Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

చెడు రాజకీయంతోనే చేటు

* ఏడు పదుల్లోకి భారత రాజ్యాంగం

మన రాజ్యాంగం మనల్ని విఫలం చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని అధికార క్రీడ స్థాయికి దిగజార్చి మనమే రాజ్యాంగాన్ని విఫలం చేశాం. మన ప్రజాస్వామ్యం మనందరి కోసం... ముఖ్యంగా పేద, బలహీన, అణగారిన ప్రజానీకం కోసం పనిచేసేలా పరిస్థితుల్ని మనం పునర్మించుకోవాలి. దీన్ని సాధించాలంటే ముందు మనం మేలుకోవాలి. చేసిన తప్పుల్ని గుర్తించాలి. అంబేడ్కర్‌ కలల్ని, స్వతంత్ర పోరాట యోధుల దార్శనికతను సాకారం చేయాలంటే- ఇప్పటి నుంచైనా దిద్దుబాటు చర్యల్ని మొదలు పెట్టాలి.

ఎల్లుండి మన రిపబ్లిక్‌ 70వ రాజ్యాంగ దినోత్సవం. డెబ్భైఏళ్ల క్రితం నవంబర్‌ 26, 1949న మన జాతి నిర్మాతలు స్వతంత్ర భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపారు. ఇంతటి సువిశాల, పేద, భిన్నత్వ దేశం ఎటువంటి ఆధునిక ప్రజాస్వామిక అనుభవం లేకుండా గణతంత్ర వ్యవస్థ ప్రారంభం నుంచే వయోజన ఓటుహక్కును, పౌరులందరికీ సమానంగా స్వేచ్ఛల్ని ఇవ్వడం మానవజాతి చరిత్రలోనే మొదటిసారి! రాజ్యాంగ రచన సంఘానికి ఛైర్మన్‌, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 60కి పైగా రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి అశేష ప్రజానీకం ఆశల్ని, ఆకాంక్షల్ని; మన సమున్నత స్వాతంత్య్ర పోరాటకారులు, జాతి నిర్మాతల వికాస దార్శనికతను మేళవిస్తూ ఉదాత్త సంవిధాన పత్రాన్ని రూపొందించారు.

ఆచరణకు ఆమడ దూరం
ప్రజాస్వామ్యం పేరుకు కాకుండా వాస్తవంగా కొనసాగడానికి మూడు పనులు చేయాలని అంబేడ్కర్‌ నవంబర్‌ 25, 1949న ఇచ్చిన చిరస్మరణీయ ప్రసంగంలో కోరారు. ఆయన సలహాను మనం చాలామేర పెడచెవిన పెట్టాం. మొదటిది- మన సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి చేసే నిరసనలు, ప్రతిఘటనలు రాజ్యాంగబద్ధ పద్ధతుల్లో మాత్రమే ఉండాలని, అడ్డుకోవడాలు, అరాచకాలకు దిగవద్దని అంబేడ్కర్‌ విజ్ఞప్తి చేశారు. కానీ మనమేం చేశాం? ప్రతిఘటనల్ని దాదాపుగా జాతీయోద్యమ పోరాటకాలం నాటి అరాచకపు విధివిధానాల్లోనే కొనసాగిస్తున్నాం. రెండోది- అంబేడ్కర్‌ తన ప్రసంగంలో జె.ఎస్‌.మిల్‌ను ఉటంకించారు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అతడి ముందు మన స్వేచ్ఛల్ని పాదాక్రాంతం చేయవద్దని హితవు పలికారు. గుప్పెట్లో అధికారం ఉన్న గొప్ప వ్యక్తిని గుడ్డిగా విశ్వసించడం వల్ల వ్యవస్థల్ని కూలదోసే అవకాశాన్ని చేజేతులా ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు. కానీ మనమేం చేశాం? అధికారంలో ఉన్న వ్యక్తులు నియంతలుగా మారేందుకు అవకాశాల్ని పళ్లెంలో పెట్టి మరీ అందించాం. ప్రైవేటు జాగీర్లుగా, కుటుంబ ఎస్టేట్లుగా పార్టీల్ని దిగజార్చాం. మూడోది- కులం, మత విశ్వాసాలు, ప్రాంతం వంటి అసమానతల్ని, విభేదాలను అధిగమించగలిగేలా సామాజిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలని అంబేడ్కర్‌ మనవి చేశారు. ఇలాంటి ప్రజాస్వామ్య నిర్మాణం ఉంటేనే సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదిగా ఏర్పడిన దేశం వాస్తవ రూపం దాలుస్తుందని, అర్థవంతమవుతుందని వివరించి చెప్పారు. కానీ మనమేం చేశాం? తనలోని సామర్థ్యాన్ని వికసింపజేసుకునే అవకాశాల్ని ప్రతి బిడ్డకూ అందే ఏర్పాటు చేయకుండా- పుట్టుకతో అసమానతల్ని, కులం చట్రాల్ని నిరంతరంగా కొనసాగిస్తున్నాం. ఒక వికృతమైన, జీవచ్ఛవం లాంటి రాజకీయ సంస్కృతిని సృష్టించడం ద్వారా సమాజంలో విభజనల్ని పెంచుతూపోతున్నాం. తమ ఉమ్మడి నాగరిక స్వప్రయోజనమేమిటో అర్థం చేసుకోలేని, దాన్ని సాధించుకోవడం కోసం పోరాడలేని ఓటుబ్యాంకులుగా సామాజిక బృందాల్ని తయారుచేశాం.

