Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

జనహితం కోసం జాతీయ వ్యూహం

* ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్రం

‘విశ్వగురు’ అన్న పేరును భారతదేశం సార్థకం చేసుకుంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మోదీ ప్రభుత్వానికి ఇచ్చిన కితాబులే ఇందుకు నిదర్శనం. స్మాల్‌ పాక్స్‌, పోలియోలను భారత్‌ సమూలంగా నిర్మూలించడమే కాదు... ఆ దిశగా ప్రపంచానికే ఓ మార్గనిర్దేశం చూపిందని డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ జె ర్యాన్‌ కొన్ని రోజుల కిందట ప్రశంసించారు. ఆ అనుభవంతో ఇప్పుడు కరోనాను అరికట్టే సామర్థ్యం, ఇతర దేశాలకు మార్గనిర్దేశం చేసే సత్తా భారత్‌కు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అదే, డబ్ల్యూహెచ్‌ఓ ఆ తరవాత పది రోజులకే ప్రధాని మోదీ ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని స్వాగతించింది. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది నిరుపేదలకు రాబోయే మూడు నెలలపాటు ఆహార ధాన్యాలను ఉచితంగా ఇవ్వడం, ప్రతి రైతు కుటుంబానికి రెండు వేల రూపాయల నగదు, 20.4 కోట్ల మంది జన్‌ ధన్‌ లబ్ధిదారులైన నిరుపేద మహిళలకు మూడు నెలలపాటు రూ.500 చొప్పున నగదు సాయం చేయడాన్ని కొనియాడింది. కరోనా విలయానికి తట్టుకోలేక వివిధ దేశాలు తమ దేశ ప్రజలను వాళ్ల మానాన వారిని వదిలేస్తున్న పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. తృతీయ ప్రపంచ దేశాలకు చెందిన పది మంది ప్రాణాలతో తమ దేశ పౌరుడి ఒక ప్రాణం సమానమని చెప్పుకొనే అమెరికాలోనూ ఇప్పుడు ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. కానీ, ఒక్క భారత్‌ మాత్రమే ఇటు వైరస్‌ వ్యాప్తిని నిరోధిస్తూ, అటు ప్రజల ప్రాణాలను కాపాడుతూ... వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటూ- బహుముఖంగా పని చేస్తోంది.

సాంకేతికతతో వైరస్‌కు కళ్లెం
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండగానే సరిపోదు... దాన్ని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలన్నదే కీలకమైన విషయం. ఇప్పుడు ఇండియా సైతం సాంకేతికతను సమర్థంగా వాడుకుంటూ కరోనాను కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తోంది. సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ టెక్నాలజీ ఆధారంగా తబ్లీగీ జమాత్‌ కార్యకర్తలను గుర్తించడమే ఇందుకు నిదర్శనం. మార్చి ఒకటో తేదీ నుంచి 17 వరకు మర్కజ్‌లో నిర్వహించిన సమావేశాలకు ముస్లిములు పెద్దయెత్తున హాజరయ్యారు. అనంతరం, వారంతా వివిధ ప్రాంతాల్లో మత ప్రచారానికి వెళ్లారు. అక్కడ పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అప్పుడే వీరందరికీ మర్కజ్‌లోనే కరోనా సోకిందనే విషయం వెలుగుచూసింది. దాంతో, కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మత ప్రచార సమావేశాల్లో పాల్గొనడానికి మర్కజ్‌కు ఎవరెవరు వచ్చారనే విషయాలను అక్కడి టవర్‌ సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించారు. దాదాపు 13,700 మంది మర్కజ్‌కు వచ్చినట్లు తేలింది. వారి వివరాలను, సెల్‌ నంబర్లను ఆయా రాష్ట్రాలకు మార్చి 21నే పంపించారు. దాంతో, వారిని గుర్తించి క్వారంటైన్‌కు, ఐసొలేషన్‌కు పంపించడం సులభమైంది. కరోనా కారణంగా ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి తగిన పరిష్కారాలు సూచించడానికి వివిధ రంగాల్లో నిపుణులతో 11 సాధికార బృందాలు ఏర్పాటయ్యాయి.

