Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

నమ్మకమే అ'జెండా'!

* స్వతంత్రానికి అదే రక్షరేక
స్వాతంత్య్రానంతరం ఈ ఏడు దశాబ్దాల్లో భారత్‌ సాధించిన ఏకైక అతిగొప్ప విజయమేమిటని కొన్ని ప్రసార సాధనాలు ప్రజలను సర్వే చేశాయి. దారిద్య్ర నిర్మూలనకోసం ప్రభుత్వాలు ఇప్పటివరకూ తీసుకున్న చర్యలా? ఆహార ధాన్యాల ఉత్పత్తిని అనూహ్యంగా పెంచిన ఆరో దశాబ్దంనాటి హరిత విప్లవమా? మూడు యుద్ధాల్లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించడమా? ప్రపంచకప్‌ క్రికెట్లో భారత జట్టు పాకిస్థాన్‌ను వరసగా మట్టిగరిపించడమా? ఈ ప్రశ్నలకు ఏదో ఒకదానికి అవునని తలూపినవాళ్లు ఉన్నప్పటికీ- స్వపరిపాలన స్ఫూర్తితో ఏర్పరచుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థే ఇప్పటివరకూ భారతదేశపు మహాద్భుత విజయంగా అత్యధికులు తీర్మానించారు. దేశానికి అందాన్ని, అర్థాన్ని ప్రసాదిస్తున్న ప్రజాస్వామ్య సంస్కృతి తమకు గర్వకారణమన్న వేల గళాలు- అవినీతి, అసమర్థత గుప్పిట చిక్కిన రాజకీయ నాయకులు, పార్టీలను తాము తుదికంటా ఏవగించుకుంటున్నట్లు తేల్చి చెప్పారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తున్నామని ప్రకటించిన ప్రజలే- దాన్ని అమలుచేస్తున్న రాజకీయ నాయకుల తీరు తమకు బొత్తిగా గిట్టదని నిక్కచ్చిగా చెప్పేశారన్నమాట! సాధించుకున్న స్వాతంత్య్రంతో దేశ ప్రజ సంతృప్తిగా లేదనడానికి ఇది నిదర్శనం. స్వాతంత్య్రం ఇవాళ అందుతున్న దానికంటే విస్తృతమైనదని, విశిష్టమైనదని జనం గుర్తిస్తున్నట్లు తేటపడుతున్న తరుణంలో- వ్యవస్థలపై వారి నమ్మకాన్ని పెంచే ఆత్మసమీక్షకు జాతి నాయకత్వం సిద్ధపడుతుందా అన్నదే ప్రశ్న.