ఒక దేశంగా మనం చాలా సాధించామనడంలో సందేహం లేదు. అన్ని రకాల అవరోధాలను, అపశకునపు జోస్యాలను తిప్పికొడుతూ ఒకే దేశంగా మనుగడ సాధించడమనే అద్భుతాన్ని సాధించి చూపాం. మన స్వేచ్ఛను నిలబెట్టుకున్నాం. స్వేచ్ఛాయుత ఎన్నికల ద్వారా శాంతియుతంగా అధికార మార్పిడి జరిగే విశ్వసనీయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. ఒక మోస్తరు అభివృద్ధినీ సాధించాం. కానీ మన సామర్థ్యానికి- విజయాలకు; అవసరాలకు- సాధిస్తున్న ఫలితాలకు; మనకు- మనతో పోల్చదగిన స్థాయి అభివృద్ధితో మొదలైన దేశాలకూ మధ్య భారీ అంతరం ఉంది. ఆ అంతరం నానాటికీ పెరుగుతోంది. బ్రిటిష్‌వాళ్లు మన దేశం వదిలివెళ్లి 72 ఏళ్లు దాటిపోయింది. ఎల్లకాలం మన వైఫల్యాలకు వలస పాలనను నిందించలేం. ఇప్పుడు మనం ఒక కూడలిలో ఉన్నాం. మన ప్రజాస్వామ్యం ఇంకా మెరుగ్గా ఉండవచ్చని, మన విజయాలు ఇంకా ఎంతో గొప్పగా ఉండవచ్చని మనలో చాలామంది తరచూ అనుకుంటూ ఉంటాం కూడా. అంబేడ్కరే చెప్పినట్లు... ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని అమలు చేసేవాళ్లు మంచివాళ్లు కానట్లయితే అది చెడ్డ ఫలితాలనిస్తుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదయినా, దాన్ని అమలు చేసేవాళ్లు మంచివాళ్లయితే అది మంచి ఫలితాలనిస్తుంది’. అంబేద్కర్‌ చెప్పిందే వాస్తవమైందా, చెడ్డవ్యక్తులు అధికార పగ్గాల్ని చేపట్టి రాజ్యాంగాన్ని విఫలం చేస్తున్నారా? ప్రతీ సమాజంలో మంచీ చెడూ ఉంటాయి. మంచితనం, విజ్ఞత గల పౌరులు ప్రజాజీవితంలోకి వచ్చి హేతుబద్ధ, నైతిక మార్గాల ద్వారా ఎదిగే అవకాశం కల్పించడం; ప్రజలకు స్పష్టమైన, సిసలైన ప్రత్యామ్నాయాల్ని కల్పించడం; ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు నెరవేరే అవకాశాలకు తగిన ప్రోత్సాహకాల్ని అందించడం- రాజ్యాంగం, చట్టాలు చేయాల్సిన పని! రాజ్యాంగం ఉదాత్తమైనది, విశాల జనావళి ఆకాంక్షలకు అద్దం పట్టేది. కానీ నిజమైన ప్రజాస్వామ్యానికి, గొప్ప దేశానికి కేవలం ఒక మంచి రాజ్యాంగం, ఓటుహక్కు, ప్రతిఘటన తెలిపే స్వేచ్ఛ మాత్రమే ఉంటే, ఫలితాలు కూడా ఆ మేరకు పరిమితంగానే ఉంటాయి. వాస్తవంలో ప్రజాస్వామ్యం ఒక సంక్లిష్టమైన, కష్టతరమైన వ్యవస్థ. అధికార దళారుల (పవర్‌ బ్రోకర్ల) పరిమితమైన ప్రజాస్వామ్యం ప్రజల కోసం పనిచేసేలా తగిన పరిస్థితుల్ని నిర్మించుకోవాల్సి ఉంది. ఓటును అర్థం చేసుకుని వ్యక్తిగత, కుటుంబ స్థాయిలో తమ జీవితంలో, సమాజంలో మెరుగైన ఫలితాల్ని సాధించుకోవడానికి ఆ ఓటును సంధానం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు ఇస్తే- ప్రజాస్వామ్యం గొప్ప ఫలితాలనిస్తుంది. తాము కట్టే పన్నుల డబ్బుకు, తమకు లభించే ఉమ్మడి సేవలకు మధ్య సంబంధాన్ని ప్రజలకు తెలియజెప్పగలిగితే ప్రజాస్వామ్యం అర్థవంతమవుతుంది. అధికారాన్ని ప్రజలకు అతి దగ్గరగా వినియోగిస్తుంటే, ఓటర్లు పాలనా నిర్ణయాల్లో భాగస్వాములవుతారు, తమ నిర్ణయాల పర్యవసానాల్ని రోజువారీగా అర్థం చేసుకుంటూ ఉంటారు. దీంతో ప్రజాస్వామ్యం వాస్తవరూపం దాలుస్తుంది.

