Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అవగాహన కొరవడి అలజడి

* పౌరసత్వ చట్ట సవరణపై విపక్షాల నిరసనలు

పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేది లేదని ఆరుగురు ముఖ్యమంత్రులు చేసిన ప్రకటన ఆశ్చర్యకరమే. భాజపాను వ్యతిరేకించే రాజకీయ పక్షాలకు చెందిన ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన ఆ ప్రకటన- రాజ్యాంగానికి, దేశ సమైక్యత, సమగ్రతలకు బహిరంగంగా పెను సవాలునే విసిరింది. సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలుపెట్టగా కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రులు కమల్‌నాథ్‌ (మధ్యప్రదేశ్‌), భూపేష్‌ బఘేల్‌ (ఛత్తీస్‌గఢ్‌), అమరీందర్‌సింగ్‌ (పంజాబ్‌) గొంతు కలిపారు. ఆ తరవాత విపక్షాలకు చెందిన కేరళ సీఎం పినరయి విజయన్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం వీరి బాటలో నడిచారు. సవరించిన చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేది లేదన్నారు. ఈ వ్యాఖ్యలు నిరక్ష్యంతో కూడినవే కాకుండా జాతీయ సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు తోడ్పడేవి కావన్నది విస్పష్టం.

కేంద్రానిదే అధికారం
పౌరసత్వ సవరణ చట్టం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి శరణు కోరి వచ్చే ముస్లిమేతరులైన హిందువులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవ వర్గాలకు పౌరసత్వాన్ని కల్పిస్తుంది. వీరంతా సదరు ఇస్లామిక్‌ దేశాల్లో మతపరమైన పీడనను ఎదుర్కొన్నవారే. 2014, డిసెంబర్‌ 31కి ముందు భారత్‌లోకి ప్రవేశించినవారికే ఈ అవకాశం ఉంటుంది. సవరణ ప్రకారం వీరందరినీ అక్రమ వలసదారులుగా చెప్పడానికి అవకాశం లేదు.

రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో కేంద్ర, రాష్ట్రాల శాసన నిర్వాహక అధికారాలు విస్పష్టంగా నిర్దేశితమై ఉన్నాయి. కేంద్రజాబితాలోని 17వ అంశం పౌరసత్వానికి సంబంధించినది. అంటే, సంబంధిత శాసన నిర్మాణ విధులన్నీ సంపూర్ణంగా భారత ప్రభుత్వ పరిధిలోకే వస్తాయని స్పష్టమవుతోంది. రాజ్యాంగం ప్రకారం కేంద్రం తనకు కేటాయించిన పరిధిలో రూపొందించిన ఏ చట్టాన్నయినా తిరస్కరించే అధికారం ఏ రాష్ట్రానికీ లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 1948, నవంబర్‌ నాలుగున రాజ్యాంగ అసెంబ్లీలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై మాట్లాడుతూ, సమాఖ్య వ్యవస్థ ప్రాథమిక సూత్రాల ప్రకారం శాసన, కార్యనిర్వాహక అధికారాలు కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజిజితమై ఉన్నాయన్నారు. ఈ పని కేంద్రం రూపొందించే చట్టం కాకుండా, రాజ్యాంగమే చేస్తుందన్నారు.

ప్రస్తుత రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తున్నవారంతా- చట్టం ముందు అంతా సమానులే, సమన్యాయానికి భరోసానిచ్చే ఆర్టికల్‌ 14 ఉల్లంఘనకు గురవుతోందని వాదిస్తున్నారు. తాజా చట్ట సవరణలో మూడు దేశాలకు చెందిన ముస్లిములను పరిహరించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని వారు భావిస్తున్నారు. సవరణను ప్రశ్నిస్తూ ఇప్పటికే చాలామంది సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి అభిప్రాయం వ్యక్తీకరిస్తుందో వేచిచూడాలి. వాస్తవానికి ఎవరు ఏ మతంవారు అన్నదానితో నిమిత్తం లేకుండా భారతీయ పౌరులకు ఈ చట్టంతో ఎలాంటి సంబంధం లేదు. చట్టసవరణను వ్యతిరేకిస్తున్నవారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయమిది. ఆర్టికల్‌ 14 ద్వారా భారతీయ పౌరులకు లభిస్తున్న రక్షణ ఈ సవరణ వల్ల తొలగిపోదు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లకు చెందిన ముస్లిం పౌరుల హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయనే దిశగా వీరి వాదనలు సాగుతున్నాయి. సవరణలో ప్రస్తావించిన ఆరు సామాజిక వర్గాలు ఫలానా మతానికి చెందినవారని కాకుండా, పీడనకు గురైన తరగతికి చెందినవారన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైగా ఆర్టికల్‌ 14 అందించే హేతుబద్ధ వర్గీవరణకు సుప్రీంకోర్టు నిర్ణయాలు కూడా ఆధారంగా ఉన్నాయి.

