Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

ఆరోగ్య పథకానికీ అవినీతి రోగం

* ఆయుష్మాన్‌ భారత్‌ అమలు తీరు

ప్రముఖ ఆంగ్ల పత్రికలో ఈ నెల 11న ఓ వార్తా కథనం ప్రచురితమైంది. భారత్‌లో ఆరోగ్య బీమా లేకపోవడం వల్ల పేదలు ఎలా ఇబ్బంది పడుతున్నారనేది దాని సారాంశం. ఇటీవల విడుదలైన ఎన్‌ఎస్‌ఎస్‌ 75వ రౌండ్‌ (2017-18) సర్వేలోని సామాజిక వినియోగానికి సంబంధించిన కీలక సూచీల గణాంకాల ఆధారంగా ఆ కథనం వెలువడింది. ఆరోగ్య బీమా సదుపాయం లేని కారణంగా పేదలు తమ కష్టార్జితంలో ప్రధాన భాగాన్ని వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావడం, లేదా అప్పుల బారిన పడటం వంటి సమస్యల్లో చిక్కుకుంటున్నట్లు పేర్కొంది. ‘ఆయుష్మాన్‌ భారత్‌- ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎమ్‌జేఏవై)’ కింద ఇప్పటివరకు సుమారు 72 లక్షల రోగులకు రూ.9,600 కోట్లకు పైగా విలువైన చికిత్సల్ని అందించారు. పథకాన్ని ప్రారంభించిన తరవాత కొద్దికాలంలోనే భారీ సంఖ్యలో చికిత్సల్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయ విజయంగానే భావించాలి. రోగుల సంఖ్య, పెట్టిన ఖర్చు వంటి గణాంకాలు ఏమి చెబుతున్నప్పటికీ, ఈ విషయంలో చేయాల్సిందేమిటో గ్రహించేందుకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నిరుడు సెప్టెంబర్‌ 25 నుంచి ప్రధానమంత్రి జన ఆరోగ్య అభియాన్‌ (ఆయుష్మాన్‌ భారత్‌) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకాన్ని జాతీయ ఆరోగ్య రక్షణ మిషన్‌ (ఏబీ-ఎన్‌హెచ్‌పీఎం) లేదా మోదీ కేర్‌గానూ పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా పేరొందింది. ఏటా ప్రతి కుటుంబానికి అయిదు లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా కవరేజీ అందిస్తుంది. ఇందులో ప్రత్యేక, సాధారణ, ఇతరత్రా వైద్య, శస్త్రచికిత్స సంబంధిత సేవలూ అందుతాయి. లబ్ధిదారుల అర్హతల కోసం సామాజిక ఆర్థిక కులగణన (ఎస్‌ఈసీసీ)పై ఆధార పడతారు. పథకానికి సంబంధించి పెద్ద సంఖ్యలో సవాళ్లు వరస కడుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

