Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

పేదలకోసం ఆహార ఛత్రం

* ఒకే దేశం... ఒకే రేషన్‌ కార్డు

జాతీయ ఆహార భద్రతా పథకం కింద రాష్ట్రాలు జారీ చేసిన రేషన్‌ కార్డులు ఇంతవరకు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. 2020 జూన్‌ 1 నుంచి కార్డుదారులు దేశంలో ఎక్కడైనా సరే రేషన్‌ సరకులు తీసుకునే వెసులుబాటు ఏర్పడనున్నది. ఆ రోజున ప్రారంభమయ్యే ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు పథకం ప్రభావమిది. భారత్‌లో గ్రామాల నుంచి పట్టణాలకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికీ, ఒకే రాష్ట్రంలో ఇతర జిల్లాలకూ వలసవెళ్లినవారి సంఖ్య 10 కోట్లని 2017 సంవత్సర ఆర్థిక సర్వే తె లిపింది. విద్య, వివాహం, ఉపాధివ్యాపారాల కోసం జనం వలస వెళుతుంటారు. వారిలో నిరు పేదలు కొన్ని సీజన్లలో ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వెళ్లి జీవనం సాగిస్తారు. అలాంటివారి సంఖ్య 4.2 కోట్లని ఒక అంచనా. వీరు పని చేసే చోటనే రేషన్‌ సరకులు తీసుకోవడానికి ఇంతవరకు అవకాశం ఉండేది కాదు. ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు పథకం అలాంటి అవకాశం కల్పించనున్నది. దీన్ని ప్రవేశపెట్టడానికి కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. మొదట పక్కపక్క రాష్ట్రాలను క్లస్టర్లుగా పరిగణించి, ఒక రాష్ట్రంవారు పొరుగు రాష్ట్రంలో రేషన్‌ సరకులు తీసుకునే సౌలభ్యం (పోర్టబిలిటీ) కల్పించారు. దీన్ని ప్రయోగాత్మక ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ, మహారాష్ట్ర-గుజరాత్‌, హరియాణ-రాజస్థాన్‌, కర్ణాటక-కేరళలలో అమలు చేశారు. దీని చలవతో నెల నెలా వెయ్యిమందికిపైగా ఆంధ్రప్రదేశ్‌ వలస కార్మికులు తెలంగాణలో రేషన్‌ సరకులు పొందుతున్నారని అధికారవర్గాలు తెలిపాయి. మరో 11 రాష్ట్రాల పరిధిలో ఒక జిల్లా వారు పక్క జిల్లాలో, ఒక ఊరివారు మరొక ఊరిలో రేషన్‌ సరకులు తీసుకునే సౌకర్యం కల్పించారు. జాతీయ స్థాయి పోర్టబిలిటీ మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలోని కొన్ని జిల్లాల్లో అందుబాటులోకి వచ్చింది. 2020 జనవరి నుంచి త్రిపుర, ఝార్ఖండ్‌, పంజాబ్‌, గోవా, మధ్యప్రదేశ్‌లకూ పోర్టబిలిటీని వర్తింపజేస్తారు. 2020 జూన్‌ నుంచి 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ పోర్టబిలిటీ కిందకు వస్తాయి.

ఏక రూపతవైపు...
ప్రస్తుతం రేషన్‌ కార్డులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటున్నాయి. ఇక నుంచి అందరూ ఒకే రూపంలో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని కేంద్రం సూచించింది. ఆ కొత్త కార్డులకు ఒక ప్రామాణిక రూపును ఏర్పరచింది. కార్డులు దేశంలో ఎక్కడైనా సరే చెల్లుబాటు కావడానికి వీలుగా వివరాలను స్థానిక భాషతోపాటు ఆంగ్లం, హిందీ భాషల్లో కూడా నమోదు చేస్తారు. ప్రతి రేషన్‌ కార్డుకూ 10 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. వాటిలో మొదటి రెండు అంకెలు కార్డు జారీ చేసిన రాష్ట్రం కోడ్‌ను తెలుపుతాయి. ప్రతి కుటుంబంలోని సభ్యులకు విడివిడిగా రెండు అంకెలు కేటాయిస్తారు. కార్డులో వివరాల నమోదు అంతా కంప్యూటర్‌ సాయంతో జరిగిపోతుంది.

