Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

విద్యుత్తుతో ఓటు రాజకీయాలా?

* చట్ట సవరణకు కేంద్రం సమాయత్తం

* డిస్కమ్‌లను ముంచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు

* ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరుగా పేదలకు కరెంటు ఛార్జీలు

* రాయితీలు భరిస్తున్నామంటూ నిధులివ్వని రాష్ట్రాలు

* ఏళ్ల తరవాత ‘ట్రూఅప్‌’ పేరిట ప్రజలపై వడ్డింపు

‘వరసగా అయిదో ఏడాది కరెంటు ఛార్జీలు పెంచలేదు. అందుకు భిన్నంగా వాటిని తగ్గించాం. దేశవ్యాప్తంగా చూసినా దిల్లీలో రుసుములు తక్కువగా ఉండటమే కాదు, నిరంతర విద్యుత్‌ సరఫరా అమలవుతోంది’- నిరుడు జులై 31నాటి దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ సందేశమిది. దీని ప్రకారం గత ఆగస్టు ఒకటి నుంచి దేశ రాజధాని రాష్ట్రమైన దిల్లీలో 200 యూనిట్లలోపు వాడే ఇళ్లన్నింటికీ కరెంటు బిల్లు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తున్నట్లు ప్రకటించారు. 201 నుంచి 400 యూనిట్ల వరకూ గత జులై వరకూ చెల్లించిన ఛార్జీల్లో రాయితీ ఇచ్చారు. ఈ నిర్ణయాల వల్ల పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల విద్యుత్‌ భారాన్ని రూ.1,720 కోట్ల వరకు దిల్లీ ప్రభుత్వం నెత్తినెత్తుకుంది. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాజకీయ పార్టీలను ఉలిక్కిపడేలా చేసింది. ఫిబ్రవరి ఎనిమిదిన దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కేజ్రీవాల్‌ మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లోనూ పాలక ప్రభుత్వాలు ఎన్నికల లబ్ధి కోసం పేదలకు విద్యుత్‌ రాయితీలు ఇవ్వడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. విద్యుత్‌ రంగాన్ని ఆర్థికంగా నిలువెల్లా ముంచేసేలా సాగుతున్న ఈ రాయితీలపై కొరడా ఝుళిపించేందుకే విద్యుత్‌ చట్టం(2003) సవరణ బిల్లును పార్లమెంటులో సత్వరం ఆమోదింపజేయడానికి కేంద్రం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

