Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

మేలిమి విద్య అందని పండేనా?

* ర్యాంకుల పోటీలో భారత్‌ వెనకబాటు

దేశంలోని ఉన్నత విద్యాసంస్థల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దదని అఖిల భారత సర్వే (2018-19) చెబుతోంది. ఇందులో 993 విశ్వవిద్యాలయాలు, 39,931 కళాశాలలు, 10,721 స్వతంత్ర విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో చేరేందుకు అర్హులైన ప్రతి లక్షమంది విద్యార్థులకు ఉన్న కళాశాలల సగటు 28గా తేలింది. ప్రపంచంలో ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను రూపొందించేందుకు ‘టైమ్స్‌ ఉన్నత విద్య (టీహెచ్‌ఈ), వరల్డ్‌ యూనివర్సిటీస్‌ ఇన్‌సైట్స్‌ లిమిటెడ్‌’ సంస్థలు అంతర్జాతీయంగా విశ్వవిద్యాలయాలకు ర్యాంకులిచ్చే (వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- డబ్ల్యూయూఆర్‌) కార్యక్రమాన్ని 2010 నుంచి చేపడుతున్నాయి. బోధన, పరిశోధన, అనులేఖనాలు, అంతర్జాతీయ దృక్కోణం, పరిశ్రమ ఆదాయం వంటి కీలకమైన అయిదు అంశాల ఆధారంగా ఈ మదింపు చేపట్టారు. ఉత్తమ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఈ గణాంకాల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వర్సిటీలు, విద్యార్థులు, ఇతరులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

‘ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకులు-2020’లో 92 దేశాలకు చెందిన 1,396 వర్సిటీలు ఉన్నాయి. మొత్తం 95.4 స్కోరుతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తొలిస్థానాన్ని సాధించించింది. 94.5 స్కోరుతో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తరవాతి స్థానాన్ని పొందింది. అమెరికాలోని మంచి విద్యాసంస్థలన్నీ తొలి 100 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. తొలి వందలో స్థానం సంపాదించే విషయంలో యూకే సైతం చక్కటి పనితీరే చూపింది. కెనడా, సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, బెల్జియం, జపాన్‌, హాంకాంగ్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, దక్షిణ కొరియా, స్వీడన్‌, ఫిన్లాండ్‌, చైనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ తదితర దేశాలు తొలి 100 ర్యాంకులు సాధించిన విశ్వవిద్యాలయాల జాబితాలో ఉన్నాయి. ఈ విషయంలో చైనా, ఆస్ట్రేలియా వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. భారత్‌ నుంచి ఏ విద్యాసంస్థా తొలి 300 స్థానాల్లో చోటు సంపాదించలేకపోయింది. 2015 నుంచి 250-300 మధ్య స్థానం సాధిస్తున్న ఐఐఎస్‌సీ ఈసారి 300-350 స్థానాల స్థాయికి పడిపోయింది. 2012 నుంచి ఒక్క భారతీయ విద్యాసంస్థ కూడా తొలి 300 స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోయింది. చైనా, ఆస్ట్రేలియా, జర్మనీ, డెన్మార్క్‌ తదితర దేశాలు గత అయిదేళ్ల కాలంలో పరిస్థితిని మెరుగుపరచుకుంటుంటే, భారత్‌ మాత్రం దిగజారుతోంది.

బోధకులకు భారీ కొరత
భారత్‌లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో అంతరం ఎక్కువగా కనిపించడానికి కారణం- విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో తగినంత బోధన సిబ్బంది లేకపోవడమే. 2018 నాటి పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదిక ప్రకారం- విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) పరిధిలోకి వచ్చే కళాశాలల్లో 35 శాతం బోధకుల కొలువులు ఖాళీగా ఉన్నాయి. మనదేశంలో వర్సిటీల్లో అయిదు లక్షలమంది బోధకుల కొరత ఉంది. ఎంతోకాలంగా పెద్ద సంఖ్యలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం లేదు. దీనికి ఎన్నో కారణాలు తోడవుతున్నాయి. ఖాళీల భర్తీకి ప్రభుత్వాలు ఓ పట్టాన ఆమోదం తెలపకపోవడం, అర్హత కలిగిన అభ్యర్థులు దొరక్కపోవడం, విద్యాసంస్థ స్థాయిలో నిధుల కొరత, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల పిసినారితనం వంటి కారణాలెన్నో తోడవుతున్నాయి. కాలక్రమంలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుండటంతో బోధకుల కొరత అంతకంతకూ ఎక్కువవుతోంది. గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల్లో మంచి బోధకుల్ని సమకూర్చుకోవడం సవాలుగా మారింది. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత, పట్టణేతర ప్రాంతాలకు వెళ్లేందుకు బోధకులు ఇష్టపడకపోవడం సమస్యగా పరిణమిస్తోంది. తాత్కాలిక, స్వల్పకాలిక సిబ్బందిని నియమించుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సాధ్యమైనంత త్వరగా ఖాళీలు భర్తీ చేయాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఉన్నత విద్యాసంస్థల్ని ప్రపంచస్థాయికి తీర్చిదిద్దాలనేదే సర్కారు ప్రధాన ఉద్దేశం.

