Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

జనం కోసమే జనగణన

* వ్యతిరేకత సబబేనా?

పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని రాజకీయ పక్షాలు చేపట్టిన తప్పుడు ప్రచారం తాకిడి జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్‌), జనగణనకూ పాకింది. ప్రభుత్వ పాలనలో కీలకంగా నిలిచే ఎన్‌పీఆర్‌, జనగణన కార్యక్రమాలపై రాజకీయ పక్షాలు తప్పుడు సమాచారాన్ని చేస్తున్నాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లలో మతపరమైన పీడనకు గురైన అల్పసంఖ్యాక వర్గాలకు పౌరసత్వం కల్పించడమే పౌరసత్వ సవరణ చట్టం (2019) లక్ష్యం. ఈ మూడు దేశాల నుంచి 2014 డిసెంబర్‌ 31లోపు సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చినవారికే పౌరసత్వం దక్కుతుంది. భారతీయ పౌరులెవ్వరికీ, ఏ మతంవారైనా దీనితో ఎలాంటి సంబంధం లేదు. చట్టంలో నిర్దిష్ట గడువు విధించడం వల్ల వలసదారులకు తలుపులు బార్లా తెరిచినట్లూ కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి.

ఎన్‌పీఆర్‌, పదేళ్లకోసారి చేపట్టే జనగణన జనాభా వివరాల సేకరణకు ఉద్దేశించినవి మాత్రమే. దేశంలోని విభిన్న ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థాయుల సమాచారాన్ని ఈ కార్యక్రమంలో సేకరిస్తారు. ఎవరి పేర్లనూ తొలగించాలనే లక్ష్యంతో ఇవి చేపట్టరు. జనగణనలో వ్యక్తుల బయోమెట్రిక్‌ సమాచారాన్ని సేకరణకు 2010లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఎన్‌పీఆర్‌ను రూపొందించి, ప్రవేశపెట్టింది. ఇందులో గణకులు ఇంటింటికీ వెళ్లి అంతకుముందు ఆరు నెలలుగా అక్కడ నివసిస్తున్నవారి వివరాలు సేకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్‌ పార్టీయే ఇప్పుడు వ్యతిరేకించడం ఓ నాటకంలా ఉంది. జనగణన అనేది ప్రాథమికంగా పౌరుల సంఖ్య లెక్కింపు. ఇది ప్రభుత్వపరంగా, గణాంకాల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కసరత్తుగా పేరొందింది. డేటా సేకరణకు 30 లక్షల మందిని రంగంలోకి దించుతారు. ఈసారి తొలిసారిగా, జనగణన సమాచార సేకర్తలు మొబైల్‌ యాప్‌ తదితర ఆధునిక ఉపకరణాల ద్వారా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించనున్నారు.

భారత్‌లో దశవార్షిక జనగణన ప్రక్రియను 1892 నుంచి నిరాటంకంగా చేపడుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన కసరత్తు. దీనివల్ల గత పదేళ్లలో జాతీయ, స్థానిక స్థాయుల్లో జనాభాపరంగా వచ్చిన మార్పులు తెలుస్తాయి. ఈ రెండు సర్వేలు విధాన రూపకర్తలకు కీలకమైన వివరాలను సమకూరుస్తాయి. ఆ మేరకు జాతీయ కార్యక్రమాల్ని రూపొందిస్తారు. ముఖ్యంగా, సమాజంలోని బలహీన వర్గాలకు ప్రాథమిక సౌకర్యాలను అందించడం తేలికవుతుంది. ఇళ్లు, విద్య, ఆర్థిక కార్యకలాపాలు, అక్షరాస్యత, వలసలు, సంతానం, భాషలు, మతం, ఎస్సీ, ఎస్టీ వంటి విభిన్న పరామితులపై గ్రామ, పట్టణ, వార్డుల స్థాయిలో సూక్ష్మస్థాయి డేటాను అందించేందుకు జనగణనే అతిపెద్ద వనరు.

