Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అసమానతలే సంకెళ్లు!

స్థూల దృష్టికి ప్రపంచం ప్రగతి దారుల్లో పురోగమిస్తున్నట్లు కనిపిస్తున్నా ఎక్కడికక్కడ విస్తరిస్తున్న అసమానతల అగాధాలు కొత్త సవాళ్లు రువ్వుతున్నాయి. 2030నాటికి ప్రపంచ దేశాలు సాధించదలచిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు తీవ్రాఘాతకరంగా మారుతున్న అసమానతల విస్తృతిపై తాజా మానవాభివృద్ధి సూచీ దృష్టి సారించింది. విశ్వవ్యాప్తంగా ఆర్థిక సామాజిక పర్యావరణ పరంగా రూపాంతరీకరణ దశలో అసమానతల రూపూ ఎలా మారుతుందో నిశితంగా అర్థం చేసుకుంటేనే, దాన్ని సమర్థంగా కాచుకొనే విధాన రచనకు ఉపక్రమించగలమని మొన్న మార్చిలోనే మానవాభివృద్ధి నివేదిక డైరెక్టర్‌ స్పష్టీకరించారు. ఆదాయ అంతరాల మీదనే కాకుండా ఆరోగ్యం, విద్య, సాంకేతిక పరిజ్ఞానాల్ని అందిపుచ్చుకోవడం, ఆర్థిక-వాతావరణ పరమైన అనూహ్య తాకిడులను తట్టుకోగలగడం వంటి భిన్నాంశాల పైనా కూలంకష అధ్యయనం చేసి మానవాభివృద్ధి క్రమంలో మరో పార్శ్వాన్ని కళ్లకు కట్టనున్నట్లు ప్రకటించారు. ఆ కోణంలో తాజా నివేదిక- దశాబ్దాలుగా దిగువ మధ్యాదాయ దేశంగా అంగలారుస్తున్న ఇండియా దుస్థితిగతులకు మూలకారణాల్ని వేలెత్తి చూపుతోంది. పోయినేటితో పోలిస్తే ఒక్కస్థానం మెరుగుదలతో ఇండియా ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో మొత్తం 189 దేశాల్లో 129వ స్థానంలో నిలుస్తోంది. మానవాభివృద్ధికి దోహదపడే మూడు మౌలికాంశాలు- ఆయుర్దాయం, విద్య, తలసరి ఆదాయాల్లో సాధించిన ప్రగతి సగటు ప్రాతిపదికన నార్వే, స్విట్జర్లాండ్‌, ఐర్లాండ్‌ దేశాలు తొలి మూడు స్థానాలూ ఆక్రమించాయి. భారత్‌ ఇరుగుపొరుగు దేశాలైన శ్రీలంక (71), చైనా (85), మెరుగైన పనితీరు కనబరచగా భూటాన్‌ (134), బంగ్లాదేశ్‌ (135), నేపాల్‌ (147), పాకిస్థాన్‌ (152) దిగనాసిగా ఉన్నాయి. 1990-2018 మధ్య దక్షిణాసియా సాధించిన 46 శాతం వృద్ధికన్నా మిన్నగా ఇండియా రాణించినా అసమానతల పరంగా అధ్వాన రికార్డు ప్రగతి ఫలాల్ని ఖర్చు రాసేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం విస్మరించలేని క్షేత్రస్థాయి వాస్తవాలివి!

