Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

'పంచతంత్ర'మే రక్షణ ఛత్రం!

ప్రస్తుతం కేంద్ర బడ్జెట్లో రూ.2.29లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బలగాల వాటా ఏటా పెరుగుతూనే ఉంది. భారత్‌ రానున్న ఎనిమిదేళ్లలో రక్షణరంగ ఆధునికీకరణపై రూ.ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని రక్షణ శాఖ అంచనా. ఇప్పటికే ప్రపంచంలో అతి పెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఆవిర్భవించిన భారత్‌, ఈ డబ్బును పూర్తిగా విదేశీ ఆయుధాల దిగుమతికే వెచ్చించడానికి సిద్ధంగా లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన మేక్‌ ఇన్‌ ఇండియా (భారత్‌లో తయారీ) విధానం- రక్షణతో సహా 25 రంగాల్లో దిగుమతులను తగ్గించి, స్వదేశంలో పారిశ్రామికోత్పత్తిని పెంచాలని లక్షిస్తోంది. 'ప్రస్తుతం మన రక్షణ అవసరాల్లో కేవలం 40 శాతాన్ని సొంతగా ఉత్పత్తి చేసుకుంటున్నాం. రానున్న అయిదేళ్లలో దీన్ని 70 శాతానికి పెంచగలిగితే మన రక్షణ పరిశ్రమ ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. ఆయుధాల దిగుమతిని 20-25 శాతం తగ్గించినా స్వదేశంలో లక్ష నుంచి లక్షా ఇరవై వేల నిపుణ ఉద్యోగాలను సృష్టించవచ్చు' అని ప్రధాని మోదీ బెంగళూరు ఏరో ఇండియా ప్రదర్శనలో విశ్లేషించారు. ఆయన ఆశిస్తున్నట్లు రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలంటే పకడ్బందీ వ్యూహం, దాన్ని సమర్థంగా అమలుచేయగల ఉన్నతాధికార సమన్వయ సంఘం, ప్రభుత్వ-ప్రైవేటు రంగాల్లో పరిశోధన అభివృద్ధికి ప్రోత్సాహం, స్వదేశీ ఉత్పత్తిదారులకు రాయితీలిచ్చే పన్నుల వ్యవస్థ ఆవశ్యకం. అన్నింటినీ మించి మన దృక్పథంలో మార్పు రావడం మరింత అవసరం.

సమన్వయమే ప్రధానం

ప్రస్తుతం మన త్రివిధ సాయుధ దళాలు తమకు కావాల్సిన అస్త్రశస్త్రాలు వేగంగా వచ్చిపడాలని ఆరాటపడుతున్నాయే తప్ప వాటిని ఎక్కడినుంచి సేకరిస్తున్నారన్నది పట్టించుకోవడం లేదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) పరిశోధనలమీద పరిశోధనలు చేసుకుంటూపోతోందే తప్ప- సకాలంలో, సరైన బడ్జెట్లో, సరైన ఆయుధాలను తయారుచేయాలన్న ధ్యాసను కనబరచడంలేదు. స్టెల్త్‌ విమానాలు, గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌), మానవరహిత విమానం (డ్రోన్‌) వంటి అత్యాధునిక ఆయుధాల రూపకల్పనకు సారథ్యం వహించిన అమెరికా రక్షణ పరిశోధన సంస్థ 'డార్పా'కు సొంత ప్రయోగశాల ఒక్కటీ లేదు. డీఆర్‌డీఓకి 50 ప్రయోగశాలలు ఉన్నా ప్రపంచంలోనే మేటి అని చెప్పగల ఆయుధం ఒక్కటీ రూపొందించలేకపోయింది. డార్పా స్వయంగా పరిశోధన - అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)ని చేపట్టదు. వ్యక్తులు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రయోగశాలల్లో ప్రతిభావంతులను గుర్తించి మూడు నుంచి అయిదేళ్ల పరిశోధన కాంట్రాక్టులను అందిస్తుంది. శక్తిమంతమైన ఆయుధాల తయారీకి పేరుగాంచిన ఇజ్రాయెల్‌లో సైతం ప్రధాన శాస్త్రజ్ఞుని కార్యాలయం (ఓసీఎస్‌) అచ్చం డార్పా లానే బయటివారికి ఆర్‌ అండ్‌ డీ కాంట్రాక్టులు ఇస్తోంది. డార్పా, ఓసీఎస్‌లు రక్షణ ప్రాజెక్టులకు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తాయి.

