Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

ఉపాధి హామీ పథకం తీరు

దేశవ్యాప్తంగా 6,576 బ్లాకుల్లో దాదాపు దశాబ్దకాలంగా అమలులో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతోంది. కేవలం 2,500 బ్లాకులకే దీన్ని పరిమితం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన ఇప్పటికే దుమారం రేపుతోంది. ఎంతో ఉదాత్త ఆశయాలతో ప్రవేశపెట్టిన ఈ పథకం క్రమేపీ అవినీతికి ఆలవాలమై దారితప్పిన ఫలితంగా అసలుకే ఎసరొచ్చే దుస్థితి దాపురించింది. ఈ పథకాన్ని అనుసరించి గ్రామీణ సామాజిక వనరులు సృష్టించాలి. వలసలు నియంత్రించాలి. నివాస ప్రాంతాల పరిధిలోనే పని కల్పించాలి. నికరమైన కనీస వేతనాలు అందించాలి. కనీస పనిదినాలు నిర్దేశించాలి. కనీస ఆదాయం లభించేలా చూడాలి. పని హక్కు కల్పించాలి. మూడోవంతుకు తగ్గకుండా మహిళలకు అవకాశాలు ఇవ్వాలి. సామాజిక న్యాయం పాటించాలి. పంచాయతీరాజ్‌ సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించాలి. రెండున్నర దశాబ్దాల కాలంలో గ్రామీణ భారతం తీవ్ర ఆటుపోట్లకు లోనయింది. ముఖ్యంగా వ్యవసాయం కుంగిపోయింది. యాంత్రీకరణ పెరిగి, ఉపాధి సన్నగిల్లింది. రైతులు, కౌలుదారులు, కూలీలు, వ్యవసాయంపై ఆధారపడిన చేతివృత్తులవారెందరో ఉపాధి కోసం పట్టణాలకు వలస బాట పట్టారు. ఆత్మాభిమానం చంపుకొని గుర్తింపు, గౌరవం లేని వృత్తుల్లో స్థిరపడటానికి సిద్ధమయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో 2005లో తెరమీదకు వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం- ప్రజానీకంలో ఎన్నో ఆశలు రేకెత్తించింది.

కేంద్రం వైఖరితో అనుమానాలు

అధికారిక గణాంకాల ప్రకారం, 2013-14లో 4.80కోట్ల కుటుంబాలకు చెందిన 7.40కోట్ల కూలీలకు ఈ పథకం కింద ఉపాధి లభించింది. అదే సంవత్సరం భారత ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.39వేలకోట్లు అంటే, స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 0.5శాతం వెచ్చించింది. ఈ పథకం తరవాతి ఏడాది ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించాలో కేంద్రం నిర్ణయించింది. దీని అమలుకు సంబంధించి రెండు ముఖ్యమైన ప్రతిపాదనలనూ తెరపైకి తెచ్చింది. దేశంలోని అత్యంత వెనకబడిన బ్లాకుల్లో పథకాన్ని అమలుచేయడం అందులో మొదటిది. మొత్తం బడ్జెట్లో శ్రమశక్తి వాటాను 60శాతం నుంచి 51శాతానికి పరిమితం చేయడం; యంత్రాలు, సామగ్రి వాటా 40శాతం నుంచి 49శాతానికి పెంచడం రెండోది. ఈ ప్రతిపాదనలను చూస్తే- భవిష్యత్తులో ఈ పథకానికి కేంద్రం పూర్తిగా తిలోదకాలు వదిలే దిశగా అడుగులు వేస్తోందా అన్న అనుమానం కొందరికి కలగడం సహజం. అదే నిజమైతే, కొన్ని లక్షలమంది గ్రామీణ పేదలకు అన్యాయం చేసినట్లవుతుంది. అలాగని, ఈ పథకం అవినీతి రహితమని, దేశమంతటా సవ్యంగా అమలవుతోందని చెప్పడానికీ లేదు. కానీ, గ్రామీణ నిరుపేదలకు ఉపాధి చూపించడంలో ఈ పథకం ఎంతోకొంత విజయవంతమైందన్నది నిజం. ఇప్పటివరకు ఈ పథకం నాలుగు విధాలుగా గ్రామీణ సమాజానికి ఉపకరిస్తూ వచ్చింది. మొదటిది- పేద శ్రామికులకు ఆదాయ భద్రత కల్పించడం; రెండోది- పరిమితంగానైనా సామాజిక ఆస్తులను సృష్టించడం; మూడోది మహిళా సాధికారత కల్పించడం; నాలుగోది- అధిక వేతనాలు అందించడం. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, తమిళనాడు, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఈ పథకం విజయవంతమై ఆయా రాష్ట్రాలకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