ఏటా పంట కోతలకు ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ల నుంచి పంజాబ్‌, హరియాణాలకు కూలీలు వలస వెళుతుంటారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కొత్త కార్డులను తీసుకోవాలంటే అక్కడ సరైన చిరునామా ఉండదు. ‘ఈపోస్‌’ పరికరాలు, ఆధార్‌ కార్డుల అనుసంధానత ద్వారా ఈ అడ్డంకిని అధిగమించవచ్ఛు ఇప్పటికే ఈపోస్‌ సాధనాల సాయంతో రేషన్‌ సరకుల పంపిణీ ప్రక్రియను స్వయంచాలితం చేశారు. దేశంలో మొత్తం 5,34,960 రేషన్‌ దుకాణాలు ఉండగా వాటిలో 4,37,171 దుకాణాల్లో ఈపోస్‌ సాధనాలను ఏర్పాటుచేశారు. వాటిని బయోమెట్రిక్‌, ఆధార్‌ ధ్రువీకరణ సౌకర్యాలతో అనుసంధానించారు. రేషన్‌ సరకులు తీసుకోవాలంటే ఇవి రెండూ తప్పనిసరి. దేశంలోని 81.4 శాతం లబ్ధిదారుల కుటుంబాలలో కనీసం ఒక్కరికైనా ఆధార్‌ అనుసంధానత ఉన్నందున ఆ కుటుంబాలవారు దేశంలో ఎక్కడైనా సరే రేషన్‌ సరకులు తీసుకోవచ్ఛు రేషన్‌ కార్డులను ఆధార్‌, ఈపోస్‌ సాధనాలతో అనుసంధానించడం వల్ల 2013-18 మధ్యకాలంలో కేంద్రరాష్ట్రాలు 2.98 కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డులను తొలగించగలిగాయి.

ఆహార భద్రతకు బాటలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తర్‌ ప్రదేశ్‌ లతో సహా మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం రేషన్‌ దుకాణాలన్నింటికీ ఈపోస్‌ పరికరాలు ఉన్నాయి. బిహార్‌, దిల్లీలతోపాటు 9 రాష్ట్రాల్లోని రేషన్‌ షాపుల్లో ఈ పరికరాలు అరకొరగా కనిపిస్తున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరం రాష్ట్రాల్లో కనీసం ఒక్క దుకాణంలోనూ ఇప్పటివరకు ఈపోస్‌ లేదు. వీటన్నింటికీ ఈపోస్‌లను అమర్చాలని కేంద్రం సంకల్పిస్తోంది. బిహార్‌, పశ్చిమ్‌ బంగలలో ఈపోస్‌ సాధనాలను అమర్చవలసిన రేషన్‌ దుకాణాలు ఇంకా చాలానే ఉన్నందువల్ల అక్కడి రేషన్‌ దారులకు పూర్తిస్థాయిలో పోర్టబిలిటీ లభించదు. ఏటా కొన్ని సీజన్లలో పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కూలీల సంఖ్య ఈ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువ. బిహార్‌లోని మొత్తం 41,483 రేషన్‌ దుకాణాల్లో కేవలం 6,371 మాత్రమే ఈపోస్‌ సాధనాలు కలిగి ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు అంతర్జాల అనుసంధానత తెగిపోయినా, విద్యుత్‌ సౌకర్యం లోపించినా, ఈపోస్‌ సాధనాలకు మరమ్మతులు వచ్చినా రేషన్‌ సరకులు తీసుకోవడం కష్టమైపోతుంది. ఇలాంటి సాంకేతిక అవాంతరాలకు తావివ్వకుండా ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు పథకాన్ని అమలు చేస్తే వలస కూలీలకు కనీస ఆహార భద్రత చేకూరుతుంది.

భారత్‌లో 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం ఉపాధి కోసం అంతర్గత వలసలు ఎక్కువయ్యాయి. పేదరికం తాండవించే ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాల నుంచి అభివృద్ధిలో ముందున్న దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాలకు వలసలు పెరిగాయి. ఈ అంతర్గత వలస కార్మికులు నెలకు 10 వేల నుంచి 15 వేల రూపాయలవరకు ఆర్జిస్తారు. అందులో పెద్ద భాగాన్ని స్వరాష్ట్రంలోని కుటుంబాలకు పంపుతుంటారు. అందువల్ల వారి చేతిలో మిగిలే మొత్తాలు చాలా తక్కువ. వలస వచ్చిన రాష్ట్రంలోనే చౌక ధరకు ఆహార ధాన్యాలు కొనడానికి వీలు కల్పించే ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు పథకం కూలీలకు కచ్చితంగా ప్రయోజనకరం. ముఖ్యంగా దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహానగరాలకు వలస వచ్చిన కార్మికులు ఎంతో లబ్ధి పొందుతారు.

