Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

నీళ్లు ఇంకి... కన్నీళ్లు!

నీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే మొదటి వరసలో నిలుస్తోంది. దేశంలో కేవలం నాలుగు శాతం మాత్రమే పూర్తిగా సురక్షితమైన తాజా జలం అందుబాటులో ఉంది. పెరుగుతున్న జనాభాకు, పారిశ్రామిక అవసరాలకు, వ్యవసాయానికి ప్రధాన ఆధారం భూగర్భ జలాలే. రోజురోజుకూ పెరుగుతున్న అవసరాలు, వర్షపాతం లోటు కారణంగా భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అత్యధికంగా 2.2కోట్ల బోరుబావులు భారత్‌లో ఉన్నాయి. సరిగా నీరు నిండక, నిర్వహణ లేమివల్ల దేశంలో దాదాపు 25శాతం బోరుబావులు ఎండిపోయి, వ్యవసాయానికి అక్కరకు రాకుండా పోయాయి. దేశంలో 431శతకోటి ఘనపుమీటర్ల (బీసీఎం) భూగర్భ జలాలు ఉండగా, అందులో 396శతకోటి ఘనపు మీటర్లు వాడుకోవటానికి అందుబాటులో ఉన్నాయి. నికరంగా సాలీనా 243శతకోటి ఘనపు మీటర్లు ఉపయోగిస్తుండగా, అందులో సింహభాగం (221 బీసీఎం) సేద్యానికే వాడుతున్నారు. ఉపరితల నీటితో పోలిస్తే భూగర్భ జలాలను ఉపయోగించుకోవడం సులభం. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలను వ్యవసాయానికి అధికంగా వినియోగిస్తున్నారు. అత్యధికంగా ఉపయోగించడంవల్ల సుమారు 22శాతం భూగర్భ జల మట్టాలు ప్రమాదకర స్థాయికి కోసుకుపోయాయి. నాణ్యతపరంగా చూస్తే 12శాతం ఫ్లోరైడ్‌; 33శాతం నైట్రేట్‌లు భూగర్భ జలాల్లో ఉన్నాయి. వర్షపు నీటిని సేకరించడంతోపాటు, ఆధునిక పద్ధతులను ఉపయోగించి నీటి వాడుక సామర్థ్యం పెంచడం, భారీగా సామాజిక అడవుల పెంపకంతో పాటు భూగర్భ జల మట్టాలను గరిష్ఠ స్థాయికి చేర్చే అన్ని చర్యలనూ యుద్ధప్రాతిపదికన తెలుగు రాష్ట్రాలు చేపట్టాలి.

కుంగుతున్న నీటిమట్టాలు

నీటి సంరక్షణతోపాటు, భూగర్భ జలాల మితిమీరిన వాడకాన్ని తగ్గించే ఆంధ్రప్రదేశ్‌ వాల్టా చట్టం; తెలంగాణా సర్కారు చేపడుతున్న 'మిషన్‌ కాకతీయ' వంటి వాటితో సాధ్యమైనంత సత్వరం పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు నడుం కట్టాలి. 2011నాటి భూగర్భ జల వనరుల అధ్యయనం ప్రకారం- ఏటా తెలంగాణలో మొత్తం భూగర్భ జల వనరులు 15.10 శతకోటి ఘనపుటడుగులు అయితే, నికరంగా అందుబాటులో ఉంటోంది 13.68శతకోటి ఘనపుటడుగులు! అందులోనూ సాలీనా వాడుకుంటోంది 7.50 బీసీఎంలే! భూగర్భ జలాల నాణ్యతపరంగా చూస్తే- అదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌లలో క్షారత్వం(ఈసీ సెం.మీ.కు 3000 ఎంజీకిపైగా) ఉండగా; అదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో ఫ్లోరైడు లీటరుకు 1.5మి.గ్రా. కంటే ఎక్కువ; అదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఇనుము లీటరుకు 1మి.గ్రా. కంటే అధికంగా ఉంది. దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ నైట్రేట్‌ (లీటరుకు 45మి.గ్రా. కంటే ఎక్కువ), ఇతర రకాల కాలుష్యాల బారినపడి భూగర్భ జలాలు నాణ్యతపరంగా అడుగంటుతున్నాయి.