విపరీత పోకడలు
ఓటు రాజకీయాలకు విద్యుత్‌ రంగం కల్పవృక్షంలా మారింది. రాయితీలవల్ల ఆర్థికంగా దెబ్బతింటున్న విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లను, విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)లను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కావడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2019-20) ఆరంభంలో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో అటు కేంద్రంలో, ఇటు ఉత్తర్‌ ప్రదేశ్‌లో విజయం కోసం భాజపా ప్రభుత్వం విద్యుత్‌ రాయితీలకు నిధుల కేటాయింపులో ఏడాది ముందు నుంచే ఉదారంగా వ్యవహరించింది. 2017-18తో పోలిస్తే 2018-19లో రాయితీ నిధుల కేటాయింపు ఏకంగా 55 శాతం అదనంగా పెంచింది. అంతకుముందూ యూపీలో ప్రభుత్వం 2010-11తో పోలిస్తే 2011-12లోనూ 71 శాతం పెంచేసిందని ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో ఎండగట్టింది. ఎన్నికలు లేని ఏ ఏడాదిలో రాయితీ నిధుల పెంపు అధికంగా లేకపోవడం గమనార్హం. కరెంటు ఛార్జీలను యథాతథంగా కొనసాగించారు. నిరుడు మే నెలలో ఎన్నికలు పూర్తయ్యాకే అసలు బండారం బయటపడింది. ఏకంగా 15శాతం మేర విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. వాస్తవానికి విద్యుత్‌ చట్టం-2003 ప్రకారం ఏటా మార్చి 31కల్లా కరెంటు ఛార్జీల సవరణ ఆదేశాలను ఇచ్చి ఆర్థిక సంవత్సరం ఆరంభం రోజు(ఏప్రిల్‌ 1) నుంచే అమలుచేయాలి. యూపీ సహా అనేక రాష్ట్రాలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించాయి. పంజాబ్‌లో ఎన్నికలైన పక్షం రోజుల్లోనే ఛార్జీల పెంచి అమలులోకి తెచ్చారు. బిహార్‌లో 2013-18 మధ్య ఆరేళ్లలో ఏటా సగటున రూ.3,278 కోట్లు రాయితీగా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో పేదలకిచ్చే రాయితీ నిధులు ఏటా ఒక్కో తీరుగా ఉంటోంది. 2015-16లో మొత్తం విద్యుత్‌ రాయితీ నిధుల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు 44 శాతం దక్కితే, మరుసటి ఏడాది(2016-17) 16 శాతానికి తగ్గించారు. 2017-18లో మళ్ళీ 28 శాతానికి పెంచారు. ఇలా రాష్ట్ర పాలకులకు అవసరం వచ్చినప్పుడు పెంచుతున్నారు లేకపోతే తగ్గిస్తున్నారు. హరియాణాలో రాయితీల పెండింగు బకాయిలు ఏటా 66 శాతం చొప్పున అదనంగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్ర డిస్కమ్‌లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ బకాయిలు 2010లో రూ.297 కోట్లుంటే 2016కల్లా రూ.3,802 కోట్లకు ఎగబకాయి. గుజరాత్‌లోనూ విద్యుత్‌ సంస్థలు తెచ్చే అప్పులు భారీగా పెరిగాయి. పంజాబ్‌లో గతేడాది రూ.8,000 కోట్లను రాయితీ పద్దు కింద ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, బీసీలు, దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంటు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు అందాల్సిన బకాయిలు రూ.14,972 కోట్లకు చేరాయి. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో 2016లో మొత్తం రాయితీ నిధుల్లో గృహ వినియోగదారులకే 48 శాతం కేటాయించారు. ఆ మరుసటి ఏడాది(2017-18)లో ఎన్నికలు లేకపోవడం వల్ల విద్యుత్‌ రాయితీ రూ.7,700 కోట్లలో గృహ వినియోగదారులకిచ్చే వాటాను 33 శాతానికి తగ్గించారు.

కరెంటు ఛార్జీల రాయితీలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఉన్నప్పుడు, లేనప్పుడు ఒక్కో రకంగా నిర్ణయించి ప్రజలను మభ్యపెడుతున్నాయి. విద్యుత్‌ చట్టం ప్రకారం డిస్కం కరెంటు కొన్న ధరకు 20 శాతంలోపు మాత్రమే పెంచి లేదా తగ్గించి ప్రజల నుంచి వసూలు చేయాలి. కొన్ని రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదు. దిల్లీ ప్రభుత్వం యూనిట్‌ కరెంటును అయిదు రూపాయల వరకూ కొని 200 యూనిట్లలోపు వాడేవారికి ఉచితంగా ఇస్తోంది. వారి తరపున రూ.1,720 కోట్లను రాయితీగా ఈ ఏడాది భరిస్తోంది. పొరుగున యూపీలో 150 యూనిట్లలోపు కరెంటు వాడే ప్రజలకిచ్చే కరెంటు ఛార్జీని రూ.4.90 నుంచి రూ.5.50కి యూపీ ప్రభుత్వం ఈ ఏడాదే పెంచేసింది. అంటే దిల్లీలో 200 యూనిట్లలోపు వాడేవారికి విద్యుత్‌ ఉచితం. యూపీలో 151 యూనిట్లు వాడితే రూ.825 బిల్లు కట్టాలి. బిహార్‌లో 200 యూనిట్లకు రూ.700 బిల్లు వస్తోంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ్‌ బంగ, అసోం వంటి నిరుపేదలు అధికంగాగల రాష్ట్రాల్లో అధిక కరెంటు ఛార్జీలతో పేద కుటుంబాల నడ్డివిరుస్తున్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరొందిన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీ, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో పేదలకు అతి తక్కువ ధరలకే కరెంటు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. వెనకబడిన రాష్ట్రాల్లోని పేదలకు సాయం చేయకుండా, అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మాత్రం పేదలకు అతి తక్కువ ఛార్జీలకు ఇస్తున్నామని చెప్పడం ఏం న్యాయం? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 19 ఏళ్లుగా పేద కుటుంబాలు వాడే కరెంటు ధర యూనిట్‌ ఛార్జీ రూ.1.45 మాత్రమే. అగ్రదేశం అమెరికాలో జాతీయ సగటు రుసుము యూనిట్‌కు 13.1 సెంట్లు(రూ.9.41). అక్కడి రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తిని బట్టి 34.43 సెంట్ల నుంచి 9.83 సెంట్ల మధ్య ధర అమలవుతోంది. మనదేశంలో అసలు సొంత విద్యుదుత్పత్తి కూడా లేని దిల్లీ రాష్ట్రం పూర్తి ఉచితంగా కరెంటును ప్రజలకు ఇస్తోంది. పలు దేశాల్లో డిమాండు-సరఫరా అనే వ్యాపార సూత్రం; విద్యుత్‌ కొనుగోలు ధర ప్రాతిపదికన ఛార్జీలు ఉంటాయి. మనదేశంలో ఓటు రాజకీయాల మేరకు ఛార్జీలు నిర్ణయిస్తున్నారు.

