Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

జాతిని వెలిగించే జ్యోతి

దేశంలో విద్యుత్తుకు నోచుకోక అంధకారంలో మగ్గుతున్న పల్లెలకు వెలుగులు ప్రసాదించాలన్న ప్రయత్నాలు ఈనాటివి కావు. గ్రామీణ ప్రాంతాలను కాంతిమంతంగా తీర్చిదిద్దాలంటే విద్యుత్తు వ్యవస్థలను పటిష్ఠంగా తీర్చిదిద్దడం చాలా అవసరం. ఆ క్రమంలో భాగంగానే దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన కార్యక్రమాన్ని కేంద్ర సర్కారు తాజాగా ప్రారంభించింది. ఇటీవల బిహార్‌లో అధికారికంగా మొదలుపెట్టిన ఈ పథకం సక్రమంగా అమలైతే జన జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.ఇప్పటివరకు విద్యుత్‌ కనెక్షన్లు లేనివారికి ఆ సౌకర్యం అందించేందుకు, గృహ విద్యుత్‌ 'ఫీడర్ల' విభజనకు ఈ కార్యక్రమం బాటలు పరుస్తుందని అంటున్నారు.

మారాల్సిన వ్యూహాలు

దేశంలో విద్యుత్తు డిమాండులో పెరుగుదలతోపాటు స్థాపక సామర్థ్యమూ ఇనుమడిస్తూ వచ్చింది. స్థాపక సామర్థ్యం బాగానే ఉన్నప్పటికీ శిలాజ ఇంధనాల కొరత కారణంగా విద్యుత్తు ఉత్పాదన తగ్గి కరెంటు అవసరాలు తీరడంలేదు. దాని ఫలితంగానే ప్రజలు దేశవ్యాప్తంగా విద్యుత్తు కోతల వాతల బారినపడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన వెన్వెంటనే, అంటే 1947లో దేశంలో స్థాపక సామర్థ్యం 1,362 మెగావాట్లు. ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక చివరికి, అంటే 1997వరకూ స్థాపక సామర్థ్యం లక్ష మెగావాట్లలోపే ఉంది. ఆ తరవాత అందులో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం అది 2.74లక్షల మెగావాట్ల(274 గిగావాట్లు)కు చేరుకుంది. విద్యుత్తు అవసరం విపరీతంగా (పీక్‌ డిమాండ్‌) ఉన్నప్పటికీ- దేశ స్థాపక సామర్థ్యం ఎక్కువే. దేశంలో 'పీక్‌ డిమాండ్‌' 140 గిగావాట్లకు కాస్త అటుఇటుగా ఉండవచ్చని అంచనా. అయినా ఆ మాత్రం విద్యుత్తునూ అందించలేని దురవస్థ నెలకొందిప్పుడు. బొగ్గు ఆధారిత ప్రాజెక్టుల స్థాపక సామర్థ్యమే 167 గిగావాట్ల మేర ఉంది. బొగ్గు కొరత ప్రాజెక్టులను వెనక్కిలాగుతోంది. ఫలితంగా సామర్థ్యం మేరకు ఆ ప్రాజెక్టుల్లోవిద్యుత్‌ ఉత్పాదన జరగడంలేదు. బొగ్గు సమృద్ధిగా అందకపోవడం, దానికితోడు నాణ్యత సరిగ్గా లేకపోవడంవల్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ఏటికేడు తగ్గుతూ వస్తోంది. 2009-'10లో బొగ్గు ప్రాజెక్టుల సరాసరి ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) 77.5శాతం ఉండగా- కిందటి ఆర్థిక సంవత్సరం పీఎల్‌ఎఫ్‌ 64.46శాతం మాత్రమే! ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌వరకు వాటి పీఎల్‌ఎఫ్‌ 61.80శాతమే. బొగ్గు ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్న వైనాన్ని ఈ లెక్కలు కళ్లకు కడుతున్నాయి. మరోవంక గ్యాస్‌ కొరత పెద్ద సమస్యగా మారింది. గ్యాస్‌ ప్రాజెక్టుల స్థాపక సామర్థ్యం 23వేల మెగావాట్లుగా ఉన్నప్పటికీ- వాటిలో విద్యుత్‌ ఉత్పాదన నామమాత్రమే. దేశంలో 42వేల మెగావాట్ల జల విద్యుత్‌ ప్రాజెక్టులు ఉన్నాయన్నమాటేగానీ- జల లభ్యత లేనప్పుడు అవన్నీ వృథాయేనన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. దేశంలో విద్యుత్‌ అవసరం ఏటికేడు పెరుగుతోంది. 2022నాటికి 'పీక్‌ డిమాండ్‌' 283 గిగావాట్లు ఉండవచ్చని ఓ అంచనా. ఆ మేరకు విద్యుత్తు ఉత్పత్తిని పెంచడంపై తక్షణం దృష్టి సారించకపోతే ఇక్కట్లు తప్పవు.


