Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

శాంతివైపు కీలక మలుపు

* బోడోలతో మరో ఒప్పందం

ఎంతోకాలంగా కొనసాగుతున్న బోడో ఉద్యమానికి ముగింపు పలుకుతూ... కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27న (సోమవారం) ఆకస్మికంగా బోడోలతో ఒప్పందం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అసోం ప్రభుత్వం, పలువురు బోడో నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం ఫలితంగా- కేబినెట్‌ హోదాగల రాష్ట్ర మంత్రి, బోడోల్యాండ్‌ స్వయంప్రతిపత్తి మండలి (బీఏసీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధితో కూడిన త్రైపాక్షిక యంత్రాంగం బోడోల్యాండ్‌ ప్రాదేశిక ప్రాంతంలోని అన్ని కార్యకలాపాలనూ పర్యవేక్షిస్తుంది. వీరు ఏడాదికి కనీసం రెండుసార్లయినా సమావేశమవుతారు. ఒప్పందంలోని నిబంధనల్ని నిశితంగా పరిశీలిస్తే, బోడోలకు న్యాయబద్ధంగా, హక్కుభుక్తంగా మరిన్ని కార్యనిర్వాహక, శాసనపరమైన, పరిపాలన సంబంధ, ఆర్థిక అధికారాలు గతంలోకన్నా ఎక్కువగా సమకూరే అవకాశం ఉంది. మరోవైపు, రాబడిని అందించే వనరుల్ని కోల్పోవడం వల్ల రాష్ట్రానికి ఆర్థికపరంగా బలమైన ఎదురు దెబ్బ తప్పకపోవచ్ఛు ఆర్థికంగా అసోంకు గతంలోకంటే ఎక్కువ అవకాశాల్ని కల్పించాల్సిన పరిస్థితి కేంద్రానికీ ఏర్పడుతుంది.

తాజాగా జరిగిన ఒప్పందం మూడోది. ఒక్కో ఒప్పందం ఒక్కో అడుగు ముందుకేస్తూ, మరింత స్వయంప్రతిపత్తి దిశగా నడిపించాయి. ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏబీఎస్‌యూ)తో 1993లో తొలి ఒప్పందం కుదిరింది. దీని ఫలితంగానే బోడోల్యాండ్‌ స్వయంప్రతిపత్తి మండలి (బీఏసీ) ఏర్పడింది. 2003లో బోడో లిబరేషన్‌ టైగర్స్‌ (బీఎల్‌టీ)తో రెండో ఒప్పందం కుదిరింది. ఫలితంగా బోడోల్యాండ్‌ ప్రాదేశిక మండలి (బీటీసీ) ఏర్పడింది. దీనికి బీఏసీకన్నా ఎక్కువ అధికారాల్ని కట్టబెట్టారు. ప్రస్తుతం కుదిరిన మూడో ఒప్పందంతో సువిశాల బోడో ప్రాంతం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ఈ మేరకు బోడోల ఆధిపత్యం ఉండే ప్రాంతాలతో కలిపి బోడోల్యాండ్‌ ప్రాదేశిక ప్రాంతం (బీటీఆర్‌)గా వ్యవహరించనున్నారు. ఈ కొత్త సంస్థకు మరిన్ని కార్యనిర్వాహక, శాసనపరమైన, పరిపాలన, ఆర్థిక అధికారాలు దక్కుతాయి. బీటీఆర్‌ ప్రాంతంలోని ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగులపైనా దానికి నిర్ణయాత్మక అధికారాలు దఖలు పడే అవకాశం ఉంది. ఫలితంగా రాష్ట్ర హోదా డిమాండ్‌ను ఇప్పట్లో ముందుకు తీసుకురాకపోవచ్ఛు తాజా ఒప్పందంపై సంతకం చేసిన ప్రతినిధుల్లో ఒకరైన బోడోల అగ్రనేత గోబింద బసుమతరి తాజా పరిణామాలపై స్పందిస్తూ... తమ ముందుంచిన అంశాలతో సంతృప్తి చెందామని, కొత్త నమూనా ప్రత్యేక రాష్ట్ర హోదాకు దాదాపు సమానంగా ఉందని, ప్రస్తుతానికి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తాము భావించడం లేదని పేర్కొనడం ఇక్కడ గమనార్హం.

