Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

వేర్పాటు కుట్రకు పాక్‌ ఆజ్యం

* కర్తార్‌పూర్‌ కారిడార్‌ వేదికగా పావులు

కర్తార్‌పూర్‌ సాహిబ్‌ క్షేత్రానికి సిక్కులకు ఆహ్వానం పలుకుతూ నవంబరు 6న పాకిస్థాన్‌ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక వీడియో గీతాన్ని విడుదల చేసింది. ఆ గీతంలో ప్రస్తావించిన అంశాలు, చూపించిన వ్యక్తులపై మనదేశంలో ఒక్కపెట్టున వివాదం రాజుకొంది. ఖలిస్థానీ వేర్పాటువాద నాయకులైన జర్నయిల్‌ సింగ్‌ భింద్రన్‌వాలె, షాబెగ్‌ సింగ్‌, అమ్రిక్‌ సింగ్‌ ఖల్సా ఆ వీడియోలో ప్రముఖంగా దర్శనమిచ్చారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో 1984లో జరిగిన ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’లో ఈ నాయకులంతా ప్రభుత్వ దళాల చేతిలో హతమయ్యారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం ఏరికోరి రూపొందించి, విడుదల చేసిన ఆ వీడియో గీతాన్ని తీవ్రంగా ఖండిస్తూ మొట్టమొదట ప్రకటన వెలువరించింది పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌. ‘పాకిస్థాన్‌కు రహస్య అజెండా ఉందని నేను మొదటినుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాను. ఏడు దశాబ్దాలుగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణం కోసం డిమాండ్లు ఉన్నాయి. ఏనాడూ వాటిపై సానుకూలంగా స్పందించని దేశం ఇప్పుడు ఉన్నట్లుండి ఆమోదం తెలపడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. మత ఉద్వేగాలను ఆసరాగా చేసుకొని కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణం ద్వారా సిక్కు సమాజాన్ని రెండుగా చీల్చేందుకు ఆ దేశం కుట్ర పన్నుతోంది’ అన్నారాయన. పాకిస్థాన్‌ దురుద్దేశాలను ఎండగడుతూ అమరిందర్‌ సింగ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. పాకిస్థాన్‌ సైన్యం, ఆ దేశపు నిఘా సంస్థ ఐఎస్‌ఐ కలిసి ఉమ్మడిగా కుట్రకు ప్రాణం పోశాయనీ ఆయన ఆరోపించారు.

సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూ, భారతీయ జవాన్లపై తుపాకీ గుళ్లు కురిపిస్తూ పాకిస్థాన్‌ తెంపరితనం ప్రదర్శిస్తోంది. ఉగ్రవాదుల కార్ఖానాగా మారి ఉన్మత్త మూకలను ఎల్లలు దాటించి ఎప్పుడెప్పుడు భారతావనిలో చిచ్చు రాజేద్దామా అని పక్క దేశం కాచుకొని కూర్చుంది. కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై చర్చకు పెట్టి, రచ్చ చేసి భారత్‌ను ముద్దాయిగా నిలబెట్టాలని పాక్‌ తహతహలాడుతోంది. సందు దొరికితే భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు వేచి చూస్తున్న ఇస్లామాబాద్‌ నాయకత్వం- భారత్‌తో ముడివడిన ఒక ప్రత్యేక అంశంపై ఉన్నట్లుండి ఎక్కడలేని సామరస్యం కనబరిస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పాక్‌ భూభాగంలో, రావి నది ఒడ్డున సిక్కుల పుణ్యక్షేత్రమైన కర్తార్‌పూర్‌ మందిరాన్ని యాత్రికులు అనాయాసంగా చేరుకొనేందుకు వీలుగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణానికి ఇమ్రాన్‌ సర్కారు ఆమోదం తెలపడం, యుద్ధ ప్రాతిపదికన అందుకోసం నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయడంతోపాటు నేడు దాని ప్రారంభానికి సంసిద్ధం కావడం వంటివన్నీ దేనికి సూచికలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అస్థిరత రగిల్చే దిశగా...
కేంద్ర నిఘా సంస్థలు సైతం పాకిస్థాన్‌ ఉద్దేశాలపట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు అక్కడి వేర్పాటువాదులతో రహస్యంగా చేతులు కలిపినట్లుగానే- పంజాబ్‌లో అస్థిరత రాజేసేందుకు ఖలిస్థాన్‌ గ్రూపులతో ఇస్లామాబాద్‌ నాయకత్వం సన్నిహితంగా మెలగుతోందన్న సమాచారం కేంద్ర నిఘా సంస్థల వద్ద ఇప్పటికే ఉంది. ఆ లక్ష్య సాధనకోసమే కశ్మీర్‌ ఖలిస్థాన్‌ ప్రజాభిప్రాయ కూటమి (కేకేఆర్‌ఎఫ్‌)ని పాకిస్థాన్‌ ఏర్పాటు చేసింది. భారత్‌నుంచి కశ్మీర్‌, పంజాబ్‌లను విడదీయడమే కేకేఆర్‌ఎఫ్‌ స్థాపిత లక్ష్యం. ఆ క్రమంలో ఈ రెండు ప్రాంతాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆ కూటమి నిరంతరం డిమాండ్‌ చేస్తూ, మన దేశంలోని కొందరు వేర్పాటువాదులను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణాన్ని అందివచ్చిన అవకాశంగా పాకిస్థాన్‌ ఉపయోగించుకుంటోందన్న అనుమానం బలపడుతోంది. ఖలిస్థాన్‌కు మద్దతుగా అమెరికాలో ‘న్యాయం కోసం సిక్కులు’ అనే పేరుతో ఏర్పడిన ఓ బృందం పనిచేస్తోంది. 2020లోగా ఖలిస్థాన్‌ ఏర్పాటుకోసం పంజాబ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, అందుకోసం కర్తార్‌పూర్‌ కారిడార్‌ను సావకాశంగా ఉపయోగించుకోవాలని ఈ బృందం లక్ష్యంగా నిర్దేశించుకొంది. పాకిస్థాన్‌ సైన్యం, ఐఎస్‌ఐనుంచి ఈ బృందానికి విస్తృత సహాయ సహకారాలు అందుతున్నాయి. యూకే, కెనడా, ఐరోపా దేశాల్లోని ఖలిస్థాన్‌ మద్దతుదారులను కూడగట్టేందుకు ఇస్లామాబాద్‌ నాయకత్వం చురుగ్గా ప్రయత్నిస్తోంది. అందుకు ఆయా దేశాల్లోని తన హై కమిషన్లను క్రియాశీలంగా ఉపయోగించుకుంటోంది. కశ్మీర్‌, పంజాబ్‌లలో అస్థిరత వ్యాప్తికి గడచిన కొన్ని వారాలుగా పాక్‌ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పాకిస్థాన్‌ భూభాగంనుంచి ఎక్కుపెట్టిన వివిధ ‘డ్రోన్ల’ను పంజాబ్‌, జమ్ము-కశ్మీర్‌ ప్రాంతాల్లో సమర్థంగా అడ్డుకుని గత కొన్నివారాలుగా భారతీయ భద్రతాదళాలు నేలకూలుస్తున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం.

