Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

సైనిక బలగాల త్రినేత్రం

* సమష్టిగా కదలాలిక త్రివిధ దళాలు

ప్రధానిగా అటల్‌ బిహారి వాజ్‌పేయీ జమానాలో మొగ్గ తొడిగిన ఓ ఆలోచనకు ఆయన జయంతికి ఒక్క రోజు ముందు మోదీ సర్కారు ఆచరణ రూపం ఇచ్చింది. దేశ త్రివిధ దళాల్లో సమన్వయం పెంచాలనే లక్ష్యంతో మహా దళపతి (సీడీఎస్‌) నియామకానికి పచ్చజెండా ఊపింది. కదన రంగంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జరిగే కాలహరణం గెలుపోటములను శాసిస్తుంది. సుబ్రమణ్యం కమిటీ నివేదికలో- ‘కార్గిల్‌’ యుద్ధంలో ఐబీ(ఇంటెలిజెన్స్‌ బ్యూరో), పరిశోధన-విశ్లేషణ విభాగా(రా)ల మధ్య సమన్వయ లోపాలను ఎండగట్టింది. దీంతోపాటు వాయుసేన మరింత ముందుగా కదన రంగంలోకి వచ్చి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేది. గతంలో చైనాతో యుద్ధసమయంలోనూ వాయుసేన దూరంగా ఉండటం భారత్‌కు నష్టదాయకంగా మారింది. మున్ముందు ఈ తరహా సమస్యలు ఎదురుకాకూడదని నాటి వాజ్‌పేయీ సర్కారు ఆ అంశంపై దృష్టి సారించి పలు కమిటీలను నియమించింది. నాటి సుబ్రమణ్యం కమిటీ, ఆడ్వాణీ నేతృత్వంలోని మంత్రుల బృందం, 2016లో డి.బి.షెకత్కర్‌ కమిటీ ‘మహాదళపతి’ ఏర్పాటుకు మొగ్గు చూపాయి. దాంతో పంద్రాగస్టు నాడు మహాదళపతి(సీడీఎస్‌) నియామకం ఖాయమని ప్రధాని మోదీ ప్రకటించేశారు.