ప్రశ్నించే స్వేచ్ఛ

భారతీయులు ఎప్పటికీ ఎవరో ఒకరి కింద పాలితులుగా ఉండాల్సిందేగానీ- వారికి పాలించే శక్తి లేదని బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ ఈసడించిన సుమారు దశాబ్దకాలానికి ఓ అద్భుతం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త జేబీఎస్‌ హాల్డిన్‌ బ్రిటన్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారపట్టి, అలాంటి దేశంలో ఉండటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ప్రకటించి 1956లో భారత్‌కు వచ్చి ఇక్కడి పౌరసత్వం స్వీకరించారు. 'అరవైఏళ్లపాటు సాక్సుల్లో కాళ్లుపెట్టి బతికాను. ఇక చాలు' అని ప్రకటించిన హాల్డిన్‌ కలకత్తా వచ్చి, అక్కడి భారత గణాంక సంస్థలో 'బయోమెట్రీ' విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టి చివరి వరకూ భారతీయ సంస్కృతినే అనుసరించారు. విశ్వపౌరుడిగా మిగిలిపోవాల్సిన హాల్డిన్‌ భారత్‌కు పరిమితం కావడాన్ని బ్రిటన్‌తోపాటు మరికొన్ని ఐరోపాదేశాల్లోని రాజనీతిజ్ఞులు తప్పుపట్టారు. 'పౌరుడెప్పుడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. దానికి కంటిమీద కునుకు లేకుండా చేయాలి. నిరంతరం జవాబులు రాబడుతూ ప్రభుత్వాన్ని జాగృతపరచాలి. ఇండియాలో నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ప్రశ్నించేందుకు ఇక్కడి ప్రభుత్వం నన్ను అనుమతిస్తోంది. నా ప్రశ్నలకు వెన్వెంటనే కాకపోయినా... కొంచెం ఆలస్యంగానైనా సర్కారునుంచి సమాధానాలు వస్తున్నాయి. నాకిది చాలు' హాల్డిన్‌ చేసిన ఈ వ్యాఖ్య, అప్పటిదాకా చర్చిల్‌ వ్యాఖ్యలనే నెమరు వేసుకొంటున్న ప్రపంచ దేశాలకు కొత్త భారతాన్ని పరిచయం చేసింది. రాజకీయ స్వాతంత్య్రంతోపాటు ఆర్థిక సమానత, సాంఘిక న్యాయాలకు ప్రాధాన్యమిచ్చి సంకుచితత్వానికి తావులేని భారత నిర్మాణం దిశగా ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సారథ్యంలో దేశం ప్రస్థానం సాగిస్తున్న కాలంలో హాల్డిన్‌ ఈ దేశంలో జీవించారు. చట్టసభల్లోనూ, బయటా ప్రజలపట్ల రాజకీయ నాయకత్వం ఎక్కడలేని నిబద్ధతతో వ్యవహరించిన కాలమది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకూ 'కార్పొరేట్ల'నుంచి ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేస్తున్న నేటికాలంలో హాల్డిన్‌ ఉండి ఉంటే- ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తీకరించేవాడు?

