Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

విలువల పొత్తం... ప్రగతికి ఛత్రం!

* రాజ్యాంగ స్ఫూర్తికి కట్టాలి పట్టం

దేశ ప్రజలందరికీ సామాజిక, రాజకీయ న్యాయాన్ని చేరువ చేసే సదాశయంతో లిఖించుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి నిన్నటికి డెబ్భైయ్యేళ్లు! నిబంధనలు, విధి నిషేధాలు, దిశానిర్దేశాలు, ఆశయాలు, ఆదర్శాలు, హితోక్తుల సమాహారమైన రాజ్యాంగం చూపిన బాటలో ఏడు దశాబ్దాల భారతావని ప్రస్థానాన్ని సమీక్షించుకోవడం నేటి అవసరం. ఒక దేశంగా ఏడు పదుల భారతావని ప్రస్థానంలో విజయాలను, వైఫల్యాలను, కీలక మైలు రాళ్లను, పాఠాలను, గుణపాఠాలను తరచి చూసుకోవడం తప్పనిసరి. రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలు, ఆకాంక్షల నేపథ్యంలో రాజ్యాంగ పనితీరు మదింపు కీలకం. భారత రాజ్యాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, సవాళ్లు బహుశా ప్రపంచంలో మరే దేశ రాజ్యాంగానికీ ఎదురై ఉండవు. అమల్లోకి వచ్చిన తొలి ఏడాదే రాజ్యాంగానికి సవరణలు అవసరపడ్డాయి. ఆ తరవాత క్రమంగా వందకుపైగా సవరణలతో రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చారు. భూ సంస్కరణలు; రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ; ప్రాంతీయ అసమానతలను సరిదిద్దడం; ఆదేశిక సూత్రాల్లో ప్రవచించిన లక్ష్యాలను సాకారం చేసుకోవడం; కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం; ఎస్సీ, ఎస్టీ, బీసీ జాతీయ కమిషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించడం; ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితానుంచి తొలగించి దానిని చట్టబద్ధ హక్కుగా గుర్తించడం; పౌరుల ప్రాథమిక విధులకు సంబంధించి కొత్త అధ్యాయాన్ని జతపరచడం; ఫిరాయింపుల నిరోధక చట్టం, జాతీయ జుడిషియల్‌ నియామక కమిషన్‌ ఏర్పాటు, జీఎస్‌టీ అమలు; ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి అనేక కీలక సవరణలకు కాలానుగుణంగా రాజ్యాంగం వేదికగా మారింది.

అంబేడ్కర్‌ సూచనలు శిరోధార్యం
రాజకీయ ప్రజాస్వామ్య సాధనకోసం మాత్రమే కాకుండా సామాజిక ప్రజాస్వామిక సంస్కృతిని పాదుకొల్పడం కోసం కృషి చేయాలని; వ్యక్తి పూజకు తిలోదకాలు వదలాలని 1949, నవంబరు 25న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పిలుపిచ్చారు. దేశ పురోగతి సాధనలో అసమాన త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం సహేతుకమే అయినప్పటికీ- ఆ ఆరాధన ఒక స్థాయిని దాటితే మూఢభక్తిగా పరిణమించే ప్రమాదం ఉంది. దానివల్ల అంతిమంగా వ్యవస్థలు పతనమై నియంతృత్వం కోరసాచే ప్రమాదం కొట్టిపారేయలేనిది. సామాజిక ప్రజాస్వామ్యమే పునాదిగా రాజకీయ ప్రజాస్వామ్యం శాఖోపశాఖలుగా విచ్చుకోవాలని ఆయన అభిలషించారు. కులాలు అన్న భావనే జాతి వ్యతిరేకమని స్పష్టం చేసిన అంబేడ్కర్‌, అంతరాలను అధిగమిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ భారతావని ఒక పరిపూర్ణ దేశంగా రూపుదాల్చాల్సి ఉందని ఆకాంక్షించారు. ఆ మహనీయుడి పలుకులే శిరోధార్యంగా భారతావని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. గడచిన ఏడు దశాబ్దాల రాజ్యాంగ పరిణామ క్రమంలో రాజకీయ నేతలు అప్పుడప్పుడూ కట్టుతప్పిన ఉదాహరణలు కనిపిస్తాయి. ఏడో దశాబ్దం తొలినాళ్లనుంచి దేశంలో రాజకీయ నాయకత్వం అడపాదడపా నియంతృత్వం బాట తొక్కిన ఆనవాళ్లు పొడగడతాయి. గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ (1967) కేసులో పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులు సహా రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్లమెంటు సమున్నతాధికారాన్ని చాటిచెప్పేందుకు (1971లో తీసుకువచ్చిన 24వ రాజ్యాంగ సవరణ) ప్రయత్నించింది. అయితే మెజారిటీ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు ధర్మాసనం ఒకవైపు ఆ రాజ్యాంగ సవరణకు మద్దతు పలుకుతూనే మరోవంక రాజ్యాంగ మౌలిక స్వరూపం, ప్రాథమిక హక్కులపై రాజ్యాంగ సవరణల ప్రభావం ఉండబోదని విస్పష్టంగా తేల్చిచెప్పింది. ఫలితంగా 1973నుంచీ తలపెట్టిన ఏ రాజ్యాంగ సవరణకైనా ‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదు’ అన్న సూత్రమే ప్రాతిపదికగా నిలుస్తోంది. ప్రధానమంత్రితోపాటు రాజ్యాంగ బద్ధ పదవుల్లోని వ్యక్తుల ఎన్నికలను న్యాయ సమీక్షకు అతీతంగా తీర్మానిస్తూ 39వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. ఇందిరాగాంధీ వర్సెస్‌ రాజ్‌ నారాయణ్‌ (1975) కేసులో న్యాయస్థానం ఆ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉందని, స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే వాతావరణాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించి దాన్ని కొట్టివేసింది. 42వ సవరణ ద్వారా కీలకమైన ప్రాథమిక విధులకు చేటు కల్పించడంతోపాటు, చట్టాల రూపకల్పనలో ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం; సామ్యవాద, లౌకికవాద పదాలను చేరుస్తూ రాజ్యాంగ పీఠికను సవరించడం వంటి మార్పులు తీసుకువచ్చారు.