ఎన్నదగిన ముందడుగు
అధికారగణం కారణంగా రక్షణ రంగంలో చాలా పనులు ఎటూ తేలకుండా మిగిలిపోతున్నాయన్న అపవాదును తొలగించుకోవడానికి కూడా మోదీ సర్కారు వేసిన తొలి అడుగుగా దీనిని భావించవచ్చు. నవంబరులో దేశ కీలక కార్యనిర్వాహక వర్గ అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ ‘మీరు నా అయిదేళ్ల కాలాన్ని వృథా చేశారు.. వచ్చే అయిదేళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కానివ్వను’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆమేరకు కార్యాచరణ మొదలుపెట్టారు. బ్యురాక్రాట్‌ అయిన రక్షణ శాఖ కార్యదర్శి పరిధిలోని పలు కీలక అంశాలను కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక వ్యవహారాల విభాగానికి బదిలీ చేశారు. ఈ సరికొత్త శాఖకు త్రివిధ దళాలకు చెందిన మహాదళపతి నేతృత్వం వహించనున్నారు. ఈయన త్రివిధ దళాల విషయంలో నేరుగా రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా, ‘న్యూక్లియర్‌ కమాండ్‌ అథారిటీ’ (అణ్వాయుధ కమాండ్‌)కి సంబంధించి ప్రధానికి సలహాదారుగా ఉంటారు. ఫలితంగా సైనిక సంస్కరణలు వేగవంతమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మహాదళపతి రాకతో ఆయుధ కొనుగోళ్లలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పరిమిత బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాల ప్రాధాన్య క్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేయనున్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి మూలుగుతున్న ముఖ్యమైన ప్రతిపాదనలు ఇక ముందుకు కదలనున్నాయి. వాస్తవానికి బాలాకోట్‌ దాడుల అనంతర పరిణామాల్లో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విమానం కూలిపోవడానికి ప్రధాన కారణాల్లో ఈ జాప్యమూ ఒకటి. కమ్యూనికేషన్లను అడ్డుకునే యుద్ధతంత్రాన్ని తప్పించుకొనే ‘యాంటీజామింగ్‌’ పరికరాల కొనుగోళ్లకు 2005లో వాయుసేన ప్రతిపాదనలు చేసింది. ఆ కొనుగోళ్లకు 2017వరకు మోక్షం లభించలేదు. ఫలితంగా అభినందన్‌ విమానం మొండి ధైర్యంతో ఎఫ్‌-16ను ఎదుర్కోవడానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ జాప్యానికి, మిగ్‌-21 నష్టానికి, ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు త్రివిధ దళాలను ఏకీకృతం చేసే కీలక బాధ్యతలను సైతం మహాదళాధిపతి పర్యవేక్షిస్తుండటంతో ఆయుధ ప్రాధాన్యం ఎంపిక సులువుకానుంది. రవాణ హెలికాప్టర్ల వంటి వాటిని త్రివిధ దళాలు విడివిడిగా కొనుగోలు చేస్తుండటంతో జరిగే వృథాకు అడ్డుకట్టపడనుంది. ముఖ్యంగా రవాణా, కమ్యూనికేషన్లలో సమష్టి తత్వం సాధించే కొద్దీ- పరికరాలు, మానవవనరుల ఖర్చుకు కళ్లెం పడనుంది. కీలకమైన కొనుగోళ్ల (క్యాపిటల్‌ అక్విజిషన్స్‌) బాధ్యతలను నేరుగా అప్పగించకపోయినా, ఆయుధ కొనుగోళ్ల మండలిలో సీడీఎస్‌ సభ్యుడిగా కొనసాగుతారు. దీంతో దళాల గొంతుక బలంగా వినిపించే అవకాశం ఉంది. త్రివిధ దళాల్లో సమష్టి తత్వాన్ని సాధించడం మహాదళపతి గురుతర బాధ్యతగా ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తు యుద్ధతంత్రం మొత్తం ‘సమష్టి’తత్వంపైనే ఆధారపడి ఉంది.

ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఈ విధానాన్ని ఏనాడో అమల్లోకి తెచ్చాయి. అమెరికాలో ‘గోల్డ్‌వాటర్‌-నికోలస్‌ చట్టం-1986’లోని చాలా అంశాలను ఇప్పుడు భారత్‌ అందిపుచ్చుకొంది. చైనా సైతం భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అయిదు థియేటర్‌ కమాండ్లను ఎప్పుడో ఏర్పాటు చేసింది. చెంగ్డూ, లాన్‌జిహు ప్రాంతాల్లోని సైనిక, వైమానిక దళాలను ఏకం చేసి పశ్చిమ థియేటర్‌ కమాండ్‌కు ఊపిరిపోసింది. ఇదే భారత్‌వైపు అన్ని కార్యకలాపాలను చూసుకొంటోంది. ఇక భారత్‌ మాత్రం చైనాను ఎదుర్కోవాలంటే అయిదు కమాండ్లు సమన్వయం చేసుకొంటూ పనిచేయాలి. ప్రస్తుతం త్రివిధ దళాలకు ఉన్న మొత్తం 17 కమాండ్లను సమ్మిళతం చేసి చైనా వైపు, పాక్‌వైపు, దేశ తీరప్రాంతానికి కలిపి మూడు థియేటర్‌ కమాండ్లను ఏర్పాటు చేయాలని డి.బి.షెకట్కర్‌ కమిటీ సూచించింది. ఇవికాక గగనతల రక్షణ, రవాణకు సంబంధించి కూడా ఇటువంటి కమాండ్‌లు ఉండాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సంఖ్యపై, విధివిధానాలపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టతరాలేదు. వీటికి అదనంగా వ్యూహాత్మక దళాల కమాండ్‌(అణు దాడికి), అండమాన్‌ నికోబార్‌ త్రివిధ దళ కమాండ్లు ఉండనే ఉన్నాయి. థియేటర్‌ కమాండ్ల ఏర్పాటు ప్రతిపాదనకు గతంలో సైనిక, నావికాదళాలు మాత్రం సానుకూలంగా స్పందించినా- వాయుసేన మాత్రం ముందస్తు హెచ్చరిక వ్యవస్థ(అవాక్స్‌), ఎయిర్‌ రీఫ్యూయలింగ్‌( గాల్లో ఇంధనం నింపే) విమానాలు వంటి వ్యవస్థలు ప్రతికమాండ్‌కు పూర్తిస్థాయిలో ప్రత్యేకంగా కేటాయించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా కొనుగోళ్ల ప్రాధాన్యాల ఎంపిక సీడీఎస్‌ చేతిలోకి రావడంతో ఆ లోటు వేగంగా తీరే అవకాశం ఉంది.