పూర్తిగా సొంత సిబ్బంది మీదనే ఆధారపడుతున్న డీఆర్‌డీఓలో బాహ్య ప్రతిభను ఆకర్షించాలన్న సంకల్పమే కనిపించడం లేదు. డీఆర్‌డీఓ ప్రస్తుతం 44 ప్రధాన ప్రాజెక్టులు చేపట్టినా, దాని శాస్త్రజ్ఞుల సంఖ్య 2001లో ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. 2008 నాటికి డీఆర్‌డీఓ శాస్త్ర సాంకేతిక సిబ్బందిలో పట్టభద్రుల శాతమే అత్యధికం. పీహెచ్‌డీలు కేవలం పదిశాతమే ఉన్నారు. అన్నింటికన్నా అధ్వానం- డీఆర్‌డీఓ శాస్త్రీయ సిబ్బందిలో అత్యధికులకు పరిశోధన రంగంలో శిక్షణ కానీ, అనుభవం కానీ లేకపోవడం! సమర్థ సిబ్బందిని తయారుచేసుకోవడానికి జాతీయ రక్షణ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలన్న ప్రభుత్వ ప్రతిపాదన ఇప్పటికీ కాగితంమీదనే ఉండిపోయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన అవసరాలకోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఐఐఎస్టీ విశ్వవిద్యాలయ ఫక్కీలో తక్షణమే రక్షణ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలి. 2022కల్లా ఒక్క వైమానిక-అంతరిక్ష పరిశ్రమ కోసమే అదనంగా 1,85,500మంది నిపుణ సిబ్బంది అవసరమవుతారని ఇక్కడ గుర్తుంచుకోవాలి. విదేశాల నుంచి ఇండియా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకున్నా, దాన్ని వేగంగా వాణిజ్య అవసరాలకు అన్వయించగల నిపుణులైన సిబ్బందికి కొరతగా ఉంది. అమెరికన్‌ సాంకేతికత ఉపయోగించి ఎలక్ట్రానిక్స్‌, ఆటొమొబైల్‌ రంగాల్లో జపాన్‌ అద్భుత విజయాలు సాధించగలిగిందంటే, అది అక్కడి విద్యావ్యవస్థ ఘనతే! భారతీయ ఇంజినీరింగ్‌ కళాశాలలు తయారుచేస్తున్న లక్షలాది పట్టభద్రులకు ఉద్యోగార్హత లోపించటం, మన విద్యారంగ వైఫల్యానికి ప్రబల నిదర్శనం. భారత్‌ ఇంతవరకు రష్యా నుంచీ, ఫ్రాన్స్‌ తదితర పాశ్చాత్య దేశాల నుంచీ లైసెన్సుపై సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చుకొంటోంది.