విద్యాసంస్థలకు ర్యాంకుల్ని కేటాయించే విషయంలో టీహెచ్‌ఈ సూక్ష్మస్థాయిలో నిర్దిష్ట పద్ధతిని అనుసరించింది. ప్రతి వర్సిటీకి ముందస్తుగా రూపొందించిన అయిదు రంగాలతో కూడిన 13 అంశాల పనితీరు సూచికల్ని లెక్కించారు. ఆయా అంశాల్లో ప్రతి విశ్వవిద్యాలయం సాధించిన స్కోర్లు, కొలమానాల ఆధారంగా తుది ర్యాంకుల్ని రూపొందించారు. ర్యాంకింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలనుకునే ఏ విశ్వవిద్యాలయమైనా కొన్ని నిర్దేశిత ప్రమాణాల్ని అందుకోవాల్సి ఉంటుంది. అయిదేళ్ల కాలవ్యవధిలో వెయ్యికిపైగా, ఏడాదిలో 150కిపైగా అధ్యయన పత్రాల్ని ప్రచురించడం, డిగ్రీ స్థాయిలో బోధన చేపట్టడం తదితర అంశాల్ని అర్హతలుగా నిర్దేశించారు. ఇతరత్రా మరికొన్ని నిబంధనల్నీ తప్పనిసరి చేశారు. పనితీరు సూచికల లెక్కింపు కోసం స్వయం సమర్పిత డేటా, బిబ్లియోమెట్రిక్‌ డేటా, సైటేషన్‌ డేటా తదితర స్కోర్లనూ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత అనలిటిక్స్‌ సంస్థ ఎల్సివియెర్‌ నిర్వహించే వార్షిక సర్వేనూ ఆధారంగా చేసుకున్నారు.

అధ్యాపకులే కీలకం
ఏ తరహా విద్యావ్యవస్థలోనైనా బోధకులదే ముఖ్యపాత్ర. నాణ్యమైన విద్యను అందించడంలో ఇతరులది సహాయ పాత్రే. విద్యాప్రమాణాల్ని లేదా నాణ్యతను ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన అంశాల్లో- విద్యాసంస్థలో ఉండే బోధన సిబ్బందిలోని నాణ్యత, సామర్థ్యం ప్రధానమైందిగా చెప్పవచ్ఛు బోధకుల నాణ్యత కాలక్రమంలో వారు గడించే అనుభవంలో ప్రతిబింబిస్తుంది. బోధకులు, విద్యార్థుల మధ్య నిష్పత్తి అధికంగా ఉంటే, ఒక్కో బోధకుడి పరిధిలో సగటున ఉండే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా భారం కూడా అధికమవుతుంది. విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉండటంవల్ల, ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడు తగిన రీతిలో ఏకాగ్రత చూపలేని పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి ఒత్తిళ్ల వల్ల ఉపాధ్యాయులు అవసరమైన రీతిలో సన్నద్ధం కాలేని పరిస్థితి నెలకొంటుంది. పరిశోధనలకూ తగిన సమయం కేటాయించలేరు. బోధన అనుబంధ కార్యకలాపాలపైనా దృష్టి సారించలేరు.

విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 2014-15లో 24.3గా ఉండగా, 2018-19 నాటికి 26.3కి పెరిగింది. ఇదే కాలంలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 22 నుంచి 29కి పెరిగింది. అంతర్జాతీయంగా పోల్చినప్పుడు... విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో భారత్‌- అమెరికా, యూకే, చైనా, బ్రెజిల్‌, కెనడా, రష్యా, స్వీడన్‌ తదితర దేశాలకన్నా వెనకంజలో ఉంది. ప్రపంచంలోని కొన్ని అత్యున్నత స్థాయి విద్యాసంస్థలు విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో ఏక అంకెను కలిగి ఉన్నాయి.