పథకం అమలు తీరుపై మొదటినుంచీ విమర్శలు వస్తున్నాయి. అవినీతి, వేతనాల చెల్లింపుల్లో జాప్యం, గ్రామసభల్లో సాంకేతిక మానవ వనరుల కొరత, నాసిరకం సామాజిక ఆస్తుల సృష్టి, నకిలీ జాబుకార్డుల వంటి లోపాలను ఇప్పటికే గుర్తించారు. ఇటువంటి కొన్ని అవకతవకల్ని ఆధారం చేసుకొని ఈ పథకం పూర్తిగా పనికిమాలినదని కొట్టిపారేసే వీల్లేదు. ఒక్క ఆర్థిక కోణంలోనే కాకుండా సామాజిక న్యాయం, సామాజికాభివృద్ధి, మానవీయ అభివృద్ధిపరంగా చూసినప్పుడు మాత్రమే ఈ పథకం ప్రయోజకత్వం అర్థమవుతుంది. సంక్షోభంలో సతమతమవుతున్న భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి తొమ్మిదేళ్లలో నేరుగా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా వచ్చి చేరడం వల్ల గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. దాంతో వారు విద్య, వైద్యం, వినోదం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతున్నారని పలు పరిశోధనల్లో రుజువైంది. పథకంలో కొన్ని ముఖ్యమైన లోపాలను ఎన్డీయే ప్రభుత్వం గుర్తించింది. కూలీలకు కనీస పనిదినాలు కల్పించలేకపోవడం; నాసిరకం సామాజిక ఆస్తులు సృష్టించడం; కూలీల వేతనాలు చెల్లించడంలో జాప్యం చేయడం; పథకాన్ని అవసరం ఉన్న ప్రాంతాలకు బదులు అవసరం లేని ప్రాంతాల్లో అమలు చేయడం అందులో ప్రధానమైనవి. అందువల్ల పథకాన్ని కేంద్రం సంస్కరించ తలపెట్టింది. ఉపాధి హామీ నిధులతో 10లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని, దీనివల్ల వ్యవసాయ కూలీలేకాక రైతులు, పల్లెసీమలు లబ్ధి పొందినట్లు ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. గ్రామీణ భారతంలో ఈ పథకం ద్వారా కనీస వేతనాలు లభిస్తున్నాయని కూలీలే చెబుతున్నారు. అందువల్ల ఈ పథకాన్ని కుదించాలనుకోవడం సరికాదు.

యంత్రాలతో చేటు

మొత్తం బడ్జెట్లో శ్రమశక్తి వాటాను ప్రస్తుత 60శాతం నుంచి 51శాతానికి తగ్గించి; యంత్రాలు, సామగ్రి వాటా 40శాతం నుంచి 49శాతానికి పెంచాలన్న ప్రతిపాదన సమంజసం కాదు. అది మూడు రకాలైన దుష్పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. మొదటిది- బడ్జెట్‌ నిధులతో శ్రమశక్తి వాటాలో కోతలవల్ల మొత్తం పనిదినాల్లో కోత పడుతుంది. రెండోది- యంత్రాలు, సామగ్రికి ఇన్నాళ్లూ 40శాతం వాటా కేటాయించినా, ఈ తొమ్మిదేళ్లలో ఎన్నడూ అది 23శాతానికి మించలేదు. పాత నిష్పత్తి విధానంలోనే యంత్రాలు, సామగ్రికి ఇంకా అదనంగా ఖర్చుపెట్టగల అవకాశం ఉన్నప్పుడు, దాన్ని 49శాతానికి పెంచడం అశాస్త్రీయం, అసమంజసం. అర్థశాస్త్రం ప్రకారం- కార్మిక శక్తి యంత్రాలు ప్రత్యామ్నాయ ఉత్పత్తి కారకాలు. ఒకే పరిమాణంగల ఉత్పత్తిని సాధించాలంటే, ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు రెండో ఉత్పత్తి కారకాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అంటే, యంత్రాల వాటా పెంచితే ఆ మేరకు కార్మికుల వాటా తగ్గించాలన్నమాట. దానివల్ల ఈ పథకం నీరుగారిపోతుంది. ఎవరికోసమైతే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారో వారి పాత్రనే పలుచన చేయడం సరికాదు. ఇక మూడోది- యంత్రాలు, సామగ్రి వాటాను సౌలభ్యం పేరుతో కొత్తగా పెంచటం వల్ల ఈ పథకంలో గుత్తేదారులు, యంత్రాలదే ముఖ్యపాత్ర అవుతుంది. దీనివల్ల పథకం ఉపాధి హామీ బదులు గుత్తేదారు కమిషన్‌ హామీ పథకంగా మారుతుంది. ఇంతవరకు పథకంపై దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటివరకు గుత్తేదారులు పూర్తిస్థాయి ఆధిపత్యం వహించలేదు. కొత్త ప్రతిపాదన వల్ల పరిస్థితి సాంతం మారిపోతుంది. ఆకలిమీదున్న గుత్తేదారులు అవినీతి ద్వారా పెద్దయెత్తున సంపాదించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. సామగ్రి వాడకం పెరగడంవల్ల అవినీతి ప్రబలుతుంది.