సమన్వయమే కీలకం
మహాదళాధిపతి బిపిన్‌ రావత్‌ ఆర్మీచీఫ్‌గా ఉన్న సమయంలో బహిరంగంగా చెప్పిన ‘కోల్డ్‌ స్టార్ట్‌’ యుద్ధతంత్రం అమలు చేయడానికి థియేటర్‌ కమాండ్లు అత్యంత అనుకూలంగా ఉంటాయి. 2001-02 ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’ సమయంలో సుందర్జీ డాక్ట్రిన్‌ (యుద్ధతంత్రం) ప్రకారం భారత్‌ దళాల సమీకరణ చేసుకొనేందుకు మూడువారాలకు పైగా సమయం పట్టింది. అప్పటికే పాక్‌ అప్రమత్తమైపోయింది. దీంతో ఆశించిన ఫలితం రాలేదు. ఆ తరవాత ఆర్మీ జనరల్‌ పద్మనాభన్‌ నేతృత్వంలోని బృందం ‘కోల్డ్‌స్టార్ట్‌’కు ఊపిరిపోసింది. ఆదేశాలు వచ్చిన 48గంటల్లోపు శత్రువులపై సర్వశక్తులతో విరుచుకుపడి దిగ్భ్రాంతికి గురిచేయడమే దీని ఉద్దేశం. త్రివిధ దళాలు ఇప్పటికీ తమ కార్యకలాపాలను ప్రధాన అధికారుల ఆదేశాల మేరకే నిర్వహిస్తాయి. దీంతోపాటు మహాదళాధిపతితో విభేదించే అంశాలపై దళాధిపతులు రక్షణ మంత్రికి తమ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛను ఇచ్చారు. మరోవంక మహాదళాధిపతి సైతం నాలుగు నక్షత్రాల హోదా ఉన్న అధికారే కావడంతో అతడికి నలుగురు దళాధిపతుల్లో ప్రథముడిగా మాత్రమే గుర్తిస్తారు. ముఖ్యంగా కొనుగోళ్లు, దళాల ఏకీకృతం వంటి కార్యకలాపాలపైనే మహాదళాధిపతి పట్టు ఉంటుంది. ఈ నేపథ్యంలో దళాల్లో సమష్టితత్వం పెంచి పోరాటపటిమను మెరుగుపరచడంతోపాటు వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థగా మాత్రమే సీడీఎస్‌ను చూడాలి. పదవీ విరమణ తరవాత ప్రభుత్వ పదవులను స్వీకరించడంపై నిషేధం, ప్రైవేటు పదవులను చేపట్టడంపై ఆంక్షలు విధించడం వంటివి వివాదాలకు దూరంగా ఉంచేందుకు తీసుకున్న చర్యలుగానే భావించాలి. త్రివిధ దళాల్లో సమష్టి తత్వాన్ని నెలకొల్పడం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం. అదీ మూడేళ్లలోగా సాధ్యం చేయాలి. ఈ లక్ష్యాలను సాధించేందుకు మహాదళాధిపతి కత్తిమీద సాము చేయాల్సి ఉంటుంది.

- పి.లక్ష్మీ తులసి
Posted on 01-01-2020