భారత్‌కు ఆవల నివసిస్తున్న సిక్కులను ఆకర్షించేందుకు పాకిస్థాన్‌ రకరకాల కుప్పిగంతులు వేస్తోంది. వీరికోసం 45 రోజులకు వర్తించే విధంగా బహుళ ప్రవేశ వీసాలు ఇటీవల ప్రవేశపెట్టింది. దాని ప్రకారం భారత్‌కు బయట ఉన్న సిక్కులు ఎవరైనా పాకిస్థాన్‌లో ప్రవేశించి కర్తార్‌పూర్‌ సాహిబ్‌ మందిరాన్ని సందర్శించుకోవడంతోపాటు, ఆ దేశంలోని వివిధ సిక్కు క్షేత్రాలనూ చూడవచ్చు. ఆ తరవాత అటునుంచి ఇండియాకూ వెళ్ళి తిరిగి పాకిస్థాన్‌ చేరుకోవచ్చు. 45 రోజుల వ్యవధిలో భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య ఎన్ని పర్యాయాలైనా తిరిగే వెసులుబాటు కల్పించారు. భారత్‌లో నివసించే సిక్కులకు ఆ అవకాశం ఇవ్వలేదు. భారత్‌కు వెలుపల నివసిస్తున్న కొందరు సిక్కుల నుంచి ఆర్థిక, నైతిక మద్దతును సమీకరించి; వారి సాయంతో పంజాబ్‌ను భారత్‌నుంచి విడగొట్టి ప్రత్యేక ‘ఖలిస్థాన్‌’ దేశాన్ని ఏర్పాటు చేయాలన్నది పాకిస్థాన్‌ దురాలోచన. భారతీయేతర సిక్కు సమూహాలనుంచి పాక్‌ ప్రయత్నాలకు ఏదో స్థాయిలో మద్దతు వ్యక్తమవుతుండటమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. విదేశాల్లోని ఈ బృందాలు పంజాబ్‌లోని ఖలిస్థాన్‌ వేర్పాటు మూకలకు మద్దతు అందజేస్తున్నాయి. 2015-2018 మధ్యకాలంలో పంజాబ్‌లో వేర్పాటు మూకలు- ఇరువురు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను హత్య చేయడంతోపాటు; ఎనిమిదిమంది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సభ్యులను తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనలను పంజాబ్‌లో సిక్కులు, హిందువుల మధ్య అగాధాన్ని సృష్టించేందుకు పాకిస్థాన్‌ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే చూడాల్సి ఉంటుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులపై దాడులకు తెగబడిన ఖలిస్థాన్‌ వేర్పాటు మూకలకు కెనడా, యూకే, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియాలనుంచి ఆర్థిక సహకారం అందినట్లు జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో వెల్లడైంది.

