Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

కొల్లబోతున్న క్రీడాస్ఫూర్తి

ఎవరైనా బలమైన ప్రత్యర్థి చేతిలో ఓటమి సంభవించినప్పుడు, ఆ పరాజయాన్ని హుందాగా స్వీకరించగలగాలి. అంతిమ విజయం చేజిక్కకపోయినా, కడకంటా సర్వశక్తులూ ఒడ్డి- ఓడినా బాగా ఆడారనిపించుకోవాలి. అదే అసలైన క్రీడాస్ఫూర్తి. ఆ లక్షణం సాంతం కొరవడి ఆరు నూరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపొంది తీరాల్సిందేనన్న కొంతమంది అనుచిత దుగ్ధ వివిధ దేశాల్లో డోపింగ్‌ బాగోతాలు పెచ్చరిల్లడానికి ప్రధాన కారణమవుతోంది. పోటీదారులమీద పైచేయి కోసం క్రీడాకారులు నిషేధిత ఉత్ప్రేరకాలను వినియోగించే తప్పుడు పద్ధతే డోపింగ్‌. తమ ఆటగాళ్లకు సంబంధించి అటువంటి పరీక్షల వివరాల్ని అధికార యంత్రాంగమే మార్చేసిందన్న తీవ్ర ఆరోపణలకు గురైన రష్యా తాజాగా పరువుమాసింది. ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) ఖరారు చేసిన శిక్ష ప్రకారం- ఇంకో ఏడు నెలల్లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌తోపాటు 2022నాటి ఖతార్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలకూ రష్యా దూరం కానుంది. సాంకేతికంగా నాలుగేళ్లపాటు ఏ భారీ క్రీడోత్సవంలోనూ మాస్కో పాల్గొనే వీల్లేదు! సుమారు అయిదేళ్లుగా రష్యాను అప్రతిష్ఠపాలు చేస్తున్న డోపింగ్‌ మహా కుంభకోణమిది. ‘విజేతల్ని రష్యా ఎలా రూపొందిస్తోంది?’ అంటూ 2014 డిసెంబరులో జర్మన్‌ డాక్యుమెంటరీ గగ్గోలు పుట్టించిన నేపథ్యంలో- ‘వాడా’ స్వతంత్ర విచారణ సంఘాన్ని ఏర్పరచింది. అదిచ్చిన 323 పుటల నివేదిక- శిక్షకులు, వైద్యులు, అధికారులు, అథ్లెట్లు... అందరికీ తెలిసే రష్యాలో విచ్చలవిడిగా డోపింగ్‌ సాగుతున్నట్లు నిగ్గుతేల్చింది. తీరు మార్చుకోవడానికి లభించిన అవకాశాలను రష్యా కాలదన్నుకుందని, డోపింగ్‌ పరీక్షల్లో దొరికినవాళ్లను కాపాడటానికి సమాచారాన్ని యథేచ్ఛగా మార్చేశారని మూడు నెలల క్రితం వాడా కమిటీ స్పష్టీకరించింది. ప్రభుత్వ యంత్రాంగమే ఉద్దేశపూర్వకంగా అనుచిత విధానాలను ప్రోత్సహించిన రష్యాది స్వయంకృతాపరాధమైతే, కొందరు వ్యక్తుల ‘పొరపాట్లు’ భారత్‌నూ డోపింగ్‌ రొంపిలోకి లాగడం దిగ్భ్రాంతపరుస్తోంది.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిపెట్టగల సత్తా ఉన్నవారిగా ప్రతీతులైన అగ్రశ్రేణి బాక్సర్‌ సుమీత్‌ సుంగ్వాన్‌, జాతీయ ఛాంపియన్‌ అయిన షూటర్‌ రవికుమార్‌- నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు పరీక్షల్లో వెల్లడైంది. సుమీత్‌ డోపీగా పట్టుబడటమేమిటని శిక్షకులే విస్తుపోతుండగా- భరించలేనంత తలనొప్పితో విలవిల్లాడుతున్న దశలో ఇంటికి దగ్గర్లో వైద్యుడిచ్చిన మాత్రలు వాడిన తనకు ఏ పాపం తెలియదని రవికుమార్‌ వాపోతున్నాడు! గడచిన ఆరు నెలల్లో నీరజ్‌ (బాక్సింగ్‌), సత్నాం సింగ్‌ (బాస్కెట్‌బాల్‌), కె.రవికుమార్‌ (వెయిట్‌లిఫ్టింగ్‌), పృథ్వీ షా (క్రికెట్‌), సంజీవనీ జాదవ్‌ (పరుగు)ల పేర్లు డోపీలుగా తేలినవారి జాబితాలో చేరాయి. 2016కు ముందు నాలుగేళ్లలో డోపింగ్‌ పరీక్షల్లో విఫలమైనవారి సంఖ్య 379; ఈ ఒక్క సంవత్సరమే ఇప్పటిదాకా 150 మందికి పైగా అలా దొరికిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దిల్లీ వేదికగా ‘ఖేలో ఇండియా’ పోటీల బరిలో దూకినవారిలో పన్నెండుమంది డోపీలుగా చిక్కారు. కబడ్డీ, జావెలిన్‌ త్రో, వెయిట్‌ లిఫ్టింగ్‌, దేహ దారుఢ్య పోటీల్లో రాణిస్తున్నవారూ ఇటీవలి ‘నాడా’ (జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ) వడపోతలో దోషులుగా నిలిచారు. దేశీయంగా డోపింగ్‌ ఉదంతాలపై ఆందోళన వెలిబుచ్చిన కేంద్ర క్రీడా శాఖామాత్యులు కిరెన్‌ రిజిజు ‘కొంతమంది కావాలనే నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకుంటారు... మరికొందరు తెలియకనే ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నా’రని సరిగ్గానే విశ్లేషించారు. పర్యవసానాలేమిటో గుర్తెరగకుండా గాడి తప్పుతున్నవారిని జాగృతపరచే వ్యవస్థే దేశంలో ఇన్నేళ్లూ కరవైంది. ‘ఆటల్లో స్వచ్ఛత’ను ప్రభుత్వం నేడు ప్రస్తావిస్తోంది. డోపింగ్‌ వలలో పడకుండా అథ్లెట్లకు, శిక్షకులకు చేతన కార్యక్రమాలు నిర్వహించాలని మేరీ కోమ్‌ ప్రభృతులు ఎన్నాళ్లుగానో విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోని అలసత్వమే దేశానికి నేడిలా తలవంపులు తెచ్చిపెట్టింది!