ఆరోగ్యకరమైన, విజయవంతమైన ప్రజాస్వామ్యానికి కావలసిన ఈ పరిస్థితుల్ని ఏర్పరచుకోవడంలో మనం చాలావరకు విఫలమయ్యాం. పర్యవసానంగా స్వేచ్ఛ ఒక ‘లైసెన్సు’గా తయారైంది. అసమానతలు పట్టిపీడించడం కొనసాగుతోంది. కులం, ప్రాంతం, మతం వంటి ఆదిమ భావాలు మనల్ని వెర్రెక్కిస్తూనే ఉన్నాయి. మాటల్లో చేతల్లో ఆవేశకావేషాలు, ఉన్మత్తత, తరచూ హింస చోటుచేసుకుంటున్నాయి. అంబేడ్కర్‌ వంటి జాతి నిర్మాతల కలల్ని నెరవేర్చాలనుకుంటే ప్రజాస్వామ్య పునాదిని పటిష్ఠపరచుకోవాలి. కేవలం ఓటు వేయడం, అరవడానికి పరిమితమైతే చాలదు- రాజ్యాంగాన్ని మెరుగ్గా పనిచేయించుకోగలగాలి. అందుకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పదునుగా పనిచేయించడానికి నాలుగు పనుల్ని కీలకంగా చేయాల్సి ఉంది. మొదటిది- ప్రభుత్వాధికార వ్యవస్థను జవాబుదారీగా మార్చాలి. రోజువారీ సాధారణ, మౌలిక సేవలు ఎవరి జోక్యం లేకుండా, లంచాలు లేకుండా, వాటంతటవే నిర్ణీత కాలవ్యవధిలో కచ్చితంగా జరిగే ఏర్పాటు రావాలి. అన్ని ప్రభుత్వ సేవలు నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా ‘సిటిజన్స్‌ చార్టర్ల’ను ఏర్పాటు చేయాలి. అలా సకాలంలో సేవలు అందించలేకపోతే దరఖాస్తుదారుడికి పరిహారం చెల్లించాలి. ఈ రకమైన ఏర్పాటు చేస్తే, రోజూ బిక్కుబిక్కుమంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పౌరులు నిజమైన సార్వభౌములవుతారు. రెండోది- చట్టబద్ధపాలన. చట్టం ముందు అందరూ సమానమే అనే మాటల్ని కాగితాల్లో నుంచి వాస్తవంలోకి మార్చాలి. ఇప్పుడు కర్ర ఉన్నవాడిదే బర్రె చందంగా పరిస్థితులు ఉన్నాయి. నేర దర్యాప్తు స్వతంత్రంగా, జవాబుదారీతనంతో జరిగేలా చేయాలి. దీనివల్ల పేదలు, ధనికులు, అధికారంలో ఉన్నవారు, బయట ఉన్నవారు... అందరూ సమానులుగా గుర్తింపు పొందుతారు. న్యాయం త్వరితగతిన, ఖర్చు లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే తమ హక్కుల్ని అందరూ వినియోగించుకోగలుగుతారు. అధికారంలో ఉన్నవారు జవాబుదారీగా ఉంటారు. మూడోది- అధికారం జనం ఇంటి ముందుకు రావాలి. అప్పుడు స్థానికంగా నిర్వహించుకోగలిగే అన్ని విషయాల్లో ప్రజలు పాలుపంచుకోగలుగుతారు. స్థానికంగానే నిర్ణయాలు తీసుకుంటారు. తప్పు దొర్లితే స్వయంగా మూల్యం చెల్లిస్తారు. పర్యవసానాల్ని త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. అక్కడ మంచి జరిగితే, ఆ నమూనాను ఇతర ప్రాంతాలవారూ అనుసరిస్తారు. చెడ్డ నిర్ణయాల వల్ల నష్టం జరిగితే అది స్థానికానికే పరిమితమవుతుంది. నాలుగోది- రాజకీయ సంస్కృతి, ఎన్నికల వ్యవస్థలను మార్చుకోవాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరిట ధనికుల రాజ్యం, దోపిడి రాజ్యం నడుస్తున్నాయి.