ప్రజాస్వామ్యం మితిమీరడమే దేశం కొంప ముంచుతోందంటున్న విమర్శకులకు ప్రసిద్ధ చరిత్రకారుడు రామచంద్ర గుహ ఆ మధ్య చురుకైన జవాబిచ్చారు. 'ఉండాల్సినంత ప్రజాస్వామ్యం, ఉండాల్సిన విధంగా లేకపోవడంవల్లే దేశానికి ఇన్ని సమస్యలు' అని గుహ తేల్చేశారు. రాజకీయ నాయకత్వంలో ఏ కోశానా నిజాయతీ లేకపోవడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. తొలి దశలో యోధానుయోధులైన మహా నాయకుల సారథ్యంలో భిన్న రాజకీయపక్షాలు సమస్యల పరిష్కారంలో ఏకోన్ముఖంగా పనిచేసేవి. దేశవ్యాప్తంగా భాషా ఉద్యమాలు చెలరేగినప్పుడు 1956లో భారత ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మాతృభాషలో పాలన వ్యవహారాలు సాగించుకోవచ్చని ఉత్తర్వులు జారీచేసింది. ప్రజల ఆకాంక్షలకు పట్టంకట్టిన ఆ చర్య 'ప్రాంతీయ అస్తిత్వ' గందరగోళం చెలరేగకుండా చేసి, దేశాన్ని కనీసం కొన్ని దశాబ్దాలపాటు సాఫీగా నడిపించింది. సరిగ్గా 1956లోనే శ్రీలంక ప్రభుత్వం తమిళులు అత్యధికంగా ఉన్న ఆ దేశ ఉత్తర భాగంలో సింహళ భాషను అధికారికంగా అమలు చేయాలని నిర్ణయించి, ఆదేశాలు జారీచేయడం యాదృచ్ఛికమే. ఆ రకంగా కొలంబో సర్కారు ఆ దేశ బహుళత్వ సంస్కృతిపై చేసిన దండయాత్ర కారణంగా దశాబ్దాలపాటు శ్రీలంక అంతర్యుద్ధంలో కూరుకుపోయి అతలాకుతలమైంది. అదేవిధంగా 'తూర్పు పాకిస్థాన్‌' ప్రజలు తప్పనిసరిగా ఉర్దూ నేర్చుకోవాలంటూ పాకిస్థాన్‌ అధినేత మహమ్మదాలి జిన్నా జారీ చేసిన హుకుం సంక్షోభాగ్నుల్ని రాజేసి చివరికి బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి కారణమైంది. ఇరుగుపొరుగు దేశాలతో పోలిస్తే సమున్నతాదర్శాలతో మొదలైన భారత్‌ ప్రయాణం- కాలం గడిచేకొద్దీ స్థిరపడాల్సిందిపోయి గతితప్పుతుండటమే ఆందోళన కలిగిస్తోంది. ఒకరకంగా మతప్రాధాన్యమైనవిగా మనుగడ మొదలుపెట్టిన పొరుగుదేశాలు తొలుత బాలారిష్టాలు ఎదుర్కొన్నా, పరిణత ప్రజాస్వామ్యాలుగా ఎదిగే క్రమంలో గణనీయ పురోగతి కనబరుస్తుండటం గమనార్హం. ఇస్లామిక్‌ దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు కొండొకచో సైనిక తిరుగుబాట్ల ఆటుపోట్లు ఎదుర్కొన్నా అవినీతి రహిత వ్యవస్థల రూపకల్పనలో, నిక్కమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటులో, ప్రసార మాధ్యమాలకు సంపూర్ణ స్వేచ్ఛను ప్రసాదించడంలో భారత్‌కంటే సమర్థంగా దూసుకువెళుతున్నాయి. మరోవంక రాజ్యాంగంలో బౌద్ధానికి పెద్దపీట వేసిన శ్రీలంక, వజ్రయాన బౌద్ధాన్ని అధికారికంగా నెత్తికెత్తుకున్న భూటాన్‌లు సైతం వ్యవస్థలను పటుతరంగా తీర్చిదిద్దుకోవడంలోనూ, అభివృద్ధిలోనూ భారత్‌తో పోటీపడుతూ ముందుకు సాగుతున్నాయి. పాకిస్థానీ ముస్లిం జనాభాతో ఇంచుమించు సమాన సంఖ్యలో ముస్లిములున్న; ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల జనాభాకన్నా అధిక సంఖ్యలో క్రైస్తవులున్న దేశంగా భారత్‌ వూపిరిపోసుకుంది మొదలు లౌకికవాదానికి కట్టుబడే నడక సాగిస్తోంది. కానీ, కొంత దూరం నడిచాక ఓటురాజకీయాల వెగటు సంస్కృతిని నెత్తికెత్తుకొని చాందసుల చేతచిక్కి కుములుతుండటమే భయపెడుతున్న పరిణామం!

అబ్దుల్‌ కలాం మన మధ్య లేకుండా జరుపుకొంటున్న మొట్టమొదటి స్వాతంత్య్ర దినోత్సవమిదే. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు 2002లో త్రివర్ణపతాకను ఆవిష్కరించి, కోట్లాదిమందిని ఉద్దేశించి, శాంతగంభీరమూర్తిగా జాతికి కర్తవ్యబోధ చేస్తూ కలాం- ప్రజల సిసలైన శక్తి, సామర్థ్యాలను వెలికితీస్తే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలచడం అసాధ్యంకాదని తేల్చిచెప్పారు. ఆయన ఆశించిన నవభారతాన్ని అవతరింపజేయడానికి మరింత చిత్తశుద్ధితో కంకణధారణ చేయాల్సిన తరుణంలో ప్రభుత్వ వ్యవస్థలపైన, పాలనపైన ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించడమే ప్రభుత్వాల లక్ష్యం కావాలి. 'వ్యాపం' కుంభకోణంలో నిందితులుగా గ్వాలియర్‌ జైల్లో మగ్గుతున్న 70మంది వైద్య విద్యార్థులు, జూనియర్‌ డాక్టర్లు తమను తాము కడతేర్చుకోవడానికి అనుమతినివ్వాలని కోరుతూ ఇటీవల ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎంతకీ తెమల్చకుండా ఏళ్లూపూళ్లుగా కేసును సాగలాగుతుండటంతో తమ భవిష్యత్తు ఎటూ కాకుండా పోతోందని, తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్న ఈ చిత్రవధనుంచి, ఆత్మాహుతితో తప్ప విముక్తి లభించదని వారు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 'న్యాయం' చేయాల్సిన వ్యవస్థలు కొరగానివిగా మారుతున్నాయన్న ఈ తరహా విశ్వాసరాహిత్యం విస్తరించడం దేశానికి అన్నింటికన్నా ప్రమాదకరం. ఏడు దశాబ్దాల కాలంలో ప్రజా సమస్యలపట్ల పైయెత్తున నాయకుల్లో మేటవేసిన నిర్లిప్తత, నిర్లక్ష్యం, అవినీతి మన స్వాతంత్య్రాన్ని మేడిపండుగా మార్చిందనడంలో మరో మాట లేదు.

ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం

స్వరాజ్య సాధనతోనే ఆత్మగౌరవమని నమ్మి ఎందరో లాఠీ దెబ్బలు తిన్నారు. జైలుశిక్షలు అనుభవించారు. ఉరికంబాలనెక్కడానికీ కొందరు వెనుదీయలేదు. ఏ విశ్వాసం కోసం స్వాతంత్య్ర సేనానులు నానాయాతనలకూ తలొగ్గారో- స్వేచ్ఛా భారతంలో సరిగ్గా ఆ నమ్మకమే కొడిగడుతుండటం విషాదం. డబ్బులు వెదజల్లి గెలవడం, మళ్ళీ డబ్బు పోగేసుకోవడంకోసం మాత్రమే పదవులు వెలగబెట్టే రాజకీయ అనైతికతవల్లే ప్రజల్లో వ్యవస్థలపట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. అందుకే డ్రైవరు ఏమరుపాటువల్ల రైలు ప్రమాదం జరిగినా రైల్వేమంత్రి రాజీనామా చేయాల్సిందేనన్న ధర్నాలు జోరందుకుంటున్నాయి. రోడ్డు దాటుతూ సరిగా చూసుకోకుండా ఏ లారీయో తగిలి ఎవరైనా మరణించినా ప్రభుత్వాన్నే పడతిడుతున్నారు. సరిగా చదవని కారణంగా పదో తరగతిలోనో, ఎంట్రెన్స్‌ పరీక్షలోనో పిల్లలు ఫెయిలైతే మొత్తం విద్యావ్యవస్థే లోపభూయిష్ఠంగా ఉందని మెటికలు విరుస్తున్నారు. సిసలైన స్వాతంత్య్ర స్ఫూర్తి ప్రజలకు చేరాలంటే ఈ పరిస్థితి మారాలి. ప్రజాస్వామ్యం పేరిట పైయెత్తున తీసుకుంటున్న నిర్ణయాల్లో బడుగులు, బలహీనవర్గాలు, దళితులు, మహిళలకు ప్రాతినిధ్యమే దక్కడం లేదని జస్టిస్‌ వెంకటాచలయ్య గతంలోనే వ్యాఖ్యానించారు. తమ భాగస్వామ్యం లేకుండా జరిగిపోయే పాలనతో ప్రజలెన్నటికీ మమేకం కాలేరు. వ్యవస్థలపైన, పాలనపైన ప్రజల్లో కొడిగడుతున్న నమ్మకాన్ని పునరుద్ధరించడమే స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రభుత్వ కర్తవ్యం కావాలి. సిసలైన ప్రజాస్వామ్య సంస్కృతి దేశంలోని మూలమూలకూ విస్తరించిననాడు- ఆ పునాదులపై నాణ్యమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్య సౌకర్యాలు సమకూరి జాతి అభివృద్ధి విలసితమవుతుంది. గుండెలనిండిన ఆత్మవిశ్వాసంతో జెండా వందనం చేయాల్సిన ఈ శుభవేళ భవిష్యత్తుపై పొడగడుతున్న అలజడిని తరిమికొట్టాలంటే నాయకత్వ స్థానాల్లో కావలసింది జనంపట్ల కాసింత నిబద్ధత!

(రచయిత - ఉల్చాల హరిప్రసాదరెడ్డి)
Posted on 15-08-2015