రంగం సిద్ధం చేయాలి
ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు పథకం విజయవంతం కావాలంటే పాత, కొత్త రేషన్‌ దారులకు అవసరమైన ఆహార ధాన్యాలను సిద్ధంగా ఉంచాలి. ప్రస్తుతం దేశమంతటా రేషన్‌ షాపులకు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కి చెందిన 2,100 గోదాముల నుంచి సబ్సిడీ ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నారు. ఈ గోదాముల్లో మూడు నాలుగు నెలలకు సరిపడా నిల్వలు ఉంటాయి. కొత్త పథకం అమలు కోసం అదనపు గోదాములను నిర్మించనక్కర్లేదు కానీ, వలస కూలీల కోసం ధాన్యం సరఫరాను మాత్రం పెంచాల్సి ఉంటుంది. సరఫరాలో ఏ మాత్రం లోటు ఏర్పడినా పథకం లక్ష్యమే దెబ్బతింటుంది. దీన్ని నివారించడానికి నెలనెలా రేషన్‌ షాపులకు గిరాకీకి తగ్గ సరఫరా జరిగేట్లు కేంద్రం జాగ్రత్త వహించాలి. 2019-20 బడ్జెట్‌ సబ్సిడీపై ఆహార ధాన్యాల సరఫరాకు రూ.1,84,220 కోట్లు కేటాయించింది. అది అంతకు ముందు సంవత్సరం కేటాయింపుతో పోలిస్తే 7.54 శాతం హెచ్ఛు జాతీయ ఆహార భద్రతా పథకం కింద దేశమంతటా 75 కోట్లమందికి సబ్సిడీ ధరకు ఆహార ధాన్యాలు విక్రయిస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్య చివరకు 81.35 కోట్లకు పెరగనుంది. ప్రతి లబ్ధిదారునికి 5 కిలోల ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నారు. బియ్యమైతే కిలో మూడు రూపాయలకు, గోధుమలు రెండు రూపాయలకు, చిరు ధాన్యాలు కిలో ఒక్క రూపాయికి విక్రయిస్తున్నారు. సబ్సిడీ ధాన్యం నిజమైన లబ్ధిదారులకే చేరడం ముఖ్యం.

బోగస్‌ కార్డులను ఏరివేయడానికి కేంద్రం ఇకపైన అన్ని రాష్ట్రాల ప్రజాపంపిణీ వ్యవస్థలను జాతీయ రేషన్‌ కార్డుదారుల సంగ్రహంతో అనుసంధానించదలచింది. ఈ సంగ్రహంలో పేర్లు నమోదైన లబ్ధిదారులు మాత్రమే దేశంలో ఎక్కడైనా సరే రేషన్‌ సరకులు తీసుకోవచ్ఛు బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌లలో ఆధార్‌, రేషన్‌ కార్డులను అనుసంధానించుకోలేకపోయిన పేదలు సబ్సిడీ ధాన్యం అందక ఆకలి చావులకు ఎర అయినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి దురదృష్టకర ఘటనలను నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

బోగస్‌ కార్డులను ఏరివేసి దేశమంతటా అర్హులకు ఆహార ధాన్యాలను సరఫరా చేయడానికి ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు పథకం వీలు కల్పించే మాట నిజమే కానీ, ప్రభుత్వ విశాల పథకంలో ఇది తొలి మెట్టు మాత్రమే కావచ్ఛు ఆహార ధాన్యాల బదులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి తత్సమాన నగదును జమ చేయడం ఉత్తమమని 2015లో శాంతకుమార్‌ కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని ప్రయోగాత్మక ప్రాతిపదికపై చండీగఢ్‌, పుదుచ్చేరిలలో అమలు చేస్తున్నారు కూడా. కాలక్రమంలో దేశమంతటికీ ఈ పథకాన్ని విస్తరించాలంటే ఆధార్‌, రేషన్‌ కార్డు, ఈపోస్‌ సాధనాలు, బ్యాంకు ఖాతాల అనుసంధానం ఎంతో కీలకం. కేంద్రం ఈ దిశగానే కదలుతున్నట్లు కనిపిస్తోంది.

- వరప్రసాద్‌
Posted on 27-12-2019