విద్యుత్‌ అవసరాలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో శిలాజ ఇంధనాలనుంచి దృష్టి ప్రత్యామ్నాయాలవైపు మరలుతోంది. భారత్‌సహా మిగిలిన ప్రపంచం ఆలోచనలన్నీ ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరుల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకూ థర్మల్‌, గ్యాస్‌, జల, అణు విద్యుత్‌ ఉత్పాదనకు భారత్‌ ప్రాధాన్యమిచ్చింది. ఇప్పుడు సౌర, పవన, బయోమాస్‌ విద్యుత్‌ ఉత్పాదన దిశగా ముందుకు కదులుతోంది. విద్యుత్‌ రంగంలో సుస్థిరత సాధనకు ఈ ఏడు రంగాలూ కీలకమన్నది కేంద్ర ప్రభుత్వ నిశ్చితాభిప్రాయం.సౌర విద్యుత్తుకు సంబంధించి ఇటీవల భారీ లక్ష్యాలను నిర్దేశించడాన్ని అందులో భాగంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్లు, సౌర విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యం మెగావాట్లను దాటి గిగావాట్ల స్థాయికి చేరుకుంది. మొత్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 2022నాటికి 175 గిగావాట్ల విద్యుత్‌ స్థాపక సామర్థ్యం సాధించాలన్నది ఆశయం. ఇందులో లక్ష మెగావాట్లు సౌర విద్యుత్‌ కాగా, 60వేల మెగావాట్లు పవన విద్యుత్‌. దేశంలో బొగ్గు నిక్షేపాలకు కొరత లేదు. కానీ వాటిని వెలికితీయడంలో మాత్రం ఎక్కడలేని జాప్యం జరుగుతోంది. భూసేకరణ, పర్యావరణ అనుమతుల్లో ఆలస్యం ప్రభావం చూపుతోంది. విదేశాలనుంచి బొగ్గు దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ధర బాగా ఎక్కువగా ఉంటోంది. నిజానికి దేశంలో సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తికి గల అవకాశాలు పుష్కలం. పదివేల గిగావాట్ల సౌర విద్యుత్‌, రెండు వేల గిగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తికి దేశంలో అవకాశం ఉన్నట్లు అంచనా. సాంకేతిక రంగంలో చోటుచేసుకొంటున్న మార్పులవల్ల సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి వ్యయాల్లో తగ్గుదల కనిపిస్తోంది. కానీ, థర్మల్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి ఏళ్ల సమయం పడుతుంది. అలాకాకుండా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా విద్యుత్తు తక్షణమే అందుబాటులోకి వస్తుంది. ఈ కారణంవల్లే ప్రపంచమంతా వీటిపట్ల ఆసక్తి కనబరుస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి సంబంధించి భారత్‌-అమెరికాల మధ్య 2012లోనే ఓ ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. గత జనవరిలో భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆ ఒప్పందాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు. హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికీ ముఖ్యంగా సౌర విద్యుత్తు ఉత్పాదన, విద్యుత్‌ సామర్థ్యాల పెంపుదలకు అమెరికా సహకారం అందిస్తోంది. ఒకవైపు శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్‌ వ్యయం క్రమంగా పెరుగుతోంది. మరోవైపు పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఖర్చు తగ్గుతోంది. కేంద్ర సర్కారు లక్ష మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం నిర్దేశించిన నేపథ్యంలో ఈ రంగంలో పెట్టుబడులకు విదేశీ సంస్థలూ ఆసక్తి చూపుతున్నాయి. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ ఇరవై బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తపరచింది. సాఫ్ట్‌బ్యాంక్‌ ఆంధ్రప్రదేశ్‌లోనూ 20గిగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పాదనకు ముందుకొచ్చింది. సౌర విద్యుత్తుకు సంబంధించి భూమి సమస్య ఉంది. సౌర విద్యుత్తు భారీగా పెరిగిన పక్షంలో తదనుగుణంగా విద్యుత్‌ గ్రిడ్‌ నిర్వహణనూ మార్చుకోవలసి ఉంటుంది. దేశంలో ఇప్పటికే రాజస్థాన్‌, గుజరాత్‌లలో సౌర విద్యుత్‌ వెయ్యి మెగావాట్లపైనే ఉంది. సౌర విద్యుత్‌ అందుబాటు పెరిగినకొద్దీ ప్రణాళికలోనూ ఆ మేరకు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ప్రధానంగా థర్మల్‌ విద్యుత్‌పై ఆధారపడిన రాష్ట్రాలు తాజా పరిణామాల దృష్ట్యా తమ విద్యుత్తు సరఫరా వ్యూహాలను మార్చుకోక తప్పదు.