మారాలి ఎన్నికల విధానం
ఓట్ల కొనుగోలుతోనే ఎన్నికలు చాలావరకు సాగుతున్నాయి. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి తాత్కాలిక తాయిలాల పథకాలు ప్రకటించడం; ప్రజలను ఓటుబ్యాంకులుగా మార్చడానికి సమాజంలో విభజనలు, విద్వేషాలను పెంచే స్థాయికి రాజకీయాలు దిగజారాయి. పార్టీలు ప్రైవేటు ఎస్టేట్లుగా తయారై, మన రాజకీయ భాగస్వామ్యానికి ఏమాత్రం పనికిరాకుండా పోయాయి. ఎన్నికల వ్యవస్థనూ మార్చాలి. ప్రభుతాన్ని నడిపించే నాయకుణ్ని ప్రత్యక్షంగా ఎన్నుకోవడం, దామాషా ఎన్నికల పద్ధతిలోకి మారితే ఓట్ల కొనుగోలుకు తెర దించవచ్చు. ఎన్నికల పద్ధతుల్లో ఈ రకమైన మార్పు వల్ల సమర్థులు, నిజాయతీపరులైన వ్యక్తులు రాజకీయాల్లో ఎదిగి, చట్టసభల్లోకి ప్రవేశిస్తారు. ప్రభుత్వంలోకి సామర్థ్యాన్ని తేగలుగుతారు. దీనివల్ల రోజువారీ అధికార దుర్వినియోగానికి కళ్లెం పడుతుంది. ఇదేసమయంలో రాజకీయ పార్టీల్నీ సంస్కరించాలి. వాటిని ప్రజావేదికలుగా మార్చాలి. పార్టీల్లో నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక- నియంతలు, వంశపారంపర్య నేతల హుకుంతో కాకుండా, రహస్య బ్యాలెట్‌ ద్వారా సభ్యులు మాత్రమే ఎన్నుకోవాలి. మహారాష్ట్రలో తాజా పరిణామాలు చూస్తే మనం ఒక రాజకీయ వ్యవస్థగా వినాశం అంచున ఉన్నామని అర్థమవుతుంది. ఇప్పుడు వెంటనే మౌలిక రాజకీయ, పాలన సంస్కరణలను చేపట్టడం నేటి చారిత్రకావసరం!

Posted on 24-11-2019