సుమారు ముప్ఫై ఏళ్లక్రితం సియోల్‌ ఒలింపిక్స్‌లో కెనడా పరుగువీరుడు బెన్‌ జాన్సన్‌ తొలుత విశ్వ రికార్డు నెలకొల్పి అంతలోనే డోపింగ్‌ దోషిగా తలదించుకుని నిష్క్రమించిన వైనం క్రీడాప్రపంచాన్ని నిశ్చేష్టపరచింది. దరిమిలా అలా తమతమ దేశాలను అప్రతిష్ఠకు గురిచేసిన మరెందరి నామ ధేయాలో లోకానికి వెల్లడయ్యాయి. అటువంటి భ్రష్ట ప్రహసనాలు పునరావృతం కారాదన్న లక్ష్యంతో జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ వంటి దేశాలు క్రీడల్లో డోపింగ్‌ను శిక్షార్హం చేస్తూ శాసనాలు రూపొందించాయి. దశాబ్దాల తరబడి అటువంటి ప్రతిపాదనను వ్యతిరేకించిన ఇథియోపియా సైతం సరికొత్తగా నిబంధనావళిని తీర్చిదిద్దింది. ‘వాడా’ నిషేధించిన ఉత్ప్రేరకాల అక్రమ రవాణా కఠిన శిక్షార్హమంటూ సైప్రస్‌, డెన్మార్క్‌, గ్రీస్‌, పోర్చుగల్‌, రొమేనియా తదితర దేశాలు పకడ్బందీ విధి నిషేధాలకు పదును పెడుతున్నాయి. చైనా, మెక్సికో, న్యూజిలాండ్‌వంటి దేశాలదీ అదే దారి. ఇవన్నీ గమనిస్తూనే పతకాలకోసం నైతికంగా పతనమైన రష్యా ఏరికోరి కొరివితో తలగోక్కున్నట్లయింది. ‘మేమీ ఊబినుంచి వెలికిరాగల అవకాశం కానరావడం లేదు... దీనివల్ల ఇక్కడి నిష్కళంక అథ్లెట్లకూ దారులు మూసుకుపోతున్నా’యని రుసాదా (రష్యన్‌ డోపింగ్‌ నిరోధక సంస్థ) సారథి యూరీ గానస్‌ వాపోవడం, దుష్పరిణామాల తీవ్రతను కళ్లకు కట్టేదే. రేసు గుర్రాలకోసం వాడే లిగండ్రాల్‌ను ఆన్‌లైన్‌లో సంపాదించి ఉపయోగించి డోప్‌ పరీక్షలో విఫలమవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ‘నాడా’ కలవరపడుతుండటం- దేశంలో తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను సూచిస్తోంది. నిరంతర కఠోర సాధన, అత్యుత్తమ శిక్షణలతోనే జగజ్జేతల్ని సృష్టించాలి గాని అడ్డదారులు తొక్కనేకూడదు. రష్యా దారుణ భంగపాటునుంచి తక్కిన దేశాలు నేర్వాల్సిన విలువైన గుణపాఠమిది!

Posted on 13-12-2019