Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

గ్రామాలకేవీ మంచినీళ్లు?

సుజల ధారల సుఫల ధాత్రికి వందేమాతరం అంటూ ప్రణమిల్లే జాతి- గణతంత్ర దేశంగా ఏడు దశాబ్దాలు దాటాక కూడా ముమ్మరిస్తున్న నీటి కటకటతో నిట్టూర్పు సెగలు కక్కుతోంది. ప్రతి రోజూ నాణ్యమైన మంచినీరు తలసరి కనీసం 40 లీటర్ల వంతున అందేలా చూడాలన్న సర్కారు లక్ష్యం- దేశవ్యాప్తంగా మూడు లక్షల జనావాసాలకు అందని మానిపండులా మారింది. 2024నాటికి తలసరి నీటి లభ్యతను రోజుకు 55 లీటర్లకు పెంచాలన్న బృహత్‌ లక్ష్యాన్ని వల్లెవేస్తున్న జల్‌ శక్తి మంత్రిత్వశాఖ- ఇటీవల లోక్‌సభకే వెల్లడించిన క్షేత్రస్థాయి దుర్భర వాస్తవ చిత్రమది. తగినంత నీటి సరఫరాకు నోచక ‘మంచి’ నీటికీ మొహం వాచిన రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్‌, పశ్చిమ్‌ బంగ, అసోమ్‌ తొలి మూడు స్థానాల్లోనూ, వాటివెన్నంటి బిహార్‌, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ ఉన్నాయని సర్కారీ అధ్యయనమే నిగ్గుతేల్చింది. రాష్ట్రాలు నివేదించిన గణాంకాల ప్రకారం 77శాతం గ్రామీణులు నివసిస్తున్న 81శాతం ఆవాస ప్రాంతాల్లో తలసరి రోజుకు 40 లీటర్ల నీటి లభ్యత ఉన్నట్లు కేంద్రం చెబుతున్నా అవన్నీ కాకి లెక్కలే! కేవలం 3.7 శాతం పల్లె ప్రజలున్న 3.1 శాతం ఆవాసాలకే నీటి నాణ్యత సమస్య ఉన్నట్లు పేర్కొనడమూ వాస్తవ దూరమే! తాగుతున్నది జీవాధార జలమో, ప్రాణాల్ని కబళించే గరళమో అన్నది పట్టించుకోకుండా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లకోసం అభాగ్యజనం తపన ఏటా రెండు లక్షలమంది ఉసురు తీసేస్తోంది. దేశవ్యాప్తంగా 21.4శాతం నివాస గృహాలకే పైపుల ద్వారా నల్లా నీరు సరఫరా అవుతోందన్న నేషనల్‌ శాంపిల్‌ సర్వే కార్యాలయం- గ్రామాల్లో తాగునీటి అవసరాల్లో 43శాతం కుళాయిలే తీరుస్తున్నాయని వెల్లడించింది. వచ్చే అయిదేళ్లలో నల్లా ద్వారా మంచినీరు (నల్‌ సే జల్‌) గ్రామీణులందరికీ అందించాలన్న మహా సంకల్పం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం- మొదట సమస్య తీవ్రతను సరిగ్గా మదింపువేసి, అవసరాలకు తగ్గట్లు నిధుల కేటాయింపులతో ముందడుగేయాలి.