పరిశోధనలూ అంతంతే...
ప్రపంచ వర్సిటీ ర్యాంకింగ్‌లు ప్రాథమికంగా విశ్వవిద్యాలయాల పరిశోధన పాటవాన్ని ప్రతిబింబిస్తాయి. భారత్‌కు సంబంధించి ఏ ఒక్క విశ్వవిద్యాలయమూ తొలి 100 లేదా 200 స్థానాల్లోకి రాలేకపోవడానికి కారణం- పరిశోధనలో నాణ్యత లోపించడమే. ఏదైనా ఒక విద్యాసంస్థ అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటే, రంగాలతో సంబంధం లేకుండా ప్రభావశీల పరిశోధన చేపట్టేందుకు మంచి అధ్యాపకుల్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. భారత్‌లో దేశవ్యాప్తంగా గణనీయ సంఖ్యలో పరిశోధకులు, సాంకేతిక విద్యాసంస్థలు, వర్సిటీలు ఉన్నాయి. అందులో కేంద్ర/రాష్ట్ర ప్రాయోజిత, స్వయంప్రతిపత్తి సంస్థలూ ఉన్నాయి. అయితే, పరిశోధక విద్యాసంస్థల నాణ్యత సూచీలో 5 పాయింట్లకుగాను భారత్‌ స్కోరు 0.42 మాత్రమే. అమెరికా 3.88, చైనా 2.38 పాయింట్ల చొప్పున సాధించాయి. దేశంలో పరిశోధన, నవీకరణలపై పెట్టుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇది 2018లో జీడీపీలో 0.69 శాతంగా ఉంది. అమెరికాలో 2.8 శాతం, చైనాలో 2.1 శాతం, ఇజ్రాయెల్‌లో 4.3 శాతం, దక్షిణ కొరియాలో 4.2 శాతంగా ఉంది. భారత్‌లో పరిశోధనలపై పెడుతున్న వ్యయం క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2008లో 0.84 శాతం ఉన్న ఈ వ్యయం 2018లో 0.69 శాతానికి చేరింది. మన దేశంలో ప్రతి లక్షమందికి పరిశోధకుల సంఖ్య 15 మంది. చైనాలో 111, అమెరికాలో 423, ఇజ్రాయెల్‌లో 825 మందిగా ఉన్నట్లు తేలింది. కీలక పరామితులన్నీ తక్కువస్థాయిలో ఉండటంతో దేశం పేటెంట్లను, పెద్ద సంఖ్యలో నాణ్యమైన పరిశోధన ప్రచురణల్ని సాధించలేకపోతోంది. ప్రపంచ మేధోహక్కుల సంస్థ నివేదిక (2017) ప్రకారం భారత్‌ 46,582 పేటెంట్లకు దరఖాస్తు చేసుకుంది. అదే చైనా 13లక్షలకు పైగా, అమెరికా, 6లక్షలకు పైగా దరఖాస్తులు పెట్టుకున్నాయి. పరిశోధనాంశాల ప్రచురణలో భారత్‌ ప్రపంచంలో అయిదో స్థానంలో నిలుస్తోంది. భారత్‌కు సంబంధించిన మొత్తం ప్రచురణల్లో 15.8 శాతం మాత్రమే అగ్రస్థాయిలోని పది జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. ఇది యూకేలో 37.3 శాతం, అమెరికాలో 36.2 శాతం, జర్మనీలో 33.4 శాతం, చైనాలో 27.6 శాతం చొప్పున ఉన్నట్లు తేలింది. ఇదంతా చూస్తుంటే- పరిశోధన, నవకల్పనలు తక్కువ స్థాయిలో జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో- ఉన్నత విద్యలో నాణ్యత, శ్రేష్ఠత, సమ్మిళితత్వాన్ని సాధించాలనే దార్శనికతతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు 10 నైపుణ్య బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు తమ నివేదికల్నీ సమర్పించాయి. అమలు చేయదగిన ఆలోచనలతోపాటు, అవసరమైన పెట్టుబడుల వివరాలు, కాలవ్యవధి, పర్యవేక్షక యంత్రాంగాలు వంటి అంశాలను సూచించాయి. ఈ నివేదికలను అయిదేళ్ల (2019-24) దార్శనిక ప్రణాళికగా రూపొందించారు. దీన్ని విద్యా నాణ్యత ఉన్నతికి సమ్మిళిత కార్యక్రమం (ఎక్విప్‌)గా వ్యవహరిస్తున్నారు. భారత్‌ ప్రస్తుతం పెరుగుతున్న జనాభా ప్రయోజనాల్ని పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిళిత విద్యను రూపొందించడంతోపాటు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను ప్రపంచస్థాయి విద్యను అందించే దిశగా ప్రోత్సహించాలి. ప్రభుత్వం కనీసం కొన్నయినా అత్యుత్తమ ప్రతిభా సంస్థల్ని నెలకొల్పే దిశగా కృషి చేయాలి. ఈ తరహా విద్యాసంస్థలు నెలకొల్పే నాణ్యత ప్రమాణాలు దేశంలోని మిగతా సంస్థలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తాయి.

- డాక్టర్‌ టి.సిద్ధయ్య
(రచయిత- మాజీ రిజిస్ట్రార్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం)
Posted on 20-12-2019