కాలానుగుణ సవరణలు
భారత ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో 1985నాటి 52వ సవరణ కీలక ఘట్టం. ప్రజాప్రతినిధులు ఒక రాజకీయ పక్ష చిహ్నంపై గెలిచి మరో పార్టీలోకి దూకే పెడధోరణిని కట్టడి చేసేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చారు. ఈ సవరణ చట్టంలోనే పార్టీల చీలికలు, విలీనాలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ప్రతిపాదించడం గమనార్హం. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్లో మూడింట ఒకవంతు చీలిక గ్రూపుగా మారి ఇతర పార్టీలోకి మారే వెసులుబాటును 91వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఏదైనా ఒక పార్టీనుంచి మూడింట రెండొంతుల మంది చట్టసభ్యులు ఒక గ్రూపుగా మారి బయటికి వచ్చినప్పుడే దానికి గుర్తింపు ఇస్తూ 91వ సవరణ పట్టాలకెక్కింది. దానితోపాటు లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15శాతానికి మించి మంత్రులు ఉండరాదనీ స్పష్టం చేసింది. న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి జాతీయ జుడిషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ 99వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. కానీ, అలాంటి యంత్రాంగం ఉండటం రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధమని, అది న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగిస్తుందని 2015లో దాన్ని కొట్టివేశారు.

జనతా ప్రభుత్వ జమానాలో 43, 44 రాజ్యాంగ సవరణల రూపంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చిన కొన్ని నిబంధనలు సవరించారు. మినర్వా మిల్స్‌ వర్సెస్‌ భారత ప్రభుత్వం (1980) కేసులో రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు- ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సామరస్యాన్ని రాజ్యాంగ మౌలిక స్వభావంగా వ్యాఖ్యానించింది. మనేకా గాంధీ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో న్యాయస్థానం పౌర స్వేచ్ఛకు మరింత విశాలమైన పరిధులు గీస్తూ తీర్పు చెప్పింది.

దేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని మరింత నిర్మాణాత్మకంగా తీర్చిదిద్ది సహకార సమాఖ్య విధానానికి పెద్దపీట వేసే క్రమంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు లాకులెత్తుతూ 101వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. 103వ సవరణ ద్వారా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు తెరపైకి తీసుకువచ్చారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని ఎత్తివేయడంతోపాటు- లద్దాఖ్‌, జమ్ము కశ్మీర్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ రాజ్యాంగాన్ని సవరించడం ఇటీవలి పరిణామం.