ఇండియాలో 60కోట్లమంది ప్రజలు అధిక నుంచి తీవ్రస్థాయి నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని, నీటి సరఫరా వ్యవస్థ కుప్పకూలేట్లు ఉందనీ నిరుడు నీతి ఆయోగ్‌ వెలువరించిన మిశ్రమ నీటి నిర్వహణ సూచీ ఆందోళనకర దృశ్యాన్ని ఆవిష్కరించింది. గ్రామీణ భారతంలో 17 కోట్ల 91 లక్షల గృహాలు ఉంటే వాటిలో 18.3 శాతానికే నల్లా నీళ్లు అందుతున్నాయి. సిక్కిం, గుజరాత్‌, హిమాచల్‌, హరియాణా, పంజాబ్‌, పుదుచ్చేరి మాత్రమే తమ గ్రామాల్లోని సగానికిపైగా నివాసాలకు నల్లా నీళ్లు సరఫరా చెయ్యగలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు రెండూ 34 శాతం గ్రామీణ గృహాలకే నేరుగా పైపుల ద్వారా మంచినీరు అందిస్తున్నాయి. అసోం, బిహార్‌, యూపీ, పశ్చిమ్‌ బంగ, మేఘాలయల్లో గ్రామీణ నీటి సరఫరా ఒకటీ రెండు శాతాలకే పరిమితమైందంటే ఏమనుకోవాలి? 2009లో జాతీయ గ్రామీణ తాగునీటి పథకాన్ని పట్టాలకెక్కించి 2017కల్లా పల్లెల్లోని 35శాతం గృహాలకు నల్లా నీరందించాలని నిర్దేశించుకొన్నారు. 2014లో గ్రామీణ ప్రాంతాల్లో 17 లక్షల కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వగా నిరుడు ఆ సంఖ్య 9.7 లక్షలకు పడిపోయింది. 2012-‘17 మధ్యకాలంలో రూ.81,168 కోట్లు గ్రామీణ తాగునీటి పథకం కోసం వ్యయీకరించి, ప్రకటిత లక్ష్యంలో సగం మాత్రమే కనాకష్టంగా సాధించారని ‘కాగ్‌’ ఆక్షేపించింది. స్వాతంత్య్రానంతర కాలంలో పల్లెల దాహార్తి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి వెచ్చించింది రెండు లక్షల 40వేల కోట్ల రూపాయలు. అయినప్పటికీ 80శాతం గ్రామీణ ఆవాసాలకు నేటికీ నల్లానీటి కనెక్షన్లే లేవు! గత అయిదేళ్లలోనే రూ.24వేల కోట్లు ఆ పద్దు కింద ఖర్చు రాసినా పల్లెల స్థితిగతులు మారిందేమీ లేదు. ఇదీ గ్రామీణ భారతం గుండె గోడు!

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో 1949లోనే పర్యావరణ పరిశుభ్రత (ఎన్విరాన్‌మెంట్‌ హైజీన్‌)కమిటీ నాలుగు దశాబ్దాల కాలావధిలో దేశ జనావళిలో 90శాతానికి సురక్షిత నీటి సరఫరా సాగాలని సూచించింది. భారత రాజ్యాంగం జలవనరులను రాష్ట్రాల జాబితాలో చేర్చి మంచినీటిని పొందడం ప్రజల హక్కుగా తీర్మానించింది. యునిసెఫ్‌ నుంచి సాంకేతిక తోడ్పాటుతో జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించి అయిదు దశాబ్దాలు కాగా, శీఘ్రగతిన ఆ కార్యక్రమాన్ని సఫలం చెయ్యడానికి రాష్ట్రాలతో కేంద్రం 1972లోనే చేతులు కలిపింది. అయినా ఏం ఒరిగింది? 14 లక్షల పై చిలుకు జనావాసాల్లో ఉంటున్న 70 కోట్లమందికిపైగా గ్రామీణులకు మంచినీరే మహద్భాగ్యమై పోయింది. దాదాపు రెండు లక్షల జనావాసాల్లో నీరు కలుషితమై ఏటా నాలుగు కోట్లమంది వ్యాధుల పాలబడుతున్న దౌర్భాగ్యం, ఏడు కోట్ల 30 లక్షల పనిదినాల్ని కోల్పోతున్న దురదృష్టం జమిలిగా వెంటాడుతూనే ఉన్నాయి. పోను పోను నీటి అవసరాలు, అందుబాటు మధ్య అంతరం 43శాతానికి పెరగనుందంటున్న కేంద్రమే జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 14 కోట్ల గ్రామీణ గృహాలకు నల్లా నీరు అందిస్తామంటోంది. అయిదేళ్ల వ్యవధిలో అందుకు కాగల వ్యయం మూడు లక్షల 60వేల కోట్ల రూపాయల్లో కేంద్రం రాష్ట్రాలు చెరి సగం భరించాలన్నది ప్రతిపాదన. ఏమాత్రం విత్తు సత్తువ లేక కునారిల్లుతున్న రాష్ట్రాలు అంత భూరి మొత్తాన్ని తలకెత్తుకోగల స్థితిలో ఉన్నాయా?- అన్నది మౌలిక ప్రశ్న. పన్నెండో పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ నీటి సరఫరా లక్ష్యాలు నీరుగారిపోవడానికి స్వీయ వాటా కేటాయింపులో కేంద్ర సర్కారు వైఫల్యమూ ప్రస్ఫుటమైంది. ఈసారి బడ్జెట్లో కేంద్రం జల్‌జీవన్‌ మిషన్‌కు నేరుగా కేటాయింపులే చెయ్యని నేపథ్యంలో- గ్రామీణ గంగావతరణం ఎప్పటికి సాకారమవుతుందో చెప్పగల వారేరీ?

Posted on 16-12-2019