బోడో ఒప్పందం దిశగా కేంద్రం ఆలోచనను ఏ అంశం ప్రేరేపించి ఉంటుందనే ప్రశ్న తలెత్తకమానదు. ఈశాన్య భారత్‌తో సాంస్కృతిక సంబంధాల్ని, అనుబంధాల్ని నొక్కిచెప్పడం ద్వారా- ఆగ్నేయాసియా దేశాలతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా- తూర్పు దేశాలతో కార్యాచరణ (యాక్ట్‌ఈస్ట్‌ పాలసీ-ఏఈపీ) విధానంపై ప్రభుత్వం అధిక శ్రద్ధ పెడుతోంది. ఈ క్రమంలో భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య ప్రాంతంతో అనుసంధానించే ‘చికెన్స్‌నెక్‌ కారిడార్‌’గా వ్యవహరించే ఇరుకైన 22 కిలోమీటర్ల మేర ఉండే భూభాగాన్ని సుస్థిరపరచడమే కాకుండా, బలోపేతం చేయాలన్న సంగతి భారత ప్రభుత్వానికి తెలుసు. సరిగ్గా ఈ ప్రాంతంలోనే బోడోలు నివసిస్తారన్న సంగతి మరవకూడదు. ఆ మాటకొస్తే ఆగ్నేయాసియా దేశాలకు చేరువవ్వాలంటే, ఈశాన్యానికి సింహద్వారంలాంటి బోడోల్యాండ్‌ ప్రాదేశిక ప్రాంతం (బీటీఆర్‌)లో శాంతి, సుస్థిరతల్ని సాధించడం చాలా అవసరం. బీటీఆర్‌ అత్యంత సునిశిత ప్రాంతంలో ఏర్పాటైంది. దీనిచుట్టూ విదేశాలే ఉన్నాయి. కొన్ని కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్తే భూటాన్‌, దక్షిణ దిశలో బంగ్లాదేశ్‌ ఉన్నాయి. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే అక్రమ వలసదారులను దృష్టిలో ఉంచుకుంటే, చికెన్స్‌నెక్‌ ప్రాంతం అత్యంత సునిశితమైన ప్రాంతంగా చెప్పవచ్ఛు కూచ్‌బిహార్‌ వంటి ప్రదేశాలు అనుమానస్పద వలసదారులకు అడ్డాలుగా ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఇలాంటి అక్రమ వలసదారులు దేశమంతటికీ వ్యాపిస్తుంటారు.

గత రెండు దశాబ్దాలుగా, బోడో సంస్థలు అధికార పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా ఆసక్తి చూపుతూ వస్తున్నాయి. 126 మంది సభ్యులు కలిగిన అసోమ్‌ రాష్ట్ర అసెంబ్లీలో 16 స్థానాలు ఈ ప్రాంతం నుంచే ఉండటం వల్ల తాజా పరిణామానికి చాలా ప్రాధాన్యం ఉన్నట్లుగా భావించాలి. ముఖ్యంగా, పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఇది కీలక పరిణామమే. బోడో ఉద్యమం కారణంగా ఇప్పటిదాకా సుమారు నాలుగు వేల మరణాలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజా ఒప్పందం వల్ల ఈ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలకు ముగింపు పలికే అవకాశం ఉంది.

అంతాబాగానే ఉన్నా, కొన్ని సమస్యలూ లేకపోలేదు. ఇకమీదట బీటీఆర్‌లో బోడోలు రాజకీయంగా ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అస్సామీ మాట్లాడే, తేనీటి తోటలకు చెందిన సామాజిక వర్గం గిరిజనులు అక్కడ జనాభాపరంగా పెద్ద సంఖ్యలో ఉన్న బోడోయేతర వర్గం కిందికి వస్తారు. వీరంతా బీటీఆర్‌ భూభాగం పరిధిలోనే పలుప్రాంతాల్లో సంఖ్యపరంగా ఆధిక్యం కలిగి ఉన్నారు. ఒకవేళ, బోడోలు ఇలాంటి బోడోయేతరులతో కలిసి సాగని పక్షంలో భవిష్యత్తు సంక్షోభానికి పునాది పడినట్లే. అప్పుడు మరిన్ని కొత్త సమస్యలు తప్పకపోవచ్చు.

- సంజీవ్‌ బారువా
(రచయిత- ప్రముఖ పాత్రికేయులు)
Posted on 31-01-2020