Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

రెక్కలు తెగిన నేరన్యాయ వ్యవస్థ!

దేశంలో నేరన్యాయ వ్యవస్థ నేతిబీరలో నెయ్యి చందంగా మారిందన్న నిజం పదేపదే రుజువవుతోంది. ఎండమావి న్యాయం కోట్లాది న్యాయార్థుల గుండెల్ని మండిస్తుంటే, శిక్షలంటే బెదురులేక నేరగాళ్లు బరితెగిస్తున్న తీరు ఎక్కడికక్కడ అరాచకత్వానికి ఆవాహన పలుకుతోంది. యూపీలోని ఉన్నావ్‌లో కోర్టు హాజరీకి వెళ్తున్న అత్యాచార బాధితురాల్ని నడివీధిలో సజీవ దహనం చేసిన తాజా అమానుషం- ఇండియాలో నేర న్యాయ వ్యవస్థ రెక్కలు తెగిన జటాయువులా మారిన వాస్తవాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ఈ భయానక వాతావరణం బదాబదలు కావాలన్న సామాన్య పౌరుడి గుండె ఘోషకు చెవులొగ్గిన తీరుగా- భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)లో భారీ సంస్కరణలకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సంకల్పించింది. సామాన్య పౌరుల ప్రయోజనాలకు గొడుగు పట్టేలా ఆయా చట్టాల్లో చేయదగు మార్పులు చేర్పులు సూచించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్ని కేంద్రం కోరుతోంది. ఆధునిక ప్రజాస్వామ్య ఆకాంక్షలకు అద్దంపట్టి, అందరికీ- ప్రత్యేకించి బలహీన వర్గాలకు సత్వర న్యాయం అందేలా తాజా కసరత్తు కొనసాగాలన్నది హోంమంత్రిత్వశాఖ అభిమతం. 1860నాటి ఐపీసీ, 1872నాటి సాక్ష్యాధార చట్టాల్ని నేటి అవసరాలకు దీటుగా సంస్కరించకపోబట్టే నేరగాళ్లకు పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయన్నది అనేకానేక విశ్లేషణల సారం! ‘న్యాయాన్ని ఆలస్యం చెయ్యడమంటే, న్యాయ నిరాకరణ ఒక్కటే కాదు... చట్టబద్ధ పాలనను ధ్వంసం చెయ్యడం కూడా!’ అని అటార్నీ జనరల్‌గా సొలీ సొరాబ్జీ లోగడ హెచ్చరించారు. సత్వర దిద్దుబాటు చర్యలకు ప్రధానమంత్రులుగా వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగులు స్థిర నిశ్చయం ప్రకటించినా కమిటీల ఏర్పాటును దాటి అడుగులు ముందుకు పడింది లేదు. నేర న్యాయ చట్టాలకు గట్టిగా సాన పట్టేందుకు కొద్ది నెలలుగా కేంద్రం చేస్తున్న యత్నాలకు కర్ణాటక, జమ్ము-కశ్మీర్‌, యూపీలనుంచి మాత్రమే స్పందన లభించింది. ప్రగతి కోసం శాంతి, శాంతి కోసం భద్రతా అత్యావశ్యకమన్న స్పృహతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కదలాల్సిన సమయమిది!