‘సామాజిక న్యాయాన్ని సాధించి, విస్తృతంగా ఉన్న అసమానతల్ని తొలగించడం నేటి అవసరం... పేదరికం నిరుద్యోగితలపై పోరాడి ప్రజల ఆర్థికాభ్యున్నతి కోసం పాటుపడటం తక్షణ కర్తవ్యం’- మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక రూపకల్పన దశలో ప్రధానిగా నెహ్రూ చేసిన దిశానిర్దేశమది. దశాబ్దాలుగా పన్నెండు పంచవర్ష ప్రణాళికలు, పద్నాలుగు ఆర్థిక సంఘాలు చేసిన విధాన సేద్యం తాలూకు ఫలసాయం ఏమిటో- దేశ ప్రగతిని దిగలాగుతున్న అసమానతల సంకెళ్లలో కనిపిస్తోంది. 2005 లగాయతు ఇండియా తలసరి స్థూల దేశీయోత్పత్తి రెట్టింపు కన్నా అధికమైంది. కడు పేదరికంలో కూరుకుపోయినవారి సంఖ్య 27 కోట్లకు పైగా తగ్గిపోయింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 130 కోట్లమంది నిరుపేదల్లో 28 శాతం భారతీయులేనని తాజా నివేదిక ఎలుగెత్తుతోంది. 2000-’18 నడిమి కాలంలో దేశ ప్రజల ఆదాయవృద్ధి సగటుకన్నా దిగువనున్న 40శాతం ప్రజల రాబడి వృద్ధిరేటు బాగా తక్కువగా నమోదైంది. ఈ కారణంగా ప్రసవ సమయంలో ప్రాణగండాలు, నాణ్యమైన ఆరోగ్య సేవలు, విద్య, ఇతర అవకాశాల్ని అందుకోవడంలో ఆర్థిక సుడిగుండాలు తరాల తరబడి వెంటాడుతున్నాయి. పేదల జీవన నాణ్యతను మెరుగుపరచడం కోసమంటూ ఏడు దశాబ్దాలుగా చేపట్టిన పథకాలు చిల్లికుండతో నీళ్లు మోసిన చందం కాగా, ప్రత్యక్ష నగదు బదిలీ ఏర్పాట్ల వల్ల ఒనగూడుతున్న ఫలితం అంతంత మాత్రమే. ఆయా పథకాల వల్ల ఇండియా వంటి వర్ధమాన దేశాల్లో దారిద్య్ర రేఖను దాటగలుగుతోంది పట్టుమని నాలుగు శాతమే. భ్రష్ట రాజకీయాల పనిముట్టుగా దిగజారిన పేదరిక నిర్మూలన నినాదాల చాపచుట్టి, సమగ్ర మానవాభివృద్ధి లక్ష్యాలకు అనువైన కార్యాచరణ ప్రణాళికలపై పాలకశ్రేణి దృష్టి సారించాలి!

సమస్య లోతుల్లోకి వెళ్లకుండా పేదరిక నిర్మూలన పథకాల అమలు పేరిట వేలకోట్ల రూపాయలు వ్యయీకరించినా ప్రయోజనం లేదని, లక్షిత వర్గాల్లోనూ వాస్తవంగా ఏయే శ్రేణులకు ఏ మేలు అవసరమో విశ్లేషించి ముందడుగేస్తే సత్ఫలితాలు సాధించగలమని నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ సేన్‌ ప్రయోగాలు రుజువు చేశాయి. మానవాభివృద్ధి విశ్లేషణ క్రతువులో అసమానతల నిర్ధారణా అదే తీరుగా సాగింది. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మహిళల పట్ల చూపుతున్న దుర్విచక్షణ ప్రపంచవ్యాప్తమైందన్న నివేదిక- మొత్తం 162 దేశాల్లో ఇండియా 122వ స్థానంలో ఉందని స్పష్టీకరించింది. దక్షిణాసియాలో 17.1 శాతం స్త్రీలు శాసనసభ్యులుగా ఉంటే, ఇండియాలో పార్లమెంటేరియన్లుగా వారి వాటా 11.7 శాతానికే పరిమితమైంది. ప్రాథమికోన్నత చదువులకు వెళ్లగలుగుతున్నది 39 శాతం బాలికలే! ఇల్లుదాటి బయటకొచ్చి పనిచేస్తున్న శ్రామిక శక్తిలో మహిళల వాటా 27.2 శాతమే. వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగిన బరువు లేక పౌష్టికాహార లోపంతో కునారిల్లుతున్నవారిలో ఆడపిల్లల వాటాయే అధికం. తరాల తరబడి కొనసాగుతున్న సామాజిక దుర్విచక్షణ సకల విధాలుగా మానవాభివృద్ధి సూచీల్ని దిగలాగుతోందన్నది నిర్వివాదం. ప్రాథమిక విద్యాగంధం అందించడంలో మెరుగుదల సాధ్యపడినా, నాణ్యమైన ఉన్నత చదువుల విషయంలో అసమానతలు పోనుపోను పెరుగుతున్నాయి. రాజ్యాంగం నిర్దేశిస్తున్న సమన్యాయ సూత్రాలకు ప్రభుత్వాలు, పౌరసమాజం ఉమ్మడిగా కట్టుబడినప్పుడే అసమానతలు లేని వాస్తవిక అభివృద్ధి రెక్కలు తొడిగేది!

Posted on 12-12-2019