కదలాలిక క్రియాశీలకంగా...
భారత రాజ్యాంగానికి ఏడు దశాబ్దాల కాలంలో వందకుపైగా సవరణలు జరిగాయి. అమెరికన్‌ రాజ్యాంగాన్ని 1789నుంచి ఇప్పటివరకు కేవలం 27 సందర్భాల్లో మాత్రమే సవరించారు. మరోవంక 1900సంవత్సరంలో అమలులోకొచ్చిన ఆస్ట్రేలియా రాజ్యాంగానికి ఇప్పటివరకూ ఎనిమిది సవరణలు జరిగాయి. మనదేశ రాజ్యాంగానికి మాత్రమే ఎందుకిన్ని సవరణలు తీసుకువచ్చారు అన్న ప్రశ్నకు జవాబు వెదకడం అంత సులభం కాదు. చైతన్యభరితమైన రాజ్యాంగ స్వభావానికి ఈ సవరణలు దర్పణం పడుతున్నాయా లేక రాజకీయ అవసరాల మేరకు దఖలుపడిన అనివార్యతలకు ఇవి సూచికలా అన్న విషయంలో లోతైన చర్చ తప్పనిసరి. దేశ ప్రజాస్వామ్య గమనాన్ని, పాలన వ్యవస్థలను కాలానుగుణంగా తీర్చిదిద్దుకునే క్రమంలో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిఫలిస్తూ చేయాల్సిన మార్పు చేర్పులు మరెన్నో ఉన్నాయి. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రభావశీలంగా మార్చడం; సంకీర్ణ ప్రభుత్వాల ప్రక్రియను కట్టుదిట్టంగా రూపుదిద్దడం, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, ఆదేశిక సూత్రాలకు అగ్రాసనమేస్తూ ఉమ్మడి పౌర స్మృతిని సాకారం చేయడం, న్యాయ వ్యవస్థకు జవాబుదారీతనాన్ని మప్పే నిబంధనలకు బాటలు పరవడం, అవినీతి కట్టడికి పటుతర వ్యవస్థలను రూపొందించడం వంటి క్రియాశీల చర్యలన్నీ రాజ్యాంగం ప్రాతిపదికగా అమలులోకి రావాల్సి ఉంది. రాజ్యాంగానికి మేలిమి భాష్యాలు చెబుతూ చురుకైన పాత్ర నిర్వహించడం ద్వారా న్యాయస్థానాలు ఈ ఏడు దశాబ్దాల కాలంలో క్రియాశీలకంగా వ్యవహరించాయి. రాజ్యాంగ మౌలిక స్వభావం అనే భావనను వెలుగులోకి తీసుకురావడం, రాష్ట్రపతి పాలన దుర్వినియోగం కాకుండా నియంత్రణలు విధించడం, సహజ వనరులను విచ్చలవిడిగా తవ్వితీయకుండా గనుల లైసెన్సుల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం, మానవ హక్కుల ఉల్లంఘనలను సాధ్యమైనంత మేర అడ్డుకోవడం వంటివన్నీ మన దేశంలో న్యాయ వ్యవస్థ చైతన్యవంతమైన చొరవకు దాఖలాలుగా ప్రస్తావించుకోవచ్ఛు ఏడు దశాబ్దాలనాటితో పోలిస్తే నేడు సమాజం మరింతగా చీలికలు పేలికలై ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పరితపించిన సమానత్వం, సౌభ్రాతృత్వ సిద్ధాంతాలు ఆచరణలో కనుమరుగవుతున్న చేదు వాస్తవాలు ఎల్లెడలా దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కేందుకు పాలకులే నిర్లజ్జగా సిద్ధపడుతున్న తరుణమిది. దీర్ఘకాలంలో దేశ గమనాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే పరిణామాలివి. ‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమర్థులు, నిజాయతీపరులైతే రాజ్యాంగంలో లోపాలు ఉన్నప్పటికీ వారి చర్యలవల్ల మెరుగైన ఫలితాలే సాకారమవుతాయి. కానీ పాలకులు సమర్థులు కాకపోతే రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఉపయోగమే లేదు’ - డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలివి. జాతి గమనాన్ని శాసించే పాలకులు ఈ మాటలను ప్రతిక్షణం మననం చేసుకొంటూ అడుగు ముందుకు వేసినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి ఆచరణలో ప్రతిఫలిస్తుంది.

- ప్రొఫెసర్‌ జీబీ రెడ్డి
(రచయిత- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్ర ఆచార్యులు)
Posted on 27-11-2019