నిబంధనలు కఠినతరం
రాష్ట్రాల ఇష్టానుసార నిర్ణయాలకు కళ్లెం వేయడానికి విద్యుత్‌ చట్టం సవరణ బిల్లులో కేంద్రం పలు కఠిన నిబంధనలు పెట్టింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీని ఆమోదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఆఖరుకే డిస్కమ్‌ల నష్టాలు రూ.28,369 కోట్లకు చేరాయి. ఇప్పుడవి మరింత ఎగబాకాయి. తెలుగు రాష్ట్రాల డిస్కమ్‌ల నష్టాలు రూ.10 వేల కోట్లను దాటాయి. సకాలంలో బిల్లు చెల్లించే వినియోగదారులకు బిల్లు సొమ్ములో ఒక శాతం రాయితీ ఇస్తూ బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శం. డిస్కమ్‌ల అంతర్గత పనితీరు మెరుగుపడేలా కఠిన నిర్ణయాలుండాలి. నష్టాలు, అప్పులు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వాలే దిక్కన్నట్లుగా డిస్కమ్‌లు పనిచేయడం సరికాదు. కంపెనీ చట్టం కింద ఏర్పాటైన డిస్కం సొంత వ్యాపార ప్రణాళికలతో ఆదాయం పెంచుకోవాలి. ఛార్జీల పెంపు దగ్గరి నుంచి ఉద్యోగుల జీతాల వరకు ప్రతీ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుని అమలుచేస్తే ఇక కంపెనీ చట్టం కింద ఏర్పాటైన డిస్కమ్‌లకు సొంత అస్తిత్వం ఏముంటుంది? విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో చేసుకున్న ధరలకన్నా తగ్గించి వినియోగదారులకు ఇచ్చే అధికారం డిస్కమ్‌లకు ఉండరాదు. ఎంత ధరకు ఇవ్వాలనే సీలింగ్‌ మాత్రమే ఈఆర్‌సీ నిర్ణయించాలనే నిబంధన బిల్లులో పెట్టడం హర్షణీయం. దేశమంతా పేదలకు ఒకేతీరుగా కరెంటు ఛార్జీలుండాలి. విద్యుత్‌ రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు ఆ నిధులను పక్కాగా డిస్కమ్‌లకు చెల్లించాలి. డిస్కమ్‌ల నష్టాలు పూడ్చడానికి కొన్నేళ్ల తరవాత ‘ట్రూఅప్‌ ఛార్జీ’ల పేరిట ప్రజల నుంచే వసూలు చేసే ప్రస్తుత అస్తవ్యస్త విధానాలకు కొత్త బిల్లుతో చరమగీతం పాడాలి. వ్యక్తుల నిర్ణయాలకు వ్యవస్థలు బలవుతున్నాయని చెప్పడానికి డిస్కమ్‌ల నష్టాలు, అప్పులే నిదర్శనం.

- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 20-01-2020