Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

భారత్‌ను కవ్విస్తున్న చైనా

చైనా మిడిసిపాటు అంతా ఇంతా కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణాచల ప్రదేశ్‌ సందర్శనకు చైనా ప్రభుత్వం నిరసన తెలపడం మిడిసిపాటు కాక మరేమిటి? చైనా ప్రభుత్వం బీజింగ్‌లోని భారత రాయబారిని పిలిచి మరీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ భారతదేశంలో అంతర్భాగమే అయినా, కొన్ని సంవత్సరాల క్రితం తన సైనిక పాటవాన్ని బాగా పెంచుకున్నప్పటి నుంచి చైనా వైఖరిలో మార్పు వచ్చింది. అరుణాచల్‌ కూడా తనదేనన్నట్లు ప్రవర్తిస్తోంది. మోదీ అరుణాచల్‌ సందర్శన తన 'ప్రాదేశిక సమగ్రతా హక్కులు, ప్రయోజనాలకు' భంగం కలిగించిందని బీజింగ్‌లోని భారత రాయబారి అశోక్‌ కాంథాకు చైనా ప్రభుత్వం చెప్పింది. అరుణాచల్‌ భారతదేశానికి చెందినది కాదని, అది అన్య భూభాగమని సూచించడానికి పిన్ను కొట్టిన వీసాలను అడ్డం పెట్టుకుంది. అరుణాచల్‌ నుంచి చైనా సందర్శనకు వెళ్లేవారి పాస్‌పోర్టుల మీద కాకుండా వేరే కాగితంపై వీసా ముద్ర వేసి పిన్ను కొట్టేది. అప్పట్లో దీన్ని భారత ప్రభుత్వం మౌనంగా భరించింది.

మెతక వైఖరి తగదు

గతంలో అరుణాచల్‌ను భారత్‌లో అంతర్భాగంగా చూపిన మ్యాపుల పట్ల చైనా నోరు మెదపలేదు. ఇటీవల వరకూ అరుణాచల్‌, చైనా సరిహద్దుల మధ్య ఉన్న చిన్న భూభాగం గురించి మాత్రమే విభేదాలు ఉండేవి తప్ప అరుణాచల్‌ ప్రతిపత్తి గురించి చైనా ఎన్నడూ సవాలు చేయలేదు. అలాంటిది చైనా ఉప విదేశాంగ మంత్రి లియు జెన్మిన్‌ ఉన్నట్టుండి అరుణాచల్‌పై మెలిక పెట్టడం దాని కండకావరాన్ని సూచిస్తోంది. 'సరిహద్దు సమస్యపై రెండు దేశాల మధ్య విభేదాలను మోదీ సందర్శన ద్వారా భారత్‌ కృత్రిమంగా ప్రేరేపించింది. సమస్య పరిష్కారానికి భారత్‌-చైనాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి, సూత్రాలకు విరుద్ధంగా ఉంది' అంటూ జెన్మిన్‌ పుల్లలు పెట్టారు. చైనా కవ్వింపులకు భారత్‌ చలించలేదు. ప్రధాని మోదీ మళ్ళీ అరుణాచల్‌ను సందర్శిస్తారని స్పష్టం చేసింది. ఈ సందర్శన తేదీని కూడా ప్రకటించి ఉంటే ఎంతో బాగుండేది. చైనా బెదిరింపులను ఖాతరు చేయబోనని తెగేసి చెప్పినట్లయ్యేది. ప్రధానమంత్రి అధికార కార్యక్రమాలన్నింటిని ముందే నిర్ణయించే మాట నిజమే. కానీ, వాటిలో దేన్నైనా రద్దు చేసుకుని మరీ అరుణాచల్‌ను సందర్శించడం మంచిది. తాజా వివాదాన్ని పురస్కరించుకుని మోదీ చైనా పర్యటనను రద్దు చేసుకోవడం ఇంకా మంచిది. ఈ ఏడాది మే నెలలో ఆయన చైనాలో అధికారికంగా పర్యటించవలసి ఉంది. దీన్ని రద్దు చేసుకొనే విషయంపై చర్చను ప్రభుత్వం కానీ, భారతీయ జనతాపార్టీ కానీ లేవనెత్తి ఉండాల్సింది. మోదీ పర్యటనను రద్దు చేసుకుంటే చైనా ఆగడంపై భారత్‌ తన నిరసనను ఘాటుగా వ్యక్తం చేసినట్లయ్యేది. తనను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించినట్లయ్యేది.

మోదీ చైనా పర్యటన రద్దయినా, వాయిదా పడినా బ్రహ్మాండమేదీ బద్దలవదు. పైగా చైనా దురహంకారాన్ని సహించబోనని భారత్‌ ఘాటుగా చెప్పినట్లవుతుంది. చైనా మనల్ని పనిగట్టుకుని కవ్వించింది కాబట్టి కుక్క కాటుకు చెప్పుదెబ్బ చందంగా వ్యవహరించి తీరవలసిందే. భారత సార్వభౌమత్వానికి సవాళ్లను తేలిగ్గా తీసుకోకూడదు. చైనాతో సంబంధాలు దెబ్బతింటాయనే కారణంతో భారత్‌ తన భూభాగాన్ని వదిలేసుకునే ప్రసక్తి తలెత్తదని మోదీ ఖండితంగా చెప్పాలి. తన భూభాగంపై చైనా కన్ను వేస్తే, ఆ దేశంతో సంబంధాలను తెగతెంపులు చేసుకుంటామని స్పష్టం చేయాలి. చైనా ఇప్పటికే ఈశాన్య భారతంలో గణనీయ భాగాన్ని కబ్జా చేసి ఉంది. ఒకరి ప్రాదేశిక సమగ్రతను రెండోవారు గౌరవించినప్పుడే భారత్‌-చైనా సంబంధాలు మెరుగుపడతాయి.