ఎందుకీ హఠాత్‌ గౌరవం?
పాకిస్థాన్‌లోని నంకానా సాహిబ్‌ ప్రాంతంలో సిక్కు మత స్థాపకులు గురునానక్‌ జన్మించారు. ఆ మహనీయుడి 550వ జయంతిని పురస్కరించుకొని నంకానాలో బాబా గురునానక్‌ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇటీవల హఠాత్‌ ప్రకటన వెలువరించింది. భారతీయ నిఘా సంస్థలనూ విస్మయానికి గురి చేసిన ప్రకటన అది! అంతటితో ఊరుకోకుండా జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గురునానక్‌ స్మృత్యర్థం ఒక నాణేన్ని, స్టాంపును విడుదల చేస్తున్నట్లు కూడా ఇస్లామాబాద్‌ నాయకత్వం విధాన ప్రకటన చేసింది. సిక్కు మత సంస్థాపకులైన గురునానక్‌పట్ల అపార గౌరవం ప్రదర్శిస్తున్న పాకిస్థాన్‌ నాయకత్వం- యాభై ఏళ్ల క్రితం ఆ మహనీయుడి 500వ జయంతి సందర్భంగా ఇలాంటి ఒక్క అడుగైనా చొరవగా వేసిందా అంటే లేదన్నదే సమాధానం. పాకిస్థాన్‌ ఇటీవల ఏర్పాటు చేసిన సిక్‌ గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (పీఎస్‌జీపీసీ) దాదాపుగా ఖలిస్థాన్‌ అనుకూల నాయకులతో నిండిపోయింది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ద్వారా భారతీయ సిక్కులతో నిరంతరాయ అనుసంధానానికి ఈ కమిటీలోని నాయకులకు పాకిస్థాన్‌ అద్భుతమైన మార్గాన్ని ఏర్పాటు చేసింది. మొబైల్‌ ఫోన్లు, వాట్సాప్‌ల ద్వారా జరిపే సంభాషణలను సాంకేతికంగా పసిగట్టవచ్చు. కానీ, వ్యక్తులు నేరుగా కలుసుకొని జరిపే ముఖాముఖి సంభాషణల వివరాలు రాబట్టడం దాదాపు అసాధ్యం. పాకిస్థాన్‌ పాలుపోసి పెంచుతున్న ఖలిస్థాన్‌ వేర్పాటువాద నాయకులు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ద్వారా ఇకమీదట తరచూ భారతీయ సిక్కులను ప్రత్యక్షంగా కలుసుకొని తమ అభిప్రాయాలు కలబోసుకోనున్నారన్నమాట! దాయాది దేశం విషపూరిత ఆలోచనల గురించి తెలిసి కూడా ఈ కారిడార్‌ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందన్నది ప్రశ్న. ‘కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణానికి 2018 మొదట్లో పాకిస్థాన్‌ అనూహ్యంగా అంగీకారం తెలిపింది. సిక్కుల మత ఉద్వేగాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌ వెన్వెంటనే స్పందించి కారిడార్‌ నిర్మాణానికి చొరవగా ముందుకు రావాలని వాదించడం మొదలు పెట్టింది. ఆ విషయానికి విస్తృత ప్రచారమూ కల్పించింది. కర్తార్‌పూర్‌ వ్యవహారం సిక్కుల మతోద్వేగాలతో ముడివడింది. కాబట్టి పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌గానీ, విపక్ష అకాళీదళ్‌గానీ, దాని మిత్రపక్షం భాజపాగానీ పాక్‌ వాదనకు వ్యతిరేకంగా ఒక్క మాటా మాట్లాడలేని పరిస్థితిలో పడిపోయాయి. సిక్కు మతస్తుల ఉద్వేగాలకు తాము వ్యతిరేకం అన్న ముద్ర పడకుండా ఆయా పార్టీలు జాగ్రత్తపడ్డాయి’- కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణంపై భారత ప్రభుత్వ వైఖరికి కారణాలు వివరిస్తూ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు చేసిన వ్యాఖ్యలివి. గురునానక్‌ 550 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని- కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తన దురుద్దేశాలను నెరవేర్చుకునేందుకు సాధనంగా ఉపయోగించుకోవాలని పాకిస్థాన్‌ ప్రయత్నిస్తే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ఏ దశలోనూ ఆస్కారమివ్వబోమని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ నిక్కచ్చిగా చెబుతున్నారు. భారతీయ భద్రత, నిఘా దళాలు సైతం ఇదే స్ఫూర్తిని ఆచరణలో ప్రతిఫలింపజేయాల్సిన సందర్భమిది!

- రాజీవ్‌ రాజన్‌
Posted on 09-11-2019