సవాళ్లివే...
ఏబీ-పీఎమ్‌జేఏవై పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాలు- అవినీతి. ఈ విషయంలో పలు ఆస్పత్రులకు నోటీసులు సైతం జారీ అయినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం ఏడాది కాలంలో సుమారు 1,200 ఆస్పత్రులు తప్పుడు కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలింది. వీటిలో 376 ఆస్పత్రులపై దర్యాప్తు ముగిసింది. ఆరు ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్‌ఐఆర్‌)లు నమోదయ్యాయి. వివిధ ఆస్పత్రులపై రూ.1.5 కోట్ల మేర జరిమానాల్ని విధించారు. 97 ఆస్పత్రుల్ని పథకం జాబితా నుంచి తొలగించారు. ఈ అంకెలన్నీ ప్రైవేట్‌ ఆస్పత్రుల ప్రమేయమున్న అవినీతి అంశాల్ని ఎత్తిచూపుతున్నాయి. పథకం అమలులో కఠిన నియంత్రణలు, పర్యవేక్షక యంత్రాంగం ఉండాల్సిన అవసరాన్ని చాటిచెబుతున్నాయి. పథకంలో రెండో సమస్య ప్రైవేట్‌ ఆస్పత్రుల పనితీరుకు సంబంధించినది. ఒకవైపు, మార్కెట్‌ రేట్లతో పోలిస్తే వివిధ రకాల చికిత్సలకు నిర్ణయించిన ధరలు మరీ తక్కువగా ఉన్నాయంటూ చాలా ప్రైవేట్‌ ఆస్పత్రులు ఫిర్యాదు చేస్తున్నాయి. మరోవైపు, కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు అందిస్తున్న సౌకర్యాలు హీనస్థాయిలో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఉదాహరణకు ఈ పథకంలో చేరిన సుమారు 71 శాతం ఆస్పత్రుల్లో 25 కన్నా తక్కువ పడకలే ఉన్నాయి. సాధారణ వైద్యసేవలనే అందిస్తున్నట్లు తేలింది. ఈ తరహా సమస్యలకు తమిళనాడు మెరుగైన పరిష్కారాన్ని గుర్తించింది. బలమైన ప్రభుత్వరంగ ప్రజారోగ్య వ్యవస్థకు ఆ రాష్ట్రం గుర్తింపు పొందింది. ప్రభుత్వరంగ ఆరోగ్య వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంటే, వివిధ రకాల వైద్యసేవల ధరల విషయంలో ప్రైవేట్‌ రంగంతో బేరసారాలు ఆడేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. దీనివల్ల ప్రైవేట్‌ రంగం ప్రభుత్వ వైద్య వ్యవస్థతో పోటీపడి చవక ధరల్లోనే మెరుగైన సేవల్ని అందిస్తుంది. సామాన్యులు లబ్ధి పొందుతారు. ఇలాంటి ప్రయోజనాలన్నింటికీ తోడుగా, సమర్థమైన, బలమైన ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంటే, భారీ సంఖ్యలో రోగులు ఆకర్షితులవుతారు. ఫలితంగా ప్రైవేట్‌ ఆస్పత్రులకు పెద్ద మొత్తాల్లో చెల్లించాల్సిన అవసరం లేకుండా, సదరు రోగులే నిధుల్లో ప్రధాన భాగాన్ని సమకూరుస్తారు. దీనివల్ల ప్రభుత్వ రంగం, లాభాల్ని ఆశించే ప్రైవేట్‌ రంగం మధ్య సమతౌల్య సాధన సాధ్యమవుతుంది. అవగాహన కార్యక్రమాల ద్వారా లబ్ధిదారులకు సాధికారత కల్పించడం, సంస్థాగతమైన విధివిధానాలతో అండదండలు అందించడం మూడో సవాలు. లబ్ధిదారులకు ఈ-కార్డ్స్‌ రూపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రశంసనీయం. అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు ‘ఫీడ్‌బ్యాక్‌’ వ్యవస్థనూ ప్రారంభించారు. నాలుగో సవాలు- సంస్థాపరమైన ఏర్పాట్ల లేమి. పథకానికి భారీస్థాయిలో సంస్థాపరమైన ఏర్పాట్లు అవసరం. ఉదాహరణకు ఈ పథకం అమలు ప్రణాళిక ప్రకారం 1.20 లక్షల సామాజిక ఆరోగ్య అధికారులను 2022 నాటికి నియమించనున్నారు. ఇదే సమయంలో 1.50 లక్షల మంది ఆరోగ్య, స్వాస్థ్య(వెల్‌నెస్‌) కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధి అయిదు శాతంకన్నా తక్కువకు పడిపోయిన పరిస్థితుల్లో వీటికయ్యే వ్యయాల్ని సమకూర్చడం సవాలే. వృద్ధిరేటు ఏడు నుంచి ఎనిమిది శాతం దాకా ఉండి, జీడీపీలో సుమారు రెండు శాతం ఖర్చు పెడితే లక్ష్యసాధన తేలికవుతుంది. ప్రస్తుతం ఆర్థిక మందగమనం నేపథ్యంలో నిధుల సేకరణా కష్టతర విషయమే. మరోవైపు ఆరోగ్యంపై వ్యయాల్ని భరించడం రాష్ట్రాలకూ సమస్యాత్మకంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితి తాలూకు తాకిడిని అవికూడా చవిచూశాయి. ఈ క్రమంలో, ప్రపంచ ప్రఖ్యాత వైద్యపత్రిక లాన్సెట్‌ ప్రకారం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విషయంలో 195 దేశాల్లో భారత్‌ 145వ స్థానంలో నిలిచింది. సిరియా, ఉత్తర కొరియా, ఫిలిప్పీన్స్‌, శ్రీలంకలకన్నా భారత్‌ వెనక ఉంది. ఇలాంటి ఆరోగ్య వ్యవస్థ అమలులో ఉన్నప్పుడు నాణ్యమైన ఆరోగ్య సేవా సదుపాయాల కల్పన భారీ ప్రయాసే అవుతుంది. ఇదంతా సాధించేందుకు ఆరోగ్యరంగానికి అధికంగా కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం 2025 నాటికి జీడీపీలో ప్రజారోగ్యంపై వ్యయాన్ని 2.5 శాతందాకా పెంచాలని భావిస్తోంది. జీడీపీలో ఒకశాతంగా ఉన్న ప్రస్తుత స్థితి నుంచి ఆ స్థాయిని చేరుకునేందుకు సుదీర్ఘ ప్రయాణం అవసరం. దేశం ఇప్పుడున్న స్థితిలో సుస్థిర ఆర్థికవృద్ధి ఓ పెద్ద సవాలే. దీన్ని అధిగమించేందుకు తీవ్రస్థాయిలో మేధామథనం అవసరం.