రష్యాతో కలసి అత్యాధునిక అయిదో తరం ఫైటర్‌ విమాన రూపకల్పన, తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. క్షిపణులు, తుపాకులు, ట్యాంకులు, మందుగుండుతో పాటు తేలికరకం యుద్ధ విమానం 'తేజస్‌'లను మాత్రం డీఆర్‌డీఓ సొంతగా తయారుచేసుకోగలిగినా- దాని ఇంజన్‌, కొన్ని కీలక పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటోంది. అంటే తేజస్‌లో ఉపయోగించిన స్వదేశీ పరికరాలు 60 శాతమే. రాడార్‌, స్టెల్త్‌ టెక్నాలజీ, నానో టెక్నాలజీ ఆధారిత సెన్సర్లు, లేజర్‌ టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో మనం సొంత పరిజ్ఞానాన్ని సంతరించుకోవాల్సి ఉంది. ఇటువంటి అత్యాధునిక ఆయుధాల తయారీకి విదేశీ సంస్థలను భారత్‌ ఆహ్వానిస్తున్నా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) వాటాను మరింత పెంచి, దీర్ఘకాలిక ఆర్డర్లు ఇవ్వనిదే ఆ సంస్థలు ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రాకపోవచ్చు. ప్రస్తుతం టాటా, రిలయన్స్‌, మహింద్రా, భారత్‌ ఫోర్జ్‌, హిందుజా, హీరో గ్రూప్‌, ఎల్‌ అండ్‌ టీ రక్షణ రంగంలో ప్రవేశించాయి. వీటితో కలిసి సంయుక్త పరిశ్రమల స్థాపనకు విఖ్యాత విదేశీ ఆయుధోత్పత్తి కంపెనీలు సుముఖంగా ఉండటం ఆశావహ పరిణామం. దీన్ని మంచి అవకాశంగా మలచుకోవాలంటే జాతీయ ఉత్పత్తి విధానంలో ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ కంపెనీలను తక్షణం భాగస్వాములను చేయాలి. ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో రక్షణ రంగ పరిశ్రమలు ఆర్‌ అండ్‌ డీపై తమ టర్నోవర్‌లో పది శాతాన్ని వెచ్చిస్తుండగా భారతీయ ప్రైవేటు కంపెనీలు ఒక్క శాతం కన్నా తక్కువే ఖర్చు చేస్తున్నాయి. డీఆర్‌డీఓకు రక్షణ రంగ వ్యయంలో ఆరు శాతాన్ని మాత్రమే కేటాయిస్తున్నారు. సంపన్న దేశాలు అన్ని రంగాలలో ఆర్‌ అండ్‌ డీపై తమ జీడీపీలో 2.2 శాతం నుంచి 3.5 శాతం వరకు ఖర్చు చేస్తుండగా, భారత్‌ కేవలం 0.85 శాతాన్ని వెచ్చిస్తోంది. గత సంవత్సర బడ్జెట్లో సాంకేతిక పరిజ్ఞాన నిధికి నామమాత్రంగా రూ.100కోట్లు కేటాయించడం చూస్తే, రాజకీయ నాయకత్వానికి సమస్య లోతుపాతులు అర్థమైనట్లు కనిపించదు.

'సైబర్‌' యుద్ధానికి సిద్ధమేనా?

భూతల, సముద్రతల, గగనతలాలతోపాటు ఇప్పుడు కొత్తగా అంతరిక్ష, సైబర్‌ సీమల్లోనూ శత్రుదాడులను ఎదుర్కోవలసిన అవసరం వచ్చిపడింది. అందుకే ఇటీవల అమెరికా ఈ అయిదు తలాల్లోనూ (5 డైమెన్షన్స్‌) పోరాట సన్నద్ధం కావాలని నిశ్చయించింది. భూకక్ష్యలో ఉపగ్రహాలను పేల్చివేసే సత్తాను 2007లో చైనా ప్రదర్శించినప్పటి నుంచి భారత సాయుధ దళాలు వైమానిక అంతరిక్ష తలాల్లో పోరుకు ప్రత్యేకంగా ఏరోస్పేస్‌ కమాండ్‌ అవసరమని మొత్తుకుంటున్నాయి. కానీ, ప్రభుత్వం ఆ దిశగా అరకొర చర్యలతో సరిపెట్టింది. 2012లో విశాఖపట్నంలో భారతీయ అణు జలాంతర్గామి అరిహంత్‌ను సముద్ర జలాల్లో పరీక్షిస్తున్న సందర్భంలో చైనా హ్యాకర్లు మన తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయ కంప్యూటర్లలో చొరబడ్డారు. ఇక పాకిస్థాన్‌ హ్యాకర్లు పదేపదే భారత ప్రభుత్వ కంప్యూటర్‌ యంత్రాంగంలోకి చొచ్చుకొస్తూనే ఉన్నారు. నేడు టెర్రరిస్టులూ సైబర్‌ సమరానికి సమాయత్తమవుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భారతదేశం సైబర్‌ కమాండ్‌ను ఏర్పాటుచేసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో భారతదేశానికి ఉన్న శక్తిసామర్థ్యాలు సైబర్‌ యుద్ధానికి ఉపయోగపడతాయి సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల తయారీలో చైనా మనకన్నా ముందుంది. మేక్‌ ఇన్‌ ఇండియా విధానం హార్డ్‌వేర్‌ రంగానికి ప్రాధాన్యమివ్వాలి.