యూపీఏ తొలిదఫా పాలన కాలంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా, రెండో దఫా నుంచి దీనికి గడ్డు రోజులు ప్రారంభమయ్యాయి. ఇదివరకటి ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించిన నిధులను రూ.40వేలకోట్ల నుంచి రూ.33వేలకోట్లకు కుదించింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం కింద రాష్ట్రాలకు అదనపు నిధులు ఇవ్వకపోగా, పరిమితులూ విధించింది. పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రాలకు దాదాపు మూడు వేలకోట్ల రూపాయల బకాయి రావలసి ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాలూ నిధుల కోతకు గురయ్యాయి. ఈ పథకం అమలు విషయంలో ప్రశంసలందుకొంటూ జాతీయ సగటుకన్నా రెండింతల పనిదినాలు కల్పిస్తున్న త్రిపుర రాష్ట్రాన్నే ఉదాహరణగా తీసుకుందాం. ఈ రాష్ట్రానికి 2014-15లో రూ.1,406.96 కోట్లు కేటాయిస్తామన్నారు. దాన్ని రూ.660కోట్లకు కుదించారు. గడచిన అక్టోబరు 20నాటికి కేవలం రూ.180కోట్లు(27శాతం) విడుదల చేశారు. అదే గుజరాత్‌కు 76శాతం, ఛత్తీస్‌గఢ్‌కు 82శాతం, కేరళకు 46శాతం నిధులు విడుదల చేశారు. త్రిపుర సర్కారు ఒత్తిడి మేరకు మరో రూ.193కోట్లను కేంద్రం అతికష్టం మీద విడుదల చేసింది.

అసలుకు ఎసరు వద్దు

ఉపాధి హామీ పథకాన్ని కుదించాలన్న ఎన్డీయే ప్రభుత్వ ప్రతిపాదనకు ముఖ్యంగా రెండు కారణాలు ఉండవచ్చు. మొదటిది, 2,500 బ్లాకుల్లో పేదరికం అధిక స్థాయిలో తాండవించడం; రెండోది, అక్కడ అవినీతి తక్కువగా ఉండటం. పేదరికమే సంస్కరణలకు ప్రాతిపదికైతే మోదీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. కానీ, వీటిలో అత్యధికం గిరిజన బ్లాకులే. దేశంలో అధిక శాతం నిరుపేదలూ గిరిజనులే. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సింహభాగం అందాల్సిందీ వారికే. కాబట్టి భయంకరమైన పేదరికాన్ని భరిస్తున్న ఆదివాసులు నివసిస్తున్న కొండల్లో, అడవుల్లో పథకం కొనసాగించడం చాలా అవసరం. కానీ, ప్రభుత్వ సిబ్బంది ఎవరూ ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడమే అసలు సమస్య. మైదాన ప్రాంతంలోని కూలీలకన్నా ఆదివాసులే తక్కువ రోజులు ఉపాధి పొందుతున్నారని అధికార గణాంకాలే చాటుతున్నాయి. వెనకబడిన బ్లాకులను కేవలం ఒకే తరగతిగా విభజించరాదు. అత్యధిక, సాధారణ వెనకబాటు బ్లాకులుగా విభజించాలి. ఆ మేరకు వాటికి ఏటా నిధులు కేటాయిస్తే మంచిది. దీనివల్ల విపక్షాల నుంచి విమర్శలూ రావు. కొన్నాళ్ల తరవాత ఆయా బ్లాకుల్లో ఈ పథకం కారణంగా పేదరికం ఏ మేరకు తగ్గిందన్నదీ తెలుస్తుంది. పాత పథకంలో ఇలాంటి సౌలభ్యం అంతగా లేదు. ఆర్థిక మంత్రి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని, తదనుగుణంగా గ్రామాభివృద్ధి ఖాతాకు నిధులు కేటాయించడం ఎంతైనా సముచితం!

(రచయిత - ప్రొఫెస‌ర్ బి.రామ‌కృష్ణారావు)
(రచయిత- ఆర్థిక, వాణిజ్య రంగ నిపుణులు)
Posted on 18-02-2015