దేశీయంగా పౌరుల ధన మాన ప్రాణాల భద్రతకు పూచీ పడాల్సిన నేర న్యాయ వ్యవస్థ- లక్షిత ప్రయోజనాల్ని సాధించేలా పని చేయడం లేదని ఆధునిక న్యాయ విద్యా పితామహుడిగా పేరెన్నికగన్న ఎన్‌.ఆర్‌.మాధవ్‌ మీనన్‌ 2016లో వాపోయారు. సక్రమంగా సాగని న్యాయ ప్రక్రియలో విపరీత జాప్యం, దోషులకు విధించే శిక్షలూ నేలబారుగా ఉండటం- నేరగాళ్ల ఉరవడిని అడ్డుకోలేవనీ ఆయనే నిష్ఠుర సత్యం పలికారు. పోలీసులకు, ప్రాసిక్యూషన్‌ వారికీ దఖలుపడ్డ విస్తృత స్థాయి విచక్షణాధికారం- వ్యవస్థలో అవినీతికి, అమాయక పౌరుల ప్రాథమిక హక్కుల హననానికి దారితీసే అక్రమాలకూ హేతువవుతోందన్న మేధావుల ఆందోళనలో అక్షరం పొల్లు లేదు. దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పల్లారుస్తున్న ఈ దురవస్థను చక్కదిద్దేందుకు 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రభుత్వం జస్టిస్‌ వీఎస్‌ మలీమత్‌ సారథ్యంలో ప్రత్యేక కమిటీని కొలువుతీర్చింది. న్యాయ విభాగానికి, పోలీసులకు, వివిధ దర్యాప్తు సంస్థల మధ్య అర్థవంతమైన సమన్వయం సాధించే సూచనలు చేసే బాధ్యతనూ ఔదలదాల్చిన కమిటీ 2003 ఏప్రిల్‌లో 158 సిఫార్సులతో కీలక నివేదిక సమర్పించింది. యావత్‌ క్రిమినల్‌ న్యాయ వ్యవస్థకూ సత్యాన్వేషణే వేగుచుక్క కావాలని జస్టిస్‌ మలీమత్‌ కమిటీ నొక్కి వక్కాణించింది. దరిమిలా నాలుగేళ్లకు, నేర న్యాయ వ్యవస్థ సమర్థ నిర్వహణకు వీలుగా దాన్ని నాలుగు విపుల స్మృతు(కోడ్‌)లుగా విభజించాలంటూ జాతీయ విధాన ముసాయిదానూ ఎన్‌ఆర్‌ మాధవ్‌ మీనన్‌ కమిటీ సమర్పించింది. దేశాన్నే కుదిపేసిన నిర్భయ ఘోరం నేపథ్యంలో జస్టిస్‌ జేఎస్‌ వర్మ అందించిన సూచనలూ ఎన్నో ఉన్నాయి. సంప్రతింపుల పేరిట సాగతీతకు తావివ్వకుండా ఏటికేడు మారుతున్న నేరస్వభావాల్ని, అంతర్జాతీయంగా మెరుగైన విధానాల్ని గమనిస్తూ మేలిమి సంస్కరణలకు సత్వరం సమకట్టాలి.

పెండింగ్‌ కేసుల కొండల కింద భారత న్యాయపాలికే కుదేలైపోతుంటే- చిన్నాచితకా నేరాలకు పాల్పడ్డ నోరులేని జీవులు జైళ్లలో జీవచ్ఛవాలుగా మారుతుంటే, బరి తెగించిన నేరగాళ్లు దర్జాగా బోరవిరుచుకొని బెయిళ్లపై తిరుగుతున్న వ్యధాకలిత దృశ్యం గుండెల్ని మెలిపెడుతోంది. చట్టబద్ధ పాలనకు అత్యావశ్యకమైన నేరన్యాయ వ్యవస్థ సమర్థ నిర్వహణలో అమెరికా వంటి దేశాలూ కాలానుగుణ సంస్కరణలకు చోటుపెట్టి పురోగమిస్తుంటే- మొత్తం 128 దేశాల సూచీలో ఇండియా 68వ స్థానంలో ఈసురోమంటోంది. అత్యున్నత స్థాయిలో అవినీతి దర్యాప్తునకు తగినంత స్వేచ్ఛ కేదసకు లేనేలేదన్న మాధవ్‌ మీనన్‌ కమిటీ- కోర్టుకు మాత్రమే జవాబుదారీ అయ్యేలా జాతీయ స్థాయి చట్ట అమలు సంస్థను పూర్తి స్వతంత్రంగా కొలువుతీర్చాలని పుష్కర కాలం క్రితమే సూచించింది. జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో అమలులో ఉన్నవిధంగా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ నేర దర్యాప్తుల్ని పర్యవేక్షించే అధికారాలు కలిగి ఉండాలని జస్టిస్‌ మలీమత్‌ కమిటీ సిఫార్సు చేసింది. మలీమత్‌ కమిటీ సూచనల అమలును కేంద్రం పరిశీలిస్తున్నదన్న వార్తాకథనాల నేపథ్యంలో- కొన్ని వివాదాస్పద సూచనలపై విస్తృత సమాలోచనలకు నడుంకట్టి, తక్కినవాటిని వేగిరం చట్టబద్ధం చేసేందుకు సిద్ధం కావాలి. దర్యాప్తుల్లో నాణ్యత మెరుగుదలకు కేంద్ర రాష్ట్ర స్థాయుల్లో భద్రతా యంత్రాంగాల్ని కొలువుతీర్చడం ఎంత ముఖ్యమో, కోర్టుల్లో కాలంచెల్లిన నేరవిచారణ నిబంధనలకు చెల్లుకొట్టి, ఆధునిక సాంకేతికత ఆలంబనతో నేరగాళ్లకు శిక్షలు విధించడం అంతకంటే ప్రధానం. నేరన్యాయ వ్యవస్థ పాతాళపు లోతులు ముట్టేకొద్దీ ప్రజాతంత్రమే పెను ప్రమాదంలో పడుతుందన్నది నిర్వివాదం!

Posted on 07-12-2019