నాగాలతో కుదుర్చుకునే ఒప్పందం అర్థవంతం కాదనే చెప్పొచ్చు. దివంగత ఎస్‌.ఎస్‌.ఖప్లాంగ్‌ ఏర్పాటు చేసిన చీలిక సంస్థ ఎన్‌ఎస్‌సీఎన్‌(కె) ఇప్పటికే ప్రస్తుత సంప్రతింపులకు దూరంగా ఉండటమే కాకుండా, మియన్మార్‌లోని తమ శిక్షణ శిబిరాల నిర్వహణను కొనసాగిస్తూనే ఉంది. ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎం), ఎన్‌ఎస్‌సీఎన్‌(కె) చేతులు కలిపే అవకాశాలు దాదాపు లేకున్నా, ఒకవేళ అదే జరిగితే భద్రతపరంగా పరిస్థితి మరింత విషమించినట్లే. ఇప్పటికే ఈశాన్య భారతంలోని పలు తీవ్రవాద సంస్థలు... యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ వెస్టెర్న్‌ సౌత్‌ఈస్ట్‌ ఏసియా (యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూఎస్‌ఈఏ) పేరిట 2015లో ఏర్పాటైన ఐక్య వేదిక కింద పని చేస్తున్నాయి. దీని పరిధిలో వేలమంది సాయుధులు ఉన్నారు. ఇది 60 వేల చదరపు కిలోమీటర్ల మేర, 50 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే భౌగోళిక ప్రాంతంలో కార్యకలాపాల్ని నిర్వర్తిస్తోంది. చట్టాల ఉనికి కనిపించని ఈ భూభాగం ఉత్తరాన అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి, దక్షిణాన మణిపూర్‌ వరకు 1300 కిలోమీటర్ల పొడవున విస్తరించింది. ఇలాంటి పరిస్థితుల్లో నాగా శాంతి ఒప్పందం సర్వసమగ్రంగా పట్టాలకెక్కినప్పుడే అది చరిత్రాత్మక పరిణామవుతుంది!


- సంజీవ్‌ బారువా
Posted on 31-10-2019