ఆయా సామాజిక వర్గాల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాల్ని, చేస్తున్న యత్నాల్ని రెండు కారణాలపై తప్పకుండా స్వాగతించాల్సిందే. మొదటగా, వేల సంవత్సరాల నుంచి పీడనకు గురైన వర్గాలకు భారత్‌ ఆశ్రయం కల్పిస్తూ వస్తోంది. 12వ శతాబ్దంలో జొరాష్ట్రియన్లే ఇందుకు ఉదాహరణ. ఇటీవలి కాలంలో టిబెట్‌లోకి చైనా ప్రవేశించినప్పుడు టిబెటన్‌ శరణార్థులు భారత్‌లోకి వరదలా వచ్చిపడ్డారు. 1959-60లో ఈ సంఖ్య 80 వేలకుపైగానే ఉంది. భారత్‌లోకి టిబెట్‌ శరణార్థుల రాక స్థిరంగా కొనసాగుతూనే ఉంది. ధర్మశాలతోపాటు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కేంద్ర ప్రభుత్వం వారికి ఆవాసాలు కల్పించేందుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. ఇందులో కర్ణాటక కూడా ఉంది. టిబెట్‌ శరణార్థుల అంశంపై భారత్‌ వ్యవహరించిన తీరును చూసిన వారికి, ఇస్లామిక్‌ దేశాల నుంచి ప్రస్తుతం వస్తున్న శరణార్థులకు ఇదే తరహాలో ఆశ్రయం కల్పిస్తారేమోనని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది తమపై మరింత భారం మోపుతుందనే అపోహ అసోమ్‌లో ఉంది. తాజా చట్ట సవరణలో- 2014, డిసెంబర్‌ 31లోపు వచ్చిన శరణార్థులకే ఈ వెసులుబాటు అని స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో భవిష్యత్తులో వలసలు జరుగుతాయనే ఆందోళనలు అర్థరహితం. చట్టసవరణ వల్ల కలిగే ప్రయోజనాలు భవిష్యత్తులో భారత్‌లోకి వచ్చే వారెవ్వరికీ దక్కే అవకాశమే లేదు. పైగా, 2015-16 సంవత్సరాల్లో జారీ చేసిన నోటిఫికేషన్ల నేపథ్యంలో ఈ సవరణ అవసరపడింది. తొలి నోటిఫికేషన్‌ ప్రకారం 2014, డిసెంబర్‌ 31కి ముందు భారత్‌లోకి వచ్చిన ఆరు సామాజిక వర్గాలకు చెందినవారిని విదేశీయుల చట్టంలోని శిక్షల నుంచి పరిహరించారు. దీనివల్ల వారికి అధీకృత పాస్‌పోర్ట్‌, ఇతర పత్రాలు లేకపోయినా, వారిపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోరు. వారి ప్రవేశాన్ని, ఇక్కడ ఉండటాన్ని క్రమబద్ధీకరిస్తారు. ఆపై కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వీసా సౌకర్యం కల్పిస్తుంది. ఇక ఇప్పుడు సవరణ తీసుకురావడం తప్పనిసరి కావడానికి కారణం- ఈ నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా, పౌరసత్వ చట్టం ప్రకారం వీరిని అక్రమ వలసదారులుగానే పరిగణిస్తున్నారు. సవరణ తీసుకురానిదే వీరంతా, భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.

ఓటు బ్యాంకు రాజకీయం
ఇప్పుడే ఇలాంటి చట్టాన్ని ఎందుకు తెచ్చారనేది సమస్య కాదు, ఇంతకుముందు ఎందుకు తీసుకురాలేదన్నదే ప్రశ్నార్థకం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఎక్కువ కాలం కాంగ్రెస్‌ పాలనలోనే ఉంది. సదరు ఇస్లామిక్‌ దేశాలకు చెందిన హిందువులు, క్రైస్తవుల కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారు. అదే కాంగ్రెస్‌ పార్టీ ఇంకోవైపు, బంగ్లాదేశ్‌ ముస్లిం వలసదారులను ఎందుకు భారీ స్థాయిలో ప్రోత్సహించింది? వారందరినీ ఇంతకాలం ఓటుబ్యాంకుగా వాడుకుని, ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చేపడుతోంది. కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ముస్లిం సంతుష్టీకరణ విధానానికి అనుగుణంగా సాగుతోందనే విమర్శలు ఎలాగూ ఉన్నాయి. ఇలాంటి విధానంతో రాజకీయంగా తమకు పెద్దగా ఒరిగేదేమీ లేదని రుజువవుతున్నా ఆ పార్టీ తన వైఖరి మార్చుకోవడం లేదు. స్వాతంత్య్రం వచ్చాక ఎక్కువ కాలంపాటు ఈ దేశాన్ని పాలించిన పార్టీ తన క్షీణతను జీర్ణించుకోలేకపోతోంది. సవరించిన చట్టాన్ని సవాలు చేసేందుకు వ్యతిరేకులకు ఉన్న ఏకైక రాజ్యాంగపరమైన ఐచ్ఛికం- సుప్రీంకోర్టులో సవాలు చేయడమే. అంతకుమించిన మార్గం లేదు. కేంద్ర చట్టాన్ని అమలు చేయబోమంటూ బహిరంగంగా ప్రకటించేలా తమ ముఖ్యమంత్రుల్ని ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ నిప్పుతో చెలగాటమాడుతోంది. ఇలాంటి వైఖరితో తలెత్తే విపరిణామాలకు ఆ పార్టీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Posted on 19-12-2019