కల నిజం కావాలంటే...

'అందరికీ విద్యుత్తు' కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దిల్లీ, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ఎంపిక చేసింది. రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌లతో ఆమేరకు నిరుడు ఒప్పందాలూ కుదిరాయి. కేంద్రం ప్రకటించిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, సమీకృత విద్యుత్‌ అభివృద్ధి పథకం ఈ లక్ష్యాల సాధనలో భాగమే. రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ స్థానంలో దీన్‌దయాళ్‌ పథకాన్ని తీసుకువచ్చారు.రూ.76వేల కోట్ల అంచనాతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. దీనికి గ్రాంటుగా కేంద్రం రూ.63వేల కోట్లు ఇవ్వనుంది. ఈ పథకం కింద రూ.14,680కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో రూ.5,827కోట్లు బిహార్‌లోకే ఇవ్వనున్నారు. శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే బిహార్‌కు భారీగా నిధులు ఇస్తున్నారన్న విమర్శ ఉంది. పశ్చిమ్‌ బంగకూ రూ.4,240కోట్లు మంజూరు అయ్యాయి. పది వేల కోట్ల రూపాయలపైన విలువ కలిగిన ప్రాజెక్టులకు ఈ రెండు రాష్ట్రాల్లోనే అనుమతి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.327కోట్లు మంజూరు చేసినా దాన్ని పెండింగులో ఉన్న కొత్త విద్యుత్తు కనెక్షన్లకే నిర్దేశించారు. విద్యుత్తుకు కొరత ఏర్పడగానే పల్లెల్లో కరెంటు ఫీడర్లలో సరఫరా నిలిపివేస్తున్నారు. గ్రామాలనుంచి ఆదాయం బాగా తక్కువగా వస్తుందన్నదే ప్రభుత్వాలు అందుకు చెబుతున్న కారణం. ఈ ఏడాది మేలో దేశంలోని రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా పరిస్థితి తీరుతెన్నులను గ్రామీణ విద్యుదీకరణ సంస్థ విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కేరళ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు మేలో రోజుకు 23గంటలపైన విద్యుత్తు అందినట్లు ఆ విశ్లేషణలో తేలింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు రోజుకు 10గంటలకు మించి విద్యుత్తు అందలేదని వెల్లడైంది. పలు రాష్ట్రాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ (దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలో), తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ్‌ బంగ వంటి రాష్ట్రాల్లో రోజుకు 20గంటలపైన విద్యుత్తు ఇవ్వగలిగినట్లు ఆ విశ్లేషణలో వెల్లడైంది. దేశంలో 19వేలకుపైగా గ్రామాలకు నేటికీ విద్యుత్‌ సౌకర్యం లేదు. 24గంటల కరెంటు సరఫరాకు కేంద్రంతో ఒప్పందం చేసుకున్న రాజస్థాన్‌లోనే 4,166 పల్లెలకు విద్యుత్తు లేని పరిస్థితి! దేశంలోనే రాజస్థాన్‌లో పరిస్థితి దారుణం. నిరంతర విద్యుత్‌ సరఫరా మార్గంలో ఎదురయ్యే సవాళ్లకు ఇదో సూచిక. విద్యుత్‌ సరఫరాను పెద్దయెత్తున సంస్కరించాలి. పంపిణీ వ్యవస్థలను పటిష్ఠంగా తీర్చిదిద్దాలి. మరోవంక విద్యుత్తు పొదుపు సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలూ అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో, బహుముఖ వ్యూహంతో ఉమ్మడిగా కదలితేనే 'అందరికీ విద్యుత్తు' స్వప్నం సాకారమవుతుంది.

(రచయిత - వల్లభనేని సురేశ్‌)
Posted on 01-08-2015