మన ఐటీ నిపుణులను సైబర్‌ గూఢచారులుగా, ఎథికల్‌ హ్యాకర్లు, సైబర్‌ డాక్టర్లుగా తీర్చిదిద్దితే ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. భావి యుద్ధాలను మలుపు తిప్పే శక్తి మానవరహిత విమానాల(డ్రోన్‌ల)కు ఉంది. చైనా ఇప్పటికే విదేశాలకు, ముఖ్యంగా పాకిస్థాన్‌కు డ్రోన్‌లను ఎగుమతి చేసింది. వచ్చే దశాబ్దంలో వ్యాపారపరమైన డ్రోన్‌ల పరిశ్రమ లక్ష ఉద్యోగాలను సృష్టించి, అయిదులక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధిస్తుంది. భారత వైమానిక, నౌకా దళాలు ఇజ్రాయెల్‌ నుంచి సెర్చర్‌, హెరాన్‌ డ్రోన్‌లను దిగుమతి చేసుకున్నాయి. హెరాన్‌ స్థానంలో స్వదేశీ రుస్తుం డ్రోన్‌ను తయారు చేయడానికి డీఆర్‌డీఓ కృషి చేస్తున్నా, అంతర్జాతీయ క్షిపణి టెక్నాలజీ నియంత్రణ ఒప్పందం మూలంగా కీలక సాంకేతిక పరిజ్ఞానాలను, పరికరాలనూ విదేశాలనుంచి దిగుమతి చేసుకోలేకపోతోంది.

ఇస్రో విజయాలు

మిగతా రంగాల మాట ఎలా ఉన్నా, భారతదేశం అంతరిక్ష రంగంలో గణనీయ విజయాలు సాధించింది. స్వదేశీ క్రయోజెనిక్‌ ఇంజన్‌ అమర్చిన రాకెట్‌తో 2013లో ప్రయోగించిన సైనిక కమ్యూనికేషన్ల ఉపగ్రహం జిశాట్‌-7 హిందూ మహాసముద్రంలోని భారతీయ యుద్ధ నౌకలన్నింటికీ సమాచార అనుసంధానం కల్పిస్తోంది. హిందూ మహాసముద్ర జలాల్లో చైనా యుద్ధ నౌకల సంచారం ఎక్కువ కావడంతో వాటిపై జిశాట్‌-7 గట్టి నిఘా వేస్తోంది. 2013లో ఒకటి, 2014లో రెండు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ (భారత ప్రాంతీయ నేవిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ) ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో, 2015లో మరి నాలుగింటిని ప్రయోగిస్తుంది. వీటివల్ల అమెరికన్‌ జీపీఎస్‌, రష్యన్‌ గ్లోనాస్‌ వ్యవస్థల మీద ఆధారపడవలసిన అవసరం తగ్గుతుంది. ఈ ఉపగ్రహాలు నిఘా సమాచారాన్ని అందించడంతోపాటు మన క్షిపణులకు, విమానాలకూ శత్రు లక్ష్యాలను గురితప్పకుండా కొట్టే సామర్థ్యాన్ని చేకూరుస్తాయి. సైబర్‌ యుద్ధానికి కూడా ఈ సమాచార ఉపగ్రహాలు ఉపకరిస్తాయి. సమీప భూకక్ష్యలో, ధ్రువ కక్ష్యలో తిరిగే శత్రు ఉపగ్రహాలను కూల్చే పరిజ్ఞానం భారత్‌కు ఉన్నా, దాన్ని ఇంకా ఆయుధ రూపంలోకి మార్చలేదు.అమెరికా, చైనా, భారత్‌లు 2045 నాటికి ప్రపంచంలో అగ్రశ్రేణి సైనిక రాజ్యాలుగా అవతరిస్తాయని బ్రిటిష్‌ రక్షణశాఖ అంచనా. అప్పటికి భారతదేశ రక్షణ బడ్జెట్‌ రూ.40 లక్షలా 50వేలకోట్లకు చేరుతుంది. మోదీ ప్రకటించిన మేకిన్‌ ఇండియా విధానం కింద ఈ నిధుల్లో సింహభాగాన్ని స్వదేశంలోనే ఖర్చు చేస్తే దేశ రక్షణ పాటవంతోపాటు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలూ కనీవినీ ఎరుగనంతగా పెరిగిపోతాయి.

(రచయిత - ఏఏవీ ప్రసాద్‌)
Posted on 24-02-2015