తెలంగాణలో భూగర్భ సంక్షోభం

తెలంగాణలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. నిరుటితో పోలిస్తే ఈ సంవత్సరం సగటున 3.15మీటర్ల దిగువకు భూగర్భజలాలు పడిపోయాయి. రబీలో తెలంగాణలో వ్యవసాయం ప్రధానంగా బోరుబావుల మీద ఆధారపడి ఉంటుంది. బోరుబావులకు భూగర్భజలాలే ఆధారం. వర్షపాతం గతి తప్పడంతో లక్షలాది బోర్లు నమ్మకంలేనివిగా మారిపోయాయి. ఉన్నపాటి కొద్ది భూగర్భ జలాలను అధికంగా వినియోగించడం, బోరుల్లో నీరు చేరకపోవడంతో భూగర్భ జలాలు మరింత అడుగంటాయి. 2013 డిసెంబర్‌నాటికి సగటున 7.09మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలాలు 2014నాటికి మరో 3.15మీటర్ల మేర పడిపోయి 10.24మీటర్ల లోతుకు పడిపోయాయి. 2013తో పోలిస్తే 2014నాటికి మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 5.43మీటర్ల భూగర్భ జలాలు తగ్గగా, రంగారెడ్డిజిల్లాలో 4.33మీటర్లు, వరంగల్‌ జిల్లాలో 3.94మీటర్లు; నిజామాబాద్‌ జిల్లాలో 3.89మీటర్లు; నల్గొండ జిల్లాలో 3.86మీటర్లు; హైదరాబాద్‌లో 3.44మీటర్ల మేర తగ్గాయి. ఇప్పటికే గతంతో పోలిస్తే రబీలో పంటల సాగు విస్తీర్ణం 69శాతం పడిపోగా, వరిపంటలో 54శాతం కంటే తక్కువే నాట్లు పడ్డాయి. రబీలో భూగర్భజలాలను మరింతగా వాడితే మెదక్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, హైదరాబాద్‌, నల్గొండ జిల్లాల్లో ఈ వేసవిలో సాగునీటితో పాటు తాగునీటికీ కష్టాలు తప్పవని నివేదికలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'మిషన్‌ కాకతీయ' ద్వారా ప్రమాదకర స్థాయికి చేరుకున్న భూగర్భజలాలను పెంచే బృహత్తర బాధ్యతను నెత్తికెత్తుకోవడం ముదావహం. చెరువుల్లో పూడికను పెద్దయెత్తున తీయడంవల్ల చెరువులు ఉన్న ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగినట్లు ఆధారాలున్నాయి. 1965తో పోలిస్తే నిరుటి వరకు చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలో 48శాతం మేర సాగు నీటి నష్టం జరిగింది. మిషన్‌ కాకతీయ ద్వారా మొత్తం 46వేల చెరువులనూ పునరుద్ధరిస్తే అద్భుతమైన మేలు జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న జలబలం

ఆంధ్రప్రదేశ్‌కూ భూగర్భ జలాలే ప్రధాన నీటివనరు. ఇక్కడ 50శాతానికిపైగా సాగునీరు, గ్రామీణ ప్రాంతాల్లో 85శాతానికిపైగా తాగునీటి అవసరాలను భూగర్భ జలాలే తీరుస్తున్నాయి. రాష్ట్రంలోని 5,096 గ్రామాల్లో భూగర్భ జలాలు అధికంగా వాడేయగా, 1064 గ్రామాల్లో నీటి మట్టాలు క్షీణ దశకు దగ్గరగా ఉన్నాయి. రాష్ట్రంలోని 2632 గ్రామాల్లో నీటి మట్టాలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. నాణ్యతపరంగా చూస్తే కడప, కర్నూలు జిల్లాల్లో తాగునీటిలో (భూగర్భ జలాలు)సైతం క్షారత్వం ఉంది. పలు జిల్లాల్లో ఫ్లోరైడ్‌ లీటరుకు 1500 మి.గ్రా.పైగా ఉండగా, బై కార్బనేట్లు లీటరుకు 160నుంచి 500మి.గ్రా. ఉన్నాయి. 12శాతం ఫ్లోరైడ్‌, 33శాతం నైట్రేట్‌లు ఉన్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. 30మండలాల్లో పూర్తిగా క్షారత్వం కలిగిన నీళ్లు కలిగి ఉంటే, 400గ్రామాల్లో ఫ్లోరైడ్‌ ప్రభావం ఉంది. సాధారణంగా జూన్‌-అక్టోబర్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన వర్షపాత కాలం. ఈ కాలంలో 609మి.మీ. వర్షపాతం నమోదు కావలసి ఉండగా- కేవలం 435.3మి.మీ. వర్షపాతమే నమోదైంది. ఫలితంగా అనేక ప్రాంతాలు క్షామంలో బారినపడి మూలుగుతున్నాయి. గడచిన ఆరు సంవత్సరాలుగా సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో అనంతపురంజిల్లాలో భూగర్భ జలాలు భారీగా కోసుకుపోయాయి.