ఇప్పటికే ఒకసారి చైనాను నమ్మి మోసపోయిన భారత్‌, చైనా ఆధిపత్య ధోరణి పట్ల సదా అప్రమత్తంగా ఉండవలసిందే. స్వతంత్ర భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్‌ నెహ్రూ గతంలో ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో ఇలా అన్నారు- 'ప్రపంచ దేశాల మధ్య నిజమైన శాంతి సహకారాలు నెలకొనకపోయినా, కనీసం భారీ యుద్ధం విరుచుకుపడకుండా నివారించడానికి మనం గట్టిగా ప్రయత్నించాలి. దీనివల్ల తరవాత శాంతియుత పరిష్కారం కనుగొనడానికి ప్రపంచానికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఇంతచేసినా యుద్ధం సంభవిస్తే, దానికి మనం దూరంగా ఉండాలి. రెండు పెద్ద దేశాల మధ్య వైరానికి భూగోళంపై కొంత భాగాన్నయినా దూరంగా ఉంచితే, ప్రపంచానికి కొంతైనా మేలు జరుగుతుంది. అందుకే మనం రెండు ప్రధాన (అమెరికా, సోవియట్‌) కూటములకు దూరంగా ఉంటున్నాం. ఈ కారణంతోనే మధ్యప్రాచ్య రక్షణ సంస్థలోకాని, ఆగ్నేయాసియా కూటమిలో కాని భారత్‌ చేరలేదు'

నెహ్రూ శాంతిదూతగా వ్యవహరించడానికే కట్టుబడ్డారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని మోదీ భావిస్తున్నారని చెప్పలేం. కానీ, అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సాయంతో సంఘర్షణను నివారించడానికి ఆయన కృషి చేయగలుగుతారు. ప్రపంచ వ్యవహారాలను శాసించడానికి చైనా ప్రయత్నించడం కొత్తేమీ కాదు. తనను తాను ఒక చక్రవర్తిలా పరిగణించుకుంటూ మిగతా ప్రపంచాన్ని తన దర్బారుగా వూహించడం చైనాకు అలవాటే. ఇక్కడ నాకు జరిగిన ఒక అనుభవం గురించి చెప్పాలి. గతంలో బీజింగ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఇప్పటికీ కొంత భారతీయ భూభాగం చైనా అధీనంలో ఉందని నేను ప్రస్తావించాను. అది వినగానే సమావేశానికి హాజరైన చైనా మాజీ సైనికాధికారులు ఆగ్రహంతో వూగిపోయారు. '1962లో మేము చెప్పిన గుణపాఠాన్ని మీరు మరిచిపోయినట్లుంది' అని అన్నారు. నెహ్రూ టిబెట్‌ను చైనా అంతర్భాగంగా గుర్తించి పొరపాటు చేశారు. దీనివల్ల భారత్‌-చైనా సంబంధాలు మెరుగుపడతాయని ఆయన ఆశించి ఉండవచ్చు. హిందీ చీనీ బాయి బాయి నినాదాలు ఆయన్ను ఏమార్చి ఉండవచ్చు. అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్‌ లై ప్రపంచ దేశాల్లో నెహ్రూకు ఉన్న పేరు ప్రతిష్ఠలను ఉపయోగించుకోవాలనుకున్నారు. తాను ఆశించినది నెరవేరగానే నిజస్వరూపాన్ని బయటపెట్టుకుని 1962లో భారత్‌పై దురాక్రమణకు ఒడిగట్టారు.

అనుమానాస్పద మోహరింపులు

చైనాతో సత్సంబంధాలను నెలకొల్పుకోవడం అవసరమే కానీ, దానికి మన భూభాగాన్ని పణంగా పెట్టనక్కర్లేదు. అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని గుర్తించడానికి చైనా నిరాకరిస్తుంటే, మన ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం వల్ల ఉపయోగమేమిటి? చైనా ఈ అంశాన్ని గుర్తించకపోవడం భారత్‌ను అవమానించడమే. భారత్‌ ఈ అవమానాన్ని తుడిచివేసుకుని చైనాకు స్నేహహస్తం సాచాల్సిన అవసరం లేదు. మొత్తం మీద భారత్‌, చైనాల మధ్య సయోధ్య ఈ ప్రాంతంలో శాంతిసాధనకు కీలకం. అయితే, భారత్‌ మాదిరిగా చైనా కూడా ఈ విషయంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలి. చైనా ప్రస్తుతం నేపాల్‌కు భారీగా సాయం అందిస్తూ, శ్రీలంకలో ఒక రేవు నిర్మిస్తోంది. మియన్మార్‌నూ దగ్గర చేసుకుంటోంది. ఈ విధంగా భారత్‌ను చక్రబంధంలో ఇరికించడానికి చైనా వ్యూహం పన్నుతోంది. భారత్‌తో సమాన హోదాలో సంబంధాలు నెరపాల్సింది పోయి, తాను బలాధిక్య స్థానంలో భారత్‌ బలహీన స్థానంలో ఉన్నట్లు వ్యవహరిస్తోంది. మన ఇరుగుపొరుగును భారత్‌పై ఒత్తిడి సాధనంగా ప్రయోగించాలని చూస్తోంది. మన రెండు దేశాల మధ్య నిజంగా శాంతి, స్నేహాలు నెలకొనాలంటే చైనా తన పంథాను మార్చుకోవలసి ఉంటుంది.

(రచయిత - కులదీప్ నయ్యర్)
(ప్రముఖ పాత్రికేయులు, బ్రిటన్‌లో భారత మాజీ హైకమిషనర్‌)
Posted on 04-03-2015