ఎన్‌పీఆర్‌ను రూపొందించడం, జనగణన చేపట్టడం కేంద్రప్రభుత్వానికి సంబంధించిన చట్టబద్ధమైన కార్యక్రమం. దీనిద్వారా సేకరించే సమాచారం కేంద్ర ప్రభుత్వానికే కాకుండా, రాష్ట్ర, జిల్లా, అంతకన్నా దిగువ స్థాయిలో విధానాల రూపకల్పనకు ఆధారంగా నిలుస్తుంది. వివరాల నమోదు సందర్భంగా తప్పుడు పేర్లు, చిరునామాలు ఇవ్వాలంటూ అరుంధతిరాయ్‌ వంటివారు పిలుపివ్వడం దిగ్భ్రాంతికరం. దీనివల్ల మొత్తం కసరత్తు లక్ష్యమే దెబ్బతినే ప్రమాదముంది. జనాభా సమాచారాన్ని సేకరించే ప్రక్రియలో ప్రభుత్వ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు ఆమె యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన పిలుపుల వల్ల దేశ సమైక్యత సమగ్రతలకు ముప్పు వాటిల్లుతుంది. ఈ తరహా చర్యల్ని ఎంత మాత్రం అనుమతించకూడదు.

ఎన్‌పీఆర్‌ కోసం సమాచార సేకరణ చేపట్టడం ముస్లిములకు వ్యతిరేకమంటూ సాగుతున్న దుష్ప్రచారం ఆధార రహితం. కొంతమంది వాస్తవాలకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఏ రకంగా చూసినా గణాంక సమాచారం ఎంతో కీలకమైనది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను, సంక్షేమ పథకాలను రూపొందిస్తుంటాయి. ముఖ్యంగా మత, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల పరిస్థితుల్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో వీటిని చేపడతాయి. విద్య, ఉద్యోగిత, నైపుణ్య, స్వయంఉపాధి కోసం ఆర్థిక సహాయం వంటి అంశాలతో పథకాల్ని రూపొందిస్తారు. ఇవి జనాభా సమాచారంపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల పదేళ్లకోసారి జనగణన తప్పనిసరి.

రాజ్యాంగం ప్రకారం మతపరంగానే కాకుండా, భాషాపరమైన మైనారిటీలూ ఉన్నారు. రాజ్యాంగంలోని 29, 30 అధికరణల ద్వారా ఉభయ వర్గాలకూ ఒకే తరహా రక్షణ లభిస్తుంది. ఎవరు మైనారిటీ అనేది నిర్ధరించేందుకు రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం హిందీ ఆధిక్య హరియాణాలో ఒక కన్నడిగ వ్యక్తి, హిందూ ఆధిక్య హరియాణాలో ఒక ముస్లిం వ్యక్తితో సమానంగా రక్షణ పొందుతారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రభుత్వ చట్టబద్ధ కార్యక్రమమైన జనాభా వివరాల సేకరణను వ్యతిరేకిస్తున్నారంటే, వారి సంఖ్యకు సంబంధించిన వివరాలు బయటపడతాయనే భయం వారిలో ఉందనుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా ముస్లిం జనాభా భారీగా పెరిగిన ఫలితంగా, హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీల వృద్ధిరేట్ల మధ్య చాలా ఎక్కువ స్థాయిలో తేడా ఉండే అవకాశం ఉంది. ఇది భారత్‌లో ముస్లిములు పీడనకు గురయ్యారనే ప్రచారానికి ముగింపు పలుకుతుందనే అభిప్రాయాలున్నాయి. ఇస్లామ్‌ను అనుసరించే భారతీయ పౌరులు తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా నిలబడాలి. ఎన్‌పీఆర్‌, జనగణనలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచార మాయలో పడకూడదు. ఈ తరహా ధోరణులు ఇదేవిధంగా కొనసాగితే నియంత్రించలేని స్థాయిలో భారత దేశం అస్తవ్యస్తమవుతుంది.

- ఎ.సూర్యప్రకాశ్‌
(రచయిత- ప్రసార భారతి ఛైర్మన్‌)
Posted on 06-01-2020