ఇష్టానుసారం భూగర్భ జలాలను వాడటం, భూమిలోకి నీటి ఇంకుదల ఆశించిన స్థాయిలో లేకపోవడంతో- భూగర్భంలో జలం పూర్తిగా క్షీణదశ(సింక్‌హోల్‌)కు చేరే పరిస్థితి ఏర్పడుతోంది. ఏళ్లుగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి సంభవిస్తుంది. చిత్రావతి నదీ పరివాహక ప్రాంతంలోని గొడ్డుమర్రి గ్రామంలో 'సింక్‌హోల్‌' ఏర్పడింది. భూగర్భజలాలు అత్యల్పస్థాయికి పడిపోవటాన్ని సూచించేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. మొత్తంగా 2014-'15 నీటి సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్‌ వర్షపాతంలో 54శాతం లోటు కన్పించింది. కోస్తాలో 65శాతం, రాయలసీమలో 18శాతం లోటు నమోదైంది. ఫలితంగా విజయనగరం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో జలమట్టాలు నిరుటితో పోలిస్తే బాగా తగ్గాయి. 1996నుంచి 'అవిభక్త ఆంధ్రప్రదేశ్‌' ప్రభుత్వం తీసుకున్న చర్యలు భూగర్భజలాలను ఒకింతైనా కాపాడాయనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌ భూగర్భ జల చట్టం, రైతు ఆధారిత సాగునీటి వాడకం, 2002లో చేసిన వాల్టా చట్టం కొంతమేరకు భూగర్భ జలాల అధిక వాడకాన్ని తగ్గించేవే. దీంతోపాటు చిన్న నీటి వనరులైన చెరువులు, పొలాల్లో కందకాలు, నీటి గుంటల తవ్వకం, భూగర్భ జలాలను పెంచనున్నాయి. ప్రభుత్వం తలపెట్టిన విధంగా పట్టణ ప్రాంతాల్లో సాంఘిక వనాల పెంపకం విజయవంతమైతే భూగర్భ జలాలకు మహర్దశ రానుంది.

దిద్దుబాటు చర్యలు అవసరం

వర్షకాలంలో 'వర్షపునీటి సేకరణ'తో దశాబ్దాలుగా అనేక ఉష్ణ, శీతోష్ణ, మెట్ట ప్రాంతాల్లో సాగు, తాగు నీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ సంప్రదాయ పద్ధతిని కొనసాగించాలి. సేకరించిన వాన నీటిని శుద్ధిచేసి తాగడానికి,. పాడి అవసరాలకూ వాడుకోవచ్చు. తద్వారా భూగర్భ జల మట్టాలూ పెరుగుతాయి. భూగర్భ జలాల నాణ్యత పెరుగుతుంది. తీరప్రాంతాల్లో క్షారత్వాన్నీ తగ్గించవచ్చు. వ్యర్థంగా పోతున్న వర్షపు నీటిని సేకరించటం ద్వారా దేశవ్యాప్తంగా 36.4శతకోటి ఘనపుటడుగుల నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవచ్చు. వాటర్‌షెడ్‌లు, నీటిగుంతలు, చెక్‌డ్యామ్‌లు, నీటికాల్వల పునరుద్ధరణ, చెరువుల్లో పూడికతీత ద్వారా వర్షపు నీటినీ మెరుగ్గా సంరక్షించుకోవచ్చు. నీటివాడకందారుల సంఘాలను ఏర్పాటుచేసి జాతి ఆర్థికాభివృద్ధిలో జలాల ఆవశ్యకతను వివరించాలి. 2002లో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ నీరు-భూమి-చెట్లు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలి. భూగర్భ జలాలు వాడే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలి. తాగునీటికోసం మినహా- అప్పటికే భూగర్భ జలాలు అధికంగా వినియోగించిన ప్రాంతాల్లో బావులు, బోర్లపై నియంత్రణ ఉంటుంది.

బోర్లు, బావుల లోతు; వాటి మధ్య దూరాలను బట్టి శాస్త్రీయ ప్రాతిపదికన ప్రభుత్వం భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రిస్తుంది. ఈ చట్టం అమలుతో నీటి సంరక్షణ, వనాల పెంపకం పెరిగి భూగర్భ జల మట్టాలు ఇనుమడిస్తాయి. భూగర్భ జలాలు అధికంగా వినియోగించిన ప్రాంతాల్లో- 20శాతానికి మించి గరిష్ఠంగా సాగునీరు అవసరమయ్యే పంటలను వేయకపోవడం; బిందు, తుంపర సేద్యాలను అనుసరించడం ద్వారా భూగర్భజలాలపై కొంతమేర ఒత్తిడిని తగ్గించవచ్చు. బెట్ట, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కేవలం మెట్ట పంటలు పండించాలి. భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థితికి చేరిన పంజాబ్‌లో- అక్కడి ప్రభుత్వం గోధుమ, వరి పంటల సరళికి బదులు గోధుమ-మొక్కజొన్న, వరి-మొక్కజొన్న సాగు సరళితో ఒత్తిడిని గణనీయంగా తగ్గించగలిగింది. ఈ తరహా పంటల సరళిని అవలంభించే రైతులకు అక్కడి సర్కారు ప్రోత్సాహకాలనూ అందిస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఈ విధానాలను అందిపుచ్చుకోవాలి. నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రమే అధిక నీరు అవసరముండే వరి వంటి పంటలను వేసేలా రైతులను ప్రోత్సహించాలి. భూగర్భ జలాలకు ప్రధాన ఆధారం వర్షం. వర్షపాతం పెంచేందుకు భారీగా సామాజిక వనాలను ప్రోత్సహించాలి. సంప్రదాయ, ఆధునిక పద్ధతుల మేళవింపుతో బొట్టు బొట్టునూ ఒడిసిపట్టి భూగర్భ జలాలను పరిరక్షించుకోవాలి. అప్పుడే దేశానికి రక్ష!

(రచయిత - డాక్ట‌ర్ పిడిగెం సైద‌య్య)
(శాస్త్రవేత్త, ఉద్యాన విశ్వవిద్యాలయం)
Posted on 17-02-2015