వైద్య సదుపాయాలకు పెద్దపీట
కరోనా బాధితులకు చికిత్స చేసే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సాధనాలు (పీపీఈ) కావాలి. దురదృష్టవశాత్తు కరోనా విజృంభిస్తే పెద్దయెత్తున ఆస్పత్రులు, పడకలు, వెంటిలేటర్లు కావాలి. వైద్యులు, వైద్య సిబ్బంది భారీయెత్తున అవసరం. ఈ అంశాలకు సంబంధించి చాలా ముందుగానే చర్యలు తీసుకున్నారు. ఐఐటీల నుంచి ఆటొమొబైల్‌ పరిశ్రమల ప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరితో మాట్లాడి వెంటిలేటర్ల తయారీకి ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్లోనే డాక్టర్లకు, నర్సులకు శిక్షణ ఇచ్చారు. జాతీయ స్థాయిలో నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాదు... రాష్ట్రాల్లోనూ ఈ తరహా కేంద్రాలు, హెల్ప్‌ లైన్లు ఏర్పాటు చేయాలని, నోడల్‌ అధికారులను నియమించాలని సూచించారు. రోజూ సామాన్యులు మొదలుకుని, నిపుణులవరకు ఎంతోమందితో మాట్లాడుతూ వారి సలహా సూచనలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వ్యూహాల్లో మార్పులు చేస్తున్నారు. మందుల సరఫరా నుంచి ల్యాబ్‌ల ఏర్పాటు, టెస్టింగ్‌ కిట్ల సరఫరా వంటి ఎన్నో అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. నెల రోజుల కిందటి వరకు దేశంలో కరోనా వైరస్‌ను గుర్తించేందుకు ప్రయోగశాల కేవలం పుణెలో మాత్రమే ఉండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 156 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలు, ఐసొలేషన్‌ వార్డులు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకే రూ.15వేల కోట్లు మంజూరు చేశారు. వివిధ దేశాల్లో భారతీయులు చిక్కుకుని, అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోక నానా అగచాట్లూ పడుతున్నారు. కానీ, ఇండియాలో చిక్కుకుపోయిన విదేశీయులకు ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేయడమే కాదు- ప్రత్యేక విమానాల్లో వారు ఆయా దేశాలకు వెళ్లేలా కేంద్రం చర్యలు తీసుకుంది. సంక్షేమం మాత్రమే కాదు... వినోదం గురించీ యోచించింది. రోజుల తరబడి ఇళ్లలోనే ఉన్నప్పుడు విసుగు చెందకుండా మహా భారతం, శక్తిమాన్‌, చాణక్య, శ్రీమాన్‌ శ్రీమతి తదితర కార్యక్రమాల పునఃప్రసారానికి ఆదేశించింది. కరోనాను కట్టడి చేసే యజ్ఞంలో ఎదురయ్యే అన్ని సమస్యల పరిష్కారానికీ మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉంది.

సంక్షేమం కీలకం
రోజుల తరబడి ‘లాక్‌డౌన్‌’ కొనసాగినప్పుడు ఉపాధి లేక నిరుపేదల జీవితాలు దుర్భరంగా మారతాయి. దీనికితోడు, దేశవ్యాప్తంగా లక్షల మంది వలస కార్మికులు రోడ్డున పడ్డారు. కరోనా వైరస్‌ కంటే ఆకలి చావులు మరింత ప్రమాదకరం. ప్రపంచ దేశాల సహకారం, అభివృద్ధికి సంబంధించిన మన విజన్‌లో ఆర్థిక లక్ష్యాల కంటే మనుషుల జీవితాలకే పెద్దపీట వేయాలి అని డబ్ల్యూహెచ్‌ఓకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా, వలస కార్మికులు, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఆరు లక్షల మందికి ఆశ్రయం ఇచ్చేలా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 21 వేలకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోట్లాది వలస కార్మికుల సమస్యను రోజుల వ్యవధిలోనే పరిష్కరించడం మోదీ ప్రభుత్వ సమర్థతకు నిదర్శనం. జీవనోపాధే కష్టంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఇంటి అద్దెను అడగవద్దని యజమానులకు విజ్ఞప్తి చేసింది. సకాలంలో పూర్తిగా వేతనాలు చెల్లించాలంటూ పరిశ్రమలు, కంపెనీలు, ఇతర కార్యాలయాలను ఆదేశించింది. డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్‌, పర్మిట్లు తదితరాలకు జూన్‌ 30 వరకు గడువు పొడిగించడం మోదీ ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనం. లాక్‌డౌన్‌ ముగిసిన తరవాత మనకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఆహార సంక్షోభం. అందుకే, వ్యవసాయ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం ఎదురు కాకుండా తగిన చర్యలు తీసుకుంది.

Posted on 10-04-2020