నాణ్యతకు ప్రాధాన్యం
ఆరోగ్య రంగంపై చేస్తున్న ఖర్చు నాణ్యత ఎలా ఉంటోందనేది అయిదో సవాలు. సామాజికంగా, ఆర్థికంగా దూరంగా ఉన్న వర్గాలనూ ఇముడ్చుకోగల సామర్థ్యం ఉండటం ముఖ్యం. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చే సామర్థ్యమూ కీలకమే. అందుకోసం ఎంతమేర ఖర్చు పెడుతున్నారనేది కాకుండా, వ్యయ నాణ్యతే ప్రధానం. సరళంగా చెప్పుకోవాలంటే, ఎంత ఖర్చు చేస్తున్నారనే ప్రశ్నకన్నా- దేనిపై ఖర్చు చేస్తున్నారు, ఎవరికోసం చేస్తున్నారనేదే ముఖ్యం. భారత్‌ ఆరోగ్య సంరక్షణ సమస్యల పరిష్కారం కోసం వివిధ విధానాల్ని రూపొందించేటప్పుడు విధాన నిర్ణాయకులు ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సేవల అందుబాటులో తీవ్రస్థాయి అసమానతలు నెలకొన్నట్లు పలు నివేదికలు స్పష్టీకరిస్తున్నందువల్ల ఇది మరింత అవసరం. లబ్ధిదారుల సామాజిక, ఆర్థిక, భౌగోళిక నేపథ్యాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏడాది కాలంలో సాధించిన ప్రగతితో తృప్తిపడితే సరిపోదు. బీమా కవరేజీని మరింత విస్తరించే దిశగా, వ్యూహాలపై పునరాలోచన చేయాలి. అవసరం ఉన్నవారికి, అర్హులైన ప్రజలకు బీమా సదుపాయం అందేలా చూడాలి. సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సేవల విస్తృతి అంశంపై ప్రసంగించిన ప్రధాని మోదీ‘ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు’ అని స్పష్టీకరించారు. వైద్యసేవా రంగంలో తమ అనుభవాలను అభివృద్ధి చెందిన దేశాలతో పంచుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్‌ భారత్‌ను విజయవంతంగా అమలుచేయగలిగితే ప్రపంచ దేశాలకు ఈ పథకం మార్గదర్శకంగా నిలుస్తుంది.

మార్గం చూపుతున్న థాయ్‌లాండ్‌
థాయ్‌లాండ్‌కు చెందిన విశ్వజనీన ఆరోగ్య సంరక్షణ పథకం భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యమైన పాఠాల్ని నేర్పింది. థాయ్‌లాండ్‌ జనాభా 6.8 కోట్లు. 927 ప్రభుత్వ, 363 ప్రైవేట్‌ ఆస్పత్రులతోపాటు 9,768 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, 25,615 ప్రైవేట్‌ క్లినిక్‌లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. థాయ్‌లాండ్‌ ఆరోగ్య పథకంలో 99.5 శాతం జనాభాకు ఆరోగ్య బీమా రక్షణ ఉంది. 2001లో సార్వత్రిక ఆరోగ్య సంస్కరణల్ని ప్రవేశపెట్టిది. ఆపై పథకాన్ని మరింత సమగ్రంగా తీర్చిదిద్దింది. పేదలకు పూర్తి ఉచితంగా, సాధారణ ప్రజలకు 30 బహాత్‌ల (రూ.70) కనీస రుసుము పథకం ప్రవేశపెట్టింది. ఇందులో చేరినవారికి ఓ బంగారు కార్డు ఇస్తారు. దీంతో హెల్త్‌డిస్ట్రిక్‌ పరిధిలో చికిత్స చేయించుకోవచ్చు. అవసరమైతే పెద్ద ఆస్పత్రుల్లో ప్రత్యేక చికిత్సలు అందజేస్తారు. సార్వజనీన ఆరోగ్య సంరక్షణను మూడు కార్యక్రమాల ద్వారా కల్పిస్తారు. ఉన్నతోద్యోగులు, వారి కుటుంబీకుల కోసం సివిల్‌ సర్వీస్‌ సంక్షేమ వ్యవస్థ, ప్రైవేట్‌ ఉద్యోగులకు సామాజిక భద్రత, సార్వజనీన ఆరోగ్య పథకం అందిస్తారు. థాయ్‌లాండ్‌లో చాలా వరకు ఆరోగ్య సంబంధ నిధులు ప్రభుత్వరంగంతోపాటు, ప్రైవేట్‌ వనరుల నుంచే వస్తాయి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో కాంట్రాక్టు యూనిట్లకు జనాభా ఆధారంగా వార్షిక నిధుల్ని కేటాయిస్తారు. ఖర్చులు, అసమానతలు పెరిగిపోవడం వంటి సమస్యలున్నా, ఇప్పటికీ థాయ్‌లాండ్‌ సార్వత్రిక ఆరోగ్య కవరేజీని చౌకగా ఇచ్చే దేశంగా గుర్తింపు పొందింది. మధ్యాదాయ దేశాలు తమ పౌరులకు చవకైన ఆరోగ్య సేవల్ని అందించే విషయంలో ఆదర్శంగా నిలిచింది.

Posted on 17-12-2019